కాశీ క్షేత్రదర్శనము – అనుభవాలు-26

0
3

[box type=’note’ fontsize=’16’] కార్తీకమాసంలో తోబుట్టువులతో జరిపిన కాశీ యాత్ర గురించి, కాశీలోని దేవీ దేవతల గురించి వివరిస్తున్నారీ యాత్రా కథనంలో సంధ్య యల్లాప్రగడ. [/box]

వారణాశి చరిత్ర:

వారణాశి చరిత్ర చూస్తే ఆశ్చర్యం వెయ్యక తప్పదు మనకు. ఆదిశంకరుల నుంచి నేటి కాలపు మహాగురువుల వరకూ వారణాశితో ఏదో సంబంధమున్నది. ప్రతి ఒక్కరు వారి జీవిత చరిత్రలో వారణాశిని చేరటమో, అక్కడ వారి ఆశ్రమము నెలకొల్పటమో చేశారు. అది పుణ్య స్థలమే కాదు శక్తి కేంద్రము కూడా.

ఆది శంకరులు కాశీకి వెళ్ళి కొన్నిరోజులు నిష్ఠగా అక్కడ తపస్సు చేశారని మనకు శంకరుల చరిత్రలో కనపడుతుంది.

అలాగే దత్తాత్రేయ అవతారము, శ్రీ గురువుగా భక్తులచే ఆరాధించబడు శ్రీ నృసింహభారతీ స్వామీ వారు సన్యాసము తీసుకొని కొంత కాలము తపస్సు చేసినది కూడా ఈ కాశి లోని గంగ వడ్డుననే. ఆయననే మనము శ్రీగురుడని కొలుచుకుంటాము. ఆ స్వామి వారు తపస్సు చేసిన ఆ తీరముమే నేటి నారదఘాటు.

శ్రీగురుని క్షేత్రము గాణ్గాపురము. నేటికీ తలిచిన వెంటనే పలికే దైవము శ్రీగురువు. గాణ్గాపురములో మధ్యహ్నాము వేళ బిక్షకొస్తానని శ్రీగురుని ఆన. అందుకే భక్తులు అక్కడ మధుకర సేవ చేసుకుంటారు. ఆయన సాక్షాత్‌ శ్రీ దత్తుని అవతారమే. అక్కడ ఆ స్వామి గురించి ఎన్నో కథనాలు వ్యాప్తిచెందాయి. మధ్యాహ్నము వేళ స్వామి గాణ్గాపురములో బిక్ష చేస్తారా లేదా అని పరిక్షించాలని ఒక భక్తుడు తలుస్తాడు. అతను సాదుసంత్. ఒక రోజు జ్వరముతో లేవలేకపోతాడు. కొద్దిగా వేళ మీరాక లేచి బిక్షకు వెడితే ఆ ఇంటి ఇల్లాలు ‘ఇందాకనే వచ్చావు కదయ్యా’ అని బిక్ష ఇవ్వటానికి నిరాకరిస్తుంది. ఆ సన్యాసి ఆశ్చర్యపోయి బసకొచ్చి ఆలోచిస్తూ మళ్ళీ కునుకు తీస్తాడు. ఆయన నిద్రలో స్వామి కనిపించి నీ రూపున నేనే బిక్ష చేశానని చెప్పారట. ఇటు వంటి లీలలు నేటికీ ప్రకటితమయ్యే ఆ పుణ్యధామము గాణ్గాపురము. ఆ స్వామి సన్యాసము, చరిత్ర కాశి నుంచే మొదలవుతుంది. ఆయన లీలలను చెప్పే గ్రంథం శ్రీగురుచరుత్ర.

గురువు కావాలని ఎవరైనా నేటికీ గురుచరిత్ర పారాయణము చేస్తే వారికి గురువు లభ్యమవుతారు.

శంకర భగవత్పాదుల వలెనే శ్రీగురుడు తన తొమ్మిదవ ఏట ఇల్లు వదిలి కాశీ క్షేత్రం వస్తారు. కాశీ మహానగరములో నారదఘాటులో ప్రతిరోజు స్నానమాచరించి ఆ ఒడ్డుననే తపస్సు చేసుకుంటూ వుంటారు. అక్కడి సాధుసంత్ ఈ లేత బాలుని దీక్ష చూసి ఆశ్చర్యపోతూ వుంటారు. దగ్గరలోని కృష్ణ చైతన్యభారతీ స్వామి శిష్యులకు “ఆ బాలుని రూపములో వున్నది దత్తస్వామియని ఆయనను సేవించుకోమని” చెబుతారు. ఆయన శిష్యులు ఆ బాలుని రూపములోని శ్రీదత్తుని సేవించుటకు వీలుగా సన్యాసము తీసుకోమని, లేకపోతే తమకు నింద తగులుతుందని ప్రార్థిస్తారు.

ఆ తరువాత ఆయన శాస్త్రప్రకారము కృష్ణ భారతీ స్వామి వద్ద సన్యాసము తీసుకుంటారు. అప్పుడు గురువిచ్చిన నామము ‘నృసింహభారతీ”. అలా శ్రీగురుడు సన్యసించినది ఈ మహా క్షేత్రములోనే. ఆ జ్ఞాపకము మనకు ఈ దేవాలయము సందర్శించినప్పుడు కలుగుతుంది.

మరో ప్రముఖమైన ఘాట్ చౌసట్టి ఘాట్. ఈ ఘాట్‌లో చౌసట్టి మాతా దేవాలయము వుంది.

చౌసట్టి అంటే అరువది ఏడని అర్థమట. ఆ దేవతలు లందరూ కాశిలో నివాసముండేవారట, ఒకనాడు పార్వతీ మాతకు మహాదేవునికి మధ్య వైరము వచ్చినదట. ఆ వైరము తీర్చటానికి ఈ 67 మంది ఒకరి తరువాత ఒకరుగా పరమేశ్వరుని వద్దకు వెళుతున్నారు కాని తిరిగి రాలేదట. చివరకు వీరిలో చౌషట్టి మాతగా వున్న ఈ దేవత వెళ్ళి చెబితే పరమశివుడు విన్నాడని కథ చెబుతారు. అందుకనే ఇక్కడ విన్నవిస్తే పరమేశ్వరునికి చేరుతాయి ఆ విన్నపాలను అంటారు. చౌసట్టి ఘాటు కూడా దశాశ్వమేథ్ ఘాటుకు చాలా దగ్గరలోనే వుంటుంది. ఆ ఘాటులోనే ఈ మాత దేవాలయము వున్నది. భక్తులు తప్పక దర్శించవలసిన ఘాట్లలో ఒకటి. నేను ఈ ఘట్లలో తిరుగుతూ అక్కడి వారితో ఈ వివరాలు సేకరిస్తూ కొంత సమయము గడిపి నా బసకు వచ్చేశాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here