రూపాంతరం

1
3

[dropcap]”నె[/dropcap]క్స్ట్ స్లైడ్ ప్లీజ్!”

“యా! యా! హియర్ ఇట్ కమ్స్”!!!

అందరి కళ్లూ ఆత్రుతగా, ఉత్సాహంగా, ఉద్విగ్నంగా తెరవేపుకు మళ్లాయి.

తెరమీద “అసలు అమ్మాయేనా?”….. అనుకునేలా ఒక చిత్రం ప్రత్యక్షమయ్యింది.. ఇంచుమించు స్క్రీనంతా ఆక్రమించిన మొహం. కొట్టొచ్చినట్టు ముందుకు ఉబికి వచ్చిన పెద్దకళ్లు, వాటికి పెట్టిన నల్ల రిమ్ సోడాబుడ్డి కళ్లద్దాలు, సన్నని ముక్కుని మరింత పైకి ఎగదోస్తున్న లావుగా ఎత్తయిన బుగ్గలు, లావుగా ఉన్న కిందపెదవి, మూతి చుట్టూ, చెంపలమీద నూగుజుట్టు సూచిస్తూ నల్లటి వలయాలు, పెద్దనుదురుని చూపించేలా పైకి దువ్వి రెండుజడలు కట్టిన జుట్టు…. మొత్తానికి అంతకు ముందు ఆ తెరమీద వారందరూ చూసిన అనేక అందమైన చిన్ననాటి చిత్రాలకు భిన్నంగా అందవిహీనమైన ఆ ఆడపిల్ల చిత్రం చూడగానే… అక్కడ దీర్ఘంగా మౌనమేలింది!

కొన్నిక్షణాలకు అమ్మాయిల టీమ్, అబ్బాయిల టీం ఏకగ్రీవంగా….” నో…! నో….” అంటూ , ” నన్ ఆఫ్ అస్ కుడ్ ట్రేస్ హు షి ఈజ్! మాకు నేషనాలిటీ కూడా తెలీనంత అగ్లీ పిక్ డిస్ ప్లే చేసారు! ఇది మమ్మల్ని కన్ఫ్యూజ్ చెయ్యడానికే! దిస్ పిక్చర్ డజ్ నాట్ బిలాంగ్ టూ ఎనీ వన్ ఆఫ్ అజ్! “….. అంటూ ఒకరి మాటలు ఒకరికి వినపడనంత గోలగా అరవసాగారు.

నిజమే వారంతా శరీరవర్ణము బట్టీ ప్రపంచాన్ని విడగొట్టి, శ్వేతవర్ణీయులని, నల్లవారని, బ్రౌన్ ఆసియన్లని, ఎల్లో చైనావారని… మనుషులను విభజించి చూసే పాశ్చాత్యదేశాలకు చెందిన వారు.

వాళ్లకు ఏ దేశమో, ఏ రంగో, ఏ జాతో కూడా తెలీకుండా ఉన్న ఆ పద్నాలుగేళ్ల ఆడపిల్ల మొహం తెలీకపోవడం వింతేమీ లేదు. నిజానికి ఆ అమ్మాయి కూడా తనకుతాను గుర్తుపట్టలేనంత కురూపంగా ఉంది ఆ చిత్రం!!

“ఓకే! ఫోక్స్! ఇంతటిదో ఆపేద్దాం! ద విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ ఆర్ అవర్ కార్డియాలజీ రెసిడెంట్స్! గ్రేట్ జాబ్ గైస్! కంగ్రాట్యులేషన్స్! అండ్ ద పేథాలజీ రెసిడెంట్స్! నెక్స్ట్ టైం బెటర్ లక్! ఓకే లెట్ అజ్ డిస్ పర్స్ ఫర్ డిన్నర్”…….. డాక్టర్ శరత్ అనౌన్స్ చెయ్యగానే , మొత్తం ఆ ఇరవై మంది రెసిడెంట్స్ పెద్ద నవ్వులతో, కిలకిలారావాలతో, హోమ్ థియేటర్ వదలి, మెట్లు దిగి, ఆరుబయట విశాలమైన డెక్ మీదకొచ్చారు.

అప్పటికే అక్కడ డాక్టర్ సంయుక్త వాళ్ళందరి కోసం, ఏర్పాట్లతో ఎదురు చూస్తోంది. ఒకవైపు మినీబార్, మరో వైపు బార్బిక్యూ చేసుకునే గ్రిల్, మధ్యలో బల్లమీద రకరకాల స్టార్టర్లు, సాలడ్లు, సూప్స్, మెయిన్ కోర్స్, డెసర్ట్స్ అరేంజ్ చేసి ఉన్నాయి! డెక్‌కి అవతల కొన్ని వందల మీటర్ల దూరంలో సువిశాల మైదానానికి ఆనుకుని ధీరగంభీరంగా , సుడులు తిరుగుతూ, హోరుగా ప్రవహిస్తున్న మిసిసిపీ మహానది!

మెంఫిస్ నగరం, టెన్నెసీ రాష్ట్రం, అమెరికా సంయుక్తరాష్ట్రాల సదర్న్ స్పైస్!

ఆ వీకెండ్ అక్కడి ప్రముఖ హాస్పిటల్‌కు చెందిన ప్రముఖ కార్డియో వాస్క్యులార్ సర్జన్ శరత్ చంద్ర, అతిచిన్న వయసులోనే సర్జికల్ పేథాలజీ డైరక్టర్‌గా ఎదిగి, వృత్తిలో తనదంటూ ప్రత్యేకతతో దూసుకుపోతున్న డా. సంయుక్తల ఇంటిలో కార్డియాలజీ, పేథాలజీ రెసిడెన్సీ పూర్తిచేసుకుని, అమెరికా వైద్యరంగంలో భవిష్యత్తును వెతుక్కోబోయే ఇరవైమంది రెసిడెంట్స్‌కు ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేయబడింది.

మధ్యాహ్నం మూడింటికి మొదలయిన పార్టీ ఎంతో సరదాగా, హడావిడిగా సాగుతూ ఆఖరి దశకు చేరుకుంది. దానిలో భాగం గానే డా. శరత్ నలభై చిన్ననాటి ఫోటోలు సేకరించి, పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసాడు.

ఇంటర్న్స్ ఆ చిత్రాలకు సంబంధించిన ప్రొఫెసర్లను, చీఫ్ లను, మెడికల్ అటెండెంట్లనూ గుర్తుపట్టారు, ఆ ఒక్క అమ్మాయిని తప్ప!

అందరూ జంటల జంటలుగా విడిపోయారు! షాంపేన్ ఓపెన్ చేసి, వారి బంగారు భావికోసం టోస్ట్ చేసి, ఎవరి జంటలతో వారు , పేషియో దిగి, లాన్ లోకి వెళ్లిపోయారు గ్లాసులు పట్టుకుని!

ఎవరి ప్రైవసీని వాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఆడామగా ఎలాంటి మొహమాటాలూ, కట్టుబాట్లూ పెట్టుకోకుండా, స్వేచ్ఛగా ఆ క్షణమే ముఖ్యమనుకుంటూ, సంతోషంగా ఉన్నారు!

ఆ జంటలను చూసి సంయుక్త పెదవుల మీదకు చిన్న చిరునవ్వు పాకింది!

శరత్‌కు తన రెసిడెన్సీలో పడ్డ కష్టాలన్నీ గుర్తొచ్చాయి. తను మొట్టమొదట ఇంటర్నల్ మెడిసిన్ మినియాపోలిస్‌లో చేసాడు. గడ్డకట్టుకుపోయే చలికాలం, ఇంటికి దూరంగా, స్నేహితులనే వారు లేకుండా, కాలినడకే దిక్కు ఎక్కడికి వెళ్లాలన్నా! అప్పుడు పరిచయం అయిన ట్రేసీ ఎంత అడ్వాన్స్ అయినా తను ముందడుగు వెయ్యలేకపోయాడు. పుట్టిపెరిగిన వాతావరణం గొంతుక్కడ్డు పడ్డట్టుండేది.

కానీ ఈ జనరేషన్ రెసిడెండ్స్ వస్తూనే జంటలు వెతుక్కునీ, సహజీవనం చేస్తూ……. ఒకందుకదే మంచిదేమో! ఈ దేశంలో ఎప్పటికి ఈ చదువులయ్యేను, ఎప్పుడు స్థిరపడేను వీళ్లు! వంటరితనం, ఫ్రస్ట్రేషన్‌తో బతకడం కన్నా ఎలాంటి కమిట్ మెంట్స్ లేని ఇదే మేలు!

బార్బిక్యూ గ్రిల్ దగ్గర చేరి, కబుర్లు చెప్తూ పనిచేసుకుంటున్న మరికొన్ని జంటలను చూసి, డా. యుక్తకు స్మితమందహాసం పెదాల మెరిసింది.

అమెరికాలో తన పన్నెండేళ్ల ప్రవాసంలో మూడు రిలేషన్లు. మొదటిది భగ్నప్రేమ. అమెరికాలో ఇమడలేక, తననూ, తనప్రేమనూ అర్ధాంతరంగా వదిలి పారిపోయిన చైతన్య, చూసిన రోజునే ప్రపోజ్ చేసి, తన ఫ్లాట్ కు మారిపొమ్మని గొడవచేసే జెఫ్, తన ఫెలోషిప్ సమయంలో తనని విపరీతంగా ఆరాధించిన అద్నాన్! ఇద్దరూ మనసుకి చేరువయ్యేలోగానే అతని చొరవ నచ్చక జెఫ్‌ను, అంత ఇంటెన్సిటీ, డామినేషన్ భరించలేక అద్నాన్‌ను దూరం చేసుకుంది.

అదే శరత్ వాళ్ల అమ్మగారు యుఎస్ ఒచ్చినపుడు చెప్పింది దాపరికం లేకుండానే! ఎంత అందంగా నవ్వింది ఆంటీ.

“యూ నో సంయుక్త! నాకు టెన్త్ లో నా క్లాస్ మేట్ రాఘవ, ఇంటర్‌లో ఇంటింటికీ మొబైల్ లైబ్రరీ తిప్పే వెంకటేష్, డిగ్రీలో ఆర్గానికి కెమిస్ట్రీ సర్…. ఎవరిని చూసినా నా కోసమే పుట్టేరేమో అనిపించేది. కానీ అవన్నీ అద్దంలో వచ్చీపోయే మొహాలనీ, ఒక్కడే మన మనసులో పటం అవుతాడని శరత్ నాన్నని చూసినపుడు అర్ధమయింది. అంతే…. జీవితమంతా ఆనందమే ఆనందం!! …. నవ్వుతూ, నాటకీయంగా కళ్లతో విన్యాసం చేస్తూ ఆంటీ చెప్తుంటే పడీ పడీ నవ్వింది , ఆమెతో పాటూ!

“సంయుక్తా! నేను నా కొడుకుని నీకు రికమెండ్ చేస్తున్నానని భావించకు! కానీ జీవితంలో అడ్వంచర్ కావాలంటే నేనేమీ చెప్పలేను కానీ, సుఖసంతోషాలు కావాలంటే మాత్రం శరత్‌ని చేసుకోవచ్చు నువ్వు”! …….. అరవైయేళ్ల ఆ అభ్యుదయవాది చెప్తున్న మాటలు తనని మంత్రముగ్దను చేసాయి.

“కార్డియో వేస్క్యులార్ పాథాలజీ డిపార్ట్‌మెంట్ డైరక్టర్‌గా తను, శరత్ టీంతో ఎన్నో సర్జికల్ ప్రొసీజర్స్ కు కలిసి పనిచేసింది. గురితప్పని తన బయాప్సీరిపోర్ట్స్ చాలా అరుదయిన ఎన్నో మయోకార్డియాక్, అయోర్టిక్ సర్జరీలను విజయవంతం చేసాయి!

అమెరికాలోనే ప్రతిష్తాత్మకమైన “మేయో కార్డియాలజీ ప్రోగ్రామ్” నుంచి లెబొనార్ హాస్పిటల్స్‌కు వచ్చాడు శరత్. వందశాతం సక్సెస్ రేట్‌తో దూసుకుపోతున్న యువడాక్టర్! హమేషా నవ్వుతూ, నవ్విస్తూ!, తమను పనిలో ఉత్తేజపరుస్తూ…. వీకెండ్స్ కూడా తమతో సమానంగా పనిచేస్తూ, పనియందు వందశాతం అంకితభావం చూపించే శరత్ అంటే…. నర్సింగ్ స్టాఫ్‌కు ప్రాణమే!

ఆ శనివారం ఇంకా గుర్తే తనకు! వచ్చేవారం జరుగబోయే సర్జికల్ ప్రొసీజర్ల ప్లానింగ్‌కు జరిగే మీటింగ్‌కు తనూ వెళ్లవలసి వచ్చింది. మీటింగయిపోయి, బయలుదేరుతుంటే, శరత్ సడన్‌గా, ” మా ఇంటికి లంచ్‌కు రావచ్చు కదా! మంచి తెలుగు భోజనం ఉంది”…..

అందరితో కలుపుగోలుగా ఉంటూ, తనతో మాత్రం ముభావంగా ఉండే శరత్ నుండి ఆహ్వానమా! ఆశ్చర్యమే!

వద్దనే కారణాలు లేకపోవడం వలన, డౌన్ టౌన్ లో మిసిసిపీ నది పక్కనే ఉన్న అతని ఇంటికి వెళ్లింది.

భోజనం వంకమాత్రమే! ఆ రోజు కబుర్లు, నవ్వులు, పాటలు, కవిత్వాలు, సినిమాలు, పుస్తకాలు, పెయింటింగ్ లు, భావజాలాలు, భయాలు, సంఘర్షణలు….. ఓహ్! ఎన్ని మాటలో! ఎన్ని చర్చలో! మరెన్నిపరస్పర ఆలోచనా బదిలీలో!

 అతని విశాలమైన ఈతకొలను పక్క కూర్చుని, తోటలో ఒకవైపంతా ఒత్తుగా పరుచుకున్న రంగురంగుల గులాబీలమీంచి ఒస్తున్న స్నేహపరిమళాలు ఆస్వాదిస్తూ……. అతని సొంత రివర్ బోట్ లోమిసిసిపీలో చేసిన స్పీడ్ బోటింగ్….. ఓహ్! జీవితానికి సరిపడా అందమైన అనుభవాలు! మరికొన్నాళ్లకే ఆ పూపొదరిల్లు తననూ మమతలతో పొదవుకుంది.

***

ఆనాటి గెస్ట్ లందరూ చెదిరిపోయాకా, సంయుక్త, శరత్‌లు విశ్రాంతిగా పూల్ పక్కన కూర్చుని రిలాక్స్ అవుతున్నారు. వేసవి సూర్యుడు రాత్రి తొమ్మిదయినా, వర్కహాలిక్‌లా ఇంకా నదిమీదే తచ్చాడుతున్నాడు. ఆ ఎర్రని సంధ్యాకాంతి….., ఊదా పులుముకుని , ఆ కొలను పక్క కూర్చున్న సంయుక్తను తడుపుతుంటే, మెరుపుతీగలా కదులుతున్న ఆ దివ్యసుందరిని చూస్తూ అలాగే ఉండిపోయాడు శరత్!

ఆమె సౌందర్యవీక్షణాతపస్సులో నిమగ్నుడైన అతన్ని, ఈలోకానికి తెప్పించింది ఆమె ప్రశ్న.

“శరత్! ఇంతకూ ఆ ఆఖరి క్లిప్పింగ్ లోఅమ్మాయి ఎవరో గుర్తుపట్టేరా ఎవరయినా?”…..

“అవును యుక్తా! అసలు మా ఎవరికీ క్లూ కూడా లేదు! ఎవరా అమ్మాయి? ఇండియన్‌లా ఉంది. కానీ మన కొలీగ్స్ ఎవరి పోలికలూ లేవు”

ఒక్కసారి గలగలా నవ్వింది సంయుక్త.

“నేనే శరత్ అది! యా!!ఇట్స్ మీ! ద కేటర్ పిల్లర్ స్టేట్ ఆఫ్ డాక్టర్ యుక్తా!!”

శరత్ మొహంలో ఒక్కక్షణమే ఆశ్చర్యం! మరుక్షణం అతను అతనే! అదే అతని వ్యక్తిత్వం. అతని సంస్కారం!

“శరత్! ఈ పిక్చర్ చూసాకా కూడా నేను నీకు నచ్చుతానా?”….చిన్న బేలతనంతో యుక్త అడుగుతుంటే….. పెద్ద పెట్టున నవ్వుతూ….

“యుక్తా! నాకయితే ఆ బొద్దు అమ్మాయే నచ్చింది. అమాయకంగా, తెలివిగా, స్టూడియస్‌గా! అయినా అందం బాహ్యశరీరానిది. నీ అంతఃసౌందర్యం ముందు నీ ఈ అపురూపలావణ్యం బలాదూర్”! …అంటూ ఇంగ్లీషులో జవాబిచ్చాడు శరత్ !

ప్రేమగా తనను సమీపిస్తున్నశరత్ ను చేతిసంజ్ఞతో నివారిస్తూ… సంయుక్త..

“నీకు తెలీదు శరత్! ఆ స్థితి, ఆ రూపం, ఆ రోజులూ… ఎంత భయంకరమో! ఎంత పీడకలో…..”

శరత్‌కు తెలుస్తోంది…. ఈరోజు సంయుక్త తనకేదో చెప్పబోతోందని. ఈ మూడేళ్ల అనుబంధంలో చెప్పనిది. అతను ఆమె మానసిక సంఘర్షణ వినడానికి అన్నివిధాలా సంసిద్ధుడయ్యాడు.

“శరత్! మా అమ్మానాన్నలు అసలు ఎందుకు పెళ్లిచేసుకున్నారో నా కర్ధం కాదు. భిన్నధృవాలు వైవాహిక జీవితంలో ఎప్పటికీ ఆకర్షించుకోవు అనడానికి వాళ్లిద్దరు చాలు!

మా అమ్మమ్మ ఇల్లు చూడాలి నువ్వు!! ఎక్కడో ఊరిశివార్లలో కోళ్ళఫారాలూ, గేదెల షెడ్లు, పెద్దపెద్ద చింతచెట్ల మధ్య ఉండే ఓ పెద్ద డాబాయిల్లు! రాత్రిపూట చిన్న బుడ్డిదీపం వెలుగుతూ ఎక్కడా కళాకాంతీ ఉండదు ఆ ఇంట్లో! ఏ ఇంటికయినా వైభవం, హుందాతనం ఎప్పుడొస్తాయి? ఆ ఇంటిగడప పసుపులనలదుకుని… పచ్చని మామిడితోరణంతో మెరిసినపుడు. ఆ ఇంటివాకిలిని ఒక వెన్నెలముగ్గుతో వెలిగించినపుడు… ఆ ఇంటి తూర్పు వాకిలి తులసికోటలో గూటిలో దీపం… గుండెల్లో ఆశలా వెలుగుతున్నప్పుడు! ఇంటికి చుట్టపక్కాలు ఆత్మీయంగా వచ్చిపోతున్నపుడు! కదా!!

అయితే ఆ ఇంటికి అవన్నీ ఆమడదూరం! ఇంటి వరండాలు కోళ్ళదాణాలూ, చిట్టూతవుడూ బస్తాలతో నిండిపోయి ఉంటాయి. ఆ చింతచెట్ల మీద పక్షులు కూడా వాలవు. ఎందుకంటే చింతకాయలు కాదుకదా… చింతచిగురు కూడా వాటికి దక్కనియ్యరు ఆ ఇంటి యజమానులు. గాలిని కూడా డబ్బుగా మార్చుకోవాలనే ఆరాటం. అయితే నిరంతర అవిశ్రాంత శ్రామికులు ఇద్దరూ!

ఆ ఇంటిబిడ్డల దినచర్యా దీనికి విభిన్నంగా ఏమీ ఉండదు. ఇంటికి దగ్గరలోనే కేథలిక్ మిషనరీ స్కూళ్ళలో చదువుకునే వీరి జీవితాలు అక్కడి నన్స్ జీవనశైలి కన్నాకూడా సరళతరం!

ఆ ఇంటి పెద్దహాలులో ఐదుమంచాలు, దోమతెరలేసి ఉంటాయి.

మా అమ్మా, మామయ్యా, పిన్నిల బాల్యమంతా ఆ దోమతెరల్లోనే క్లాసు పుస్తకాలు చదువుకుంటూ, వాళ్ళ నాన్న తెచ్చిపడేసి “చదవాలి” అని ఆదేశించిన సాహిత్యమంతా అధ్యయనం చెయ్యడంతోనే గడిచిపోయింది.

ఆ హాలు తప్పా… ఆ ఇంట్లో ఇంకో గది కూడా వాళ్లకు తెలీదేమో! బంధువులు తెలీదు, మిత్రులు లేరు! లోకం తెలీదు! అమ్మమ్మ, తాతకూ కోళ్లఫారాలూ, పిల్లల చదువులూ! ఇవే వ్యాపకాలూ! ఆశయాలూ!

మామయ్య డీఆర్డీఏ సైంటిస్ట్, పిన్ని కెనడాలో బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్, అమ్మ ఎమ్ ఫార్మసీ చేసి డ్రగ్స్ ఇన్స్పెక్టర్! ముగ్గురుకీ మెడిసిన్ వచ్చింది. కానీ మానవశరీరాన్ని నగ్నంగా చూడవలసి వస్తుందనే వికారంతో…ఆ కోర్సులో చేరలేదట. అంత ఫ్రిజిడ్ పర్సనాలిటీస్! నవ్వుతో సహా అన్ని మానవస్పందనలూ పొదుపే వారికి!

ఇక నాన్ననేపథ్యం మొత్తం వ్యతిరేకం! బిలో ఏవరేజ్ స్టూడెంట్! ఇండియన్ క్రికెట్ నేషనల్ టీంలో పదేళ్లు ఆడిన అనుభవం, కస్టమ్స్‌లో ఇన్స్పెక్టర్‌గా ఉద్యోగం! విపరీతమైన స్నేహితులు, ఎక్కువగా ఆడవారు, స్వోత్కర్షతో పాటూ విరివిగా దొర్లే బూతులు, సోషల్ డ్రింకింగ్ తోనే అన్ సోషల్ గా ప్రవర్తించే తీరు, ఫ్లర్టింగ్ అనేది చాలా ఫన్‌గా భావించేంత స్పోర్టివ్ స్పిరిట్. విపరీతమయిన సంపాదన, దానికనుబంధమయిన అలవాట్లు!

మరి ఈ ఇద్దరికీ పెళ్లి ఎలా అయ్యిందీ అంటే, అమ్మరూపం!…..నాన్నఅమ్మని అనే మాటల్లో,పిలుపుల్లో…, అమ్మ సబార్డినేట్స్, మా ఇరుగుపొరుగూ….. అమ్మవెనుక తన ఆకారాన్ని చూసి అనుకునే పదం “ఎలుగుబంటి”!

తొంభై కేజీల బరువుతో, తుప్పగా పెరిగిన కర్లీ హెయిర్‌తో, తెల్లటి వంటిరంగును కప్పేస్తూ ఒళ్లంతా రోమాలతో… సోడాబుడ్డి కళ్లద్దాలతో…. కానీ పెద్ద ఆస్తితో…… అమ్మ!!

అమ్మ లంచాలు తీసుకోకపోయినా డిపార్ట్‌మెంట్‌లో … ఆమె పేకట్ ఆమెకొచ్చేసేది. దానితో పాటూ మెడికల్ షాప్స్ ఓనర్ల నుండి వచ్చే స్వీట్ పేకట్లు, పళ్లబుట్టలు, నేతి కేన్లూ అదనం. ఫలితం….నేనో ఎనభై కేజీలూ, మా చెల్లి ఓ డెభ్బయి ఐదు కేజీలూ అనతికాలంలోనే చేరిపోయాము. మా నాన్న మాత్రం డెభ్భై! మాకు పైగా ఆకలేస్తే ఇంటిముందర వాలిపోయే డామినోస్ వాడు! ….. ఇదీ మా మందం, అందాల వెనుకున్న రహస్యం! హహహహ!

పిల్లల పెంపకంలో…అమ్మ వాళ్ళ అమ్మనే ఆదర్శంగా తీసుకుని…ఇంకో అమ్మమ్మ అవతారం ఎత్తింది! మా గదినిండా పుస్తకాలు! మాకు ఆటలు లేవు! పాటలు లేవు! హాబీస్ లేవు! ఎప్పుడూ స్కూల్ ఫస్ట్ రావాలి! కీ ఇచ్చిన యంత్రాల్లా డిబేట్లలో, క్విజ్‌ల్లో మాట్లాడి గెలుచుకున్న బోలెడు మెడల్సూ, షీల్డ్సూ, ప్రోత్సాహకాలు ఇంటినిండా!

అడుగు పెడితే డ్రైవర్‌తో కారు! కొన్నాళ్లకు ఆ అడుగులూ వెయ్యనంత భారంగా అయిపోయాం! నాకు థైరాయిడ్ ప్రోబ్లం వచ్చింది. ఒళ్లంతా అవాంచితరోమాలు! నల్లని మెడలు. ఆకలి సమస్యలు, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ ప్రోబ్లమ్స్, విపరీతమైన ఆత్మన్యూనత, మానసిక ఒత్తిడి!

అమ్మకు ఏదీ పట్టదు. తన కౌమార్యదశతో పోలుస్తూ… నా అనారోగ్య సమస్యలన్నీ ఆ వయసులో చాలా సహజం అని కొట్టిపారేసేది. మా తిండినీ, ఒళ్లునూ కంట్రోల్ చెయ్యడానికి ప్రయత్నించేదికాదు. తను చదివిన చదువుకు సరిపడా శాస్త్రీయస్పృహ లేని మనిషామె. గట్టిగా నోరెత్తితే…. చెయ్యెత్తు పిల్లల మీద చెయ్యత్తడానికి కూడా సంకోచించని క్రమశిక్షణ!

తనకి క్రికెట్ లో తన వారసుడు లేడని నాన్నకు మామీద పెద్ద మమకారం లేదు. ఏదో తన ఇంటిపేరుతో చలామణి అవుతున్న తన ఆడపిల్లలు… అంతే!

నాన్నవేపు వారితో మాకు అనుబంధమూ తక్కువే! ఆయనవేపు బంధువులను మా అమ్మ రానిచ్చేది కాదు. ఏడాదికోసారి మమకారం చంపుకోలేక మమ్మల్ని చూడాలని వచ్చే మా నాయనమ్మా, తాతగారు వచ్చి వుండే ఆ వారంరోజులూ మాకు పండుగల్లా ఉండేవి. మా చదువులు వారుంటే సాగవని నిర్మొహమాటంగా వారిని సాగనంపేసేది అమ్మ. ఆ సమయంలో నాయనమ్మ కళ్ళల్లో మెరిసే ఆ కన్నీటిచుక్కలు నేను ఎప్పటికీ మర్చిపోలేను శరత్!

మమ్మల్ని స్కూల్లో ఎవరితో స్నేహాలు చెయ్యనిచ్చేది కాదు అమ్మ. మా ఇద్దరిలో బాల్యమంతా… భయంకరమైన ఒంటరితనం, అభద్రత!

ఆ రోజుల్లో….మా భయాలూ, సందేహాలూ, ఎవరితో పంచుకోవాలో, మానసిక అవసరాలకు ఎవర్ని అడగాలో తెలీదు. ఆఫీసు నుంచి ఇంటికొస్తూనే అమ్మ పుస్తకం పట్టుకుని కూర్చునేది. తన పుస్తకపఠనాసక్తి తప్పా అమ్మకు వేరే ఎలాంటి ప్రాధాన్యాలూ ఉండేవి కాదు!

ఇక నాన్న దర్శనం మాకు రాత్రి పది తరవాతే!

నాన్న మరీ అంత చెడ్డవారేమీ కాదు! వారసుడు లేడనే బాధవున్నా…. చదువులో మా మెరిట్ గురించి గర్వంగా నలుగురికీ చెప్పుకునేవారు. మాకు లోకజ్ఞానం లేకుండా చేస్తోందని అమ్మతో పోట్లాడేవారు. టీవీ చూడమని, సినిమాలు చూడమని ప్రోత్సహించేవారు. కానీ పదిమంది ముందు అమ్మనీ, మమ్మల్నీ “బోండాం” “ బంటీ”…. అంటూ ఇన్‌సల్ట్ చేసేవారు!

వీటన్నిటికీ అదనంగా….మాకు ఇంట్లో వీకెండ్ డ్రామా ఒకటుండేది. మా టీనేజ్ వూహలకూ… వయసుతో మెల్లగా అవగతమవుతున్న స్త్రీపురుష సంబంధాన్ని మా మనసుల్లో వికృతం, అసహ్యకరం చేస్తూ!

వీకెండ్స్ లో అమ్మ మమ్మల్ని మాగది విడిచి రాత్రిపూట కనీసం మంచినీళ్లకు కూడా రాకూడదని ఆంక్షలేసేది.

ఏ అర్ధరాత్రిపూటో, అమ్మ వాళ్ల గదిలోంచి బయటకొస్తూ…., “యూ! రేపిస్ట్!” అంటూ గట్టిగా అరుస్తూ… ఏ ఫ్లవర్ వేజో నాన్నగది వేపు విసిరి, పెద్దగా ఏడుస్తూ కూర్చునేది.

నాన్న గదినుండి….బయటకొచ్చి అరిచేవాడు… “యూ… ఫ్రిజిడ్….!” అంటూ. అవన్నీ వింటుంటే….మాకూ బాగా ఏడుపొచ్చేది. అమ్మను ప్రేమగా, చనువుగా పట్టుకుని ఓదార్చాలని ఉండేది. కానీ అమ్మానాన్నలు వాళ్లకూ , మాకూ మధ్య ఎప్పుడో మానసికంగా గోడకట్టేసారు! దుర్భేద్యం అది!!

అమ్మ ఫ్రిజిడిటీ…, తను పెరిగిన గృహవాతావరణం వలన! భార్యాభర్తల మధ్యనుండే సాధారణ సంసారజీవితం కూడా ఆమెకు పాపం దుర్భరంగా ఉండేదేమో! నాన్నకు అవన్నీ అవగాహన చేసుకునే జ్ఞానం కానీ, బుద్ధి పరిపక్వత కానీ, సంస్కారం కానీ లేవు. ఆయన శారీరక అవసరాలు మాత్రమే ఆయనకు ముఖ్యం. వాళ్లమధ్య ఉన్న దాంపత్య సమస్యకు థెరపీ, సైకియాట్రిక్ కౌన్సెలింగ్ అవసరం అనే విషయం కూడా ఇద్దరికీ తెలీదు.

కానీ తెలిసీతెలీని ఊహతో ఒక ఎదుగుతున్న ఆడపిల్ల అవి గమనిస్తోందని, ఎన్నో భయాలు ముప్పిరిగొని ఆ పిల్ల బులీమియాని (పెరిగే మానసిక ఒత్తిడితో విపరీతంగా తినడం) ఆశ్రయించిందని గ్రహించుకోలేని పరిస్థితి అక్కడ!

మా అమ్మ మాకు ఆస్తికత్వం మప్పకపోయినా… మేము చదివే పాఠశాలల వాతారణం మాకు ప్రార్థనలోని శక్తిని పరిచయం చేసింది. మతంతో సంబంధం లేకుండా….. నేనూ, నా చెల్లీ ప్రతిరోజూ మా ఆ నిరాసక్త, నిర్జీవ, నిర్లిప్త జీవితాలలో వెలుగు చూపించమని ప్రార్ధించని రోజు లేదు! తప్పకుండా ఆ చీకటిదారి చివర వెలుగుంటుందనే ఇద్దరం ఆ నిర్వేదజీవితాన్ని లాగుతున్నాము!

ఆరోజు మా జీవితాలే మార్చేసిన రోజు!

ఆ రోజు ఉదయం స్కూల్‌కు వెళ్ళే సమయంలో…. లిఫ్ట్‌లో అపార్ట్‌మెంట్లో నా వయసు ఆడపిల్లలూ, మగపిల్లలూ ఉన్నారు. దాంట్లో ఒకమ్మాయి నన్ను ఇన్‌డైరెక్ట్‌గా బొచ్చుకుక్కతో పోలుస్తూ జోకులేస్తోంది. అందరూ పడీపడీ నవ్వుతున్నారు నాకేసే ఓరకంటితో చూస్తూ. మేమందరం ఒకే స్కూల్. నా అకాడెమిక్స్ అంటే వాళ్లకు అసూయ. మా రూపం చూస్తే అసహ్యం. పైగా మేము ఎవరితో కలవం!

ఈ అవమానాలన్నీ మాకు చిన్నప్పటినుండీ అలవాటయినా… ఆరోజు నన్ను అవమానించిన వారిలో నాతో కాస్త స్నేహంగా ఉండే స్మిత కూడా ఉండడం నేను జీర్ణించుకోలేకపోయాను. ఎంతో సున్నితమైన ఆ కౌమారంలో అంత శాడిజమ్ చూపిస్తూ… హింసిస్తున్న వారి మనస్తత్వాలు నేనింక తీసుకోలేకపోయాను!

నా చెల్లి ముక్తను స్కూల్‌కు వెళిపోమని, నేను అపార్ట్‌మెంట్ గార్డెన్‌లో బెంచ్ మీద కూర్చుని…. ఏడుస్తూ…. మా పేరెంట్స్ కి ఒక ఉత్తరం రాయడం మొదలుపెట్టాను. ఆ ఉత్తరం రాసి… డ్రాప్ బాక్స్ లో వేసిన తరువాత ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకున్నా!

ఉత్తరం ముగించేసరికి,హఠాత్తుగా నా వెనకాల నుండి మాటలు… ” విత్ లవ్” కాదు ” విత్ హేట్రెడ్” అని ఉండాలేమో కదా !”….. ఎవరో అంటున్నారు.

ఒక్కసారి ఉలిక్కిపడి లేచా!

 “రూపక్క”….. మా ఎదురింటి ఫ్లాట్ కొనుక్కుని ఈమధ్యే దిగిన ఇండస్ట్రియలిస్ట్! తను ఒక్కతే ఉంటుంది. భర్తనుండి సెపరేటెడ్ తను!

గబుక్కున ఉత్తరం ఉండ చేసేసి, బేగ్‌లో పడేసా! తప్పుచేసిన దానిలా చూస్తుంటే, ఒక్కసారి నన్ను కావులించుకుంది అక్క.

“బేడ్ యుక్తా! వెరీ బేడ్!”…అంటూ రూపక్క ఏడుస్తోంది. నాకూ ఏడుపాగలేదు. ఎన్నాళ్లగానో నాలో గడ్డకట్టిన దైన్యమంతా కరిగి నీరయ్యింది.

ఇద్దరం కాసేపు ఏడ్చాకా…. నన్ను ఓదార్చి.., తనింటికి తీసుకునివెళ్లింది.ఆత్మహత్యకు ప్రేరేపించిన అంత పెద్ద సమస్య ఏంటని నిలదీసింది.

మొట్టమొదటిసారి పరాయి వ్యక్తితో.. మా ఇంటివాతావరణం, నారూపం వలన నేను అనుభవిస్తున్న ఆత్మన్యూనత, అవమానాలూ… అంతా చెప్పుకొచ్చా.

“ముక్తా! నా మీద నమ్మకం ఉంచు. నేను నీకు సాయం చేస్తా! ఈ దశ హార్మోన్ ఇంబాలన్స్ వలన వచ్చిందే నీకు! ఈవేళ రేపు, ఈ ఒళ్లూ, ఈ రోమాలూ పెద్ద విషయం కాదు. అన్నిటికీ రెమిడీస్ ఉన్నాయి. మట్టిముద్దనిస్తే… మహాశిల్పంగా మార్చేస్తున్నారు బ్యూటీ థెరపిస్టులు. సమస్యకు పరిష్కారం వెతక్కుండా, లోకంలోంచి పారిపోయి సాధించేది ఏమీ లేదు. నువ్వు పోయిన రెండో రోజుకి నిన్ను మర్చిపోతుందీ ప్రపంచం. నువ్వేంటో చూపించి, నీ అస్థిత్వం నిలబెట్టుకో! “….. అంది రూపక్క నాలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపుతూ!

“లేదు రూపక్కా! మా మమ్మీ మేము ఏవిధంగా మారినా ఒప్పుకోదు. నేను బ్యూటీపార్లర్ కెళతానంటే , కొట్టినంత పని చేసింది. ఇలా ఉండడమే బెటర్‌ట. అబ్బాయిలు కన్నెత్తికూడా చూడరుట. పౌడర్ రాసుకున్నా, వెంటనే “ఎవర్ని అట్రాక్ట్ చెయ్యడానికీ?” అని డేమేజింగ్‌గా మాట్లాడుతుంది!”…. అని నేను ఉన్నది ఉన్నట్టు చెప్పా తనకు!

“నో ప్రోబ్లం యుక్తా! ఐ విల్ మేనేజ్ ! నేను చూసుకుంటా మీ అమ్మనెలా ఒప్పించాలో” ….అంటూ భరోసా ఇచ్చి రూపక్క నన్ను స్కూల్‌లో డ్రాప్ చేసింది.

మరి ఏం మాయ చేసిందో, ముందు మా నాన్న వేపు నుండి నరుక్కొచ్చింది. థెరపీల విషయంలో మొట్టమొదటిసారి నాన్న మావేపు, మాకోసం మాట్లాడారు. అమ్మని మరి మాట్లాడనివ్వలేదు.

రూపక్క మా రూపాంతరాన్ని నెమ్మదిగా మొదలుపెట్టింది.

డైటీషియన్ నుండి స్థూలకాయాన్నితగ్గిండానికి ఆహారనియమాలతో.. డైట్ రెజిమ్ తీసుకుంది! దేహాకృతికోసం…మొదట మెడిటేషన్, యోగాతో మొదలుపెట్టి, మెల్లగా బాడీ ఫ్లెక్సిబిలిటీ రాగానే జిమ్ జాయిన్ చేసింది. అలాగే టెర్రేస్ మీద సూర్యనమస్కారాలు చేయించేది.

నగరంలో ఎక్కడికెళ్ళ వలసి వచ్చినా….కారు వాడకుండా…ప్రతీచోటకూ మైల్స్ దూరం నడిచేవాళ్లం. వీకెండ్స్ తన ఫాక్టరీలో గార్డెనింగ్ చేసేవాళ్ళం. ఎండోక్రైనాలజిస్ట్ సలహాలతో…నా థైరాయిడ్ కు ట్రీట్‌మెంట్ జరిగి … అవాంఛితరోమాలూ, బులీమియా లాంటి సమస్యలు దూరమై…నా స్కిన్ టోన్ బాగుపడింది!

మెల్లమెల్లగా నా శరీరంలో…కొవ్వుకరిగి అసలు ఫీచర్స్ బయటపడడం మొదలయ్యింది. మమ్మల్ని చూసి, మా అపార్ట్‌మెంట్ లో మాలాగే ఊబకాయంతో బాధపడుతున్న మరో ఆరుగురు పిల్లలు మాతో చేరారు.

వీకెండ్స్ ఇంచుమించు ఒక అరవైమందిమి పిల్లలూ, పెద్దవాళ్ళూ….హైకింగ్, ట్రెకింగ్‌కు వెళ్లేవాళ్లం. ఆ సమయంలో…మా నాన్నలో ఉన్న అసలైన క్రీడాకారుడు బయటకొచ్చాడు.

రూపక్క నా వార్డ్ రోబ్ అంతా మార్చేసింది. బురఖాల్లాంటి పైనుండి కిందవరకూ వ్రేలాడే బట్టల స్థానే చక్కటి కంఫర్ట్ ఇచ్చే, అసభ్యతకు తావులేని…. మాకు నప్పే ఆధునిక డ్రస్సింగ్ అలవాటయింది.

 చదువులో ఎక్కడా తగ్గకుండానే మెల్లగా… నా స్టైలింగ్ నేనే చేసుకుంటూ ఆడపిల్లకు….అందంగా, స్లిమ్‌గా, స్మార్ట్ గా ఉండడంలో కలిగే ఆనందాన్ని చవిచూడసాగాను.

రూపక్క ప్రోద్బలంతో అమ్మ కూడా తనను తాను చాలా మార్చుకుంది. డైటింగ్, జిమ్, బ్యూటీపార్లర్ , చక్కటి హుందాగా ఉండే డ్రస్సింగ్ వలన అమ్మలో ఎప్పుడూ చూడని, అందం బయటకొచ్చింది.

తనలో ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ తగ్గింది.।

అమ్మానాన్నా సైకియాట్రిక్ థెరపీ తీసుకోడం మొదలుపెట్టారు.ఆ కౌన్సెలింగ్ మంచి ఫలితాలనిచ్చి…..మా ఇంట్లో గొడవలు బాగా తగ్గాయి.

శరత్! నీకు తెలుసా….. నేను నా పదిహేడేళ్ల వయసులో…మన దేశంలో మెడికల్ స్కూల్ కు పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఏభైఐదు కేజీల బరువుతో, అందమైన అమ్మాయిగా, చంకలో స్టేట్ రేంక్ పట్టుకుని వెళ్లాను.

దేర్ ఈజ్ నో లుక్ బేక్ ఫ్రం దెన్! మరి వెనక్కి తిరిగి చూడలేదు నేను! దీనంతకూ కారణం ఆరోజు ఆదుకోడానికి దేవతలా వచ్చిన రూపక్క!

రూపక్క ఏమీ ఆశించకుండా, కేవలం పిల్లలంతా ఆనందంగా, ఫిట్‌గా, చురుగ్గా ఉండాలి, సాధికారంగా ఉండాలి అని కోరుకునేది. పిల్లలకు పిరికిమందు పోయడం తనకు నచ్చేది కాదు. అపార్ట్‌మెంట్లోనే మార్షియల్ ఆర్ట్స్ శిక్షకులు వచ్చి మా అందరికీ శిక్షణ ఇచ్చేవారు. ఆడపిల్లలకు రక్షణావిధానాలు, చట్టభద్రతా మొదలైనవన్నీ కూర్చోపెట్టి చెప్పేది తను.

తన పుణ్యమాని అపార్ట్ మెంట్లో అందరి కుటుంబాల మధ్యలో మంచి స్నేహం మొదలయింది. కలిసిమెలిసి ఒకే కుటుంబంలా పండుగలూ, పబ్బాలూ చేసుకునే సంస్కృతి అలవాటయింది.

ఎన్నో జీవితాలు నాలాగే బాగుపడ్డాయి.

తనని అడిగేదాన్ని! ఎందుకక్కా! మేమంటే నీకంత ప్రేమ. ఇంత, డబ్బూ , సమయం మాకోసం ఖర్చుచేస్తావ్!”….అని

తన కుటుంబనేపథ్యాన్ని , జీవితంలో తనకు తగిలిన దెబ్బలూ…నాకు చూచాయగా చెప్పింది…. తను!

రూపక్క అమ్మానాన్నలకు తనూ, తన అన్నయ్యా సంతానం!

భారత్ లో ఏదో స్టేట్ కు ఐజీ చేసారు వాళ్ళ నాన్నగారు ! చాలా సంపన్నకుటుంబం అక్కది.

ఇంజినీరింగ్ అవ్వగానే….తనను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కు ఇచ్చి పెళ్లి చేసారట.

పెళ్ళయిన మూడేళ్లతరవాత అక్కకు యూటిరైన్ కేన్సర్ వచ్చి, గర్భసంచి రిమూవ్ చేసారట. పెళ్లయిన నాల్గవసంవత్సరానికే ఆమె తన భర్తతో విడిపోయిందట….పిల్లలు పుట్టే అవకాశం లేని కారణాన!

కొన్నాళ్లకు రూపక్క అన్నయ్య ఆక్సిడెంట్ లో పోయాడట. అతనిమీద బెంగతో వాళ్ల అమ్మగారు కూడా!

తనూ, తన తండ్రీ ఒంటరిగా!

వారికున్న డబ్బు ఏవిధంగా వారిని సుఖపెట్టలేదు!

ముఖ్యంగా అది తండ్రి తన వృత్తిలో…. నలుగురినీ పీడించి సంపాదించిన డబ్బు అనే భావన ఆమెలో రోజురోజుకూ పెరగసాగిందట.

అప్పుడే తను నిర్ణయించుకుందట! తను ఆ ఆస్తితో నలుగురికీ ఏదయినా మంచి చెయ్యాలి. ముఖ్యంగా విభిన్న సమస్యల్లో చిక్కుకుపోయి అలమటిస్తున్న పిల్లలకోసం అని!

తన తండ్రితో చెప్పిందట తన ఆలోచన!

ఆస్తంతా అనాధలకోసం ఖర్చుచేద్దామని.

కానీ ఆయన తను చచ్చిపోయాకా ఆమెకు ఏంకావాలో అది చేసుకోమన్నారుట. అప్పటివరకూ ఆస్తి తనకు ధారపోయనని ఖచ్చితంగా తన నిర్ణయం చెప్పారట.

“అందుకే మా నాన్ననుంచి విడిపోయి బయటకొచ్చేసి… నాకు తోచింది నేను చేస్తున్నా!” అనేది రూపక్క!

ఇంకా పెద్ద విశేషం ఒకటుంది.!! రూపక్క చొరవ, మానవతావాదం వలన మారిన మరో వ్యక్తి మా మేనమామ!

మా మామయ్య మా అమ్మకన్నా జఢుడు. ఎంత మంది పోరినా తను పెళ్లిచేసుకోకుండా…. తన పరిశోధనలే… ప్రపంచంగా బ్రతికేవాడు.

అలాంటి మామయ్యకి రూపక్కంటే విపరీతమైన ఆరాధన. తనే అడిగాడు కొన్నాళ్ళకు రూపక్కను…. పెళ్లిచేసుకోమని తనను. పెళ్లి అనే బంధమే అక్కరలేదు మనిషి మనిషిని అర్ధం చేసుకోడానికి అని తను మామయ్యని…. కొన్నాళ్ళు పరిక్షించి చివరకు వైవాహికంగా స్వీకరించింది.

ఇప్పుడు మా మామయ్య రూపక్క మొదలుపెట్టిన ఎన్ జీ ఓ ని చాలా ఆర్గనైజ్డ్ గా నడుపుతున్నారు….. కొన్ని వందల కార్యకర్తలతో… వాళ్ళిద్దరి ఉమ్మడాస్తులూ మూలధనంగా పెట్టి.., చాలామంది దాతల సౌజన్యంతోనూ!

ఇది శరత్ నా బాల్యం! ఈరోజు ఎందుకో నీకు చెప్పాలనిపించింది. కావాలనే నా చిన్నప్పటి చిత్రం నేనే ఈరోజు ఆ ఫోటో క్విజ్ లో పెట్టాను. నాకు తెలుసు నన్ను గుర్తు పట్టడం అసంభవం అని!”….. అంటూ దీర్ఘంగా నిశ్వసిస్తూ ముగించింది డాక్టర్ యుక్త!

“నీ కధ పేరు ‘రూపాంతరం’ అనచ్చేమో! యుక్తా!”….. శరత్ .. ఏదో దీర్ఘాలోచనలో మునిగిపోయి …. ఆకాశంలో చుక్కలదుప్పటిని దీక్షగా.. చూస్తున్న యుక్తను… భద్రతాకవచంలా తన చేతులతో చుట్టి… సమ్మోహనంగా నవ్వుతూ అన్నాడు!

“ఎక్జాక్ట్లీ శరత్! రూపాంతరం అన్న టైటిట్…. నా కథకు వందశాతం న్యాయం చేస్తుంది! నా జీవితంలో ప్రతీ ప్రమాదకరమైన మలుపు దగ్గరా నన్ను రూపక్కే గైడ్ చేసింది.

యుక్త కాసేపాగి మళ్లీ మొదలుపెట్టింది!!

“కానీ టైటిల్ పెట్టి ఎండ్ చెయ్యడానికి….నా కథ ఇంకా అవ్వలేదు శరత్! “

“….వయసుతోపాటూ సంతరించుకున్నఅపురూపమైన అందంతో, మితిమీరిన ఆత్మవిశ్వాసంతో నేను మెడిసిన్ పూర్తవగానే… యుఎస్ ఎమ్ఎల్ఈ పరిక్షలో నెగ్గి…. రెసిడెన్సీ కోసం అమెరికాలో అడుగుపెట్టా!

నా మొదటి రెసిడెన్సీ కాలిఫోర్నియాలో, లోమాలిండా లో!

భారత్‌లో నేను పెరిగిన ఆంక్షల వాతావరణానికి దూరంగా మొట్టమొదటిసారిగా…. సర్వస్వతంత్రంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న నేను , అమెరికాలో నా వ్యక్తిగతస్వేచ్ఛకు హద్దులు పెట్టుకోడంలో కొంత పొరపడ్డా!

నా పదిహేనేళ్ల బాల్యకౌమారాలను వాళ్ల గొడవలతో నిర్దయగా నలిపేసిన మా అమ్మానాన్నల మీద మనసులో తెలియని కక్షగా ఉండేది.

ఇక్కడ జీవితం నా చెప్పుచేతుల్లో ఉంది. ఆనందపుటంచులు చూడాలనుకున్నా! చదువయితే ఎప్పుడూ నిర్లక్షం చెయ్యలేదు. అదెప్పుడూ నా ప్రియమైన నెచ్చలి!!

నా వేగానికి అడ్డుకట్టవేస్తూ అద్నాన్ కలిసాడు. యెమనీస్ అతను. కొన్నాళ్ల డేటింగ్ తరువాత అతను నా ఫ్లాట్ కు మూవ్ అయ్యాడు! ముందంతా నా ఇష్టానుసారంగా ఉన్నవాడు మెల్లగా మారసాగాడు.

ఒకసారి వాళ్ల పేరెంట్స్ యెమన్ నుంచి ఒస్తున్నారని తలకు హిజాబ్ చుట్టించాడు. బుర్ఖా తెచ్చాడు కానీ వేయించలేకపోయాడు.

అద్నాన్ తల్లితండ్రులు నన్ను చూపులతో కాల్చేసారు. వాళ్ళెందుకంత కోపంగా ఉన్నారో అర్ధమయ్యేది కాదు! వాళ్లభాషలో,నన్ను అర్థం కాని తిట్లు తిట్టేవారు. నేనిచ్చిన బహుమతులన్నీ పుచ్చుకుని… వారు చాలా అసంతృప్తితో…నాలుగురోజుల్లో వారి దేశానికి వెళ్లిపోయారు.

రానురానూ నామీద అద్నాన్ ఆంక్షలూ, కోపతాపాలూ మితిమీరసాగాయి.

కొన్నాళ్లకు యెమన్ నుండి, అతని చెల్లెనని చెప్పుకుంటూ ఒకమ్మాయి చిన్నబాబుతో వచ్చింది. అతనికి రకరకాల మాంసాహారపు వంటలు చేసిపెట్టేది.

రూపక్కకు అద్నాన్ వ్యవహారం అంతా చెప్పా. అలాంటి రిలేషన్‌లో అవివేకంగా అలా ఎలా ఇరుక్కున్నావని చెడామడా తిట్టింది. వెంటనే ఆ అమ్మాయి సంగతి క్రాస్ చెక్ చేసుకోమంది.

ఒకరోజు మధ్యాహ్నం నా అనుమానం నిజం చేస్తూ ఇద్దరూ పట్టుబడ్డారు.

ఆమె అతని భార్య. తనని పంపించేస్తానని, నన్ను పెళ్లిచేసుకుంటానని కాళ్లావేళ్లా పట్టాడు.

నేను ఫ్లాట్ తనకే వదిలేసి మూవ్ అవుతుంటే నా మీదకు దౌర్జన్యానికి దిగసాగాడు.

ఎలాగోలా అతని బారి నుండి తప్పించుకుని…. స్నేహితురాలింటిలో కొన్నాళ్ళు గడిపి…నేను న్యూయార్క్ మారిపోయా!

ఆ తరువాత నాకు ఎలాంటి రిలేషన్ అన్నా విపరీతంగా భయం పట్టుకుంది! కెరియర్ మీదే ఎక్కువ దృష్టిపెట్టి ఇదిగో ఈస్థాయికి వచ్చాను!

నాకన్నా నా చెల్లి నయం. మంచి క్లారిటీతో తన లైఫ్ పార్ట్‌నర్ ను ఎంచుకుని , పెళ్ళిచేసుకుని… పిల్లాడిని కని…ఆనందంగా సెటిల్ అవ్వగలిగింది. నేను నా జీవితంలో నాకు కావలసినవి స్పష్టతతో ఎంచుకోలేక ఫెయిల్ అయ్యాను!

నిన్ను కలిసే వరకూ నా జీవితంలోకి ఎవరినీ ఆహ్వానించలేకపోయా శరత్! ఇప్పుడు నిన్ను వదలలేక పోతున్నా!

ఇప్పుడు చెప్పు శరత్!నిన్ను చూస్తే… నువ్వేమో నీ జీవితాన్నితాజాగా కొత్తబొమ్మ వెయ్యడానికి సిద్ధంగా ఉన్న కేన్వాలంత స్వచ్ఛంగా ఉంచుకున్నావు. కానీ నేను అసంపూర్తి బొమ్మల కేన్వాస్ లా అస్థవ్యస్థంగా ఉన్నా.

అయినా మూడేళ్లనుండి నీనుండి నాకు ఒక్కప్రశ్న లేకుండా నన్ను ప్రేమిస్తున్నావ్! ఇద్దరం ఒక్కప్రాణంలా సహజీవనం చేస్తున్నాం! ఇప్పుడు నాకే భయం వేస్తోంది మన బంధానికి గమ్యమేమిటా అని…… నా ప్రేమకు అస్థిత్వం ఏమిటా అని?? …..” విచలితవదనంతో ఆవేశంగా, ఆవేదనతో మాట్లాడుతున్న యుక్తను సూతారంగా లాగి… తన పక్కన కూర్చేపెట్టి…..

“యుక్తా! నన్ను పెళ్లి చేసుకుంటావా! మన ప్రేమకు ఒక మంచి బంధాన్నిద్దాం”…… ఆర్తితో అడిగాడు శరత్!

“మనం పెళ్ళి చేసుకుంటే…..మనకొక అందమైన పాప పుడుతుంది ……. నీ అంత అందంగా!”

“మనం ఆ పాపకు” రూపా” అని పేరు పెట్టచ్చు! సరేనా! “

“ఓ శరత్! లవ్లీ నేమ్! నా మనసులో నేనెప్పుడూ ఊహించుకునే కల అది!!

శరత్! అయితే నిజంగానే మనం పెళ్లిచేసుకుందామా? ఆర్ యూ సీరియస్! నా గతం నిన్ను బోదర్ చెయ్యదు కదా! ఆలోచించుకునే చెప్పు! ఇంక ఎలాంటి ఓటములూ తట్టుకునే శక్తి నాకు లేదు.”……..యుక్తలో ఉద్వేగం!!

“బేబీ! ఐ వుడ్ లవ్ టు మారీ యూ! రేపే చేసేసుకుందాం! ఆలస్యం అమృతం విషం! మళ్ళీ నీ మనసు మారేలోపు చేసేసుకోవాలి”….. అంటూ శరత్ ఆట పట్టిస్తుంటే…..

“రేపు కాదులే! మన ఆసుపత్రి ష్కెడ్యూల్స్ అన్నీ చూసుకుని…. ఇండియా వెళ్ళి పెద్దల సమక్షంలో… దేవుడి సన్నిధిలో… చేసుకుందాం…. మంచి సాంప్రదాయంగా!” అంది యుక్త

“సాంప్రదాయ పెళ్లి మీద నీకు నమ్మకం లేదనుకున్నా యుక్తా! నువ్వో ఆశ్చర్యాలపుట్టవి”….. అంటూ యుక్తకేసి అబ్బురంగా చూసాడు శరత్!

“నమ్మకం లేక కాదు శరత్! మా అమ్మలాంటి ఫ్రిజిడ్, మా నాన్నలాంటి అతిరొమాంటిక్ మిస్ మాచింగ్ జంటను చూసి, పెళ్లిలాంటి కమిట్‌మెంట్ అంటే భయమేసింది ఇన్నాళ్లూ! కానీ ఇప్పుడు పోయింది! నీతో ఇన్నాళ్ల సహవాసంలో!

సాంప్రదాయపెళ్లి ఎందుకంటే మీ పేరెంట్స్ కోసం. వాళ్లకి ఈ చిన్నసరదా తీర్చాలని, నిజంగా ఆ వేదమంత్రాల్లో ఏముందో తెలుసుకోవాలని” …….!

ఇంతలో…ఫోన్ మోగింది. డా. సంయుక్త తల్లి కాల్ చేస్తోంది! తమ భార్యాభర్తలిద్దరూ యూరోప్ టూర్ ప్లాన్ చేసుకున్నారుట. వచ్చేవారం నుండీ మూడువారాలు భారతదేశంలో ఉండబోమని చెప్పడానికి!!

ఆ మూషికమార్జాల జంట మధ్య కూడిన సయోధ్యను తలుచుకుని ఫక్కున నవ్వుకున్నారు శరత్, యుక్తా!

అలాగే ఆ ఆరుబయలు…. పేటియోలో పూలకుండీల నుండి తేలివస్తున్న మల్లియసౌరభాలను ఆఘ్రాణిస్తూ… నిశ్చింతగా శరత్ భుజం మీద తలవాల్చుకుని….అచ్చెరలా వచ్చి… అద్భుత మంత్రజాలమేదో చేసి… తన జీవితాన్ని ఈ ప్రశాంతతీరానికి చేర్చి అదృశ్యమైన ఆ దేవత ఉనికి కోసం పైకి ఆకాశంలోకి చూస్తూ….

“థేంక్స్ రూపక్కా! ఇదంతా నీవల్లే!” ….. అంటూ ఆప్యాయంగా పైకే అనుకుంది… యుక్త… డా. సంయుక్త!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here