వేంపల్లి రెడ్డి నాగరాజు నాలుగు మినీ కథలు-16

0
5

[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.

1. మాత్రలు

“సుమారు అరగంట నుంచి గమనిస్తున్నా, ఇక్కడే తచ్చాడుతున్నావు, ఏం కావాలయ్యా నీకు” అడిగాడు మెడికల్ షాపు యజమాని తన దుకాణం ముందు తిరుగాడుతున్న ఓ యాభై ఏళ్ల  పెద్దాయనను.

“దగ్గు, జలుబు, జ్వరం రావడానికి ‘మాత్రలు’ కావాలయ్యా” మెల్లగా గొణిగినట్లుగా చెప్పాడు పెద్దాయన షాపు యజమానికి మాత్రమే వినబడేలా.

“ఏం కావాలీ?” రెట్టించి మళ్లీ అడిగాడు షాపు యజమాని వినపడనట్లుగా.

“దగ్గు, జలుబు, జ్వరం వచ్చేందుకు ఏవైనా ‘మాత్రలు’ ఉన్నాయా అని” మరోసారి చెప్పాడు పెద్దాయన చుట్టూ పరికించి చూస్తూ.

“ఏవైనా వ్యాధులు తగ్గడానికి ‘మాత్రలు’, మందులు వుంటాయి గానీ, నువ్వు అడుగుతున్నట్లుగా రోగాలు రావడానికి మందులు ఉండవయ్యా, అయినా దగ్గు, జలుబు, జ్వరం రావాలని ఎందుకు కోరుకుంటున్నావు” పెద్దాయనను పిచ్చివాడిలా చూస్తూ అడిగాడు షాపు యజమాని.

“నేను రోజూ కూలి చేసుకుని పొట్టపోసుకునేవాడిని స్వామీ, ఈ పాడు కరోనా రోగం వచ్చి నెల రోజులుగా పనులు దొరక్క పెళ్ళాం, బిడ్డలతో పస్తులువుంటున్నా” చెప్పాడు పెద్దాయన ఆవేదనగా.

“దానికీ, దీనికీ ఏమిటి సంబంధం?” ప్రశ్నించాడు షాపు యజమాని అర్థంకానట్లుగా చూస్తూ.

“ఆ లక్షణాలు వున్న వారిని పోలీసులు, ఆఫీసర్లు వెతికి మరీ పట్టుకెళ్లి పెద్దాసుపత్రిలో మూడు వారాల పాటు అక్కడే పెట్టుకుంటున్నారట, అక్కడ ఉన్నన్ని రోజులు మూడు పూటలా తిండి వాళ్లే  పెడుతున్నారట, అలాగైనా నా పెళ్ళాం, బిడ్డలతో సహా కనీసం కొన్నాళ్ళయినా మా ఆకలి కూడా తీరుతుందని” పెద్దాయన చెబుతున్న సమాధానానికి నిలువు గుడ్లు వేసుకుని చూస్తుండిపోయాడు షాపు యజమాని.

2. టిఫిన్

ఉదయం ఎనిమిది గంటల వేళ…

“నందినీ, టిఫిన్ అయిందామ్మా?” పట్నంలో ఉంటున్న కొడుకు పిల్లలను చూసేందుకు పల్లె నుంచి వచ్చిన అరవై ఏళ్ల పద్మావతమ్మ అడిగింది కోడలిని.

“ఇంకా కాలేదు అత్తయ్యా” బదులిచ్చింది నందిని.

“ఎంతసేపు పట్టవచ్చునమ్మా?” మళ్ళీ అడిగింది పద్మావతమ్మ.

“పనులు ఒక్కొక్కటిగా చేస్తున్నా అత్తయ్యా, ఇవన్నీ పూర్తి అయ్యాక చేస్తా” చెప్పింది నందిని వాట్సప్‌లో ఎవరితోనో చాటింగ్ చేస్తూ తల ఎత్తకుండానే.

“నందినీ, టిఫిన్ అవుతోందా?” తొమ్మిది గంటల ప్రాంతంలో మరోసారి అడిగింది పద్మావతమ్మ.

“ఇంకా మొదలుపెట్టలేదు అత్తయ్యా, అయినా ఓ అరగంట క్రితమేగా కాఫీ తాగారు” చిరాగ్గా అంది నందిని.

“కాస్త త్వరగా చేయమ్మా” చెప్పింది పద్మావతమ్మ కోడలితో.

“రాత్రి సింకులో వేసిన పాత్రలు తోమాలి, ఉప్మాకు రవ్వవేయించి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరిగి చేయాలి” చెప్పింది నందిని.

“మరీ ఆలస్యం అయ్యేలా ఉంటే పిల్లాడిని పంపి హోటల్‌లో రెండు ఇడ్లీలు తెప్పించుకోనా?” అడిగింది పద్మావతమ్మ.

“ఇంట్లో చేస్తున్నానని చెబుతున్నా కదా” వాదనకు దిగినట్లుగా అంది నందిని.

“కనీసం రాత్రి మిగిలిన చద్దన్నం ఉన్నా కాస్తంత పెట్టమ్మా” నీరసంగా అడిగింది పద్మావతమ్మ.

“కేవలం గంటలోపే నాలుగుసార్లు అడిగావు, తిండికి మరీ మొహం వాచినట్లు, తినడానికే ఉన్నట్లు అడుగుతున్నావే” అత్తగారిపై ఒంటికాలిమీద లేచింది నందిని.

“ఈమధ్య బిపి రోగం వచ్చిందని నీకు తెలుసు కదమ్మా, ఏదైనా తిని తొమ్మిదిలోపు మాత్ర వేసుకోవాలి, లేకుంటే తల తిరుగుతుంది” చెప్పింది పద్మావతమ్మ శరీరం పూర్తిగా అదుపు తప్పి కంపిస్తుండగా, తన పరిస్థితి అర్థం చేసుకోమన్నట్లుగా.

3. చివరి చూపులు

“సంధ్యా, అన్నయ్య ఫోన్ చేసాడా?” చెల్లికి కాల్ చేసి అడిగింది పద్మ.

“ఇప్పుడే చేశాడు, అమ్మ ఆరోగ్యం పూర్తిగా  బాగోలేదటగా” అంది సంధ్య.

“చికిత్స చేసి కూడా ప్రయోజనం లేదని డాక్టర్లు చెప్పేశారట, అందుకనే అమ్మను ఇంటికి తీసుకొచ్చేశారట, మనల్ని తొందరగా బయలుదేరి రమ్మంటున్నాడు” చెప్పింది పద్మ.

“మరి నువ్వు బయల్దేరుతున్నావా?” అక్కను అడిగింది  సంధ్య.

“నేనూ, మీ బావగారు మరో అరగంటలో బయలుదేరుతున్నాము, నీ మాటేమిటి?” ప్రశ్నించింది పద్మ.

“రెండు నెలల క్రితం కూడా ఓసారి ఇలాగే ‘చివరి చూపుల’కు రమ్మని కబురు చేస్తే, కంగారుపడి వెళ్ళామా, తీరా వెళ్ళాక మనకు శ్రమతప్ప ఆవిడ ఆరోగ్యం బాగానే కుదురుకుంది, ఇప్పుడు కూడా అలాగే సర్దుకుంటుందిలే” అసహనంగా  అంది సంధ్య.

“అదికాదే పిచ్చిమొద్దూ, ఆవిడ ఈసారి నిజంగానే కన్నుమూస్తే ఈ చివరి క్షణాల్లో మనం అక్కడ లేకుంటే ఎలా?” చెల్లెలిని మందలిస్తున్నట్టుగా అంది పద్మ.

“పిల్లలు స్కూల్ నుండి రాగానే బయలుదేరుతాములే” చెప్పింది సంధ్య.

“నువ్వు ఇలాగే మీనమేషాలు లెక్కిస్తూ కూర్చో, మనకు జరగాల్సిన  ఆన్యాయం జరిగి పోతుంది” కసురుకుంటూ కఠినంగా అంది పద్మ.

“ఏం అన్యాయం?” అడిగింది సంధ్య అర్థం కానట్లుగా.

“ఆమె మెడలో ఉండే గొలుసు, చేతుల్లో ఉండే గాజులు, ఉంగరము కోడలి హోదాలో  మన వదినమ్మ పరం అయిపోతాయిగా” అంది పద్మ  ‘వదినమ్మ’ అనే పదాన్ని ఒత్తి పలుకుతూ.

“ఇన్నేళ్లుగా అమ్మకు సేవ చేస్తున్న వదినకే దక్కాలిగా అవి న్యాయంగా, మనకు ఎలా వస్తాయి?” ప్రశ్నించింది సంధ్య.

“దానికి ఓ చిన్న ఉపాయం ఉంది, నీ జ్ఞాపకార్థం నీ సొమ్ములు మాకు కావాలి అమ్మా అని మనమే సెంటిమెంటుగా అమ్మను అడిగితే పోలా” తల్లి బతికుండగానే ఎత్తులు వేస్తూ అంది పద్మ.

4. పెద్దదిక్కు

“శ్రావణీ, నాన్న చనిపోయాక అమ్మ ఒక్కతే ఒంటరిగా పల్లెలో వుండలేకపోతోంది, తనను ఇక్కడికే తీసుకువద్దామనుకుంటున్నా” రాత్రి భోజనాలవేళ భార్యతో చెప్పాడు కుమార్.

“ఏమాత్రం అవసరం లేదు” భర్త ప్రతిపాదనను తాను అస్సలు ఒప్పుకోనట్లుగా అంది శ్రావణి.

“మా అమ్మ తన పనులు తానే చేసుకుంటుంది, నువ్వేమీ శ్రమ పడాల్సిన పని   ఏమాత్రం వుండదు, పైగా పనుల్లో నీకు కాస్తంత సహాయంగా కూడా వుంటుంది, మరోసారి ఆలోచించు” అన్నాడు కుమార్.

“అయితే ఓ పని చేయండి, మీ అమ్మ బోడిసాయం నాకేమీ అక్కర లేదుగానీ, మీరు ఆమెనే ఇంట్లో తెచ్చి పెట్టుకోండి, నేనే వెళ్లిపోతా” తెగేసినట్లు చెప్పింది శ్రావణి.

“సరే నీకు ఇష్టం లేకపోతే మా అమ్మను తీసుకు రానులే” లోలోన బాధపడుతూ చెప్పాడు కుమార్.

సరిగ్గా రెండు నెలల తర్వాత…

“ఏమండీ, ఇప్పుడే టీ.వీ.వార్తల్లో చెప్పారు, నాలుగేళ్లుగా పెండింగ్‌లో వున్న మా ఉద్యోగాలను మాకు వెంటనే ఇచ్చేయమని హైకోర్టు ప్రభుత్వాన్ని మొట్టికాయ వేసి మరీ ఆదేశించిందట, ఈ లెక్కన నాకు ఉద్యోగం వచ్చినట్టే” ఇంటికి వచ్చిన భర్తకు ఆనందంగా చెప్పింది శ్రావణి.

“కంగ్రాచ్యులేషన్స్, పెళ్లికాక ముందు నుండి  ఎంతగానో  ఎదురు చూస్తున్న జాబ్  కనీసం ఇప్పటికైనా వచ్చిందన్నమాట” సంతోషంగా అన్నాడు కుమార్.

“కానీ నేను ఉద్యోగం చేయాలంటే మీరు చిన్న పని చేయాలండీ, వెంటనే పల్లెకు వెళ్లి మీ అమ్మగారిని  ఇక్కడికే తీసుకొచ్చేస్తే, ఆవిడ మనతో పాటు వుండి, రోజు పిల్లాడిని చూసుకుంటుంది, పైగా మనకు కాస్త ‘పెద్దదిక్కు’ గాను వుంటుంది” భార్య మాటలకు నోరెళ్లబెట్టాడు కుమార్ ఆవిడ పలుకులలోని అవకాశవాదాన్ని గ్రహిస్తూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here