“మైగ్రేషన్” అను సంక్రమణ

1
3

[dropcap]ల[/dropcap]ఘు చిత్రాలు ఒకోసారి సామాజిక అవసరార్థం కూడా తీస్తారు. ఇప్పుడు నేను చెప్పే “మైగ్రేషన్” అన్న చిత్రం ఆ కోవలోకే వస్తుంది. 2008 లో ఎయిడ్స్ గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి విశాల్ భారద్వాజ్, సంతోష్ శివన్, ఫర్హాన్ అఖ్తర్, మీరా నాయిర్ లాంటి వాళ్ళు లఘు చిత్రాలు తీశారు. ఈ చిత్రం తీసినది మీరా నాయిర్.

పల్లెల్లో రైతులు అప్పులపాలై, పంట పండక, పండినా పెట్టుబడైనా రాక కొందరు ఆత్మహత్యలు చేసుకుంటున్న రోజులు. షైనీ ఆహుజా తండ్రి టినూ ఆనంద్ దాన్ని భూదేవి శాపం అంటాడు. కాదు, రైతుల రుణభారం అంటాడు షైనీ. సంపాదన కోసం భార్య రైమా సెన్ ను వదిలి, ముంబైకి వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ వర్కర్ గా చేస్తాడు. పక్క బిల్డింగులో వుంటున్న సమీరా రెడ్డి వివాహం అయినా కూడా అసంతృప్త మహిళ. భర్త ఇర్ఫాన్ ఖాన్ పెళ్ళైతే చేసుకున్నాడు కాని అతని ప్రేమ అర్జున్ మాథుర్ అనే అబ్బాయితో. కొడుకు గురించి తెలిసీ వెనకేసుకొచ్చే సులభా దేశ్‌పాండే భర్త తప్పుడు తిరుగుళ్ళకు బాధ్యత భార్యదే, ఓ పిల్లాణ్ణి కను, ఇక ఇంటిపట్టున వాడుండకపోతే నన్నడుగు అంటుంది. సహజ వాంఛో లేక సంతానం కోసమో గాని సమీర షైనీతో చాటు సంబంధం పెట్టుకుంటుంది. తన ప్రియుడిని కలవడానికి వెళ్ళిన ఇర్ఫాన్ ఖాన్ అక్కడ అర్జున్ మాథుర్ మరో మగాడితో వుండడం చూసి గొడవ పడతాడు. నువ్వు మాత్రం నీ భార్యకు చెప్పకుండా చాటుగా రావట్లేదా, నా మీద అథారిటీ చెలాయిస్తున్నావు అంటాడు అర్జున్.

ఇలా గొలుసు సంకెల లాగా చాలా మంది జీవితాలు ముడివేసుకుని వుంటాయి. వేరు వేరు ఆర్థిక, సామాజిక, భౌగోళిక, లైంగిక అభిరుచుల వర్గాల నుంచి వచ్చిన వారు. కొన్ని ప్రజలకు సమాచారం అందజెయ్యడానికి రోడ్ షోలు బాగా పని చేస్తాయి. నాలుగు రోడ్ల కూడలిలో విజయ్ రాజ్ అలాంటిదే వొకటి నిర్వహిస్తాడు. ఎచ్ ఐ వి, ఎయిడ్స్ బారి నుంచి తప్పించుకోవడానికి సులువైన మార్గం కండోంలు ధరించడమే అంటాడు. కథకురాలి మాటగా తెర మీద “మీరు ప్రేమిస్తున్నవారి క్షేమం కోసం కండోం వాడండి” అని వుంటుంది.

చెప్పాల్సింది ఎయిడ్స్ నివారణ గురించే అయినా ఎన్ని రకాల కథలను చెప్పవచ్చో అన్నీ నమ్మించేలా అల్లి, గుది గుచ్చి బలంగా చెప్పారు రచయిత్రీ, దర్శకురాలూ. చదువుకున్నా (ఇర్ఫాన్) పట్టించుకోని, లక్ష్య పెట్టని, ప్రమత్త ప్రజ ఒక వైపు. చదువుకోని షైనీ లాంటి వాళ్ళు మరో వైపు. షైనీ భార్య రైమా బిడ్డను కంటుంది. ఆ బిడ్డను అందిస్తూ నర్సు అంటుంది షైనీ తో, తల్లికి ఎచ్ ఐ వీ వుంది, డాక్టర్ మిమ్మల్ని ఇద్దరినీ కలవమన్నారూ అని. సంతోషంగా నవ్వుతూ తలాడిస్తాడు షైనీ. నర్సు అర్థం చేసుకుని విసుగ్గా అంటుంది, ఎయిడ్స్ అంటే తెలుసుగా అని. అతని ముఖం పాలిపోతుంది. భార్య కాళ్ళ దగ్గర పడి క్షమించమని ఏడుస్తూ అడుగుతాడు.

ఇంకో గమనించాల్సిన విషయం ఏమిటంటే స్వలింగ సంబంధాలను నిరసించడం (మొదట్లో ఎయిడ్స్ వారి కారణంగానే వచ్చిందని నమ్మేవారు), వివాహేతర సంబంధం మీద విమర్శ గాని చెయ్యలేదు. అదే సమయంలో ఇర్ఫాన్ తల్లి ఏ విధంగా సమాజంలో దొంగ నీతులను చెల్లనిస్తున్నారో ఆ వర్గానికి ప్రతినిధి. అన్నీ ఎలాంటి టీకా టిప్పణి లేకుండా మన ముందు పెట్టారు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాన్ని తెర మీద అక్షరాలతోనే చెప్పారు : “మీరు ప్రేమిస్తున్నవారి క్షేమం కోసం కండోం వాడండి”.

ఈ లఘు చిత్రానికి కథ జోయా అఖ్తర్ వ్రాసింది. సౌష్టవమైన కథను తెరమీదకు ఎక్కించే పని మీరా నాయిర్ చేసింది.

ఇప్పుడు ఎయిడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. కానీ ఈ కొత్తగా వచ్చిన కొరోనా వైరస్ జనాలను ఆట ఆడిస్తోంది. ఏ వైరస్ అయినా మనిషి దాన్ని అర్థం చేసుకుని తగ్గట్టుగా జీవన సరళిని మార్చుకోవాల్సిందే. ఎయిడ్స్ విషయంలో సెక్స్ సంబంధాలైతే, ఇప్పుడు ఈ కొరొనా విషయంలో ప్రకృతితో మనిషి సంబంధం ఫోకస్ లో కొచ్చింది. నిర్మానుష్యంగా వున్న వీధుల్లో పక్షులు, జంతువులు స్వేచ్చగా తిరగడం, జలాశయాల్లో దూర ప్రాంతాలనుంచీ వస్తున్న పక్షులు, నదుల్లో జనావాసానికి దగ్గరగా కూడా డాల్ఫిన్లు రావడం, పట్టణాల్లో కాలుష్యం తగ్గడం ఇవి కూడా మనల్ని ఆలోచింపజేస్తున్నాయి. ఆ కోణం నుంచి చూస్తే ఈ చిత్రం ఇప్పుడు చూడడం కూదా లాభించే పనే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here