[dropcap]రా[/dropcap]మనాథం గారు ఆఫీస్‌లో తన క్యాబిన్‌లో కూర్చుని వున్నాడు.
“సార్! మే ఐ కమిన్” అంటూ అడుగుతున్న అటెండర్ వైపు చూస్తూ.. రమ్మన్నట్లుగా సైగ చేశాడు.
అటెండర్ “సార్! మిమ్మల్ని కలవడానికి రాము అంట వచ్చారు. పంపించనా?” వినయంగా అడిగాడు.
“ఆ! పంపించు” అన్నాడు.
కొద్దిరోజుల క్రితం తన స్వంత గ్రామానికి వెళ్ళినప్పుడు తన స్నేహితుడు దుర్గారావు తన కొడుక్కి ఏదైనా ఉద్యోగం పట్నంలో ఇప్పించమని అడగడం గుర్తొచ్చింది. వాళ్ళమ్మాయి మౌనిక, అబ్బాయి రాముని పరిచయం చేయడం మదిలో మెదిలింది.
దుర్గారావు గ్రామంలో వుంటూ సైకిల్ మెకానిక్‌గా పనిచేస్తూ.. వచ్చిన ఆదాయాన్ని జాగ్రత్తగా ఖర్చుచేస్తూ అమ్మాయిని ఇంటర్మీడియట్ చదివిస్తున్నాడు.. అలాగే అబ్బాయి చదువు ఇటీవలే డిగ్రీ పూర్తయ్యిందని చెప్పాడు.
తన ఎదురుగా వినయంగా నిలబడి నమస్కరిస్తున్న రాము వైపు ప్రశంసగా చూస్తు చిరునవ్వుతో ప్రతినమస్కారం చేశాడు రామనాథం.
“డిగ్రీలో గ్రూప్ ఏంటి? డిగ్రీ ఎప్పుడు పూర్తయ్యింది? ఎంత పర్సెంటేజ్ వచ్చింది?”
“బి.కాం ఇటీవలే పూర్తయ్యింది సార్. 95% వచ్చింది. ఇంకా చదువుకోవాలని వున్నా ఇంటి పరిస్థితులు మీకు తెలిసినవే కదా సార్. ఇదివరకటిలా నాన్నకి పనులు వుండడం లేదు. ఎలాగైనా నేను వెంటనే జాబ్‌లో చేరాలి సార్. ఇంటి అవసరాలకి ఆర్థికంగా ఎంతో కొంత ప్రయోజనం కలుగుతుంది. చెల్లిని బాగా చదివించవచ్చు.” అంటున్న రాముతో..
“నీ ఆలోచన బాగుంది.. కానీ నాకు కాస్త సమయం కావాలి, ప్రస్తుతం మా ఆఫీస్‌లో జాబ్ లేమీ ఖాళీగా లేవు. కాని నీకు తప్పకుండా సాయం మాత్రం చేస్తాను. నా స్నేహితులని అడిగైనా నీకు వెంటనే ఏదో ఒక ఉద్యోగం చూస్తాను.. సరేనా!” అన్నాడు రామనాథం.
“అలాగే సార్ !” అంటూ సంబరంగా లేచాడు రాము.
“ఎక్కడ వుంటున్నావు?” అంటూ అడుగుతున్న ఆయనతో..
“ప్రస్తుతానికి స్నేహితుల రూంలో వుంటున్నాను. తరువాత జాబ్ ఎక్కడవస్తే అక్కడకి వెళతాను సార్” ఆన్నాడు.
“ఓ.కే. నాలుగు రోజులాగి మళ్ళీ కలువు” అన్నాడు రామనాథం.
“అలాగే సార్” అంటూ బయటకు నడిచాడు రాము.
రామనాథం మంచి మనస్సుగలవాడు. తెలిసిన వాళ్ళు ఎవరైనా తన సాయం కోరితే .. వీలైనంతలో వాళ్ళకి సాయం చేయడం ఆయన నైజం.
***
సరిగ్గా నాలుగు రోజుల తరువాత వచ్చిన రాముకి ఓ అడ్రస్ ఇచ్చి.. అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యుకి అటెండ్ అవ్వమని చెప్పాడమే కాకుండా ఖర్చులకి ఓ వెయ్యి రూపాయలు కూడా ఇచ్చాడు రామనాథం.
సంతోషంగా చర్లపల్లిలో వున్న ఆ ఆఫీస్‌కి ఇంటర్వ్యు కి వెళ్ళడమే కాకుండా సెలక్ట్ అయ్యాడు రాము.
తనకి మొదటి నెల జీతం రాగానే రామనాథం గారిని కలసి డబ్బులు ఇవ్వబోతే ..”వుంచులేరా..” అన్నాడు ఆప్యాయంగా.
కాదు తీసుకోమని రాము పట్టుబడుతుంటే ..” నా పేరు చెప్పి మీ అమ్మా నాన్నా వాళ్ళకి ఏమైనా బహుమతి తీసుకువెళ్ళు. వాళ్ళు ఎంతగానో సంతోషిస్తారు” అన్నాడు.
ఓ సంవత్సరం తరువాత.. మళ్ళీ ఆయన్ని కలిశాడు రాము.
తాను ఎం.కాం డిస్టెన్స్‌లో చదువుతున్నానని చెప్పాడు రాము.
విని రామనాథం ఎంతో సంతోషంతో..”All the best” చెప్పాడు.
***
అప్పుడప్పుడు రామనాథం తమ ఊరుకి వెళ్ళివస్తున్నా.. ఈ సారి అతడు.. తన చిన్ననాటి స్నేహితుడు దుర్గారావు కూతురి పెళ్ళికి వెళ్ళవలసివస్తుంది. రాము కూడా పెళ్ళిలో కలసి చక్కగా పలకరిస్తాడు. మౌనికకి సంబంధం వూరికి దగ్గరలోనే కుదిరిందని సంబరంగా చెబుతాడు దుర్గారావు రామనాథంతో!
రెండు సంవత్సరాల తరువాత..
రామనాథం తమ ఊరు వెళ్ళినప్పుడు సైకిల్స్ రిపేరింగ్ దుర్గారావు ఎంతో ఏకాగ్రతగా చేసుకోవడం గమనించించాడు. కొడుక్కి పెళ్ళిసంబంధాలు చూస్తున్నానని చెప్పాడు దుర్గారావు.
తమ ఊరిలో తెలిసిన వారందరిని పలకరించడం అతడికి అలవాటు. తను పట్నంలో పెద్ద ఉద్యోగం చేస్తున్నా, చక్కని క్వాలిఫికేషన్ కలిగినా.. రామనాథం గారు వాళ్ళ ఊరిలో ఓ సాధారణ వ్యక్తిలా తిరగడం ఆయనకి అలవాటు.
అందుకే అతడిని వారి ఊరివాళ్ళు ఎంతో అభిమానంగా పలకరిస్తారు.
ఆ ఊరు ఓ చిన్న పల్లెటూరు. అనుబంధాలకు,ఆప్యాయతలకు మారు పేరు! గ్లోబలైజేషన్‌లో బాగంగా పల్లెటూరులు కమర్షియల్‌గా మారుతూ తమ ఉనికిని కోల్పోతున్నా.. ఇంకా ఆ ఊరు మాత్రం అచ్చు తెలుగు పల్లెటూరిలా వర్థిల్లుతుంది.
***
కాలం ఓ ప్రవాహం.. దాని ప్రయాణం అపడం ఎవరి వల్లకాదు!?
మరో సంవత్సరంలో రామనాథం రిటైర్మెంట్ అనగా.. కొత్తగా బాస్‌కి ఓ అసిస్టెంట్‌ని తీసుకోవాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది. అందుకు అతడు కూడా ఓ.కే అనడం, మేనేజ్మెంట్ వెంటనే ఒకరిని అపాయింట్ చేయడం జరిగింది.
అతడి పేరు రామకృష్ణ.
ఆ పేరు ఎక్కడో విన్నట్లుగా అనిపించింది రామనాథానికి.
అతడు కారు దిగి ఆఫీస్‌కి వస్తూనే నేరుగా.. రామనాథం గారి దగ్గరకు వెళ్ళాడు. మిగతా స్టాఫ్ అందరూ వచ్చి అతడిని అభినందిస్తున్నారు.
రామనాథంకి ఇంకా సందేహం గానే వుంది.. ఇతడు నేను ఊహిస్తున్న వ్యక్తేనా అని!?
“సార్” రామకృష్ణ అలా పిలవడంతో.. “ఆ!” అన్నాడు.
“సార్.. నన్ను గుర్తు పట్టలేదా!? నేను రామకృష్ణ ని. మా నాన్న నన్ను ప్రేమగా పిలుస్తారు కదా ‘రాము..’ అని.”
“ఆ గుర్తొచ్చావు.. రాము కదా నీ పేరు. చాలా ఎదిగిపోయావు.”
“అవును సార్ ! నేను పి.జి. పూర్తి చేశాక మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. మన ఆఫీస్‌లో జాబ్ వేకెన్సీ ఉందని తెలిసి అప్లయ్ చేశాను. ఇంటర్వ్యు చాలా బాగా జరిగింది” అంటూ ఉత్సాహంగా అతడు చెబుతుంటే వింటున్నాడు రామనాథం.
తన కళ్ళ ముందు ఎదిగిన కుర్రాడు ఇంతలా మాట్లాడుతుంటే సంబరంగా వింటున్నాడు.
కానీ ఇటీవల జరిగిన ఓ సంఘటన అతడి మనస్సును కలచివేస్తుంది.
ఆ విషయం గురించి.. రామకృష్ణతో మరుసటి రోజు మాట్లాడాలనుకున్నాడు రామనాథం.
***
“పిల్లలేం చదువుతున్నారు?”
“అబ్బాయి ఫస్ట్ క్లాస్. అమ్మాయి నర్సరీ”
“ఓ.కే. గుడ్..”
“థ్యాంక్ యూ సార్!” అన్నాడు రామకృష్ణ చిరునవ్వుతో..
అయినా రామనాథం గారు ఎందుకలా డీలాగా వునారో అతడికి అర్థం కాలేదు.
ఆ పెద్దాయన్ని అడిగే దైర్యంలేక మౌనంగా వున్నాడు ఆయనేం చెబుతాడో విందామనుకున్నట్లుగా !
“రాము మొన్నీ మధ్య మన ఊరు వెళ్ళివచ్చాను. మీ నాన్న అదే నా స్నేహితుడు దుర్గారావు దాదాపుగా నా వయస్సువాడు. నిజానికి ఇద్దం కలిసి ఒకే క్లాస్ చదువుకున్నా.. నా కంటే రెండు సంవత్సరాలు పెద్దవాడు. ఆయన చేసే పని సైకిల్ రిపేరింగ్. సైకిల్ మెకానిక్‌గా పని చేస్తూనే ఎన్నోసార్లు పంటపొలాల్లో కూలిగా పనిచేస్తుండేవాడు. మీ చెల్లి పెళ్ళి ఘనం గానే చేశాడు చేతనైనంతలో.. నీ పెళ్ళికంటే నేను రాలేకపోయాను. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే.. అయన పెద్దగా ఆస్తులేమీ సంపాదించుకోలేదు. మీరే తన ఆస్తిగా భావించాడు. నువ్వు చదువుకుని ప్రయోజకుడివి అయ్యావని.. నీకు, మీ చెల్లికి మంచి సంబంధాలు కుదిరాయని ఆయన ఎంతో మురిసిపోయాడు. కానీ ఇటీవల మీ నాన్న ని కలిసినప్పుడు తను పని ఇక చేయలేకపోతున్నానని నా దగ్గర ఆన్నాడు. సంపాదన కూడా చాలా తగ్గిపోయిందని అన్నాడు. తమ ఆరోగ్యం కోసం కూడా బాగా ఖర్చవుతుందని అన్నాడు..”
రామనాథం గారు అడగబోయే ప్రశ్న ఏంటో అర్థమవసాగింది. తల వంచుకుని వింటున్నాడు.
“నేనొక ప్రశ్న అడుగుతాను. సూటిగా సమాధానం చెప్పు..”
ఆయన వైపు చూడలేక పోయాడు.
“నువ్వు ఇంటికి వెళ్ళి ఒక సంవత్సరం అవుతుందట కదా? నిజమేనా?”
అవును అని చెప్పలేక.. తలూపాడు.
“పిల్లలని వృద్దిలోకి తేవాలని మీ నాన్న ఎంతో కష్టపడేవాడు. ఆయన ఆలోచనల్లో ఎప్పుడూ మీరే వుండేవారు. నిజానికి ఏ తల్లీ తండ్రీ అయినా అంతే! పిల్లల అభ్యున్నతి కోసమే శ్రమిస్తారు. కానీ… మీరు ప్రతిఫలంగా ఆయనకి తిరిగి ఇచ్చిందేంటి? ఒక్కసారి ఆలోచించండి? కొడుకుగా నువ్వు ఆయనకి చేసిన మంచి పని ఏదైనా వుందా? మీ నాన్నకి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకునే బాధ్యత నీకు లేదా? ఎప్పుడూ నీ చదువు, నీ డబ్బు గురించిన పనులేనా!? తల్లితండ్రులని కనీసం ప్రేమగా పలకరించే సమయం కూడా నీకు లేదా?”
రామనాథం గారు అడిగే ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక మౌనంగా వుండిపోయాడు రామకృష్ణ.
కొద్దికొద్దిగా తను చేసిన తప్పేంటో అర్థమవుతుంది రామకృష్ణకి!
నిజమే తనెప్పుడూ బిజీ అనుకుంటూ ఇంటి విషయం, తల్లితండ్రుల సంగతి పట్టించుకోలేదు. అదేమంటే వాళ్ళెప్పుడూ తమకి ఇది కావాలని ఏనాడు అడగలేదు. వున్నంతలో బ్రతకసాగారు.
“ఇదివరకటిలా మీ నాన్న ఉత్సాహంగా లేకపోవడంతో.. నేను అడగగా.. ఎంతో అడిగిన మీదట చెప్పారు. కొంచెం ఆలోచించు వాళ్ళ గురించి.. నువ్వే లోకంగా బ్రతుకుతున్న నీ వాళ్ళ గురించి! ఎవరైతే ఇంటగెలవగలరో.. వాళ్ళే ప్రపంచాన్ని గెలవగలుగుతారు. నీ దగ్గర పనిచేసే నీవాళ్ళ మనస్సులు గెలవగలుగుతావు” అన్నాడు రామనాథం ఉద్వేగంగా..
ఏదో కొత్త విషయం బోధపడినట్లుగా అనిపించింది రామకృష్ణకి. వెంటనే వెళ్ళి తన తల్లితండ్రులని పలకరించాలనిపించింది.
పెద్దాయన చెప్పిన ఎన్నో విషయాలు మనస్సుకి హత్తుకోగా..”నిజమే” అనుకున్నాడు.
రామనాథం గారివైపు క్షమించమన్నట్లుగా చూశాడు.
దగ్గరకి వచ్చి “ఇంటికి వెళ్ళినప్పుడు మీ నాన్నగారిని అడిగానని చెప్పు. ఇవన్నీ ఆయనతో చర్చించవద్దు. సరేనా !?” అన్నాడు అనునయంగా!
“ఈ ఆదివారమే ఇంటికి వెళుతున్నాను.. తప్పకుండా మీరు అడిగారని చెబుతాను సార్!” అన్నాడు తల్లితండ్రుల రూపం కళ్ళ ముందు మెదలగా.. కళ్ళలో నిలిచిన ఆనందభాష్పాలని తుడుచుకుంటూ.. రాము.. అలియాస్ రామకృష్ణ!