వినత – కద్రువలు

0
3

[dropcap]మ[/dropcap]న పురాణాలు మన ఎలా వుండాలో ఎలా ఉండకూడదో స్పష్టముగా సోదాహరణముగా చెపుతాయి. పురాణాలలోని వ్యక్తుల జీవితాలు మనకి మార్గదర్శకంగా ఉంటాయి. మంచి మార్గాన్ని అవలంభించిన వారు మొదట్లో కష్టాలకు లోనయినా చివరకు సుఖపడటము చూస్తూ ఉంటాము. అలాగే నీతి తప్పినవారు అన్ని రకాలుగా భ్రష్టు పట్టటం చూస్తూ ఉంటాము. ఈర్ష్య అసూయా వంటి లక్షణాల వల్ల మానవులే కాదు ఇతరులు కూడా ఏ విధముగా నాశనము అయింది అన్న సత్యాన్ని వివరించేదే వినత కద్రువల కథ. అసూయ మనిషినే కాదు, దేవతలను కూడా ఎంతటి నీచ స్థితికి దిగజారుస్తుందో, సంబంధాలను ఏ విధముగా చెడగొడుతుందో ఈ కథ వల్ల తెలుస్తుంది. అధిపత్యపు పోరు, అహంకారము అతిశయము, అనే చెడు లక్షణాలు అప్పచెల్లెల్లు అయినా వినత కద్రువలను మమతానుభంధాలకు ఎలా దూరము చేసింది అన్న సత్యానికి కూడా వీరి కధ నిదర్శనము. అసూయ వున్న వాళ్ళు చరిత్ర హీనులవుతారే తప్ప దేవతలైన మసి వాడక తప్పదు అని కూడా తెలుస్తుంది. అలాగే ఈ కథ మాతృరుణము తీర్చుకున్నగరుత్మంతుడి కథగా వస్తుంది.

అప్పచెల్లెల్లు అయిన వినత కద్రువలు కశ్యప ప్రజాపతి భార్యలు. వీరిద్దరూ ఒకసారి సముద్రతీరానికి విహారముగా వెళ్లారు. అక్కడి వాతావరణానికి ఇద్దరు ఆనందించారు కానీ బుద్ధి వక్రించిన కద్రువ దూరంగా ఉన్న దేవతా అశ్వాన్ని చూచి,” చూశావా సముద్రపు నురగలా ఎంత బాగుందో” అంది. వినత కూడా “అవును చాలా బాగుంది” అంది. కానీ కద్రువ,”అంతా బాగానే ఉంది కానీ తోకే నలుపు” అంది. దానికి వినత నవ్వి, “ఎక్కడ చూస్తున్నావు గుర్రాన్నా, దూరముగా ఉన్న కొండనా?” అన్నది. వినత నవ్వుకు ఉక్రోషము చెందిన కద్రువ ఒంటికి కారము పూసినట్లు అయి, “తోక నలుపుగానే ఉంది నీ చూపు సరిగా లేదు” తన పంతము పట్టుదల నెగ్గించుకోవాలని మొండిగా గట్టిగా అంది. “అయితే దగ్గరకు వెళ్లి చూద్దాము” రమ్మని వినత కద్రువను అడుగుతుంది. “ఇప్పుడు కాదు, చీకటి పడుతుంది కాబట్టి రేపు ఉదయము చూద్దాము” అని కద్రువ అంటుంది. కానీ అంతటితో ఆగక కద్రువ పట్టుదల పంతాలకు పోయి, “నీవు చెప్పినట్లు గుఱ్ఱము తోక తెల్లగా ఉంటే నేను నీకు దాసిగా ఉంటాను. దాని తోక నల్లగా వుంటే నీవు నాకు దాసివి కావాలి” అని పందెము వేసింది.

అప్పటికి వినత “ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత పెద్ద పెద్ద పందేలు” అని సర్ది చెప్పబోయింది కానీ కద్రువ,”ఓడిపోతానని భయమా? అటువంటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి” అని రెచ్చగొట్టే ధోరణిలో వినతను కవ్విస్తుంది. వినత పరిస్థితి వెనుక నుయ్యి, ముందు గొయ్యి అయింది పందానికి ఒప్పుకోక తప్పింది కాదు. ఎలాగూ ఆ గుఱ్ఱము తెల్లదే పైపెచ్చు అది దేవతాఅశ్వము కాబట్టి దానిని గురించి ఆలోచన అనవసరమని

వినతకు అనిపించింది. కానీ కద్రువకు కంటి మీద కునుకు లేదు.

తెల్లవారగానే కద్రువ తన వెయ్యి మంది నాగకుమారులను పిలిచి విషయము చెప్పి తన పరువు దక్కించమని ప్రార్థించింది. వారిలో కొంతమంది అక్క చెల్లెళ్ళ మధ్య ఇటువంటి పంతాలు పట్టింపులు పనికి రావని సలహాగా చెప్పారు కానీ కద్రువ తన పట్టుదల వీడకుండా తన నాగకుమారులను “కామరూపులై ఆ గుఱ్ఱము తోక పట్టుకుని ఉండండి, అప్పుడు తోక నల్లగా కనిపిస్తుంది లేని పక్షంలో నేను దాసీగా ఉండవలసివస్తుంది” అని తన కుమారులను హెచ్చరిస్తుంది. నాగకుమారులలో కొందరు, “మేము తప్పు చేస్తే సరిచేయ వలసిన తల్లివి, మమ్మల్ని తప్పు చేయమని చెప్పటం భావ్యమా?” అని తల్లికి సర్ది చెప్పాలని ప్రయత్నిస్తారు కానీ ఆగ్రహము చెందిన కద్రువ, “నన్ను కాదన్నవారు త్వరలో జనమేజేయుడు చేయబోయే సర్ప యాగములో నాశనము అవుతారు” అని శపించింది.

నాగకుమారులలో ఒకడైన కర్కోటకుడు తల్లి శాపానికి చావుకు భయపడి తల్లిని పందెములో నెగ్గించటానికి తన మాయ స్వరూపముతో ఆ గుఱ్ఱము తోకను చుట్టుకున్నాడు. వినత కద్రువలు ఆ గుర్రాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు కద్రువ దగ్గరకు వెళ్లనీవకుండా వారించి, “చూసావా ఆ తోక నలుపే. నేనే గెలిచాను కాబట్టి ఈ క్షణము నుంచి నీవు నా దాసివే” అంది.

ఆ విధముగా కుతంత్రముతో పందెము గెలిచి సోదరి అయినా వినతను దాసిగా చేసుకుంది. ఈ కథ ఇంతటితో అయిపోలేదు. వినత దాస్య విముక్తి ఎలా అయిందో తెలుసుకోవాలి.

మాతృ ఋణము ఏమి చేసిన తీరదు. అటువంటిది మాతృ ఋణము తీర్చుకున్న మహానుభావులలో వినత కొడుకైన గరుక్మంతుడు ప్రముఖుడు. గరుక్మంతుని పుట్టుకే చాలా విచిత్రమైనది. వినత రెండు అండాలను పెడుతుంది. మొదటి అండాన్ని తొందరపడి పగలగొడుతుంది. ఫలితముగా మహామహుడు కావలసిన వాడు అనూరుడై (కాళ్ళు తొడలు లేనివాడు) పుట్టి సూర్యనికి సారధి అవుతాడు. అతని సంతతియే శ్వేని, శ్వేని పుత్రులు సంపాతి జటాయువులు. ఆ తరువాత 500 సంవత్సరాల తరువాత రెండవ అండము రూపు దాల్చుకొని సూర్య తేజోమయుడు, వాయు విక్రముడు అయిన గరుక్మంతుడు బయటకు వస్తాడు. పుట్టగానే రెక్కలను టపాటప లాడించటము వల్ల సముద్రాలూ పొంగుతాయి, పర్వతాలు కదులుతాయి. ఉన్నట్టుండి వచ్చిన కాంతికి దేవతలు అగ్ని దేవుని వల్ల ఈ కాంతి అనుకొని అగ్ని దేవుడిని శాంతించమని అడుగుతారు. అగ్నిదేవుడు ఈ కాంతికి కారణము గరుక్మంతుఁడని అని చెప్పగా దేవతలు మునులు అగ్ని సూక్తాలతో శాంతింపజేస్తారు. అప్పుడు గరుక్మంతుడు క్రిందకు వచ్చి తల్లి వినత చరణాలకు నమస్కరిస్తాడు. వినత పొందిన ఆనందము వర్ణానాతీతము, కానీ ఇది చూసిన కద్రువ అసూయతో కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది.

“దాసీ దాని కొడుకు కూడా దాసీ వాడే. కాబట్టి నీవు నా పిల్లలను వీపున మోస్తూ ఆడించాలి” అని ఆజ్ఞ జారీ చేసింది. ఆ క్రమములో గరుక్మంతుడు నాగులను భుజాన ఎక్కించుకొని ఆకాశములో విహరిస్తుంటే నాగులు ‘ఇంకా ఇంకా పైకి’ అంటుంటే గరుక్మంతుడు సూర్యమండలం దాకా తీసుకు వెళ్ళాడు. సూర్యుని వేడికి నాగులు తాళలేక క్రిందకు పడిపోయారు. ఇది తెలుసుకున్న కద్రువ గరుక్మంతుడిని తిట్టి తన పిల్లలను కాపాడమని ఇంద్రుడిని కోరింది. ఇంద్రుడి అనుగ్రహముతో నాగులు బ్రతికారు. అప్పటినుంచి కోపముతో కద్రువ చెప్పకూడని పనులు చెపుతూ గరుక్మంతుడిని బాధలు పెట్టసాగింది.

ఈ దుష్ట దాస్యము భరించలేక గరుక్మంతుడు తన తల్లిని ఈ దాస్యానికి కారణము అడుగుతాడు. తల్లి బాధపడుతూ జరిగినదంతా చెపుతుంది. అప్పుడు గరుక్మంతుడు నాగుల దగ్గరకు వచ్చి, “మీకు ఏమి కావాలో చెప్పండి. ఎంత కష్టమైనా మీ కోరిక నెరవేరుస్తాను. ఆ క్షణమూ నుండి నా తల్లికి నాకు దాస్య విముక్తి చేయండి” అని అడుగుతాడు. నాగులు అలోచించి, “మాకు అమృతము తెచ్చి ఇస్తే మీరు దాస్య విముక్తులు అవుతారు” అని వారి కోరికను చెపుతారు.

గరుక్మంతుడు తల్లి దగ్గరకు వెళ్లి ఆమె పాదాలకు నమస్కరించి జరిగినది చెప్పి ఆశీర్వచనం తీసుకొని అమృతము కోసము వెళతానని చెప్పి”అమ్మా దేవతలతో పోరాడటానికి శక్తి కావాలంటే తగ్గ ఆహారము తీసుకోవాలి కదా ఎలా” అని అడుగుతాడు. అపుడు తల్లి వినత, “సముద్ర మధ్యములో భూలోక వాసులకు అపకారము చేసే నిషాదులు ఉన్నారు, వారిని తిను. కానీ బ్రాహ్మణుల జోలికి పోకు. వారు అగ్నిహోత్రుని మించిన అగ్నిహోత్రులు” అని చెపుతుంది. తల్లి చెప్పినట్లుగానే నిషాదులను తిన్నా గరుక్మంతుడికి ఆకలి తీరలేదు. అప్పుడు గంధమాన పర్వతముపై తపస్సు చేసుకుంటున్న తండ్రి కశ్య ప్రజాపతిని దర్శించి తాను అమృతము కోసము బయలుదేరటము మొదలైన విషయాలు వివరముగా చెప్పి తన ఆకలి తీరలేదు ఏమి చేయమంటారు అని అడుగుతాడు.

తండ్రి పూర్వకాలములో అన్నదమ్ములైన విభావసుడు సుప్రతీకుడు అనే మహర్షులు ఒకరి నొకరు శపించుకొని గజ (ఏనుగు), కాకాపము(తాబేలు) గా మారిన వృత్తాంతము చెప్పి “ఆ ఇద్దరిని తినేసి నీ ఆకలి తీర్చుకో” అని చెపుతాడు. తండ్రి ఆదేశము ప్రకారము గరుక్మంతుడు గజ కచ్ఛపాలను తీసుకొని ఆలంబ తీర్ధము చేరేసరికి అక్కడ రోహణ మనే వృక్ష రాజము తనపై కూర్చుని వాటిని తినమని చెపుతుంది. కానీ గరుక్మంతుడి బరువుకు ఆ చెట్టు కాస్త పెళపెళ విరుగుతుంది ఆ చెట్టు నాధారము చేసుకోని అంగుష్ట (బొటన వ్రేలు) మాత్ర మునులు తలక్రిందులుగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఏమి చేయాలో తోచని గరుక్మంతుడు వారు ఉన్న కొమ్మను జాగ్రత్తగా ముక్కుతో పట్టుకొని తండ్రి దగ్గరకు వెళతాడు. ఇది గమనించిన కశ్యపుడు మునులతో, “మహామహులారా నా కుమారుని ప్రయత్నములో మీకు ఇబ్బంది కలిగింది. మీరు మీకు సురక్షితమైన ప్రదేశము చెపితే మిమ్ములను అక్కడికే చేరుస్తాడు” అని చెప్పగా మునులు కొమ్మను విడిచి హిమవత్ పర్వత ప్రాంతాలకు వెళ్లిపోయారు. తండ్రి సూచన మేర ఆ భారీ కొమ్మను హిమవత్ పర్వత సమీపములో గల నిష్పురుష పర్వతము పై వదిలి అక్కడే గజ కచ్ఛపాలను తిని అమృత సంపాదనకు దేవలోకానికి ఒక్క ఉదుటన ఎగిరాడు.

గరుక్మంతుడి ధాటికి దేవలోకంలో ఏర్పడ్డ ఉపద్రవాలకు దేవతలు భయపడి తమ గురువైన బృహస్పతిని కారణము అడిగారు. అప్పుడు బృహస్పతి కశ్యప ప్రజాపతి సంతానమైన గరుడు మాతృ దాస్య విముక్తికి అమృతము కోసము వస్తున్నాడని చెప్తాడు. “అతను బలవంతుడు అతనితో నీవు తలపడి నెగ్గలేవు అదీగాక కశ్యప ప్రజాపతి నీకు చేసిన సహాయమును గుర్తు తెచ్చుకొని గరుక్మంతుడితో సంధి చేసుకొని అమృతాన్ని ఇవ్వు” అని బృహస్పతి ఇంద్రునికి సలహా ఇస్తాడు. కానీ ఇంద్రుడు ఆ సలహాను పెడచెవిన పెడతాడు. గరుక్మంతుని ధాటికి ఎవరు తట్టుకోలేకపోతారు. అమృత భాండానికి రక్షణగా ఉన్న చక్రము వంటి యంత్రము లోకి సూక్షధారి అయి ప్రవేశించి రక్షణగా ఉన్నవిష సర్పాలను చంపి అమృతభాండాన్ని చేజిక్కించుకొని తిరుగు ప్రయాణము అయినాడు. అమృత భాండము లోని ఒక చుక్క అమృతాన్ని స్వీకరించని గరుక్మంతుడి నిస్వార్ధ బుద్దికి సంతసించిన శ్రీ మహావిష్ణువు గరుక్మంతుడి ఎదుట ప్రత్యక్షమయి, “మహావీరా, నీలాంటి నిస్వార్ధపరులు లోక రక్షణకు అవసరము. ఏమి వారము కావాలో కోరుకో” అని సెలవిస్తాడు. మహా ఆనందపడిన గరుక్మంతుడు, “దేవాదిదేవా అను క్షణము నిన్ను సేవిస్తూ నీతో అంతరిక్షంలో విహరించే అవకాశము కలుగజేయి తండ్రీ. అమృత పానము చేయక పోయినా అజరామరుడిగా ఉండే వరాన్ని ప్రసాదించు దేవా” అని ప్రార్థించాడు. శ్రీ మహా విష్ణువు గరుక్మంతుడికి కోరిన వరము ప్రసాదించాడు.

అప్పుడు సంతుష్టుడైన గరుక్మంతుడు శ్రీ మహావిష్ణువుతో,”దేవాధిదేవా నీకూ ఒక వరము ఇవ్వాలని నాకు కోరికగా ఉంది కోరుకో” అని అడిగాడు. శ్రీ మహావిష్ణువు నవ్వి “నీవు నాకు వాహనముగా వుండు” అని అంటాడు ఆ విధముగా ఇరువురు ఒకరినొకరు వరాలను గ్రహించుకున్నారు.

అమృత భాండము తీసుకువెళుతున్నగరుక్మంతుడిపై ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాడు. గరుక్మంతుడు, పకపకా నవ్వి, “ఇంద్రా నీ వజ్రాయుధము నన్నేమి చెయ్యలేదు. ఆ వజ్రాయుధానికి ఊడిన నా రెక్క లోని ఈకను నీకు సమర్పిస్తున్నాను”అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవతలు గరుక్మంతుని పరాక్రమాలను పొగుడుతు అతనిని సుపర్ణుడు అని ప్రశంసిస్తారు. యథార్ధాన్ని గ్రహించిన ఇంద్రుడు తాను గరుక్మంతుడిని ఏమి చేయలేను అని తెలుసుకొని సామరస్య పూర్వకముగా “ఈ అమృతాన్ని ఏమి చేస్తావు?” అని అడుగుతాడు. అప్పుడు గరుక్మంతుడు మొత్తం వృత్తాంతాన్ని చెప్పి “నేను ఈ అమృత భాండాన్ని నాగకుమారులకు అప్పజెప్పి నేను నా తల్లి దాస్య విముక్తులవుతాము. ఆ తరువాత నీవు ఏమైనా చేసుకో” అని చెపుతాడు గరుక్మంతుడి నిస్వార్థ బుద్ధిని మెచ్చిన ఇంద్రుడు వరము కోరుకోమంటాడు. “ఇన్నాళ్లు నన్ను నా తల్లిని హింసించిన నాగకుమారులను నాకు ఆహారముగా ఇవ్వు” అని అడుగుతాడు. ఇంద్రుడు సరే అని అంటాడు.

గరుక్మంతుడు నాగకుమారులను చేరి “ఇదిగో అమృత భాండము. శుచిగా స్నానమాచరించి సేవించండి” చెప్పి అమృత భాండాన్ని దర్భలపై ఉంచి వారిచే ముమ్మారులు, “మీరు దాస్య విముక్తులు” అని చెప్పించి తల్లితో సహా స్వతంత్రుడైనాడు.

నాగకుమారులు స్నానము కోసము వెళ్లిన సమయములో ఇంద్రుడు సుడిగాలిలా వచ్చి ఆ అమృత భాండాన్ని ఎత్తుకు పోతాడు. స్నానము చేసి వచ్చిన నాగకుమారులకు అమృత భాండము కనిపించదు. అమృతము దర్భలకు ఏమైనా అంటుకున్నదేమోనని నాగులు నాలుకతో దర్భలను రుచి చూశారు. అందుచేతనే నాగుల నాలుక రెండుగా చీలి ఉంటుంది. ఈ విధముగా గరుక్మంతుడు తన శక్తి నిస్వార్థ బుద్ధితో యుక్తితో విష్ణుమూర్తిని దేవతలను మెప్పించి అమృతాన్ని పొంది తల్లి దాస్యవిముక్తి చేసి మాతృ ఋణము తీర్చుకున్న మహానుభావుడైనాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here