జ్ఞాపకాల పందిరి-3

51
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

ఇది నువ్వే రాశావా.. !?

[dropcap]ఒ[/dropcap]క్కోసారి ఎవరు ఎందుకు అలా.. మాట్లాడతారో అర్థం కాదు. అర్థం చేసుకునే శక్తి ఆ వయస్సులో ఉండవచ్చు, ఉండకపోవచ్చు కూడా! సందర్భంతో సంబంధం లేకుండా ఎదుటి వ్యక్తి చేసే వ్యాఖ్యానాలు ఒక్కోసారి మానసికంగా కృంగదీస్తాయి. పరిస్థితిని బట్టి అది ఏ స్థితిలోనికైనా పోవచ్చు. అది ఇంట్లో జరిగినా, బయట జరిగినా, జరిగే నష్టం ఎలాగూ జరుగుతుంది. సమస్య ఇంట్లో జరిగితే వివిధ రూపాల్లో దాన్ని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది. అదే బయటివారితో జరిగితే పరిస్థితి వేరుగా ఉంటుంది. ఎవరో మనల్ని కావాలని అపహాస్యం చేస్తున్నట్టు, అవమాన పరుస్తున్నట్టు ఫీల్ అవుతాము. అంతమాత్రమే కాదు, ఒక్కోసారి నిరుత్సాహం, అహం, కోపం వంటి సమస్యలు ఉత్పన్నం కావచ్చు. తొందరపడితే అది ఎలాంటి అఘాయిత్యానికైనా దారితీయవచ్చు, లేదా మన ప్రతిభను మరోసారి చాటి ఆ.. అసందర్భ వ్యాఖ్యానం చేసిన వారికి కనువిప్పు కలిగేట్లు కూడా చేయవచ్చు. సమస్య వచ్చేదల్లా మనం ఢీ కొనవలసిన వ్యక్తి ఎలాంటివాడు, ఎంతటి వాడు, ఎలా ఎదుర్కొవాలన్నది ముఖ్య విషయం.

కొందరి మాటలు మనస్సులో ముళ్ళు గుచ్చుకున్నంత తీవ్రంగా ఉంటాయి. యెంత అనుకున్న సర్దుబాటు చేసుకోలేనంత ఆవేదన మనస్సులో కలుక్కుమనిపిస్తుంది. మొండివాళ్లకు పెద్ద సమస్య ఉండదు గానీ, సున్నిత మనస్కులకు ఇది ఇబ్బంది కలిగించే అంశమే. ప్రతి వాళ్ళ జీవితంలోనూ ఎక్కడో ఒక చోట ఇలాంటి సన్నివేశాలు ఎదుర్కోక తప్పదు. సమస్యను ఎదుర్కున్న మార్గాలు వేరు విధంగా ఉండవచ్చు, ఎందుకంటే అందరికీ ఒకే రకమైన సమస్యలు ఎదురుకావు కదా! నా విద్యా కాలంలో నేను ఎదుర్కున్న సమస్యను వివరిస్తాను. ఇది భవిష్యత్‌లో చాలామందికి అక్కరకు రావచ్చును.

***

మెట్రిక్‌లో రచయిత

అవి నేను దంత వైద్య శాస్త్రం వృత్తి విద్యలో చేరిన రోజులు. అప్పటి వరకూ ఇలాంటి విద్య ఒకటి ఉందని నాకు తెలవనే తెలవదు. 1975లో నాగార్జున సాగర్ (హిల్ కాలనీ)లో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి హైదరాబాద్‌లో చింతల్‌బస్తీలో అప్పుడే ప్రారంభం అయిన ప్రభుత్వ ఆర్స్ అండ్ సైన్స్ కళాశాలలో బి.జడ్.సి ,గ్రూపుతో బి.ఎస్సీ మొదటి సంవత్సరంలో చేరాను. అప్పటికి మెడిసిన్ కోసం ‘ఎంసెట్’ ప్రవేశ పరీక్షా విధానం రాలేదు. మామూలు ప్రవేశ పరీక్షా విధానం ఉండేది. దంత వైద్యం కోసం ఇంటర్‌లో మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించేవారు. నేను మెడిసిన్‌కూ, చిన్నన్నయ్య డా. కె. మధుసూదన్ సలహా మేరకు బి.డి.ఎస్.కు అప్లై చేసాను. మెడిసిన్‌లో సీటు రాలేదు కానీ, బి.డి.ఎస్.లో మాత్రం సీటు వచ్చింది. నిజానికి మా పెద్దన్నయ్య ప్రముఖ నవల/కథ/అనువాద రచయిత స్వర్గీయ కె. కె. మీనన్, నన్ను మాస్కోలో మెడిసిన్ చేయించడానికి తన శాయశక్తులా కృషి చేసాడు. కానీ ఫలితం దక్కక పోవడంతో, నాకు బి.డి.ఎస్.లో సీటు రావడం ఆయనకు కొంత ఊరట కలిగించింది. అనేక మంది తన స్నేహితులను, వైద్యరంగంలో స్థిరపడిన పెద్దలను కలసి, వృత్తి విద్యగా బి.డి.ఎస్.కు ఎంతవరకూ భవిష్యత్తు ఉంటుందో తెలుసుకుని, వారిచ్చిన సలహాలకు తృప్తి పడి నన్ను ఉస్మానియా కళాశాలకు అప్పుడు అనుబంధంగా ఉన్న డెంటల్ వింగ్‌లో జాయిన్ చేశారు. అప్పట్లో ‘ప్రీ -ప్రొఫెషనల్ కోర్స్’ అని ఉండేది. మెడికల్/డెంటల్‌లో చేరిన విద్యార్ధులకి మొదటి ఆరు నెలలు ఈ కోర్సు ఉండేది. అంటే మళ్ళీ ఒక ఆరు నెలల పాటు ఇంటెర్మీడియేట్ చదివినట్టు ఆ.. ఆరు నెలలు పాఠాలు ఉస్మానియా వైద్య కళాశాల ‘కోటి’ లో ఉండేవి. అది ముగిసిన పిమ్మట, కొన్ని క్లాసులు అఫ్జల్‌గంజ్ లోని దంత వైద్య విభాగంలోనూ, కొన్ని ఉస్మానియా వైద్య కళాశాల లోనూ జరిగేవి. జనరల్ సబ్జెక్ట్స్ అయిపోయిన తర్వాత కేవలం దంత వైద్య విభాగానికే పరిమితం అయ్యేవాళ్ళం. అందుచేత కోఠీ – అఫ్జల్‌గంజ్, అఫ్జల్‌గంజ్ – కోఠీ బస్సు ప్రయాణాలతో సరదాగా గడిచిపోయేది.

నా బి.డి.ఎస్ రెండవ సంవత్సరంలో అనుకుంటాను, నేను ఒక వ్యాసం రాసి అప్పటి పత్రికలలో ఒకటైన ‘ఆంద్ర పత్రిక’ దిన పత్రికకు పంపించాను. నిజానికి ఆ పత్రిక ఆఫీసు ఎక్కడ ఉందో, దాని సంపాదకులు ఎవరో కూడా తెలీదు నాకు. నా ప్రయత్నం ఫలించి అది సకాలంలోనే అచ్చయింది. ఆ చిరు వ్యాసం పేరు ‘కట్టుడు పళ్ళు అవసరమా?’. నిజానికి నేను ఆ వ్యాసం రాసే సమయానికి, దానికి సంభందించిన పరీక్ష పూర్తి కాలేదు. అయినా ఆ వ్యాస పరిధి బహు తక్కువ గనుక అంత క్షుణ్ణంగా చదవక్కర లేదు. ప్రాథమిక అంశాలు తెలిస్తే చాలు. నేను ఆ వ్యాసం ఎవరికీ చూపించకుండా పుస్తకంలో దాచుకున్నాను. అనుకోకుండా ఒక రోజు ఒక సహాధ్యాయి మిత్రుడి కళ్లబడింది. అతని చేతిలోనుండి ఇంకొక అమ్మాయి చేతిలోకి వెళ్ళిందది. నాకైతే దానికి సంబంధించిన ప్రచారం అసలు ఇష్టం లేదు.

నా సహాధ్యాయులు మాత్రం దానిని గొప్పగా చిత్రించి, ఊహించని రీతిలో కీర్తించడం మొదలు పెట్టారు. అంతటితో ఆగిపోతే సమస్య ఉండేది కాదు. వ్యాసం తీసుకున్న అమ్మాయి నేరుగా ఆదిపట్టుకుని ‘ప్రొస్థెటిక్స్ లాబ్’కు పరిగెత్తింది. ఆ రోజు మాకు ప్రొస్థెటిక్స్ ప్రయోగాలు ల్యాబ్ క్లాసు. క్లాసులో అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ప్రేమానందం గారు వున్నారు. ఆయన తర్వాత కీర్తిశేషులైనారు. వ్యాసం ఆయన చేతిలో పెట్టింది ఆ అమ్మాయి. నా సహాధ్యాయులందరూ ఆయన స్పందన కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. నేను మాత్రం వ్యాసం ఆయన చేతిలోకి వెళ్లినందుకు సిగ్గుపడుతూ ఒక మూల నిలబడ్డాను. నిజానికి నేను అప్పుడు అక్కడ కాలరెత్తుకుని నిలబడాలి. కానీ చెప్పలేని భయం ఏదో నా హృదయ కవాటాల్ని కుమ్ముతున్నట్టు అనిపించింది. అసలైన గురువు అయితే నన్ను ప్రోత్సహించాలి. మరి ఈయన ఏమంటాడోనన్న ఆత్రుత. ప్రతి క్షణం గడ్డుగా కదులుతోంది. ఇంతలో మా ప్రేమానందం సార్ నన్ను దగ్గరకు పిలిచారు. నన్ను పైనించి క్రిందికి రెండుమూడు సార్లు చూసి ‘ఇది నువ్వే రాశావా?’ అని సూటి ప్రశ్న వేశారు. ఒక్కసారి నా మెదడు మొద్దుబారిపోయింది. జవాబు చెప్పలేని మూగ జీవిని అయిపోయాను. ఒక పక్క బాధ, ఉక్రోషం, అవమానం ఇలా అన్నీ కలగలుపుకుని దుఃఖం రూపంలో కళ్ళు చెమ్మగిల్లి అక్కడినుండి వడివడిగా బయటకు వెళ్ళిపోయాను.

జరిగిన దాని గురించి తిరిగి ఎవరితోనూ చర్చించలేదు. కానీ, నాలో అవమానం, పట్టుదలగా రూపాంతరం చెంది వెంటనే మరో వ్యాసం రాయడానికి ఉసిగొల్పింది. అనుకున్నది వెంటనే కార్యరూపంలో పెట్టడం మొదటినుంచీ నాకు అలవాటు! అదే పని చేసాను. మరో వ్యాసం తయారు అయింది. వెంటనే దానిని విజయవాడలో వున్న ఆంద్ర పత్రిక ఆఫీసుకు పంపాను. హైదరాబాద్ బషీ‌ర్‌బాగ్‌లో పత్రిక బ్రాంచి ఆఫీసు ఉండేది. ఆదివారం ప్రత్యేక సంచిక శనివారం సాయంత్రం అక్కడికి వచ్చేది. ఆ వారం ఆదివారం దినపత్రికలో నా రెండవ వ్యాసం వచ్చింది. అది స్వయంగా నేనే మా ప్రేమానందం సార్ దగ్గరకు వెళ్లి చూపించాను. ఆయన ఆ వ్యాసం చదివి “నువ్వు భవిష్యత్తులో మంచి రచయిత అవుతావు” అన్నారు. అది ఆయన దీవెనగానే తీసుకున్నాను. ఆ విధంగా ఆయన ప్రేరణ/దీవెన నాలోని రచయితను నిద్ర లేపినట్లయింది.

ఈ రోజు సాహితీ రంగంలో నిలదొక్కుకుని, కవిగా, కథకుడిగా, వ్యాస రచయితగా పేరు సంపాదించుకోగలిగాను. నా వృత్తి దంత వైద్యం అయినప్పటికీ, ప్రవృత్తిగా తెలుగు సాహిత్యం నేను ఊహించని స్థాయికి నన్ను తీసుకెళ్లింది. ఇదంతా బలమైన పట్టుదలవల్ల  సాధ్యం అయింది.

ఉపసంహారం:

ఈ ఉదంతం పాఠకులకు అందించడంలో నా స్వార్థం ఏమీలేదు. కానీ ఎవరికైనా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు, కృంగిపోక, మనసు పాడుచేసుకోక, పట్టుదలతో దైర్యంగా ముందుకు సాగాలనే సందేశాన్ని అందించడమే దీని ముఖ్యోద్దేశం. ‘కృషి ఉంటే మనుష్యులు ఋషులౌతారు’ అన్నది ఒట్టిమాట ఏమాత్రం కాదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here