కాజాల్లాంటి బాజాలు-49: నేనే రాణీ – నేనే దాసి..

7
3

[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]

[dropcap]ప్ర[/dropcap]స్తుత పరిస్థితులు జనాలని యిళ్ళల్లోనే వుండమంటున్నాయి. తప్పనివాళ్ళు తప్ప చాలామంది ఆఫీసు పనులు కూడా యింట్లోంచే చేసుకుంటున్నారు. ఇంటినే ఆఫీసు చేసేసుకునేటప్పటికి ఒకవిధంగా బాగానే వున్నా ఇంకోరకంగా ఇబ్బందిగానే వుంటోంది.

మునిమాణిక్యంగారన్నట్టు ఇంట్లో జరిగే విషయాలను సరదాగా తీసుకుంటే వచ్చే ఆనందమే వేరు. ఈ కరోనా కాలంలో అందరిమీదా వచ్చి పడిపోయిన లాక్‌డౌన్ వల్ల ఇళ్ళల్లో అప్పటివరకూ చూడని కొత్త కొత్త కోణాలు బయట పడుతున్నాయి. అందుకే వాటన్నింటికీ హాస్యపు మేలిముసుగు వేసి అందరినీ అలరించాలనే ఈ చిన్ని ప్రయత్నం.

ప్రస్తుతం ఇల్లాలే ఇంటికి మహారాణీ, పనిమనిషీ కూడా.. ఎప్పుడే అవతారం దాల్చాలో ఆ ఇల్లాలికన్న బాగా ఇంకెవరికి తెలుస్తుందీ!

ఉదయసంధ్యల్లో సూర్యోదయాస్తమయాలను చూసి మురిసిపోయే ప్రకృతి ప్రేమికులు చాలామంది వంటింట్లో తళతళా మెరిసిపోయే సింకును చూసి మురిసిపోయే స్థితికి వచ్చేసేరు. “ఆహా.. ఈ వంటింటి సింకు తళతళముందు ఆ సూర్యుని కాంతి యేపాటిది!” అనుకోవడం మొదలుపెట్టేరు.. ఏం చేస్తారు పాపం.. అలా అనుకుంటేనే మళ్ళీ వాళ్ళు ఆ సింక్ దగ్గరకెళ్ళి పనిచెయ్యగలరు మరి!

లాక్‌డౌన్ మొదలయి అప్పటికే ఇరవైరోజులు దాటింది. ఒక్కోఇంట్లో ఒక్కొక్కరకం భాగోతం. మనకి బాధ కలిగించేవి మానేసి కాస్తంత సరదాగా వుండే యిళ్ళ ముచ్చట్లు చెప్పుకుందాం.

ఇప్పుడు మనం రేవతి యింట్లోకి కాస్త తొంగి చూద్దాం..

పొద్దున్నే భార్య రేవతికి సాయం చేద్దామనే సదుద్దేశ్యంతో వంటింట్లో కెళ్ళేడు రవి. రేవతి పెనాన్ని సబ్బెట్టి శుభ్రంగా తోముతోంది. రవి అమందానంద కందళిత హృదయారవిందుడైనాడు. “ఓహ్.. ఇవాళ టిఫిన్ దోశెలన్నమాట..” అనుకుని సంబరపడిపోతూ పిల్లలరూం లోకి వెళ్ళి, ఆ రూం సద్దుకుంటున్నవాళ్లతో ఆ మాట చెప్పేడు. వాళ్ల మొహాలు మందారంలా వికసించేయి. అదేమిటో ఈ మధ్య అమ్మ పొంగళ్ళు, దధ్ధోజనాలూ చేసి పడేస్తోంది తప్పితే ఇదివరకులాగ దోశెలూ, కట్లెట్లూ చెయ్యటంలేదు అనుకుంటున్న వాళ్ళిద్దరికీ ఈ వార్త ఆనందాన్నే యిచ్చింది.

“ఒరేయ్ అన్నయ్యా, అమ్మ మసాలాదోశెలే చేస్తోందంటావా!” ఆ దోశెలో కూరంటే స్వీటీకి చాలా ఇష్టం.

“చేస్తుందేమోలే.. సాంబారు కూడా చేస్తే బాగుండును..” బాబీ సాంబారు ప్రియుడు.

పిల్లల మాటలు వింటున్న రవి పాపం అనుకున్నాడు. ఇదివరకు పిల్లలకి యేవి కావాలంటే అవి చేసిపెట్టేది రేవతి. తను కూడా బైటనుంచి వాళ్లడిగినప్పుడల్లా పిజ్జాలూ, బర్గర్లూ తెచ్చేవాడు. కానీ ఈ లాక్‌డౌన్ వల్ల పాపం రేవతికి పని యెక్కువైపోయి యేదో ఒక్కటే అయిటంతో వంట ముగించేస్తోంది. తను మటుకు యెన్నని చేస్తుందీ! ఇటు యిళ్ళు తుడవాలి, బట్టలు ఆరేయాలీ, వంటా టిఫినూ చేయాలీ అంటే ఒక్క మనిషి తట్టుకోగలదా! అలా అనుకోగానే వెంటనే రవికి వంటింట్లోకెళ్ళి రేవతికి కూరా, సాంబారూ చెయ్యడంలో సాయం చెయ్యాలనిపించి వంటింట్లో కెళ్ళి అక్కడి దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయేడు.

ఈ కరోనా కష్టాలు మొదలైనప్పట్నించీ అన్నీ కడుక్కోడాలూ, తుడుచుకోడాలూ యెక్కువైపోయేయన్నమాట అందరికీ తెల్సినదే. పొద్దున్నే పాలపేకెట్టు దగ్గర్నించి బైటనుంచి వచ్చిన యే వస్తువునైనా సబ్బునీళ్ళలో బాగా నురగ వచ్చేలా తలంటి, ఆపైన పసుపునీళ్ళతో శుధ్ధి చేస్తే కానీ వాడటం లేదెవెరూ. మామూలుగా సూపర్ మార్కెట్ నుంచి యేవైనా సామానులు కొనుక్కొస్తే వాటిని కూడా ఓసారి డెట్టాల్‌తో అభిషేకించి కానీ ఊపిరి పీల్చుకోవడంలేదు.

అవన్నీ ఒక ఎత్తైతే రెండ్రోజుల్నించీ రేవతికీ, రవికీ ఒక్క ప్రశ్నకి మటుకు ఎంత ఆలోచించినా సమాధానం దొరకటంలేదు. అదేమిటంటే బైటనుంచి తెచ్చిన కరెన్సీనోట్లూ, చిల్లరనాణేలని యెలా శుభ్రపరచాలీ, వాటి మాట యేవిటీ.. అని. నాల్రోజుల్నించీ ఆ కరెన్సీనోట్లు అలా కిటికీలో వున్న ట్రే లో వుంటున్నాయి. చిల్లరనాణేలు వెయ్యడానికి పక్కనే ఒక స్టీల్ బొచ్చెలాంటిది పెట్టింది రేవతి. నిన్నటికి చిల్లర అప్పుడే ఆ బొచ్చెలో సగం దాకా వచ్చేసింది. నాల్రోజులైపోయేయి కదా, ఇంక కరోనా అక్కడుండదు, మనం లోపలికి పిలవలేదని అలిగి వెళ్ళిపోయుంటుందీ, అందుకని ఆ డబ్బు మనం మామూలుగా తీసుకుని వాడుకోవచ్చూ అని రవి వాదన. ఊహూ, ఏదేమైనా సరే వాటిని ముట్టుకోడానికి వీల్లేదని రేవతి వాదన. నిన్న ఇద్దరిలో ఎవరూ గెలవకుండానే వాళ్ల వాదన ఆగిపోయింది.

ఇదిగో, ఇప్పుడు రేవతి చేస్తున్న పని చూస్తుంటే దానికి సమాధానం దొరికినట్టే అనిపించింది రవికి. రేవతి చేస్తున్న పనిని జాగ్రత్తగా గమనించసాగేడు. రేవతి రెండు చేతులకీ రెండు ప్లాస్టిక్ కవర్లు తొడిగేసుకునీ, వాటిని కదలకుండా మోచేతుల దగ్గర రబ్బర్ బేండ్ పెట్టేసుకుంది. మామూలుగానే మూతికి మాస్క్ ముసుగేసుకుంది. చీర పైన వంట చేసుకునేటప్పుడు కట్టుకునే ఆప్రాన్ కట్టేసుకుంది. ఆపరేషన్ చేసే సర్జన్ లాగా రెండు చేతులూ దేనికీ తగలకుండా ఎత్తి పట్టుకుని, బాల్కనీ వైపున్న కిటికీలో వున్న ట్రేని అతి జాగ్రత్తగా, కాస్త కదిలితే పగిలిపోయే గాజు సామానంత భద్రంగా తెచ్చి, స్టౌ పక్కనున్న స్టూల్ మీద పెట్టింది. పట్టకారుతో ఒక్కొక్క నోటునీ తీసి, జాగ్రత్తగా పక్కనే పెట్టుకున్న డెట్టాల్ నీళ్లలో అలా ముంచీ, ఇలా తీసేసి, వెంటనే స్టౌ మీదున్న వేడి పెనం మీద ఆ నోటుని పెట్టి, అట్లకాడతో అటూ ఇటూ తిప్పుతూ, తడి పోయేలా చూసి, వాటిని ఇటు పక్కనున్న ప్లేట్లో పెట్టింది. నోరెళ్ళబెట్టి ఇదంతా చూస్తున్న రవిని అప్పుడే గమనించి, “అదేంటీ అలా అయిపోయేరూ..” అంది. అప్పటిదాకా అలా అయిపోయినట్టు కూడా తెలీని రవి ఇంక ఆగలేక “మరా కాయిన్స్ యేం చేస్తావు!” అనడిగేడు ఆతృత ఆపుకోలేక.

తను కనిపెట్టిన పరిష్కారానికి రవి మెచ్చుకున్నాడనే ఆనందంతో రేవతి “అదీ చూడండి..” అంటూ అలాగే అతి జాగ్రత్తగా ఆ కాయిన్స్ వున్న బొచ్చెని తెచ్చి, దానిని స్టౌ మీద పెట్టి, నిండా నీళ్ళు పోసి స్టౌ వెలిగించింది. చిల్లరను స్టెరిలైజ్ చెయ్యాలన్న రేవతి ఆలోచనకి తెల్లబోయేడు రవి. “అద్భుతం..” అన్నాడు ఇంకేమనలేక..

“మరీ, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్..” అంది రేవతి గొప్పగా.

ఇంతలో రవికి తను పిల్లలకి పెట్టిన ఆశ గుర్తొచ్చింది. “నువ్వు పెనం కడగడం చూసి దోశెలేస్తున్నావని చెప్పేను పిల్లలకి..” అన్నాడు తప్పు చేసినట్టు. రేవతి ముఖం చిన్నబోయింది.

“ఇందాకే పిండి గ్రైండ్ చేసేనండీ. రాత్రికి చేస్తాను. పాపం పిల్లలు..ఏం పెడితే అది తింటున్నారు..” అంది మమకారంతో. “అయితే నేను ఆలూ తరిగియ్యనా..” ఉత్సాహంగా అన్నాడు రవి.

“ఊ.. రాత్రి డిన్నర్ తొందరగా చేసేద్దాం. ఏడింటికల్లా మా కజిన్స్ అందరం కలిసి ఆన్‌లైన్‌లో మీటింగెట్టుకున్నాం..”

రేవతి కజిన్స్ అందరూ ప్రపంచంలో తలోమూలా వుంటారు. అప్పుడప్పుడు యిలా కలుసుకుని వాళ్ళుండేచోట వున్న సదుపాయాలూ, ఇబ్బందులూ చెప్పుకుంటూంటారు.

“ఓహ్.. వెరీ గుడ్. అయినా ఏవిటి అంత అర్జంట్ మీటింగూ..”

“అంత అర్జెంటేమీ కాదు కానీ అరుంధతికి ఏదో డౌట్ వచ్చిందిట. దాన్ని క్లియర్ చేసుకోవాలనీ. అదీకాక బైట కెళ్ళక అందరికీ విసుగొచ్చేసింది. ఓసారి అందరం కలిసి కబుర్లు చెప్పుకోవాలనీ.. అంతే..” అంది.

అనుకున్నట్టే పిల్లలకీ, రవికీ తొందరగా దోశెలు వేసి పెట్టేసి, తను కూడా తినేసి, గబ గబా పనులు ముగించేసుకుని, మిగిలినవి మర్నాటికి వాయిదా వేసి రాత్రి యేడున్నరకల్లా ఆన్‌లైన్‌లో మీటింగ్‌కి జాయిన్ అయిపోయింది రేవతి.

ఇలా లాగిన్ అయిందో లేదో అలా కజిన్స్ అందరూ ఒక్కసారి హాయ్ చెప్పేసేరు రేవతికి. అంతే ఇంక కాసేపు ఎవరెవరు యేం మాట్లాడుతున్నారో తెలీనంత గందరగోళం అయిపోయింది. “సైలెన్స్..” అందరికన్నా పెద్దదైన మాలతి గట్టిగా ఒక్క అరుపు అరిచింది. అంతే స్కూల్లో పిల్లల్లా అందరూ ఒక్కసారి సైలెంటయిపోయేరు. ముందుగా తేరుకున్న నీరజ విసుగ్గా ”నీ టీచర్ బుధ్ధి పోనిచ్చుకున్నావు కాదు. అయినా మేవేవీ నీ స్టూడెంట్స్ కాదు. అలా అరవకు” అంది మాలతితో.

మాలతి కాస్త తగ్గుతూ, “అదికాదే. అసలు ఇక్కడ ఇప్పుడు మనందరం ఎందుకు కలిసేమో చెప్పాలి కదా..” అంది.

చెప్పు చెప్పు అన్నారు అందరూ కోరస్‌గా. మాలతి గొంతు సవరించుకుని చెప్పసాగింది.

“ఈ మధ్య అందరం ఇంట్లో కూర్చుని పనులైపోయేక ఇంకేం తోచక పాత ఫొటోలన్నీ తీసి చూసుకుంటున్నాం కదా!” అందరూ ఆసక్తిగా వింటున్నారు.

“అందులో మొన్న రమక్క మన గ్రూప్‌లో ఒక ఫొటో అప్లోడ్ చేసింది. చూసేరు కదా.. అది అప్పటి పద్మత్త పెళ్ళైనప్పటి ఫొటో. ఎప్పుడో డెవ్భ్భైయేళ్ళ క్రితంది. ఆరోజుల్లో పెళ్ళిటైమ్ లోనే స్టూడియోనుంచి మనిషిని పిలిపించి పెళ్ళిఫొటోలు తీయించుకునేవారు. అప్పుడే ఫామిలీ అందరూ కలిసి గ్రూప్ ఫొటో తీయించుకునేవారు. కొడుకులూ, కోడళ్ళూ, కూతుళ్ళూ, అల్లుళ్ళూ, మనవలూ, మనవరాళ్ళూ అందరూ వుండేవారందులో. అందులో మన బాబయ్యలూ, మావయ్యలూ చిన్నగా వున్నప్పుడు ఎలా వుండేవారో తెలుస్తుంది. ఇప్పుడీ ఫొటోలో నాకూ, రాగిణీకీ మధ్య చిన్న తగువులాట వచ్చింది. రెండో వరసలో నిల్చున్న మూడోమనిషి అబ్బులు బాబాయ్ అంటాను నేను. కాదూ పేరారం మావయ్య అంటుంది రాగిణి. ఇప్పుడే ఫొటో మళ్ళీ చూపిస్తాను. అందరూ పెద్దది చేసి చూసి అదెవరో చెప్పండి.” అంటూ ఒక ఫొటో చూపించింది మాలతి.

అందరూ దాన్ని పెద్దది చేసి రెండో వరసలో మూడో మనిషిని చూసేరు. పొడుగ్గా కట్రాటలా వున్న పదిహేడేళ్ళ అబ్బాయిది ఆ ఫొటో. ఈ చూస్తున్నవాళ్ళ మావయ్యో బాబయ్యో ఎలా చెప్పగలరు ఎవరైనా! అయినా సరే వెనక్కి తగ్గకుండా అబ్బులు బాబాయ్ అనొకరూ, పేరారం మావయ్య అని ఇంకోరూ, ఇద్దరూ కాదు పెత్తల్లిగారి తాలూకు అని ఇంకోరూ చెప్పడం మొదలెట్టేరు. వాళ్ళు చెప్పింది అవునో కాదో కూడా వాళ్లకి తెలీటంలేదు. ఇంతలో పరాశరం “ఉండండి. మా అమ్మని తీసుకొస్తాను. తనకి తెలుస్తుంది కదా..” అంటూ టీవీలో ప్రవచనం వింటున్న అరవైయేళ్ళ వాళ్లమ్మ సరస్వతిని తీసుకొచ్చేడు లాప్‌టాప్ దగ్గరికి. సంగతి విని ఆవిడ పరీక్షగా ఫొటో చూసింది. పైన నిలబడ్ద రెండు లైన్లలో వాళ్లనీ, మధ్యలో కుర్చీలో కూర్చున్న వాళ్లనీ, వాళ్ల కింద జంబుఖానా మీద కూర్చున్న పిల్లలనీ అందరినీ ఒకటికి పదిసార్లు పరీక్షగా చూసింది. కింద స్కూల్లో క్లాసులో కూర్చున్నట్టు ముక్కుమీద చూపుడు వేలేసుకుని కూర్చున్న పదేళ్ళ పిల్లని చూసి “ఇది పెద్దబ్బులు కూతురు మీనాక్షి కదుటే. వాళ్ల నాన్న టీచరు కదా. అందుకే ఎక్కడికెళ్ళినా అది క్లాసులో కూర్చున్నట్టు అలా ముక్కు మీద వేలేసుకునే కూర్చుంటుంది.” అంది నవ్వుతూ.

“అప్పుడు క్లాసులో అలా కూర్చునేవారా అత్తయ్యా..” రేవతి అడిగింది ఆశ్చర్యంగా.

“కాదే. క్లాసులో మాట్లాడకుండా వుండడానికి పిల్లలని నోటిమీద వేలేసుకుని కూర్చోమనేవారు. కానీ, ఆ వేలు అలాగే వుండేది, కానీ కింద నోరు మటుకు ఆగేది కాదు.” అంది నవ్వుతూ.

“అది సరేనమ్మా. ఇంతకీ ఈ లైన్‌లో వున్న మూడో మనిషి అబ్బులు బాబాయా, పేరారం మావయ్యా..” అడిగేడు పరాశరం.

“నేనేం చెప్పక్కర్లేదు. ఒక క్లూ చెప్తాను. దాన్ని బట్టి వాడే కాదు ఈ ఫొటోలో ఎవరెవరో మీకు ఇట్టే తెల్సిపోతుంది” అంది.

అందరూ ఆత్రంగా చూస్తున్నారు ఆవిడ యేమి చెపుతుందా అని.

“ఇదిగో చూడండి. ఈ ఫొటోలో ఇంతమంది పిల్లలు వున్నారు కదా! వాళ్ళల్లో కొందరు గళ్లచొక్కాలూ, కొందరు చారలచొక్కాలూ, కొందరు సన్న గళ్ళూ, ఇంకొందరు అడ్దచారలూ వున్న చొక్కాలు వేసుకున్నారు కదా! గళ్లచొక్కాలవాళ్లందరూ అన్నదమ్ములన్న మాట. చారలవాళ్లందరూ ఒక ఫామిలీ. ఆ రోజుల్లో ఒకే తానులో గుడ్డతో అన్నదమ్ములందరికీ చొక్కాలు కుట్టించేసేవారు. అందుకని వాళ్ళు వేసుకున్న చొక్కాలను బట్టి అన్నదమ్ములని తెల్సిపోతుంది కదా! వాళ్ళెంతమందున్నారో లెక్కెట్టండి. ఆరుగురయితే పార్థూ కొడుకులూ, యెనమండుగురయితే శీనూ కొడుకులూ.. ఇలాగ నంబర్లను బట్టి ఎవరెవరో యిట్టే తెల్సుకోవచ్చు.”

సరస్వతి యిచ్చిన క్లూ విని తెల్లబోయేరందరూ.

“అందరికీ అలా ఒకేరకం గుడ్దతో ఎలా కుట్టించేవారు బామ్మా..” ఆపుకోలేక అడిగింది రాగిణి.

“ఏం చేస్తారే.. ఇప్పట్లాగ ఒక్కళ్ళూ యిద్దరూనా యేవిటీ.. ఒక తానులో బట్ట చింపిస్తే ఆ యింట్లో వున్న మగపిల్లల కందరికీ చొక్కాలు వచ్చేసేవి. ఇప్పట్లా ఇన్ని రకాలు వున్నాయా యేవిటీ!” అంది సరస్వతి.

“మరి అమ్మాయిలకో..” రేవతి అడిగిన ప్రశ్నకి నవ్వింది సరస్వతి.

“వాళ్లకీ అంతే. ఏ పూల డిజైనో వున్న తానులోంచో బట్ట తీయించడం. పెద్దమ్మాయిలకయితే దాంతోనే పరికిణీ, వోణీ, కాస్త చిన్నపిల్లలకి జాకెట్లూ, గౌనులూ కుట్టించేవారు.”

వీళ్ళంతా యింకా సరస్వతి ఇచ్చిన క్లూ లోంచి బయటపడనేలేదు, స్క్రీన్ మీద “హాయ్..” అంటూ ప్రత్యక్ష్యమయింది నీరూ.

“ఏవిటే ఇంతాలస్యం. ఇంకా రోడ్డుమీదున్న వాళ్లందరినీ పలకరించడం అవలేదా యేవిటీ! అయినా ఇంట్లోంచే కదా పని చేస్తున్నావ్! అంత అలసటగా కనిపిస్తున్నావేం” నీరూతో వున్న చనువుతో కాస్త గట్టిగానే అడిగింది రేవతి.

“ఏం చెయ్యమంటావక్కా. ఇలా ఇంట్లోంచి పని చెయ్యడం యింకా కష్టంగా వుందనుకో..” అంటూ నిట్టూర్చింది.

“అయినా నువ్వు మరీ సుకుమారివిలే!” ఎత్తిపొడిచింది శైలూ నీరూని.

“నా మొహం సుకుమారం. రేవతక్క అన్నట్టు అందరినీ బాగున్నావా అని పలకరించడం యిప్పుడు నా నెత్తిమీద కొచ్చింది.”

“అదేంటీ.. బాగున్నారా అనడం తప్పైపోయిందా!”

“తప్పైపోలేదు. కానీ నాకు పిచ్చెక్కించేస్తోంది. ఇదివరకు ఆఫీసుకి వెళ్ళినప్పుడలా అందరినీ హాయ్ అని పలకరించి, వాళ్ళ పిల్లల గురించీ, వాళ్ళ చుట్టాలగురించీ, ఆఖరికి వాళ్ళింట్లో వున్న పెట్స్ గురించి కూడా కుశలం కనుక్కునేదాన్ని. దానివల్ల నాకేం పోదుకదా, ఏదో ఓ మంచిమాట మాట్లాడినట్టు వాళ్ళ కనిపిస్తుందీ అనుకునేదాన్ని. కానీ అదే ఇంత దూరం తెస్తుందనుకోలేదు.”

“ఏవైందే బాబూ.. అసలు సంగతి చెప్పు.” కసిరింది రాగిణి.

“మీకు తెలీనిదేవుందీ! ఇక్కడ పెట్స్‌ని పిల్లలకన్న బాగా చూసుకుంటారు కదా! ఏదో ఆఫీసుకి వచ్చినప్పుడు వాటి గురించి అడిగేదాన్ని, అక్కడితో అయిపోయేది. ఇప్పుడు ఆఫీసు పని మీద ఇళ్ళల్లో వున్నవాళ్లని కాల్ లోకి పిలిస్తే వాళ్ల కన్న ముందు ఆ పెట్స్ వచ్చేస్తున్నాయి స్క్రీన్ మీదకి. ముందు వాటికి నేను హాయ్ చెప్పాల్సొస్తోంది.

ఒకడంటాడూ, “హాయ్ నీరూ, సే హాయ్ టూ తాపీ..” అంటాడు. ఎవరా అని చూస్తే పక్కన ఓ పిల్లిపిల్ల ఇంతింత గుడ్లెట్టుకుని స్క్రీన్ వైపు చూస్తూ కనిపిస్తుంది. దానికి ముందు హాయ్ చెప్తే కానీ అక్కణ్ణించి కదలదు.

ఇంకోడున్నాడు.. వాడి గర్ల్ ఫ్రెండ్ వీడి దగ్గరికి వస్తూ వస్తూ తనతోపాటూ తీసుకొచ్చిందిట ఒక కుక్కపిల్లని. రెండేళ్ళయేక ఆ గర్ల్ ఫ్రెండ్ వాణ్ణి వదిలేసింది కానీ ఈ కుక్క మటుకు వీడి దగ్గరే వుండిపోయింది. దానికి హాయ్ చెప్పడంతో సరిపోలేదు, వాడు దాన్ని బుజ్జగించి పంపేదాకా అయిదునిమిషాలు దాని విన్యాసాలు చూడ్డానికే నా పనయిపోయింది.

ఇంకొకావిడుంది. ఆవిడ కుక్క పేరు పెటా ట. అది ఆవిడ కొడుకుని కూడా ఆవిడ వొళ్ళో కూర్చోనివ్వదుట. పొరపాటున యెప్పుడైనా ఆవిడ కొడుకుని వొళ్ళో కూర్చోపెట్టుకుంటే వాణ్ణి దింపి, దీన్ని కూర్చోపెట్టుకునేదాకా గొడవ గొడవ చేసేస్తుందిట. ఆ పెటాని చూపిస్తూ ఆవిడ యిదంతా చెప్తుంటే యింక నాకు ఆఫీసు విషయం మాట్లాడ్దానికి యెక్కడ గుర్తుంటుందీ.. ఇదిగో కొలీగ్స్ కన్న ముందు వాళ్ల పెట్స్‌తో మాట్లాడి, వాటిని సముదాయించి, వీళ్లతో ఆఫీసు సంగతులు చూసుకుని వచ్చేసరికి యీవేళయింది.”

సంగతంతా చెప్పి అలిసిపోయింది నీరూ.

“హూ.. ఈ కరోనా కాదు కానీ యెన్నెన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయో…” అన్నాడు పరాశరం.

“బాబోయ్.. కరోనా అన్న మాట మాత్రం యెవరూ యెత్తకండి దయచేసి. ఎక్కడ చూసినా అదే న్యూస్. భయంతో చస్తున్నాం. మళ్ళీ వారం మళ్ళీ కలుద్దాం. అప్పుడు యింకో టాపిక్ మాట్లాడుకుందాం..”

అంటూ అందరికీ వీడ్కోలు చెప్పింది రేవతి.

మనం కూడా వచ్చేవారం ఇంకో యింట్లోకి తొంగి చూద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here