[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన (ఉమ్మడి) మహబూబ్‌నగర్ జిల్లా–18” వ్యాసంలో జిల్లా లోని తాను చూడని ప్రసిధ్ధ ఆలయాల గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]
[dropcap]1[/dropcap]7 వారాలనుంచీ మహబూబ్‌నగర్ జిల్లాలో నేను చూసిన ఆలయాల గురించి నేను తెలుసుకున్న వివరాలన్నీ ఫోటోలతో సహా తెలియజేశాను. మహబూబ్‌నగర్ పెద్ద జిల్లా కదా, 17 ఆలయాలేనా అనకండి. నేను చూడనివి కూడా వున్నాయి. వాటి గురించి ఈ రోజు తెలియజేస్తాను. అయితే ఈ జిల్లా ఆలయాల గురించి ముగిస్తున్న సందర్భంగా జిల్లా గురించి కూడా కొంచెం తెలుసుకుందాం.
మహబూబ్‌నగర్ జిల్లా, తెలంగాణా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఒకటి. ఇది జిల్లా ముఖ్యపట్టణం. విస్తీర్ణం దృష్ట్యా గానీ, మండలాల సంఖ్యలోగానీ ఈ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా, తుంగభద్ర నదులు రాష్ట్రంలో ప్రవేశించేది కూడా ఈ జిల్లా నుంచే.
మహబూబ్ నగర్ హైదరాబాదునుండి 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాన్ని పూర్వం మౌర్యులు, శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొఘల్‌లు, నిజాంలు పరిపాలించారు.
మహబూబ్ నగర్ ప్రాంతాన్ని పూర్వం పాలమూరు అని, రుక్మమ్మపేట అని పిలిచేవారు. జిల్లాలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించడంతో పాలమూరు అనే పేరు. ఆ తరువాత 1890 డిసెంబరు 4న అప్పటి హైదరాబాదు సంస్థాన పరిపాలకుడైన ఆరవ మహబూబ్ ఆలీ ఖాన్ అసఫ్ జా (1869 – 1911) పేరు మీదుగా మహబూబ్‌నగర్ అని మార్చబడింది. మహబూబ్ నగర్ క్రీ.శ. 1883నుండి జిల్లా ముఖ్య పట్టణమైంది.
ఈ ప్రాంతం చాలా కాలం చిన్న చిన్న ప్రాంతాల పాలకుల చేతిలో ఉండిపోయింది. ఇక్కడ ఎక్కువగా సంస్థానాధీశులు, జమీందారులు, దొరలు, భూస్వాములు పాలించారు. జిల్లాలోని ప్రముఖ సంస్థానాలలో గద్వాల, వనపర్తి, జటప్రోలు, అమరచింత, కొల్లాపూర్ సంస్థానాలు ప్రముఖమైనవి.
జిల్లాలోని నారాయణపేట పట్టు చీరెలకు, నేత వస్తాలకు ప్రసిధ్ధి చెందింది. అలాగే రాజోలి చేనేత వస్త్రాలు కూడా పేరుగాంచాయి.
జిల్లాలో అన్ని ఆలయాలూ నేను చూడలేక పోయాను అని చెప్పాను కదా. నేను చూడని ప్రసిధ్ధ ఆలయాల గురించి కూడా చెబుతాను. వీలున్నవారు చూడండి.
కురుమూర్తి దేవస్థానం:
తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయంతో అనేక పోలికలున్న కురుమూర్తి శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం జిల్లాలోనే అతి పురాతనమైన దేవాలయంగా చెబుతారు. క్రీ.శ.14 వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం చిన్నచింతకుంట నుంచి 5 కి.మీ.ల దూరంలో, వనపర్తి నుంచి 39 కి.మీ.ల దూరంలో మహబూబ్‌నగర్ – కర్నూలు రైలు మార్గంలో మహబూబ్‌నగర్ నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో వుంది. ఈ దేవస్థానానికి బస్సు సౌకర్యము కూడా ఉంది. ఇక్కడ ఎత్తయిన ఏడు కొండలపై ఉన్న కురుమూర్తి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని క్రీ.శ. 1268 ప్రాంతములో ముక్కెర వంశ మూలపురుషుడు గోపాలరాయుడు నిర్మించాడు.
బ్రహ్మోత్సవాలలో ఉద్దాల (పాదుకల) ఊరేగింపు ప్రధాన ఘట్టం. వీపుపై పాదుకలతో కొట్టించుకుంటే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం.
శ్రీ వేంకటేశ్వరస్వామి వారు ఇక్కడకు రావడానికి కారణంగా చెప్పుకునే పురాణ గాథ… ఆకాశరాజు కుమార్తె పద్మావతిని పెండ్లాడేందుకు కుబేరుని వద్ద అప్పు చేసి, దానిని తీర్చడంలో మాట తప్పానని మనస్తాపం చెందాడు మహావిష్ణువు ఆ సమయంలో ఇక్కడికి వచ్చారంటారు.. స్వామి కృష్ణానదీ తీరం వెంట వెళ్తూ జూరాల వద్ద గల గుండాల జలపాతం వద్ద స్నానం చేశాడు. అక్కడ్నించి ఉత్తర దిశగా వెళ్తున్న సమయంలో అక్కడి కురుమూర్తి గిరులపై విశ్రమించాడు. ఇలా పద్మావతి సమేతంగా తిరుమల వీడి కృష్ణాతీరం చేరిన శ్రీ వేంకటేశ్వరుడు ఇక్కడ సేద తీరిన అనంతరం పాదాలు కంది పోకుండా కృష్ణమ్మ పాదుకలు బహుకరించిందని, ఈ పాదుకలనే ఉద్దాల ఉత్సవంలో ఊరేగిస్తారని చరిత్రాత్మక కథనం ప్రచారంలో ఉంది. అక్కడ్నించి తిరిగి వెళ్ళేటప్పుడు తమ ప్రతిరూపాలను మాత్రం ఇక్కడే వదిలి వెళ్ళారని స్థల పురాణం వివరిస్తోంది. అదే ‘కురుమార్తి స్వామి’ క్షేత్రమైంది. ఈ ఆలయం మొదట్లో సహజ సిద్ధమైన గుహలలో పెద్ద రాతిగుండు కింద ఉండేది. భక్తులు గుహ లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొనేవారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య ఎక్కువ కావడంతో గర్భగుడికి గోపురం నిర్మించి ఆలయాన్ని అభివృధ్ధి చేశారు.
శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, మల్దకల్ :
ఈ ఆలయం గురించి బ్రహ్మాడ పురాణం, మరియు స్కాంద పురాణాలలో చెప్పబడింది అంటారు. ఇంతకు ముందు దీనిని మొదలి కల్లనీ, ఆది శిలా క్షేత్రమని కూడా అనేవారు.
శివుడు వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం ఇక్కడ తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమయ్యాడుట.
ఈ ఆలయాన్ని గద్వాల మహారాజు శ్రీ చిత్రభూషణ్ కట్టించారుట. డిసెంబరులో జరిగే తిమ్మప్ప జాతరకి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు.
సీతారామచంద్రస్వామి శ్రీ దేవాలయం, శిర్సనగండ్ల :
అపర భద్రాద్రిగా పేరుగాంచిన క్రీ.శ.14 వ శతాబ్ది కాలం నాటి శిర్సనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయం వంగూరు మండలంలో ఉంది. ఇక్కడ ప్రతి ఏటా చైత్రశుద్ధి పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కూడా ప్రతియేటా దిగ్విజయంగా నిర్వహిస్తారు.
జహంగీర్ పీర్ దర్గా:
కొత్తూర్ మండలం, ఇన్ముల్‌నర్వ గ్రామ సమీపంలో ఉన్న ఈ దర్గా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందింది. కులమతాలకతీతంగా భక్తులు ఇక్కడకు విచ్చేసి తమ ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు.
ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు:
ధరూర్ మండలం రేవులపల్లి వద్ద కర్ణాటక సరిహద్దు నుంచి 18 కిలోమీటర్ల దిగువన కృష్ణానదిపై ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు ఉంది. కృష్ణానది తెలంగాణలో ప్రవేశించిన తర్వాత ఇదే మొదటి ప్రాజెక్టు. నీటిపారుదల ప్రాజెక్టుగా ఉన్న ఈ ప్రాజెక్టు ఇటీవలే విద్యుత్ ఉత్పాదన కూడా ప్రారంభించింది.
కోయిల్‌సాగర్ ప్రాజెక్టు:
50 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న కోయిల్‌సాగర్ ప్రాజెక్టు దేవరకద్ర మండల పరిధిలో ఊకచెట్టు వాగుపై నిర్మించారు. నిర్మాణం సమయంలో ఈ ప్రాజెక్టు సాగునీటి లక్ష్యం 12 వేల ఎకరాలు కాగా ప్రస్తుతం 50 వేల ఎకరాలకు పెంచి ప్రాజెక్టును అభివృద్ధి పరుస్తున్నారు. వర్షాకాలంలో ప్రాజెక్టు సందర్శన కొరకు అనేక పర్యాటకులు వస్తుంటారు.
గద్వాల కోట:
సంస్థాన రాజుల కాలంనాటి గద్వాల కోట పట్టణం నడిబొడ్డున ఉంది. ఈ పురాతన కోటలో చెన్నకేశవస్వామి ఆలయం ఉంది. కోట లోపలే ప్రస్తుతం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలు నడుస్తున్నాయి. కోటలోని స్థలాన్ని కళాశాలకు ఇచ్చినందున కళాశాల పేరు కూడా మహారాణి ఆదిలక్ష్మీ డిగ్రీ కళాశాలగా చెలామణిలో ఉంది.
చంద్రగఢ్ కోట:
ప్రియదర్శినీ జూరాల ప్రాజెక్టు సమీపంలో ఎత్తయిన కొండపై 18 వ శతాబ్దంలో మొదటి బాజీరావు కాలం నాటి కోట పర్యాటకులకు కనువిందు చేస్తుంది. ఇది ఆత్మకూరు పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో నర్వ మండల పరిధిలో నిర్మించారు. జూరాల పాజెక్టు సందర్శించే పర్యాటకులకు ఇది విడిదిగా ఉపయోగపడుతుంది. 18వ శతాబ్దం తొలి అర్థ భాగంలో మరాఠా పీష్వా మొదటి బాజీరావు కాలంలో ఆత్మకూరు సంస్థానంలో పన్నుల వసూలు కొరకు నియమించబడిన చంద్రసేనుడు ఈ కోటను నిర్మించాడు.
రాజోలి కోట, దేవాలయాలు:
పురాతనమైన రాజోలి కోట, కోటలోపలి దేవాలయాలు సందర్శించడానికి యోగ్యమైనవి. కోట ప్రక్కనే తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల డ్యాం కనిపిస్తుంది.
దీనితో నేను చూసిన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా యాత్రా విశేషాలు సమాప్తం.