[dropcap]“వె[/dropcap]య్యేండ్ల ముంద్ర గజినీ ముహమద్ సచ్చిపోయ. కాని వాని
సన్నబుద్ధి (సంకుచిత మనస్తత్వం) పెరిగి పెరిగి 174 అడీల చారిత్రక
బౌద్ద విగ్రహాన్ని పగలగొట్టె కదనా?”
“అవునురా ఇది శాన అన్యాయమురా”
“దేశ విభజన తర్వాత పాకిస్తాన్, బాంగ్లాదేష్, కాశ్మీరు
లోయలో మన కళాచారం వికసించినా? బౌద్ధ, జైన, ఇందూ, సిక్కు
జనాలు పెరిగిరా, ఓరిగిరా…నా?”
“ఏచన చేసి చెప్తానురా”
“అబుడు మన కళాచారం పశ్చిమాసియాలో అఫ్ఘాన్ నుంచి
ఆగ్నేయాసియాలోని ఇండోనేషియా వరకు…. ఇబుడు భారత్, శ్రీలంకా
నేపాల్, కంబోడియా, వియత్నాం, థాయిలాండ్ ఇంతే ఏలనా ఇట్లాయా?”
“రేయ్! మన కళాచారం దొడ్డదిరా, మనది సన్నబుద్ధి కాదురా
దాన్నింకానే ఇట్లయరా”
“దొడ్డదయితే పెద్దవ్వాల కదనా?”
“నీ మాట నిజమే కాని సన్నబుద్ధి ప్రాణం తీస్తుంది. దొడ్డ
బుద్ధి, దొడ్డ కళాచారం ప్రాణం పోస్తాయిరా, అది తెలసుకోరా”
“ఏమినా తెలుసుకొనేది ప్రాణం తీసినా నాది దొడ్డబుద్ధి, దొడ్డకళాచారం
అని నేను అనుకోనునా… నా కళాచారానికి కత్తులు కట్టి ఆ సన్న
బుద్ధిని చంపి కాటికి పంపుతానునా”
“కానీరా – కాలానికి తగినట్ల కోలాట – కానీరా”
కళాచారం = సంస్కృతి