నేపథ్య రాగం – నాటకం – దృశ్యం 8

0
3

[box type=’note’ fontsize=’16’] యుగ-యుగాల నుండి ఈ సంఘమనే రంగస్థలంపైకి వచ్చి కనబడాలని, వినబడాలని నిరంతరం సంఘర్షణ చేస్తున్న ఒక సన్నని రాగం కథే ఈ ‘నేపథ్య రాగం’.. హిందీ మూలం డా. మీరాకాంత్. తెలుగు సేత డా. సుమన్‌లత రుద్రావజ్ఝల. [/box]

దృశ్యం-8

[dropcap](మ[/dropcap]ధ్యాహ్నం వేళ మాళవగణ నాయకుడైన విక్రమాదిత్యుడి రాజభవన దృశ్యం. కాస్త – కాస్త దూరంలో ఉన్న స్తంభాల పైన ఆనాటి కళాకృతుల దృశ్యాలు చెక్కబడి ఉన్నాయి. ఒకచోట వాయిద్య యంత్రాలు కానవస్తే, వేరొక దాని పైన నృత్య ముద్రలు దర్శనమిస్తున్నాయి. విక్రమాదిత్యుడు ఆలోచనలో మునిగి కూర్చుని ఉన్నాడు. అలాంటి సమయంలో మహాదేవి ప్రవేశం. దీర్ఘాలోచనల్లో మునిగినట్లున్న విక్రమాదిత్యుడిని చూసి ముందు సంకోచించి తత్తరపడినా, తరువాత ఆయన వద్దకు వస్తుంది.)

మహాదేవి : (విక్రమాదిత్యుని భుజంపైన చేతులు పెట్టి, ఆత్మీయంగా) మహారాజా! ఇంకా ఎందుకు చింతిస్తున్నారు? చింతించవలసిన కారణాలు అన్నీ సమసిపోయేయి కదా! గౌడ ప్రదేశంలో వానలు ఎన్నో దినాల కిందటే ఆగిపోయాయి కదా! ప్రజల పునరావాస కార్యక్రమాల పురోగతి తెలుస్తోంది. పరిస్థితులు కూడా అదుపులోకి వస్తున్నాయి కదా!

విక్రమాదిత్యుడు : (ఉదాసీనంగా) నిజమే మహాదేవి… కాని అక్కడి క్షేత్రపాలకుడు… అదే అక్కడి రాజు హత్య తరవాత…

మహాదేవి : కాని ఆతని హత్యకు కారణం ఆతని కుటుంబ సభ్యులే కదా!

విక్రమాదిత్యుడు : (లేచి నిల్చుంటూ) కాకపోవచ్చు… కుటుంబ సభ్యులు కాదు, సౌర మండల సభ్యులు! కుటుంబ సభ్యులు కేవలం పరికరాలు అంతే!

మహాదేవి : (గొంతుకలో కాస్తంత వ్యంగ్యం ధ్వనిస్తూ) ఓహో… మహారాజులవారు ఆ గ్రామీణ బాలిక ఆలోచనలోనే మునిగి ఉన్నారన్నమాట!

విక్రమాదిత్యుడు : ఔను… ఆమె చెప్పిన భవిష్యవాణిని గూర్చే ఆలోచిస్తున్నాను. ఆలోచించదగినది కాదా?

మహాదేవి : (తనను తాను సంబాళించుకుని, గంభీర స్వరంతో) సత్యం చెపుతున్నారు మహారాజా… మీరు కాపత్థిక గ్రామం నుండి తిరిగి వచ్చి, నాకు అక్కడ జరిగిన దానిని శలవిస్తే, ఆ రాత్రంతా నాకు మాత్రం కంటిమీద కునుకు వచ్చిందా?

విక్రమాదిత్యుడు : (మరలివచ్చి సింహాసనం పైన కూర్చుని) అయితే ఖనా చెప్పిన భవిష్యవాణి పూర్తిగా సత్యమూ కాదు; పూర్తిగా అసత్యమూ కాలేదు. తను రాజుగారి మృత్యువు అంది… రాజుకి మృత్యువు వచ్చింది, కాని గౌడ ప్రదేశ రాజు మరణించేడు. (ఆలోచిస్తూ) కాదు… ఇది ఆ వయస్సులో ఉరకలు వేసే ఉత్సాహంతో చెప్పిన భవిష్యవాణి కాదు… సూక్ష్మమైన అంతర్దృష్టి వలన చెప్పగలిగినది.

మహాదేవి : ఖనా, తన మామగారైన ఆచార్య వరాహమిహిరులవారు చేసిన ఏదో తైలం… ఆఁ! ‘జ్యోతిష్మతీ తైలాన్ని’ తాగేసిందని దాసి చెప్పింది!

విక్రమాదిత్యుడు : (చిరునవ్వుతో) ఓహో మహారాణీ! మీరు కూడా అప్పుడప్పుడు…

(మహారాణి వంక స్నేహపూర్వకంగా చూపులు)

మహారాణి : (ముడుచుకుపోతూ) ఆ దాసి….

విక్రమాదిత్యుడు : (స్థిరమైన గొంతుకతో) తెలుసు.. ఆ దాసీ అనే కాదు… ఖనాను గురించి ప్రజల మనసులో ఇటువంటి అభిప్రాయమే ఉంది. కాని మీరే ఆలోచించండి మహారాణీ? ఇలా ఏదో ఒక తైలం వలన ఇంతటి జ్ఞానాన్ని ఎవరికైనా సముపార్జించుకోవడం సాధ్యమా?

(లేచి నిలుచుంటాడు)

మహాదేవి : (ప్రేమనిండిన గొంతుకతో) ఇదే ప్రపంచంలో మీరు కూడా ఉన్నారు కదా మహారాజా…. మాళవ గణనాయకుడైన సామ్రాట్టు వారిది ఎంత విశాలమైన ఉదారమైన ఆలోచనా సరళి అని ఆలోచిస్తే మనసు ఉప్పొంగిపోతుంది.

(కళ్లలో హర్షంతో కూడిన చిరునవ్వు) అంతటి ఔదార్యవంతుడైన సామ్రాట్టు నా స్వామి!

విక్రమాదిత్యుడు : (గద్గద స్వరంతో) మహాదేవీ…

(చెంతకు వచ్చి మహాదేవి చేతిని తన చేతిలోకి తీసుకోగా ఇద్దరూ ఒకరినొకరు అనురాగ పూర్ణ దృష్టితో చూసుకుంటారు.)

మహాదేవి : ఖనాకు నన్ను పరిచయం చెయ్యరూ?

విక్రమాదిత్యుడు : (చెయ్యి వదిలేసి) మీకు ఇటువంటి కోరిక కలుగుతుందని అనుకుంటూనే ఉన్నాను.

మహాదేవి : నేను కూడా నా అదృష్టం ఎలాగుందో అని ఆ జ్యోతిష్మతిని అడిగి తెలుసుకుంటాను. (కాస్తంత వినోదంగా) మహారాజుల వారికి నాపట్ల ఈ భావం ఎన్నాళ్లుంటుందో!

విక్రమాదిత్యుడు : (కాస్తంత ఊరిస్తున్నట్లు) అయితే ఈనాడు ఖనాతో ఇదే సంభాషిస్తే?

మహాదేవి : (ఉలిక్కిపడి) ఈనాడా? (కాస్తంత దెబ్బతిన్నట్లు) అంటే?

విక్రమాదిత్యుడు : ఔను! ఖనా ఈ సరికి వస్తూండవచ్చు!

(మహాదేవి కాస్తంత దూరం జరుగుతుంది)

ఉదయాన్నే రాజోద్యోగులు ఆమెను సగౌరవంగా తోడ్కొని రావడానికి వెళ్లేరు. (గవాక్షం నుండి బైటకు చూస్తూ) మధ్యాహ్నం అయింది. వస్తూ ఉండి ఉంటారు.

మహాదేవి : (గాయపడిన స్వరంలో) మీరు ఈ విషయాన్ని చర్చించనేలేదు!

విక్రమాదిత్యుడు : నేను అకస్మాత్తుగా ఆమెను మీ ముందు నిలిపి, మిమ్మల్ని ఆశ్చర్యపరుద్దామని అనుకున్నాను.

(ప్రతీహారి ప్రవేశం)

ప్రతీహారి : జయము! నాయకుల వారికి జయము! కాపిత్థకం నుండి రాజోద్యోగులు తిరిగి వచ్చారు మహారాజా! అతిథులు నిరీక్షిస్తున్నారు. ఆజ్ఞాపించండి మహారాజా!

విక్రమాదిత్యుడు : మా అతిథిగా వచ్చినా ఖనా దేవిని సగౌరవంగా లోపలికి ప్రవేశపెట్టండి!

ప్రతీహారి :- ఆజ్ఞ!

(ప్రతీహరి వెళ్లి, ఖనాతో తిరిగి వస్తాడు.)

విక్రమాదిత్యుడు : (ఖనాను చూస్తూ) ఆచార్య వరాహమిహిరుల వారి విదుషీమణి కోడలికి చంద్రగుప్త విక్రమాదిత్యుని రాజభవనంలోకి స్వాగతం!

ఖనా : (వినయంగా చేతులు జోడించి) మాళవగణనాయకులైన మహారాజుల వారికి శత-శత ప్రణామాలు!

విక్రమాదిత్యుడు : ఉజ్జయినిలో నవోదయమైన ఈ జ్యోతిష్మతిని కలవాలని మహారాణిగారు అభిలషించారు.

మహాదేవి : (ముందుకు వచ్చి ప్రసన్నంగా) రా ఖనా! వచ్చి ఈ ఆసనంపైన కూర్చో! వస్తున్న మార్గంలో ఏవిధమైన అసౌకర్యం కలగలేదు కదా?

ఖనా : లేదు మహారాణి… ఎంతో ఆహ్లాదకరంగా అనిపించింది.

(మహారాణి కూర్చుని, ఖనాను కూడా కూర్చోమని సైగ చేయడంతో ఆమె కూడా దగ్గరే కూర్చుంటుంది. కాని ఖనా, ఒక్కసారి దిగ్గునలేచి నిలబడి, విక్రమాదిత్యుని వైపుకు వెళ్తుంది.) కాని మహారాజా! ఈ రాజప్రసాదంలో నిలబడిన నేను, ఆనాటి నా అపరాధాన్ని మన్నించమని వేడుకుంటున్నాను. నా తప్పిదాన్ని మన్నించమని మరీ-మరీ వేడుకుంటున్నాను మహారాజా!

(విక్రమాదిత్యుడు మందహాసం చేస్తాడు)

మీరు ఒక పేద వ్యక్తి వేషధారణలో రావటం వలన ఎంత మాత్రమూ గుర్తించలేకపోయేను మహారాజా!

విక్రమాదిత్యుడు : అలా గుర్తు పట్టలేనప్పుడే అది యథార్థమైన మారువేషం అనిపించుకుంటుంది. నువ్వు నా యథార్థ రూపాన్ని గుర్తించలేకపోయినా, నా జిజ్ఞాసను గుర్తించి దానికి సరియైన సమాధానం ఇచ్చేవు కదా!

ఖనా : అది మీ ఔదార్యం మహారాజా!

విక్రమాదిత్యుడు : మణుల నిపుణుడు దుర్లభమైన మణులను గుర్తించక, మరేం చెయ్యగలడు? భవిష్యత్తులో ఉజ్జయిని బహుశా నీ జ్ఞానాన్ని, అంతర్ దృష్టిని ఉపయోగించుకుని లాభపడుతుందేమో?

(మహారాణితో) వెళ్లోస్తాను మహారాణీ… ఖనాను మీరు

మహాదేవి : (లేచి నిల్చుని) నిశ్చింతగా ఉండండి!

(నవ్వుతూ ఖనా వంక చూస్తుంది) ఇప్పుడు ఈమె నా అధికార పరిధిలో ఉంది.

(చిరునవ్వుతో విక్రమాదిత్యుని నిష్క్రమణ! మహారాణి ఖనా వద్దకు వస్తుంది. ఆమె వంక స్నేహపూర్వక దృష్టితో, తదేక ధ్యానంతో చూస్తూ ఉండగా)

ఖనా : (ఆర్ద్రమైన స్వరంతో) అహో భాగ్యం!

మహాదేవి : (రెక్క పట్టుకు ఖనాను కూర్చొబెట్టి) పృథు యశస్సులేని లోటు కలచి వేస్తూనే ఉంటుంది కదా ఖనా?

(ఖనా ముడుచుకుపోతుంది.)

ఏమైనా సందేశం వచ్చిందా?

ఖనా : వచ్చింది మహారాణీ! గత వారమే వచ్చింది.

మహాదేవి : ఇక్కడకూ వచ్చింది. భర్తృహరి మహారాజుల వారి క్షేమ సమాచారాలు తెలిసేయి.

ఖనా : మహారాజు భర్తృహరిగారు?

మహాదేవి : ఔను. పృథు యశస్సు చెప్పే ఉంటాడు. ఈ మధ్య మహారాజు భర్తృహరి గారు తమ సన్యాస జీవితాన్ని అక్కడే గడుపుతున్నారని!

ఖనా : (ఏదో ఆలోచిస్తూ) అదయితే తెలుసు, గాని,

మహాదేవి : కాని…?

ఖనా : మహారాణి! మీరు అన్యథా భావించనంటే ఒక ప్రశ్న అడగనా?

(మహారాణి ఆమెవంక పరిశీలనగా చూస్తుంది.)

ఎన్నాళ్ల నుండో మనసులో ఏదో ఆలోచన సుడులు తిరుగుతోంది. ఎవరిని అడగాలో అర్థం కావటం లేదు. ఈనాడు మిమ్మల్ని కలిసేక, అడిగితే బాగుండునని…

మహాదేవి : నిస్సంకోచంగా నీ మనసులో మాటను అడుగు ఖనా… ఇప్పుడు నువ్వు నాకు సఖివి …. సంకోచం ఎందుకు? అడుగు.

ఖనా : భర్తృహరి మహారాజుల వారు మాళవ గణాధీశుడైన విక్రమాదిత్యుల వారికంటే వయసులో చిన్నవారు కదా మహారాణీ! వారు సన్యాసం స్వీకరించడానికి హేతువేమి?

మహాదేవి : ఈ విషయం మాళవ రాజ్యమంతటికీ తెలుసు; నువ్వు వినలేదంటే ఆశ్చర్యమే మరి!

ఖనా : విన్నాను మహారాణీ! కాని నమ్మబుద్ది కాలేదు, అందుకే…

మహాదేవి : అందుకే… ఏమిటి?

ఖనా : అందుకే రాజభవనంకి చెందిన, అతి విశ్వసనీయులైన వారినుండే తెలుసుకోవాలని భావించేను.

మహాదేవి : (ముందు చిరునవ్వు నవ్వి, అటుపైన గంభీరముద్రలో) ఎంత వేగంతో ఒకరిపట్ల ఆకర్షింపబడతారో, నమ్మకం వమ్ము అయినప్పుడు అంతే వేగంతో వికర్షింపబడడం అన్నది మానవస్వభావం. అది సహజ లక్షణం.!

ఖనా : నిజంగానే మహారాణి పింగళ…

(అంటూ అంటూ ఆగిపోయిన ఖనా వంక మహారాణి పరీక్షగా చూస్తుంది.)

మహాదేవి : (దీర్ఘంగా నిట్టూర్చి, గంభీరస్వరంతో) నువ్వు విన్నది నిజమే! భర్తృహరి మహారాజా రాణి పింగళను తన ప్రాణాలకన్న మిన్నగా ప్రేమించేవారు; ఇష్టపడేవారు. మహారాజుకు ఒక పేద బ్రాహ్మణుడు, అమరత్వాన్ని ప్రసాదించే పండునొక దానిని బహూకరించేడు. ఆ పండును ఎవరు తింటారో, వారు అమరులవుతారు.

(మహారాణి మౌనంగా ఉండిపోతుంది.)

ఖనా: ఏమయింది మహారాణీ?

మహాదేవి : (కంఠంలో ఒకరకమైన ఉదాసీనత) భర్తృహరి మహారాజు ఆ ఫలాన్ని తాను స్వయంగా ఆరగించక, తన మహారాణి పింగళకు అందించేరు. (తన గొంతుకను అదుపు చేసుకుంటూ) ఆ పండు ప్రత్యేకతను తెలుసుకున్న మహారాణి పింగళ, దానిని తాను తినక, తనకు ప్రేమ పాత్రుడయిన సైన్యాధిపతికి అందజేసింది. సైన్యాధిపతి కాస్తా ఆ పండును తన ప్రేయసికి ఇచ్చేడు. ఆమె ఉజ్జయినికే చెందిన విలాసవతియైన వారకాంత. విధి విచిత్రం! ఆ గణికకు మహారాజులైన భర్తృహరిపట్ల చెప్పలేని ఆకర్షణ ఉండడంతో, ఆమె ఈ ఫలాన్ని మహారాజుల వారికి సభక్తికంగా సమర్పించుకుంది.

ఖనా :  (ఒళ్లు జలదరించినట్లయి) అయ్యో! అప్పుడు భర్తృహరి మహారాజు గారికి ఎలా అనిపించి ఉంటుందో కదా!

మహాదేవి : అంతే, ఆ క్షణంలోనే ఆయనకు జీవితం అంటే ఎంత నిస్సారమో కదా అనిపించింది. ఆయన జీవితాంతం ఎవరికోసం సర్వస్వం సమర్పించుకుంటూ వస్తున్నారో, ఆ మహారాణి పింగళ తనను కాక, వేరెవరినో ప్రేమిస్తోంది!

ఖనా : దానితో ఆయన సన్యాసాన్ని స్వీకరించేరు!

మహాదేవి : బహుశా ఆయన తనకు తానే నిరర్థకుడిని అని భావించేరేమో!… ప్రపంచమే నిస్సారంగా అనిపించిందేమో!

ఖనా :  (ఆదుర్దా నిండిన గొంతుకతో) కాని మహారాణీ…

మహాదేవి : చెప్పు….

ఖనా : తన మహారాణి తనను మాత్రమే నిష్టగా ప్రేమించలేదని, భర్తృహరి మహారాజుగారు సన్యాసం స్వీకరించేరు. కాని ఎప్పుడైనా ఎవరయినా స్త్రీ తన భర్త తనను కాక వేరెవరినో ప్రేమిస్తున్నాడని భావిస్తే…

(మహారాణి గంభీరంగా ఖనా వైపు చూస్తుంది)

భార్యకు సహనం లేదంటారు… ఆమెకు ఓపికలేదు అంటారు… మరి…

మహాదేవి : ఆగిపోయావేం చెప్పు?

ఖనా : మరి అదే సంఘం, ఈ మాట మీద ఆ స్త్రీ సన్యాసాన్ని తీసుకుందికి అనుమతిస్తుందా? ఈ సమాజం ఆమెను తన ఇంటి గడప దాటనిస్తుందా మహారాణీ?

(మహారాణి ఆమె వద్దకు వచ్చి, భుజంపైన చేతిని ఉంచి, ఏదో ఆలోచిస్తుంది. కొద్ది క్షణాలు రంగస్థలంపైన పూర్తి నిశ్శబ్దం ఆవరించుకుంటుంది. అటుపైన మహారాణి ముందుకు అడుగులు వేస్తుంది.)

మహాదేవి : (స్వగతంగా) ఒక స్త్రీ గురించి నువ్వు అంటున్నావు, కాని అటువంటి స్త్రీల సంఖ్య ఎంతమందో కూడా తెలియదు. రాజ్యానికి మహారాణిని కావచ్చు… కాని నేను కూడా…) (బైటకు) అంతటి గంభీరమైన ప్రశ్నలు వెయ్యొద్దు! ఇలాటివి కెలికితే, జీవించడం దుర్భరం అవుతుంది. భూమిమీద ప్రశ్నలు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో, వాటిని ఆకాశంలోని గ్రహగతులపైన వదిలేయాల్సి వస్తుంది.

ఖనా : మహారాణీ!

మహాదేవి : ఊరికే పరిహాసానికే సుమా…

(చెయ్యి అందించి) పద… నా అభ్యంతర మందిరంలోకి వెళ్దాం… ఈనాడు నా గ్రహాలు ఏమంటున్నాయో… ఆ కథ తెలుసుకోవాలి!

(ఖనా చిరునవ్వుతో తన చేతిని ఆవిడకు అందిస్తుంది. ఇద్దరూ లోపలికి నిష్క్రమిస్తారు.)

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here