అలనాటి అపురూపాలు-9

0
3

సినిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

నటి నర్గిస్ తల్లిగా గుర్తుండిపోయిన తొలి తరం సంగీత దర్శకురాలు జద్దాన్ బాయి

తాము స్వయంగా ఎంతో ప్రతిభావంతులైనప్పటికీ, కొందరికి తమ పిల్లల వల్ల మరింత కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. అలాంటివారిలో జద్దాన్ బాయి ఒకరు. హిందీ సినీరంగంలో తొలినాటి మహిళా సంగీత దర్శకురాలైనప్పటికీ, ఆమె కూతురు నర్గిస్ నటిగా రాణించడంతో నర్గిస్ తల్లిగా ఆమెకి బాగా గుర్తింపు వచ్చింది.

దలీపా బేగం, మియా జాన్ దంపతులకు 1895లో నలుగురి సంతానంలో తొలి సంతుగా జద్దాన్ బాయి జన్మించారు. ఆమె తల్లి ఆస్థాన నర్తకి సంప్రదాయానికి చెందిన గాయని. చిన్నారి జద్దాన్ బాయికి కమ్మని కంఠం ఉండేది, నాలుగేళ్ళ ప్రాయంలోనే హిందూస్థానీ సంగీతంలో శిక్షణ పొందారు. ఆమెకి ఐదేళ్ళ వయసులో తండ్రి చనిపోయారు. తరువాత జద్దాన్ బాయి కలకత్తాకి చెందిన భయ్యా సాహెబ్ గణ్‌పత్ గారిని సంప్రదించి, వారి శిష్యురాలయ్యారు. ఆమె ఇంకా నేర్చుకుంటూండగానే గణ్‌పత్ గారు స్వర్గస్థులు కాగా, ఉస్తాద్ మోయినుద్దీన్ ఖాన్ గారి వద్ద శిక్షణ పూర్తి చేశారు. అటు పిమ్మట, ఉస్తాద్ చద్ధూ ఖాన్ సాహెబ్, ఉస్తాద్ లాబ్ ఖాన్ సాహెబ్‌ వద్ద కూడా శిష్యరికం చేశారు. ఆమె సంగీతంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. కొలంబియా గ్రామ్‌ఫోన్ కంపెనీకి ఘజళ్ళు రికార్డింగ్ చేయడం ప్రారంభించారు. సంగీత కచేరీలలో పాల్గొనసాగారు. ఆమెకు రామ్‌పూర్, బికనేర్, గ్వాలియర్, కాశ్మీర్, ఇండోర్, జోధ్‌పూర్ వంటి రాజ సంస్థానాల నుంచి ఆహ్వానాలు అందాయి. దేశవ్యాప్తంగా పలు రేడియో కేంద్రాలలో ఆమె పాటలు, ఘజళ్ళు పాడారు. ఆమె తొలి వివాహం గుజరాత్‍కి చెందిన సంపన్న వ్యాపారి నరోత్తమ్ దాస్ ఖత్రి (బచ్చు భాయ్ లేదా బచ్చి బాబు)తో జరిగింది. వివాహానంతరం ఖత్రి ఇస్లాం మతంలోకి మారారు. వాళ్ళకి అఖ్తర్ హుస్సేన్ అనే కొడుకు పుట్టాడు. జద్దాన్ ద్వితీయ వివాహం – కచేరీలలో నిత్యం వెంటే ఉండే – హార్మోనియం మాస్టర్ ఉస్తాద్ ఇర్షాద్ మీర్ ఖాన్‌తో జరిగింది. వారికి అన్వర్ హుస్సేన్ అనే కొడుకు పుట్టాడు. ఆమె మూడవ వివాహం – సుసంపన్న పంజాబీ మోహ్‌యాల్ బ్రాహ్మణ హిందూ కుటుంబానికి చెంది – తరువాత ఇస్లాం మతం పుచ్చుకుని – అబ్దుల్ రషీద్‌గా పేరు మార్చుకున్న – మోహన్‌చంద్ ఉత్తమ్‌చంద్ (మోహన్ బాబు)తో జరిగింది. వీరికి సినీ నటి నర్గిస్ (ఫాతిమా రషీద్) జన్మించింది. ఆ రోజుల్లో జద్దాన్ బాయి సంపాదిస్తుండంతో, అద్బుల్ రషీద్ తన సమయమంతా ఖాళీగానే గడిపేవారట. పేరుకు ముస్లిం అయినప్పటికీ, ఆమె భర్త ఇస్లాం మతం పుచ్చుకున్నప్పటికీ, జద్దాన్ బాయి, ఆమె కుటుంబం హిందూ ఆచారాలు పాటించేవారు, హిందూ లేదా ముస్లిం గుర్తింపుల మధ్య నలుగుతూ. జద్దాన్ బాయికి కొన్ని అధికారిక దస్తావేజులలో కూడా ‘జయదేవి త్యాగి’ అనే హిందూ పేరు ఉండేది.

గాయనిగా ఆమె నైపుణ్యాన్ని పక్కన పెడితే, జద్దాన్ బాయి బాగా చదువుకున్న మహిళ. ఉర్దూ, హిందీ, పర్షియన్, బెంగాలీ భాషలు మాట్లాడగలరు. జద్దాన్ బాయి గానం శలభాలని దీపం ఆకర్షించినట్టు అభిమానులను ఆకర్షించేది. త్వరలోనే సినీ నిర్మాతలు ఆమె తలుపు తట్టడం మొదలుపెట్టారు. లాహోర్‍కి చెందిన నిర్మాత హకీమ్ రామ్‌ప్రసాద్ తమ చిత్రం ‘రాజా గోపీచంద్’ (1933) కోసం ఆమెని సంప్రదించారు, అది ఆమె తొలి సినిమా. అది హిట్ కావడంతో, ఆమె రామ్ దరియాని గారి ఆఫర్ ఆమోదించి; ఇంపీరియల్ స్టూడియోస్ వారి ‘ఇన్సాన్ యా సైతాన్’ (1933) చిత్రంలో ప్రధాన పాత్ర కోసం బొంబాయి చేరుకున్నారు. ఈ సినిమాకి మోతీ బి. గిద్వాని దర్శకులు. ఈ సినిమా ప్రజాదరణ పొందడంతో ఇక సినిమాలలో కొనసాగాలని గట్టిగా నిర్ణయించుకుని జద్దాన్ బాయి కలకత్తా వదిలి బొంబాయికి శాశ్వతంగా వచ్చేశారు. తరువాత సాగర్ మూవీటోన్ వారి రామ్నిక్ దేశాయ్ దర్శకత్వం వహించిన ‘డాన్సింగ్ గర్ల్/నాచ్‍వాలీ’ (1934) సినిమాలో యాకూబ్, మెహబూబ్, స్వరూప రాణి వంటి వారి సరసన వేశ్య పాత్రలో నటించారు. ఆమె కూతురు నర్గిస్ ఈ సినిమాలో బాల నటిగా తొలిసారి నటించిది. క్రెడిట్స్‌లో ఆమె పేరు ‘బేబీ రాణి’ అని వేశారు. అదే ఏడాది జద్దాన్ బాయి జిఆర్ సేథీ దర్శకత్వంలో ఈస్టర్న్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి ‘ప్రేమ్ పరీక్షా’ అనే చిత్రంలో నటించారు. అదే ఏడాది ఆమె తన స్వంత నిర్మాణ సంస్థ ‘సంగీత్ మూవీ‍టోన్’ను స్థాపించారు. 1935లో ‘తలాష్-ఈ-హక్/సెర్చ్ ఫర్ ట్రూత్’ నిర్మించారు. చిమన్‌లాల్ లూహార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జద్దాన్ పలు రంగాలలో కృషి చేశారు. యాకూబ్, ఆషిక్ హుస్సేన్ ఇతర నటులు. ఈ సినిమాకి సంగీతం సమకూర్చడమే కాక, సినిమాకి కథ అందించి, డైలాగులు రాశారు. ఇది ఫిరోజా అనే వేశ్య కథ; తనలో ఎన్ని దోషాలున్నప్పటికీ, తానని తాను దిద్దుకునే మహిళ కథ. 1936లో జద్దాన్ బాయి ‘హృదయ మంథన్/కాల్ ఆఫ్ ది సోల్’ చిత్రానికి దర్శకత్వం వహించి, సంగీతం సమకుర్చారు. 1936లోనే ‘మేడమ్ ఫ్యాషన్’ చిత్రంలో నటించి ఆ సినిమాకి 12 పాటలు రాశారు. అనంతరం 1937లో ‘జీవన్ సప్నా/జర్నీస్ ఎండ్’, సాంఘిక చిత్రం ‘మోతీ కా హార్’ విడుదలయ్యాయి, ఇవి ఆమె నిజ జీవితంలోని సంఘటనల ఆధారంగా రూపొందించినవి, ఒక వేశ్య జీవితంలోని కష్టాలు, పోరాటాలని ప్రదర్శించాయి. జద్దాన్ బాయి వ్రాసిన స్క్రిప్ట్స్ సామాజిక వంచననీ, మహిళల పట్ల దురహంకారాన్ని బట్టబయలు చేసేవి. ఆస్థాన నర్తకి కుటుంబపు మహిళగా తాను జీవితంలో ఎదుర్కున్న కష్టాలు ఆమెను రాటుదేల్చాయి, తన కూతురు తనలాగా కాకూదనుకున్నారు. తన కూతురిని బొంబయిలోని ఒక గొప్ప స్కూల్లో చేర్చారు. అయితే అప్పటికే, స్టార్ సిస్టమ్ ఏర్పడి, బ్లాక్‌బస్టర్ సినిమాలు వస్తున్న కాలం కాబట్టి జద్దాన్ బాయికి తప్పుకోక తప్పలేదు. ఇలా జరగగానే, ఆమె తన కూతురు చదువు మాన్పించి సినిమాల్లోకి తీసుకొచ్చారు. ఆవిధంగా నర్గిస్ 14 ఏళ్ళ వయసులో 1943లో మెహబూబ్ ఖాన్ సినిమా ‘తక్దీర్’లో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమా హిట్ కావడంతో వాళ్ళ పరిస్థితులు కుదురుకున్నాయి. అప్పటినుంచి, తాను చనిపోయే దాక నర్గీస్ సినిమా వ్యవహారాలు చూసుకున్నారు జద్దాన్ బాయి. తన కొడుకులిద్దరూ ప్రధాన బాధ్యతలు స్వీకరించగా ‘నర్గిస్ ఆర్ట్ కన్సర్న్’ అనే సంస్థను స్థాపించారు. ఈ సంస్థలో నర్గిస్ ప్రధాన పాత్రధారిణిగా ఎన్నో సినిమాలను ప్రకటించారు. తన జీవితపు చివరి రోజుల్లో జద్దాన్ బాయి మళ్ళీ కష్టాలు ఎదుర్కున్నారు, ఎందుకంటే సప్రూ, నర్గిస్ నటించిన ‘రోమియో అండ్ జూలియట్’ (1947) సినిమా సరిగా ఆడలేదు. వ్యక్తిగత విషయాలకొస్తే ఆమె కొడుకులు అఖ్తర్ హుస్సేన్‌కీ, అన్వర్ హుస్సేన్‌కీ ఒకరంటే ఒకరికి పడక, గొడవలు పడ్డారు. పైగా నర్గిస్ కూడా తల్లి అభీష్టానికి విరుద్ధంగా నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన రాజ్‍కపూర్‌తో అనుబంధం కొనసాగించింది.

జద్దాన్ బాయి 8 ఏప్రిల్ 1949 న ఘనమైన వారసత్వాన్ని విడిచి, స్వర్గస్థులయ్యారు.

జద్దాన్ బాయి తన భర్త, కూతురుతో ఉన్న ఫొటోలు చూడండి.

1935లో నర్గిస్‌కి ఆరేళ్ల వయసులో యాకూబ్ ప్రధాన పాత్ర పోషించిన ‘తలాష్-ఈ-హక్’ చిత్రంలోనిది ఫొటో. ఈ సినిమాలో నాయికపాత్ర జద్దాన్ బాయి పోషించారు.

   


ప్రతిభామతి లీలా చిట్నిస్

బాలీవుడ్ తొలి తరం నటీమణుల్లో విద్యాధికురాలు, సహజ అందగత్తె అయిన లీలా చిట్నిస్ సినిమాలలోనే కాక నాటకాలలోనూ నటించిన అద్భుతమైన కళాకారిణి.

9 సెప్టెంబరు 1909 నాడు ఆమె ధార్వాడ్‍లో జన్మించారు. తీర్చిదిద్దినట్టుండే కనుబొమలు, విశాల నేత్రాలు, చక్కని రూపురేఖలు, తెర మీద అద్భుతంగా గోచరించే రూపంతో, సాంప్రదాయాన్ని ఎదిరించి ఆమె 1930లో సినీరంగంలో ప్రవేశించారు. దక్షిణాది రాష్ట్రమైన కర్నాటకలోని ధార్వాడ్‌లో జన్మించిన చిట్నిస్ ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ కూతురు. స్థానికంగా చదువు పూర్తి చేశాకా, ఆమె ‘నాట్యమన్వంతర్’ అనే రంగస్థల బృందంలో చేరారు. ఈ బృందం ఆమె మాతృభాష అయిన మరాఠీలో నాటకాలు ప్రదర్శిస్తూండేది. ఈ బృందం ప్రదర్శించే నాటకాలు – ఇబ్సన్, షా, స్టానిస్‌లావ్స్కీ వంటి నాటక రంగ ప్రముఖులచే బాగా ప్రభావితమైనవి. అనేక కామెడీలు, ట్రాజెడీలలో నటించి, తనదంటూ బాణీ దొరకపుచ్చుకున్నాకా, సినిమాలో నటించేందుకు, 1930లలో ముగిసిన తన తొలి వివాహబంధం ద్వారా పుట్టిన నలుగురు పిల్లలని పోషించేందుకు చిట్నిస్ బొంబాయి వెళ్ళారు. మొదట ఎక్స్‌ట్రాగా ప్రారంభించి, తరువాత – భారతీయ ప్రేక్షకుల ఆదరణ పొందిన – స్టంట్ సినిమాల్లోనూ, పౌరాణిక చిత్రాలలోనూ ప్రధాన పాత్ర పోషించే స్థాయికి చేరారు.

1937లో వచ్చిన ‘జెంటిల్‌మన్ డాకూ (జెంటిల్‌మన్ థీఫ్)’ సినిమాలో ఆమె మగవేషంలో తిరిగే దుష్టుడిగా నటించారు. ‘బాలీవుడ్‌లో తొలి గ్రాడ్యుయేట్ సొసైటీ లేడీ’గా పేర్కొంటూ స్థానిక టైమ్స్ ఆఫ్ ఇండియాలో రాశారు. బొంబాయికి 120 మైళ్ళ దూరంలో ఉన్న పూణెకి చెందిన ప్రభాత్ ఫిల్మ్స్‌ వారితో స్వల్పకాలం పాటు పని చేశాకా, 1939లో ఆమె బాంబే టాకీస్‌తో చేరినప్పుడు ఆమె ప్రభ ప్రారంభమైంది. అంతకు ఐదేళ్ళ క్రితమే – ఎకోప్రూఫ్ స్టేజ్‌లు, ఆటోమాటిక్ ల్యాబ్, ప్రివ్యూ థియేటర్, ఇంకా అత్యంత నైపుణ్యం కలిగిన సిబ్బంది, అందులో జర్మన్‌లు అధికం… ఈ స్టూడియో సాంకేతికపరంగా అత్యుత్తమైనది. సామాజిక రుగ్మతలపై, ముఖ్యంగా వివాహ వ్యవస్థలోని, కుల వ్యవస్థలోని లోపాలపై వివాదాస్పద చిత్రాలు తీసిన బాంబే టాకీస్ వారికి విజయాలు పరిమితంగా ఉండేవి. అయితే 1939లో చిట్నిస్ ప్రధాన పాత్రలో నటించిన ‘కంగన్’ జనాదరణ పొందడంతో విజయాల బాట పట్టింది. ఈ సినిమాలో చిట్నిస్‌ని ఒక హిందూ పూజారి పెంచుకుంటారు,  ఆమె ఒక స్థానిక భూస్వామి కొడుకుని ప్రేమిస్తుంది, ఇది నచ్చని భూస్వామి పూజారిని బెదిరిస్తాడు. కానీ ఆమె ప్రేమ తండ్రి దురభిమానాన్ని తట్టుకుని ఎలా గెలించిందో ఈ సినిమాలో చూఫించారు. ఇది అప్పటి కాలానికి ఏ మాత్రం ఊహించలేని కథాంశం. కానీ ప్రేక్షకులని ఆకట్టుకుని బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగా రెండో ప్రపంచ యుద్ధం రావడంతో – ఈ చిత్ర జర్మన్ దర్శకుడు ఫ్రాంజ్ ఆస్టెన్, కెమెరామాన్ జోసఫ్ విర్షింగ్, ఇంకా అనేకమంది సాంకేతిక నిపుణులను వలసవాద ప్రభుత్వం అడ్డుకోగా – చిత్రీకరణ బాగా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఆస్టెన్ సహాయకులిద్దరు సినిమాని పూర్తి చేశారు. ఈ సినిమా విజయంలో సంగీతానికి ముఖ్య పాత్ర, పాశ్చాత్య వాయిద్యాలతో అనేక ప్రయోగాలు చేశారు.  బాంబే టాకీస్ బానర్‌పై ఆస్టెన్ 14 సినిమాలకు దర్శకత్వం వహించారు, భారతీయ సినిమాటోగ్రఫీని విశేషంగా ప్రభావితం చేశారు.

‘కంగన్’ విజయవంతం కావడంతో, చిట్నిస్ – బాంబే టాకీస్ వారి సినిమాల్లో అప్పటివరకూ కథానాయికగా ఉన్న అందాల తార దేవికారాణి స్థానాన్ని ఆక్రమించారు. ఆమె అప్పట్లో బాలీవుడ్ అగ్ర కథానాయకుడైన అశోక్‌కుమార్‌తో హీరోయిన్‌గా జటకట్టి – అజాద్ (1940), బంధన్ (1940), ఝూలా (1941) వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. వీరిద్దరి విజయవంతమైన జోడీగా పేరొచ్చింది. 1941లో తన ప్రజాదరణ, గ్లామర్ ఉచ్చస్థాయిలో ఉండగా, చిట్నిస్ – ప్రముఖ సోప్ బ్రాండ్ ‘లక్స్‌’కి -మోడ‌ల్‌గా వ్యవహరించారు. అప్పటి వరకూ ఇది హాలీవుడ్ హీరోయిన్‌లు మాత్రమే నటించిన ప్రకటన!

1940ల మధ్యలోకి వచ్చేసరికి ప్రధాన కథానాయికగా చిట్నిస్ ప్రభ మసకబారసాగింది. స్వల్ప కాలపు వ్యతిరేకత తర్వాత, బాలీవుడ్ మళ్ళీ సాంప్రదాయక మహిళా పాత్రలపై మళ్ళింది. వాస్తవాలను గ్రహించిన చిట్నిస్, 1948లో ఆమె కెరీర్‌లోనే ప్రసిద్ధమైన దశలో ప్రవేశించేందుకు, ‘షహీద్’ చిత్రంలో హీరో తల్లి పాత్ర చేయడానికి అంగీకరించారు. ఆ సినిమాలో అనారోగ్యంతో బాధపడే తల్లిగా తన పాత్రను అద్భుతంగా పోషించారు. తరువాతి నాలుగు దశాబ్దాల పాటు ఆవిడ బాలీవుడ్‌లో అత్యంత ఆదరణ పొందిన అమ్మగా పేరుపొందారు. ఎక్కువగా విధవ తల్లి లేదా బిడ్డలు విడిచిపెట్టిన తల్లిగా, పేదరికంలో ఉన్నా, తన పిల్లల్ని నిజాయితీగా పైకి తీసుకురావడానికి కృషి చేసే తల్లిగా నటించారు. ఆమెని తలచుకుంటే ఇప్పటికీ – పొడవాటి తెల్లని చీరలో, దగ్గుతో, ఓ సీసాలోంచి దగ్గు మందు తీసుకుని వేసుకోబోతుంటే సీసా జారి నేల మీద పడిపోయి మందు ఒలికిపోతే వగచే స్త్రీమూర్తి రూపం కళ్ళకు కడుతుంది. ఇంకో సీసా కొనుక్కుందామనుకుంటే పాపం, అమ్మ చిట్నిస్ దగ్గర ఎప్పుడూ డబ్బు ఉండేది కాదు! తల్లి పాత్రలో ఆమె హావభావ ప్రదర్శన ఆవారా (1951), గంగా జమునా (1961) వంటి చిత్రాల్లో పతాకస్థాయికి చేరింది. అలాగే 1965లో వచ్చిన ‘గైడ్’ సినిమాలో కూడా! ఈ సినిమాకి మూలం అదే పేరుతో సుప్రసిద్ధ రచయిత ఆర్.కె. నారాయణ్ వ్రాసిన నవల.

చిట్నిస్ చిత్ర నిర్మాణంలోనూ ప్రవేశించి, ‘కిస్‌‌సే నా కహ్‌నా’ (1942) అనే సినిమాని నిర్మించి, ‘ఆజ్ కీ బాత్’ (1955) అనే సినిమాకి దర్శకత్వం వహించారు. సోమర్‌సెట్ మామ్ వ్రాసిన ‘సాక్రెడ్ ఫ్లేమ్’‍కి రంగస్థలానికి అనుకూలంగా మలచారు. 1981లో తన ఆత్మకథ ‘చందేరీ దునియేత్’ ప్రచురించారు. 1970లలో తీరిక లేకుండా నటించినా, ఆ తరువాత నుంచి సినిమాలు తగ్గించుకుంటూ వచ్చారు. 1985లో విడుదలైన ‘దిల్‌ తుజ్‌కో దియా’ ఆమె చివరి సినిమా.

తర్వాత తన పిల్లలతో ఉండడానికి అమెరికా వెళ్ళిపోయారు. అయితే ఆమె చివరి రోజులలో ఒంటరి జీవితం గడపాల్సి వచ్చింది. కనెక్టికట్ నర్సింగ్ హోంలో ఉండగా చిట్నిస్‌ని చూడడానికి వెళ్ళిన ఓ యువ బాలీవుడ్ కొలీగ్ చెప్పిన వివరాల ప్రకారం – ఆమె దయనీయమైన, నిస్సహాయమైన, బీదయైన స్థితిలో ఉన్నారట. దయాళువైన ఓ నర్స్ ఆమెని కనిపెట్టుకుని చూసిందట! ఆ స్థితిలో చూసినప్పుడు ఉచ్చస్థాయిలో ఉండగా చిట్నిస్ చేసిన పాత్రలు గుర్తొచ్చి, ఆమె చలించిపోయిందట. 14 జూలై 2003 నాడు అదే నర్సింగ్ హోం‌లో అజ్ఞాతంగా కన్నుమూశారు చిట్నిస్.


బాల నటుడు సాజిద్ ఖాన్

బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ మహబూబ్ ఖాన్‌ గుర్తించక ముందు – భారతదేశంలోని నాటి బొంబే స్టేట్‌లో (ఇప్పటి మహారాష్ట్ర) బొంబాయి (ఇప్పటి ముంబై) మురికివాడలకి చెందిన పేద బాలుడు సాజిద్.

సాజిద్ సినీ జీవితం మహాబూబ్ ఖాన్ తీసిన ఆస్కార్‌కి నామినేట్ అయిన ‘మదర్ ఇండియా’ (1957) సినిమాలో చిన్ననాటి సునీల్ దత్ పాత్రను పోషించడంతో ప్రారంభమైంది. తరువాత  మహబూబ్ ఖాన్, ఆయన రెండో భార్య, నటి సర్దార్ అఖ్తర్ – ఆ కుర్రవాడిని దత్తత తీసుకుని సాజిద్ ఖాన్ అని పేరు పెట్టారు. 1957లో ‘మదర్ ఇండియా’తో సినీరంగంలో ప్రవేశించినా, సాజిద్ తన రెండో సినిమాగా తన పెంపుడు తండ్రి 1962లో తీసిన ‘సన్ ఆఫ్ ఇండియా’లో ప్రధాన పాత్ర పోషించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైంది. అయితే విమర్శకుల ప్రశంసలు మాత్రం పొందింది. 1964లో తండ్రి చనిపోవడంతో, అతని పెంపుడు తల్లి సర్దార్ అఖ్తర్ సాజిద్‌ని అమెరికా పంపేసింది. 1966లో జే నార్త్ సరసన ‘మాయ’ అనే చిత్రంలో నటించడం ద్వారా సాజిద్ అమెరికా అంతటా పేరు పొందాడు. ఈ సినిమా విజయం సాధించడంతో, ఎన్‌బిసి అదే పేరుతో సెప్టెంబరు 1967 నుంచి ఫిబ్రవరి 1968 వరకు 18 ఎపిసోడ్ల టీవీ షో గా ప్రసారం చేసింది. దీంతో, సాజిద్ ‘టీన్ ఐడల్’ అయిపోయి, కొంతకాలం పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పత్రికల కవర్ పేజీల మీద కనబడ్డాడు. 1968లో ‘ది బిగ్ వ్యాలీ’ అనే ఒక టీవీ షో లో అతిథి పాత్రలో నటించాడు. ‘ఇట్స్ హ్యాపెనింగ్’ అనే సంగీత ప్రదర్శనలో న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. 1970 తొలినాళ్ళలో అతనికి ఫిలిప్పైన్స్‌లో కూడా జనాదరణ లభించింది. ఫిలిప్పైన్స్ ప్రసిద్ధ కథానాయికలు నోరా ఔనర్, విల్మా సాంటోస్ సరసన హీరోగా అనేక రొమాంటిక్ కామెడీ సినిమాల్లో నటించాడు. 1966 – 1974 మధ్య అతని కెరీర్ ఉచ్చస్థాయిలో ఉండేది. ఇంగ్లీష్ సినిమాలలో అతను ఎంతగానో రాణించాడు. అతను నటించిన చివరి సినిమా మర్చంట్-ఐవరీ ఫిల్మ్ ‘హీట్ అండ్ డస్ట్’. ఈ సినిమా విజయవంతమైంది. తనదైన అధిక ఫలప్రద, వినోదాత్మక చిత్రాల కోసం భారతీయ సినీరంగం బాలీవుడ్‌గా ప్రసిద్ధికెక్కక ముందే సాజిద్ ఖాన్ విస్తృతమైన అంతర్జాతీయ గుర్తింపు పొందాడు.

సాజిద్ సినిమాలు, టీవీ, మ్యూజిక్ రంగాలలో పనిచేశాడు. అతని ఫోటో అమెరికా, ఫ్రాన్స్, జపాన్, మెక్సికో, జర్మనీ, థాయ్‌లాండ్ వంటి దేశాలలో వివిధ పత్రికల కవర్ పేజీల పైనా, లోపలి పేజీల్లోనూ వచ్చేది. ‘హ్యాపెనింగ్’, ‘అమెరికన్ బాండ్‌స్టాండ్’ వంటి నెట్‌వర్క్ టీవీ షోలలో పనిచేయడం ద్వారా సాజిద్ 1968 నుంచి పాప్ సాంగ్స్ రికార్డు చేయడం ప్రారంభించాడు. 1968 ఆగస్టు నెలలో సాజిద్ తొలి సింగిల్‌ ‘హ రామ్/గెట్టింగ్ టు నో యు’ ని ‘ది మంకీస్’ లేబుల్‌పై, ‘కోల్‌జెమ్స్ రికార్డ్స్’ విడుదల చేసింది. అనంతరం జనవరి 1969లో మరో సింగిల్‌ ‘డ్రీమ్స్/సమ్ డే’ విడుదలైంది. తర్వాత జూన్ 1969లో సాజిద్ ఎల్‍పి ‘సాజిద్’ విడుదలైంది. ఆర్‌సిఎ రికార్డ్స్ వారు ఈ సింగిల్స్‌నీ, ఎల్‍పి లని జపాన్, కెనడా, వెనిజులా దేశాల్లో విడుదల చేశారు. తన అమెరికన్ సింగిల్స్ విడుదలైన జపాన్‍లో సాజిద్ గానానికి ఆదరణ పెరిగింది. ఆర్‌సిఎ రికార్డ్స్ వారి కోసం పూర్తిగా జపనీస్‌లో ఒక సింగిల్ విడుదల చేశాడు సాజిద్. జపనీస్ భాషలో దాని పేరు ‘SINPI NO HOSEI and TENIHA GITTER WO’. అంటే ఇంగ్లీషులో ‘MYSTERIOUS STAR and to A GUITAR IN ONE’S HANDS’ అని అర్థం. నేడు ప్రపంచవ్యాప్తంగా అతని అభిమానులు ‘సాజిద్ మూమెంట్స్’ని పంచుకుంటారు. బంగారు ఆభరణాలు విక్రయించే ఒక ఫ్యాక్టరీని భారతదేశంలో నెలకొల్పాడు సాజిద్. ఆ రీటెయిల్ స్టోర్ పేరు ‘ఆర్టిస్టిక్’. 1970-72 మధ్యకాలంలో నటి రేఖ సాజిద్ ఖాన్‌తో ప్రేమలో పడింది కానీ అప్పటికే సాజిద్ తన కాబోయే భార్యని కలిశాడు. వాళ్ళకి పెళ్ళయి ఒక కొడుకు ‘సమీర్’ పుట్టాడు. 1990లో తన భార్యకి విడాకులిచ్చాడు సాజిద్.

మ్యాగజైన్ కవర్ల మీద, రికార్డుల మీద అతని ఫొటోలు చూడండి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here