[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]ఈ[/dropcap] ఆటాలో నేను మాధవ్‍ని కలవడం చాలా అదృష్టంగా భావిస్తాను. చిన్నవాడైనా అతను చాలా ఆదర్శవంతుడు. ఆదర్శాలు చెప్పడం కాదు, ఆచరించడం గొప్ప. తన తండ్రి కాన్సర్‌తో ఎంత బాధపడ్డారో చూడడం వల్ల కాన్సర్ రోగులకి బోన్ మేరో డొనేట్ చేస్తాడు. దానికి స్వయంగా డాక్టర్ అయిన అతని భార్య అపర్ణ, షాట్స్ ఇవ్వడంలో, కేర్ తీసుకోవడంలో ఎంతో సహకరిస్తుంది. వారి పేర్లు రహస్యంగా వుంచుతారు కానీ, అతని వల్ల కొన్ని ప్రాణాలు కాపాడబడ్డాయి.
మృత్యువుని ఆపలేము. కానీ దగ్గర నుండి దానిని చూడడం చాలా బాధాకరం! చాలా చిన్న వయసులోనే అంటే… 23, 24 ఏళ్ళ వయసులో నేను మృత్యువు ఎలా ఓ జీవిని తీసుకెళ్తుందో దగ్గర నుండి చూసాను.
మేం మా పెద్దబ్బాయి పుట్టినప్పుడు, ఆనంద్‌బాగ్‌లో ఒక ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. ఆ ఇంటి పక్కన మరాఠీ వాళ్ళు వుండేవాళ్ళు. నాకు చాలా స్నేహం వాళ్ళతో. ఆ ఇంటి ముసలావిడ పోయే ముందు, ఆమె తల దగ్గర నేనే కూర్చుని వున్నాను. అందరు నిద్రపోయారు. ఆ ఎనభై ఏళ్ళ వృద్ధురాలు తల ఎత్తి నన్ను చూసి దణ్ణం పెట్టింది. ఎగశ్వాసా, దిగశ్వాసాతో ఒక గంట యాతన పడి, అప్పటికే నేల మీద చాప మీద పడుకోబెట్టి రెండు రోజులయింది. నేను చూస్తూ వుండగానే, అందరూ నిద్రించే ఆ నిశిరాత్రి వేళ, నిశ్శబ్దంగా మృత్యువు చేయి పట్టుకుని వెళ్ళిపోయింది. నిద్రపోయే వాళ్ళని లేపలేక నేను తెల్లవారు ఝామున వారి కోడల్ని లేపి చెప్పాను ఈ వార్త – “మీ అత్తగారు ఒంటిగంటా, పది నిమిషాలకి పోయారు” అని. అప్పుడు గొల్లుమన్నారు.
ఆ తరువాత మేం నరసింహారెడ్దీనగర్‌లో వున్నప్పుడు, శాస్త్రి గారనే ఆయన ఇంట్లో వుండేవాళ్ళం. వాళ్ళావిడ సావిత్రి గారి, అక్కగారి అబ్బాయి, భార్యా పిల్లాడితో వేరే వూరి నుండి ట్రాన్స్‌ఫర్ అయి వచ్చారు. ఆ అమ్మాయికి గుండె జబ్బు పాపం!
శాస్త్రి గారింట్లో పిల్లలు తప్ప, ఆయనా ఆవిడా లేరు. నేను మా పెద్దవాడిని మెర్సీ మోడల్ స్కూల్‌కి పంపించి, ఒకటవ తరగతి చదివేవాడు, రెండవ వాడిని ఎత్తుకుని, ఈ కొత్తగా వచ్చిన శాస్త్రి గారి చుట్టాల ఇంటి మీదుగా వెళ్తుంటే, ఎనిమిదేళ్ళ వాళ్ళ అబ్బాయి పెద్దగా ఏడుస్తున్నాడు. ఆ అబ్బాయి తండ్రి హడావిడిగా బయటకు వచ్చి “పద్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. నేను వెళ్ళి డాక్టర్ చెరియన్‌ని తీసుకొస్తాను… మీరు కాసేపు వుంటారా?” అన్నాడు. నేను ‘సరే’ అని చిన్నవాడిని ఎత్తుకునే, వాళ్ళ బాబుని దగ్గరకి తీసుకుని లోపలికి వెళ్తే, ఆమె నెప్పితో బాధపడ్తూ, భారంగా వూపిరి పీలుస్తోంది. పిల్లవాడినీ, మా వాడినీ ఇద్దరినీ దగ్గరకి తీసుకుని, ఆమె బాధ చూస్తూ, ఏం చెయ్యలేని నిస్సహాయతతో చూస్తున్నాను… మహా అయితే ఇరవై ఎనిమిదేళ్ళు వుండచ్చు, చిన్న పిల్లవాడి తల్లి… ఆమె కనుగుడ్లు తిప్పి, పిల్లవాడి వైపు చూసింది. గబగబా వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరకి తీసుకెళ్ళి, “పద్మా… పద్మా… డాక్టరు గారు వస్తున్నారమ్మా” అన్నాను. ఆమె ఏం వినిపించుకోలేదు. బాబు వైపు చూస్తోంది. వాడు “అమ్మా” అంటూ ఏడుపు. ఏ తల్లీ పిల్లల్ని ఆ వయసులో వదిలి వెళ్ళిపోకూడదు! తల్లి లేని పసిపిల్లల పరిస్థితి దుర్భరం! ఇంతలో వాళ్ళ ఆయన డాక్టర్ చెరియన్‌ని తీసుకొచ్చాడు. డాక్టర్ గారొచ్చి, పల్స్ చూసి, పెదవి విరిచి, ఛాతీ మీద రుద్ది, మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తుంటే, నేను వాళ్ళ అబ్బాయినీ, మా బాబునీ తీసుకుని, ఇవతల వరండా లోకొచ్చి నిలబడ్డాను. డాక్టర్ బయట కొచ్చి “షీ ఈజ్ నో మోర్” అని వెళ్ళిపోయారు. డాక్టర్ మా తోటికోడలి ఫ్రెండ్. నాకూ బాగా తెలుసు. మా అబ్బాయిని అక్కడే చూపించేదాన్ని.
ఆ వయసులో నాకు భయం వుండేది కాదు. అసలు అంత చిన్న వయసులో చావు అంటే పెద్దగా తెలిసేది కాదు! నాకు వూహ వస్తున్న వయసులో, మా పెదనాన్న మరణం, మా ఇంట్లోనే జరగడం వల్ల, చూసాను. బొంబాయి జె. జె. హాస్పిటల్స్‌లో కాన్సర్‍కి చాలా రోజులు చికిత్స జరిగాకా, హైదరాబాద్, అజామాబాద్, ఆర్.టి.సి. కాలనీలో వున్న మా ఇంటికే డైరక్ట్‌గా తీసుకొచ్చారు. ఆయన మా పెద్దమ్మ భర్త అయినా, అమ్మమ్మకి తమ్ముడి వరస కూడా! ఆయన మాట్లాడిన ఆఖరి మాటలు “పాపాయి ఇంటికి వచ్చేసా కదా!” అని. అప్పట్లో శుభ అశుభాలన్నీ మా అమ్మకి ఆర్.టి.సి. వాళ్ళు ఇచ్చిన క్వార్టర్స్‌లోనే జరిగేవి. ఏదీ అశుభం కాదు. అన్నీ రిట్యువల్స్. అమ్మకి ఏమీ పట్టింపు వుండేది కాదు. మా చిన్నతాతగారు పోతే, స్వంత పిన్ని భర్త, వాళ్ళ ఇల్లు పాడు పెట్టాలి, మంచి నక్షత్రం కాదు అంటే, మొత్తం ఆరుగురు సభ్యుల కుటుంబాన్ని మా ఇంట్లో మూడు నెలలు వుంచుకుంది!
పెదనాన్నని, నేను పదేళ్ళ పిల్లని, కిటికీలోంచి చూస్తూ వుండగా, డాక్టర్ సూర్యప్రకాశరావు అనే డాక్టర్ చాలా శ్రమపడినా, లాభం లేకపోయింది. ‘పోయారు’ అన్నారు. ఎముకల పోగులా వున్న పెదనాన్నని చూసి, ఆ పడిన వేదన అంతా ఆ కళ్ళల్లో చూసి, అంత చిన్న వయసులోనే పోవడమే బెటర్ అనుకున్నాను… అంతకన్నా మృత్యువు అంటే పెద్దగా తెలీదు!
ఆ తరువాత మా ఆడబిడ్ద, ఇంటికి పెద్దావిడ వెళ్ళిపోయేముందు సైంటిస్ట్ అయిన మా తోటికోడలూ, పసిపిల్లాడి తల్లినైన నేనూ కూడా వంతులు వేసుకుని, రాత్రుళ్ళు తోడు వుండేవాళ్ళం… మాట దక్కలేదు. ఓ రోజు నేను ఇంటికొచ్చి పిల్లాడికి అన్నం పెట్టి తీసుకెళ్ళేసరికి “పోయింది” అన్నారు.
“మీరు స్వంత ఇల్లు కట్టుకోవాలే” అని ఆవిడ అంతకు ముందు రోజు నాతో అంది. అదే ఆఖరి మాట అనుకుంటా నాతో!
ఇవన్నీ గుర్తు చేసుకుంటే, అనుభవాలు ఎప్పుడూ మంచివే అనిపిస్తుంది. గుండె ధైర్యం ఇస్తాయి. కొంతమంది “ఆసుపత్రికి వచ్చి మేం చూడలేం అమ్మా… మాకిలాంటివి అలవాటు లేదు! ఆసుపత్రి వాసన పడదు… ఎన్నడూ మాకు అనుభవం లేదు” అనడం విన్నాను… ఎవరికీ అనుభవంలోకి వచ్చేదాకా ఏదీ అలవాటు వుండదు. నా దగ్గర పని చేసే అసిస్టెంట్ డైరక్టర్స్ బంధువులతో సహా, అస్సలు తెలీని వాళ్ళు సాయం అడిగినా నేనెళ్ళి ఆసుపత్రిలో తోడుగా వుంటాను. ఏదీ అలవాటు వుండదు… చేస్తే అవుతుంది. జీవితం మూడు రోజుల ముచ్చట… ఈ ప్రయాణంలో నీటిలో నావలా ఎప్పుడు ఆటుపోటులొస్తాయో తెలీదు… మునగకుండా వెళ్ళాలనే ప్రయత్నిద్దాం. వీలైతే నలుగురికీ సాయపడదాం. మాధవ్ అలా సాయపడ్తాడు. మా అబ్బాయి క్లాస్‌మేట్‌కి… టెరిటోమా అని, బ్రెయిన్‌లో పిల్లలా ఫార్మ్ అయింది. పన్ను, జుట్టూ కూడా వచ్చాయట ఒక సెల్‌లో, అదీ బ్రెయిన్‌లో. నేను ఇక్కడ హైదరాబాద్‍లో న్యూరోసర్జన్స్‌కి చూపించాను. వీళ్ళు చెప్పలేకపోయారు. తీరా అమెరికాలో కేలిఫోర్నియాలో ఒక డాక్టర్, ఆమె కడుపుతో వున్నప్పుడు, వాళ్ళ అమ్మకి పుట్టాల్సిన కవలల అండం ఒకటి, ఇంకొక పిల్లలోకి వెళ్ళి, ఇన్ని సంవత్సరాలకి, పెరుగుతోందని తెలిసి, సమర్థవంతంగా ఆపరేషన్ చేసి తీసాడు. అప్పుడు నా స్నేహితులు చాలామందితో బాటు, అడగగానే ఆర్థిక సాయం అందించిన వ్యక్తి మాధవ్ దుర్భా. ఆర్థిక సాయం అందించడమే కాదు, ఆ పిల్ల చెల్లెలితో ఫోన్‌లో మాట్లాడి, యూనివర్సిటీ నుండి ఆమెకి ఎలా సాయం అందవచ్చో కూడా సలహాలిచ్చాడు. ఆ అమ్మాయి పెళ్ళికి, గత ఏడాది నేను, మా వారూ కాలిఫోర్నియాలో వుండగానే మా అబ్బాయి కృష్ణకాంత్ వెళ్ళి వచ్చాడు. ఓ అమెరికన్ సైకియాట్రిస్ట్ ఆమెని పెళ్ళాడాడు. మాధవ్‌కి ఆ ఫోటోలు పంపి, మీ అందరి సాయం వల్ల ఓ పిల్ల జీవితం నిలబడిందని చెప్పాను.
సాయం చిన్నదా, పెద్దదా అని ఆలోచించవద్దు. ఒక్కోసారి మీరు ఇచ్చే పది రూపాయలూ, ఒక రొట్టే ఎంతో విలువైనవి! ఓ నిండు ప్రాణం కాపాడవచ్చు. ఎవరైనా ఆపదలో వుంటే, పది రకాలు ఆలోచించి, వీళ్ళది నాటకమేమో… అబద్ధమేమో అని ఆలోచించేవాళ్ళు జీవితంలో, తమ కుటుంబంతో సహా ఎవరికీ పనికిరారు!
నిన్న మా అబ్బాయి కారు రోడ్డు మీద ఆగిపోతే, అక్కడే వదిలేసి, మేనల్లుడికి ఫోన్ చేసి, మా అశ్విన్, శరత్‌తో వచ్చేసాడు. నేను మా అసిస్టెంట్‍గా చేసిన రవికి ఫోన్ చేసి విషయం చెప్పగానే, “సరే మేడం, నేను చూస్తాను” అని మెకానిక్‌ని తీసుకెళ్ళి బాగు చేయించి, దాన్ని సురక్షితంగా ఇల్లు చేర్చాడు.
అతనినే ‘హాపీ’ సినిమా అప్పుడు నేను అల్లు అరవింద్ గారి దగ్గరకి పని ఇమ్మని పంపినది!
నేను తనకి సాయం చేసానని రవి ఎప్పుడూ అందరితో చెప్తుంటాడు. కానీ ఈ కోవిడ్ లాక్‌డౌన్ టైంలో అతను చేసిన సాయం చాలా పెద్దది!
(సశేషం)