అలనాటి అపురూపాలు-10

0
3

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బాలీవుడ్‌ని ఏలిన తార మాలా సిన్హా

1950 – 70ల మధ్య బాలీవుడ్ వెండి తెరని ఏలిన సూపర్ స్టార్స్‌లో మాలా సిన్హా ఒకరు. వందకు పైగా సినిమాలు, అందులో ఎన్నో హిట్లు! అప్పట్లో అందానికి, ప్రతిభకి నిదర్శనంగా ఉండేవారు మాలా సిన్హా.  సినీ ప్రపంచపు ప్రముఖులందరితోనూ నటించిన మాలా సిన్హా, వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని నేర్పుగా విభజించుకున్నారు; తోటి నటులతో సంబంధపు పుకార్లు, వివాదాలు లేకుండా జీవితం గడిపారు. వాస్తవానికి, ఒక నేపాలీ-క్రిస్టియన్ కుటుంబానికి చెందిన మాలా సిన్హా ఆనాటి కలకత్తా నుంచి వచ్చారు. అందుకని తరచూ ఆమెని బెంగాలీగా పొరబడతారు. ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఆల్డా సిన్హా అని పేరు పెట్టారు, అయితే బాల నటిగా సినీ పరిశ్రమలోకి ప్రవేశించి జై వైష్ణోదేవి, రోషనార, ధూళి వంటి బెంగాలీ సినిమాలలో నటించినప్పుడు ఆమె పేరుని ‘బేబీ నజ్మా’గా మార్చారు. ఆమె గొప్ప గాయని, నర్తకి కూడా. ఆకాశవాణి ధ్రువపత్రం పొందిన గాయనీమణుల్లో ఆమె ఒకరు. తన తల్లిదండ్రులు తనకి పెట్టిన పేరుని (ఆల్డా) మాలా సిన్హా అసహ్యించుకునేవారట, ఎందుకంటే స్కూల్లో ఆమెను పిల్లలంతా డాల్డా సిన్హా అని వెక్కిరించేవారట.

మాలా సిన్హా నిజానికి నటి అవ్వాలనుకోలేదు, గాయని అవ్వాలనుకున్నారు. చిన్నప్పటి నుంచి లతా మంగేష్కర్ పాటలను అత్యంత నైపుణ్యంతో అనుకరించేవారు. బాల్యంలో వాళ్ళు కలకత్తా లోని భవానీపూర్‌లో ఉండేవారు, అక్కడ అందరూ ఆమెని ‘బేబీ లతా’ అని పిలిచేవారు. దుర్గాపూజలప్పుడు లేదా పుట్టిన రోజు వేడుకల్లో ఆమె చేత పాటలు పాడించేవారు. ఆమె సంగీతంలో శిక్షణ పొందలేదు, కానీ దైవదత్తమైన ప్రతిభ ఉన్న గాయని. తనకి ఏదో ఒకనాడు లతా మంగేష్కర్ పాడతారని ఆమె ఎలా ఊహించగలరు? ఫిల్మ్‌ఫేర్‌లో యువ మాలా సిన్హా ఫోటో చూసిన సుప్రసిద్ధ దర్శకులు అమియ చక్రవర్తి, ఆమెను బొంబాయికి పిలిపించి మూడు సినిమాల కోసం ఒప్పందం చేసుకున్నారు. అయితే కాంట్రాక్టులోని తొలి సినిమా ‘బాద్‌షా’ (1954) ఫ్లాప్ కావడంతో, ఒప్పందం రద్దు చేసుకున్నారు. ఆమె తరువాతి రెండు సినిమాలు – కిషోర్ సాహు గారి హామ్లెట్ (1954), ఏకాదశి (1955) కూడా విఫలమయ్యాయి. ఆమె, ఆమె కుటుంబ సభ్యులు మరికొన్ని అవకాశాల కోసం వేచి చూశారు. అవకాశాలు లభించక, తిరిగి కలకత్తా వెళ్ళిపోదామనుకుని సామాన్లన్నీ సర్దుకున్నారు. అప్పుడే, అదృష్టవశాత్తు నటుడు జానకీదాస్ వాళ్ళని కలిసారు. అప్పట్లో దర్శకులు లేఖ్‌రాజ్ భక్రి ‘నయా జమానా’ అనే సినిమా తీస్తున్నారు. మాలా సిన్హా నటించిన హామ్లెట్ చూడమని జానకీదాస్ ఆయనని ఒత్తిడి చేశారు, ఆ సినిమా ఫ్లాప్ అయినా మాలా సిన్హాకి మంచిపేరే వచ్చింది. “నేనా సినిమాలో ఓఫెలియా పాత్ర పోషించాను. అప్పట్లో నేను బక్కపలచని టీనేజర్‌ని. కిషోర్ సాహు గారి శ్రీమతి నాకు పాడెడ్ కాస్ట్యూమ్స్, విగ్స్ పెట్టారు” అని చెప్పి నవ్వేరట మాలాసిన్హా. ఆ నిర్మాతలు ‘హామ్లెట్’ చూసి, ‘నయా జమానా’ కోసం మాలా సిన్హాతో ఒప్పందం చేసుకున్నారు. ఆ రోజుల్లో నిర్మాత ఎస్. ముఖర్జీ ఒక భారీ దుర్గా పూజ నిర్వహించారు. ఆ ఉత్సవంలో పాడేందుకు మాలా సిన్హాకు కలకత్తా లోనే పరిచయం ఉన్న గాయని గీతాదత్ తన భర్త, నటుడు గురుదత్‌తో సహా వచ్చారు. ఆమె మాలా సిన్హాను ఒక నాటకంలో నటించమని కోరారు. ఆ నాటకంలో మాలా సిన్హా నటన నచ్చిన గురుదత్ ‘ప్యాసా’ (1957) సినిమాలో ఆమెను తీసుకున్నారు. విలాసాల కోసం ప్రేమను వదులుకునేంత లాలస వ్యక్తం చేస్తూ ఆమె ప్రదర్శించిన నటన ఆమెకు ఎంతో పేరు తెచ్చింది. ఈ సినిమాతో ఆమెకి చిత్రరంగంలో గొప్ప పేరు వచ్చింది, ఎన్నో అవకాశాలు వచ్చాయి, మిగిలినదంతా చరిత్రే!

మరో వైపు, బాల్‌రాజ్ సహానీ దర్శకత్వంలో లాల్ బత్తి (1957), సొహరాబ్ మోడీ గారి ‘నౌషెర్వాన్-ఎ-ఆదిల్ ‘ (1957), దాస్తొయెవ్‌స్కీ నవల ‘క్రైమ్ అండ్ పనిష్‌మెంట్’కి అనుసృజన అయిన రమేష్ సైగల్ గారి ‘ఫిర్ సుబాహ్ హోగీ’ (1958) వంటి సినిమాలు మాలా సిన్హాని మంచి నటిగా నిలదొక్కుకునేలా చేశాయి. అయితే యాష్ చోప్రా తొలి సినిమా ‘ధూల్ కా ఫూల్’ (1959) ఆమెనో స్టార్‌గా చేసింది. పెళ్ళి కాకుండా తల్లి అయిన మహిళ కథ అది. 36 నగరాలలో ఆ సినిమా సిల్వర్ జుబ్లీ జరుపుకుంది. 1958 – 1962 మధ్య మాలా ‘దునియా నా మానే’, ‘హారియాలీ అవుర్ రాస్తా’, ‘దిల్ తేరా దీవానా’, ‘అన్‌పఢ్’ వంటి హిట్ చిత్రాలను అందించారు. అయితే 1964లో వచ్చిన ‘జహాన్ ఆరా’ ఆమెకి బాగా నచ్చిన చిత్రం. నటుడు – నిర్మాత ఓం ప్రకాశ్ మొదట ఈ పాత్ర కోసం మీనాకుమారిని సంప్రదించారట. అయితే ఆమె డేట్లు ఖాళీ లేవని కమల్ అమ్రోహీ గారు చెప్పారట. మాలా రూపురేఖలు ముస్లిం యువతిలా ఉంటాయని మీనాకుమారి ఓం ప్రకాశ్‌ గారికి చెప్పారట. రాచరిక పాత్ర పోషించినందుకు ఆమె ఫిల్మ్‌పేర్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ఆమె హృదయానికి బాగా చేరువైన మరో సినిమా బి.ఆర్. చోప్రా గారి దాంపత్యద్రోహం ఆధారంగా సాగిన ‘గుమ్రాహ్’ (1963). ‘గుమ్రాహ్’ లో ఆమె భర్తగా నటించేటప్పటికి అశోక్ కుమార్‌కు ఆమె తండ్రి వయసు ఉంటుంది. ఆమె ప్రియుడిగా సునీల్ దత్ నటించారు. ఆ సినిమా చూసిన తర్వాత మాలా బాగా చేశారని అశోక్ కుమార్ ప్రశంసించారు. ఒకదాని తర్వాత ఒకటిగా హిట్ సినిమాలని అందించారు మాలా. ‘మైతిఘర్’ (1966) అనే నేపాలీ సినిమాలో నటించేందుకు ఖాట్మాండు వెళ్ళాల్సి వచ్చింది. మంచు కప్పిన పర్వతాల వెనుక అత్యంత విలువైనది తానేదో వదిలేసి వస్తానని ఆమెకి ఏ మాత్రం తెలియదు. అది ఆమె హృదయం! అవును, అక్కడ ఆమె తన కాబోయే భర్త, చిదంబర్ ప్రసాద్ లొహానిని కలిసారు. ఆ సినిమాలో చిదంబర్ ఆమెకు సహనటుడు (ఆయన కస్టమ్స్‌లో పని చేసేవారు, కానీ అందంగా ఉన్నారని ఈ సినిమాలో ఒక పాత్రలో నటించేందుకు అవకాశమిచ్చారు). సినిమా షూటింగ్ పూర్తయి, కొన్ని రోజులకి మాలా బొంబాయి వచ్చేసారు. కాని సి.పి. లొహాని హృదయంలో మాత్రం నిలిచిపోయారు. కొన్ని నెలల తర్వాత లొహాని గారికి మాలా సిన్హా నుంచి ఓ ఉత్తరం అందిందట. ఆ ఉత్తరంలో నటి హృదయభావనలను బహిర్గతం చేసి, తన ప్రేమను వెల్లడించించారట. చిదంబర్ పేరు అప్పటికే నేపాల్ అంతటా మారుమ్రోగిపోతోంది. మాలా పట్ల ఆయనకీ అంతే ప్రేమ ఉందట.  తరువాత నుంచి వాళ్ళిద్దరూ తరచుగా కలుస్తూ, తమ బంధాన్ని శాశ్వతం చేసుకోవాలనుకున్నారు. ఆమెకు 26 ఏళ్ళు రాగనే పెళ్ళి చేయాలని ఆమె తండ్రి భావించారు, సినీ పరిశ్రమలోని మగవారిని నమ్మలేమని ఆయన అనుకునేవారట. కొన్ని ‘అహం’ ఇబ్బందులు కూడా వచ్చాయట. తన ప్రియమైన కుమార్తెకి ఒక పహాడీ అంటే నేపాలీ వరుడు రావడం ఆయనకి ఆమోదమైంది. పైగా చిదంబర్ ఆయనకి నచ్చేసారు. 1966లో మాలా, చిదంబర్‌లు వివాహం చేసుకున్నారు.  చిదంబర్ ఖాట్మాండ్‌లో వ్యాపారం చూసుకోగా, మాలా కుమార్తె ప్రతిభతో బొంబాయిలో ఉండేవారు. నటన పట్ల ఆమె ఇష్టాన్ని భర్త కాదనలేదు, ఆమెని వంటింటికి పరిమితం చేయలేదు. పైగా ఆమెకు పార్టీలు ఎలాగూ నచ్చవు. అందుకని ఆమెని నటనలో కొనసాగమని చెప్పారు చిదంబర్. ఒకరికొకరు దూరంగా ఉన్నా వారి బంధం మరింత బలపడింది. 1970 చివర్లలో, 80లలో మాలా కారెక్టర్ రోల్స్‌కి మారిపోయారు. 36 ఘంటే, జిందగీ, కర్మయోగి వంటివి. ఆమె ఆఖరి సినిమా ‘జిద్’ (1994).

1987లో తన తండ్రి చనిపోయినప్పుడే సినిమాలు ఆపేయాలని అనుకున్నారట. ఎందుకంటే ఆమె తండ్రి చాటు కూతురు. నటించిన ప్రతీ షాట్ తర్వాత, తండ్రి ఆమోదం కోసం ఆయన ముఖంలోకి చూసేవారట. అవుట్‌డోర్‍లలో షూటింగ్స్ అవుతుంటే ఆయన కూతురు గదిలోనే పడుకునేవారట. ఆమె వాష్‌రూమ్ ఉపయోగించుకునేడప్పుడు, బయట వేచి ఉండేవారట. ఆయన చనిపోయిన తర్వాత ఆమెకి అంతా శూన్యంలా అనిపించేది. అయితే ఆధ్యాత్మిక భావనలు బలంగా ఉండడంతో తట్టుకోగలిగారు.

చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆమెకు కలలో క్రీస్తు కనబడ్డారట. చుట్టూ పిల్లలు ఉండగా, ఒక రాయిపైన క్రీస్తు కూర్చుని ఉన్నారట. తన చేయిని ఆమె తలపై ఉంచారట. ‘బాద్‌షా’ సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఇటువంటిదే మరో కల వచ్చిందట. అప్పట్లో ఇంటద్దె చెల్లించడానికి కూడా డబ్బు లేదట. ఒకనాడో కలలో మిద్దె మీదకి ఒక అందాల యువతి వచ్చిందట! ఆమె బైబిల్ చదువుతోందట! ఆమె మేరీ మాత అని మాలా గుర్తించారట. ఏం కావాలని అడిగితే, ఆమె  జీసస్ పట్ల నిరంతరం ప్రేమ ఉండేలా చూడమని మాతని కోరారుట. అప్పట్నించి మాలా జీవితమే మారిపోయిందని అంటారు. మాలా సిన్హా తరచూ చర్చ్‌కి వెళ్ళేవారు కాదు. దైవంతో సంభాషణమే ఆమె ప్రార్థన. ఎందుకంటే కేవలం గ్రంథాలు చదవడం వల్ల ఉపయోగం ఉండదనేది ఆమె భావన. ఆమె దేనికీ క్రుంగిపోలేదు, ఎవరి పట్లా పగా పెంచుకోలేదు.

ఆమె తన గత కీర్తిని కూడా పట్టించుకోరు. ప్రతీ పరిస్థితి లోనూ ఆమె సంతోషంగా ఉన్నారు. తానొక ధూళి కణాన్నని, జీసస్ తనని ఇంతలా దీవించారని ఆమె నమ్మకం. 2013లో తనకి దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు ప్రకటించినప్పుడు దానిని ఆమె నిరాకరించినప్పుడు ప్రపంచమంతా విస్తుపోయింది.ఆశా , యాష్ చోప్రాలతో పాటూ మాలాసిన్హా కూ దాదా ఫాల్కే అవార్డ్ ఇస్తున్నట్టు ప్రకటించారు. కానీ, అవార్డ్ ఆహ్వాన పత్రంలో మాలా సిన్హా పేరు ప్రచురించలేదు. ఆహ్వాన పత్రికపై ఆషా భోస్లే పేరు, యాష్ చోప్రా భార్య ప్రేమ్ చోప్రా పేరు ఉండి తన పేరు లేకపోయేసరికి ఆమె అవమానంగా భావించారు. అదీ మాలా సిన్హా జీవితం! వృత్తి జీవితాన్నీ, వ్యక్తిగత జీవితాన్నీ వేరువేరుగా ఉంచగలిగిన ధీశాలి. విమర్శలు ఆమెని ఎన్నడూ క్రుంగదీయలేదు. బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోకుండా తన వృత్తి పట్ల నిబద్ధతో ఉన్నారు.

   


1963లో తెలుగు తారల జైత్రయాత్ర

1 మార్చి 1963 నాడు మద్రాసులోని విజయా గార్డెన్స్‌లో దర్శకనిర్మాత పి. పుల్లయ్యగారి నేతృత్వంలో – దేశ రక్షణ నిధికి నిధులు సేకరించేందుకు గాను ఆనాటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నీలం సంజీవరెడ్డి కోరిక మేరకు ఐదు గంటలు (రాత్రి 7 గంటల నుండి 12 గంటల వరకు) జరిగే సాంస్కృతిక కార్యక్రమం రిహార్సల్స్ కోసం – ఎన్.టి.రామారావు, నాగేశ్వరరావు, జగ్గయ్య, కాంతారావు, సావిత్రి, కృష్ణకుమారి, జమున, రాజసులోచన, జయంతి, ఎస్.వి.రంగారావు, గుమ్మడి, మిక్కిలినేని, పేకేటి శివరాం, రాజనాల, లింగమూర్తి, సత్యనారాయణ, శేషగిరిరావు, కన్నాంబ, లక్ష్మీరాజ్యం, రేలంగి, గిరిజ, రమణారెడ్డి, సూర్యకాంతం, పద్మనాభం, ఘంటసాల, ఈలపాట రఘురామయ్య తదితరులు సమావేశమయ్యారు. ఈ సాంస్కృతిక కార్యక్రమం విజయవాడ (16 మే), హైదరాబాద్ (17 మే), కర్నూలు (18 మే) లలో జరిగింది. చక్రపాణి గారు తగిన సౌకర్యాలు కల్పించారు. (వాళ్ళంతా బిజీ ఆర్టిస్టులైనప్పటికీ) నటీనటులంత మే నెల మధ్య వరకు రిహార్సల్స్ జరిపారు. చివరికి ‘తెలుగు తారల జైత్రయాత్ర’ అనే ఆ కార్యక్రమానికి సన్నద్ధమయ్యారు.

15 మే సాయంత్రం మద్రాసులో బయల్దేరి 19 మే సాయంత్రానికి రైళ్ళు, బస్సులు, కార్లలో ప్రయాణించి తిరిగి మద్రాసు చేరారు. దేశభక్తిలో లీనమై తమ తమ తీరికలేని కార్యక్రమాలనే మరిచిపోయారు. అటువంటి పిలుపులకు తెలుగు నటీనటులు ఆ విధంగా స్పందించేవారు (చీలికలు పీలికలుగా ఉన్న నేటి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరి మాటా ఎవరూ వినరు). ఈ ప్రోగ్రామ్‌ని కవర్ చేసేందుకు ‘ది హిందూ’ దినపత్రిక తమ ఫోటోగ్రాఫర్ టి.ఎం. రామచంద్రన్‌ని పంపింది. స్టేజ్ లైటింగ్, సౌండ్ వంటి అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంది. సినీ నటుల బస, ఆహారం, ప్రజా ప్రదర్శనల విషయాలు అధికారులు చూసుకున్నారు.

ఈ మూడు కేంద్రాలలో అసలు కార్యక్రమం ఎలా జరిగిందంటే… ప్రతీ కార్యక్రమం ఘంటసాల గారి ప్రార్థనా గీతంతో ప్రారంభమయ్యేది. తర్వాత కన్వీనర్ పి. పుల్లయ్య గారు ప్రసంగించేవారు. ఈ కార్యక్రమం ఉద్దేశం గురించి సవివరంగా వ్రాసిన పాంప్లెట్లు వేలాదిగా ముద్రించి పంచిపెట్టారు. ఆ సందేశాన్ని ఎన్.టి.రామారావు తన గంభీరమైన కంఠంతో, సహజ శైలిలో భావోద్వేగంతో చదివి వినిపించేవారు. తరువాత, ఘంటసాల, ఆయన ఆర్కెస్ట్రా వారి 20 నిమిషాల కార్యక్రమం ఉంటుంది. తర్వాత పింగళి గారు రచించిన ‘దేశం కోసం’ అనే నాటకం ఉండేది. అక్కినేని, కృష్ణకుమారి, జయంతి, సూర్యకాంతం, రమణారెడ్డి, లింగమూర్తి, మిక్కిలినేని ఈ నాటకంలో నటించారు. తరువాత రాజసులోచన గారి నృత్య నాటకం ‘బాల గోపాల’ ప్రదర్శితమయ్యేది. ఆ తర్వాత ఈలపాట రఘురామయ్య గారి పాటలు, చేతి వేళ్ళతో వేణుగాన ప్రదర్శన జరిగేవి. తదుపరి రేలంగి, గిరిజ, పేకేటిల హాస్య నాటకం ‘దొంగాటకం’ ప్రదర్శించేవారు. అనంతరం, అలెగ్జాండర్ కథ ఆధారంగా తీసుకున్న ఒక చిన్న స్కిట్ ‘దేశభక్తి’ ప్రదర్శితమయ్యేది. ఇందులో కాంతారావు, రాజనాల, సత్యనారాయణ, శేషగిరిరావు ఎంతో ఉద్వేగంతో నటించారు. తర్వాత జగ్గయ రచించిన ‘రక్తార్పణ’ అనే నాటకం జరిగేది. ఇందులో జగ్గయ్య, జమున, పద్మనాభం, గుమ్మడి, లక్ష్మీకాంతం నటించారు. ఆ తర్వాత రమణారెడ్డి ఇంద్రజాల ప్రదర్శన ఉండేది. అప్పటికి అర్ధరాత్రి అయిపోయేది. కళాకారులందరూ వేదిక మీదకి వచ్చి జాతీయ గీతం ఆలపించేవారు.

ఇలా మొత్తం మీద వారు ఆ రోజుల్లోనే పది లక్షల రూపాయలు సేకరించి రక్షణ నిధికి అందించారు. జయహో! తెలుగు సినీకళాకారులకు!

           

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here