ఇలతో అల చేసిన సంభాషణ – మణిబాబు ‘నేనిలా… తానలా’ దీర్ఘకవిత

4
3

[dropcap]కొ[/dropcap]న్నికవితా వస్తువులు కవిజీవితంతో మమేకమైపోతాయి. వాటితో ఆ కవి సుదీర్ఘమైన ఆత్మైకప్రయాణం చేసి ఉంటాడు. ఆ వస్తువుతో కవికి ఉన్నఅనుభవాలతో అతని హృదయం నిండి పొంగిపొర్లుతూ ఉంటుంది. అలాంటి స్థితిని అనువదించటానికి ఓ పాతిక ముప్ఫై పాదాలు సరిపోవు. ఇలాంటినేపథ్యంలోఆ కవి తన ఉద్వేగాలను దీర్ఘకవితగా మలుస్తాడు. అదొక అనివార్యమైన వ్యక్తీకరణరూపం. తీసుకొన్నవస్తువును దాని భిన్నపార్శ్వాలతో కవిత్వీకరించి, తనదైన ఒక దృక్కోణాన్ని ఆ వస్తువుకు ఆపాదిస్తూ వ్రాసిన విస్త్రుతమైన రచననే ‘దీర్ఘకవిత’గా నిర్వచించుకోవచ్చును.

కవి, విమర్శకుడు అవధానుల మణిబాబు సముద్రంతో తనకున్న అనుబంధాన్ని ఒక దీర్ఘకవితగా మలచి ‘నేనిలా… తానలా’ పేరుతో ఇటీవల వెలువరించారు. దీర్ఘకవితను వ్రాసేటపుడు ప్రణాళిక అవసరం. లేనట్లయితే అతివిస్తరణ, శాఖాచక్రభ్రమణం కావ్యాత్మను పాడుచేస్తాయి. మణిబాబు ఈ దీర్ఘకవితను చక్కని ప్రణాళికతో నడిపించాడు.

ఈ దీర్ఘకవితను మూడు భాగాలుగా విభజించుకొంటే మొదటిభాగంలో తన బాల్యంనుండి సముద్రంతో తనకు ఉన్న జ్ఞాపకాలను తలపోసుకొంటాడు. రెండవభాగంలో వర్తమానంలో సముద్రంతో చేసిన తాత్విక సంభాషణ ఉంటుంది. మూడవభాగంలో సముద్రం కవితో చేసిన సంభాషణలో పలికించిన పర్యావరణస్పృహ చదువరిని ఆలోచింపచేస్తుంది. నాస్టాల్జియా, సమకాలీనత, అన్యాపదేశంగా చెప్పిన హెచ్చరికా ఈ దీర్ఘకావ్యానికి సమగ్రతను తెచ్చిపెట్టాయి. దీర్ఘకవితలకు సమగ్రత ఆత్మవంటిది.

దండి “కావ్యాదర్శం”లో కావ్యానికి అష్టాదశవర్ణనలు ఉండాలంటాడు. “నేనిలా… తానలా” దీర్ఘకవితలో వివిధ సందర్భాలలోచేసిన – నగరం, సముద్రం, రుతువు, సూర్యోదయం, సలిలక్రీడ, విప్రలంభం, వివాహం, కుమారోదయం, దూత్యం, నాయకాభ్యుదయం అనే పదిరకాల వర్ణనలను పోల్చుకోవచ్చును. సముద్రాన్నివస్తువుగా స్వీకరించి రచనలుచేసిన శ్రీఅద్దేపల్లి, శ్రీగరికపాటి, శ్రీరామకృష్ణశ్రీవత్స, శ్రీగనారా వంటి తన “పూర్వకవుల/రచయితల ప్రస్తావన” చేయటం గమనించవచ్చు. ఇవికాక, ఆధునిక కావ్యలక్షణాలైన సామాజికచైతన్యం, పర్యావరణకాలుష్యం పట్ల వ్యాకులత, చారిత్రిక స్పృహలు అద్భుతంగా పలికాయి. వీటన్నింటినీ దృష్టిలోఉంచుకొన్నప్పుడు “నేనిలా… తానలా” దీర్ఘకవిత అటు సాంప్రదాయక, ఇటుఆధునికలక్షణాలను పొదువుకొన్న ఒక “మినికావ్యం”గా అనిపించకమానదు. .

***

“నేనిలా…తానలా” కావ్యంలో పైకి కవి తన ఎదుటగా ఉన్న సముద్రంతో చేసిన సంభాషణలా కనిపిస్తున్నప్పటికీ అది మానవజాతికి, ఆద్యంతరహితమైన సాగరానికి ఉన్న అనాది అనుబంధానికి అక్షరరూపం.

“ఎందుకు నీవంటే అపేక్ష” అని కవి సముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా సమాధానం ఇచ్చిందట

వెర్రివాడా!
నువ్వునాసంక్షిప్తరూపానివి
నేనునీసమగ్ర స్వరూపాన్ని
నేనుఅర్ణవం
నువ్వుఅక్వేరియం.
నీభాషలో
త్వమేవాహం-అంతే.

మనిషి సముద్రానికి సంక్షిప్తరూపం అనటం నవ్యమైన ఊహ. పడిలేచే లేదా లేచిపడే కెరటాలు, బడబాగ్నులు, ఉప్పెనలు, నిర్జన ఒంటరితనాలు, నిగూఢతా, నిర్మలతా మనిషి లేదా మానవ జాతి లక్షణాలుకూడాను.

సముద్రఘోషను కవులు భిన్నసందర్భాలకు భిన్నరకాలుగా భాష్యంచెప్పి తమ ఊహలకు ఊతంగా, ఆయా సందర్భాలను ఉన్మీలనంచేసేలా వాడుకొన్నారు. ఈ దీర్ఘకవితలో “మేము తీరంపై రాసిన రాతల్ని, ముద్రల్ని ఎందుకు చెరిపేస్తావు నువ్వు” అనిసముద్రాన్ని ప్రశ్నించినపుడు సముద్రం ఇలా బదులిచ్చిందట

చెరిపిపోవటం కాదు
వాటిని నాలో దాచుకోవటం
భాష తెలియక ఘోషనుకొంటారు గానీ
నాశబ్దాలన్నీమీరాతల కలవరింతలే

మీ ఆటల తలపోతలే. — ఇదొక నవ్యమైన ఊహ. సముద్రఘోష అనేది, సముద్రతీరంపై మనం రాసుకొన్న రాతలు, ఆడుకొన్న ఆటలే అనటం చక్కని సందర్భోచిత నిర్వచనం. చెప్పే విషయాలలో అన్వయసారళ్యత ఎంత తేటగాఉంటే ఆ కవిత అంత బిగిగా ఉంటుందనటానికి చక్కని ఉదాహరణ ఇది.

ధనుష్కోటిలో
తేలుతున్నరాయిని చూసి
ప్రత్యేకత రాయిదా? నీటిదా?
ఆలోచిస్తూ
కిటికీలోంచి చీకటిని చూస్తూ
నిదరోతున్న రైలులో
ఒక్కడినే మెలకువగా ఉన్నపుడు

“సాంద్రమైనదేదో వీడగలిగితే
తేలడం నీకైనాసాధ్యమే
బెండులా తేలిక కావాలంటే
గుండె మెత్తబరచుకో”

చెవిదగ్గరకొచ్చి చెప్పిపోయావు గుర్తుందా …! అంటూ సముద్రం తనతో చేసిన సంభాషణను తలపోసుకొంటాడు కవి ఒకచోట. హృదయ కాఠిన్యాన్నితొలగించుకొంటే తేలికపడతాం, మార్దవంగా మారతాం అనే ఒక గొప్ప ప్రాపంచిక సత్యాన్నిచెప్పటానికి “ధనుష్కోటిలో తేలుతున్నరాయి” అంటూ అంతే గొప్పసాదృశ్యాన్నితీసుకొన్నాడిక్కడ కవి. ప్రభోధాలను నేరుగా కాక పరోక్షంగా చెప్పటం సమకాలీన కవిత్వలక్షణం. అందుకే ఆ పాఠాన్ని వాచ్యంగా కాక ప్రతీకాత్మకంగా సముద్రం బోధపరచినట్లుగా చెపుతున్నాడు. చక్కటి శిల్పవ్యూహంఇది.

నువ్వో వ్యాపారకేంద్రం
రణరంగం
కార్యక్షేత్రం
విలాసస్థానం
ఏంకావాలోపట్టుకెళ్లడం వచ్చినవాడి సత్తా
చెంబుడు నీళ్లా
ఇన్నిగులకరాళ్ళా?
ఖనిజాలా? ఇంధనాలా?
మరోదేశంపైపెత్తనమా?//
నాడైనానేడైనా
నీటినినెగ్గినవాడే

నేలకురాజు — పైవాక్యాలలోకవి చారిత్రికదృష్టి ద్యోతకమౌతుంది. అవి చదివినపుడు అనేకానేక దృశ్యాలు మదిలో మెదులుతాయి. జలగండానికి భయపడి చెంబుడు నీళ్ళు తీసుకొని ఒడ్డునే పవిత్రస్నానం చేసే భక్తుడో; //గజ ఈతగాళ్ళు ముత్యాలను శోధిస్తూంటారు. ఓడల్లోవ్యాపారం జరుతూంటుంది. పిల్లగాండ్రు మాత్రం గులకరాళ్ళను సేకరించి మరలా విసిరేస్తూంటారు// అనే టాగూర్ వాక్యాలో; “ఓడలు సముద్రాలమీద రహదార్లను గీస్తాయి” అంటూభారతదేశానికి బ్రిటిష్ వారి రాకను వర్ణించిన కొప్పర్తి వాక్యాలో; భవిష్యత్తులో నీటికొరకు యుద్ధాలు జరుగుతాయన్నహెచ్చరికలో గుర్తుకురాక మానవు. తక్కువఖర్చుతో లవణజలాల్ని త్రాగునీరుగా మార్చే ఆవిష్కరణకు నోబుల్ బహుమతి ఇవ్వటానికి ప్రపంచమిపుడు ఎదురుచూస్తోంది. “నీటిని నెగ్గినవాడే నేలకు రాజు” వాక్యాలు కవి చారిత్రిక అవగాహనకు, సమకాలీన వాస్తవాలకు, భవిష్యద్దర్శనానికి అద్దంపడతాయి.

కడుపులోప్లాస్టిక్ నింపుకున్న
షార్క్‌ల మృతదేహాలు
వలలనిండా జీవంలేని తాబేళ్ళు//
వేల అడుగుల క్రిందచేరిన
వ్యర్ధాలనుతొలగించేది ఎవరు?
సరిదిద్దుకోలేని నీకు

తప్పుచేసే హక్కెవరిచ్చారు? – అంటూ సముద్రం పలికిన మాటలు ఈమొత్తం దీర్ఘకావ్యానికి ఆయువుపట్టు. నేడు తెలుగులో పర్యావరణ విధ్వంసంపై వచ్చే కవిత్వం చాలా తక్కువ. దీర్ఘకవితలకు సంబంధించి కొల్లేరు విధ్వంసంపై ఎస్.ఆర్. భల్లం వ్రాసిన “కొల్లేరు” దీర్ఘకవిత, అంతరించిపోతున్న పక్షులపై అద్దేపల్లిప్రభు వ్రాసిన “పిట్టలేనిలోకం” ఈ సందర్భంలో ప్రస్తావించుకోదగినవి. మణిబాబు వ్రాసిన “నేనిలా…తానలా” దీర్ఘకావ్యంలో సింహభాగం సాగరకాలుష్యాన్ని దానివల్ల కలిగిన దుష్పరిణామాలను శక్తివంతంగా ఆవిష్కరించింది. కనుక ఈ దీర్ఘకావ్యాన్నిపర్యావరణకవిత్వంగా భావించవచ్చు.

ఆధునిక మానవుడు చేస్తున్నకాలుష్యంవలన మానవజాతి మనుగడ ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ వలన హిమశిఖరాలు కరిగి, సముద్రమట్టాలు పెరిగి, భూమి అంతా జలమయం అయ్యే అవకాసం ఉందని శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. ఇదొక సాంకేతిక అంశం. ఇలాంటి వాటిని కవిత్వీకరించటం సులభం కాదు. ఈ అంశాన్నిఇలా అక్షరీకరిస్తాడీ కవి.

ఇదే కొనసాగితే
నానుండి విడివడిన భూమి
మళ్ళీ నాలోకలవడం
మరెంతో దూరంలోలేదు
అపుడు
వేదన వినిపించేందుకు
నాకు మనిషి దొరకడు
తలబాదుకొనేందుకు

ఒడ్డుమిగలదు. — ఒక ప్రాచీన మహాఖండం కాంటినెంటల్ డ్రిఫ్ట్ వల్ల నేడు ఉన్న భిన్న ఖండాలుగా విడిపోయిందని పాంజియా సిద్ధాంతం చెపుతుంది. ఆ సిద్ధాంతాన్ని రేఖామాత్రంగా స్పృశిస్తున్నాడిక్కడ కవి. మానవులు ఇలాగే పర్యావరణ విధ్వంసాన్ని కొనసాగించినట్లయితే నానుండి విడిపడిన భూమి నాలో కలిసిపోతుంది అని హెచ్చరిస్తున్నాడు. ఇంతవరకూ వ్రాసి వదిలేస్తే అదేమంత గొప్పవిషయం కాబోదు. ఆ తరువాతి వాక్యాలే మణిబాబుని ఉత్తమకవి అని నిరూపిస్తాయి. జలప్రళయం జరిగాకా సముద్రం మాట్లాడుకోవటానికి మనిషి ఉండడట, ఒడ్డూ మిగలదట. ఈ మాటల్నిసముద్రంతో అనిపించటం లోతైన కల్పన. ఇక్కడ సముద్రాన్ని కవి ఎలా ఊహించుకొంటున్నాడు అని ఆలోచిస్తే- ఒక తల్లి, ఒక స్నేహితుడు, ఒక గురువు ఇంకా ఒక నైరూప్య అనంత స్వరూపునిగా భిన్నరూపాల్లో దర్శనమౌతుంది.

***

ఈ మొత్తం రచనను
ఇదంతా
నీలో దోసెడు నీళ్ళు తీసి
మరలా నీలోనే విడిచిపెట్టటం – అంటాడు కవి ఒకచోట. ఇది పైకి వినయంగా అనిపించినా త్వమేవాహం అని మొదట్లో అన్నమాటకు అందమైన ముక్తాయింపు. “నేనిలా…తానలా” అనే శీర్షికలో నేను ఇలను, తాను అల అనే గడుసైన శ్లేష ఉంది.

శ్రీ అవధానుల మణిబాబు కవిత్వంలో గహనమైన సిద్ధాంతాల చట్రాలుండవు. నిత్యం తనను జ్వలింపచేసే మానవానుభవాలకు తాత్త్విక పరిమళాలు అద్ది కవిత్వంగా మార్చటం ఇతని కవిత్వ రహస్యం. జీవితానుభవాలను గ్రహించటంలో- సున్నితత్వం, కరుణ, అమితమైనప్రేమ, హృదయ నైర్మల్యం ఇతని కవిత్వాన్ని హృద్యమైన అనుభవంలా మార్చుతాయి.

***

నేనిలా… తనలా…
(దీర్ఘకవిత)
రచన: అవధానుల మణిబాబు
పేజీలు: 60
వెల: 80 రూపాయలు
ప్రతులకు: అవధానుల మణిబాబు
#3-62, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దగ్గర
సర్పవరం, కాకినాడ రూరల్, తూ. గో. జిల్లా
ఆంధ్ర ప్రదేశ్ 533005
ఫోన్ 9948179437

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here