[dropcap]అ[/dropcap]దే పనిగ కుహూ రావాలు
లేమంచు దుప్పట్లో
మత్తుగున్న లోకాన్ని
తట్టి మరీ లేపుతున్నట్లుంది…
మొన్న పలకరించి వెళ్ళిన ఉగాదిని
ఉన్న ఫళాన కలవడానికి
ఊసులు మూటకట్టి తెచ్చిందేమో గండుకోయిల
వసంతగీతం పాడుతోందిలా…
శిశిరంలా ముడుచుకున్న
మనసులు కూడా
తొలకరిలా వలపులు కురిపించుకుంటున్నాయి అదేపనిగా
చిరుగాలికి కదులాడే జాజితీగ
కోయిలమ్మ పాటతో జత కలిసినట్లుంది…
రంగులన్నీ కలబోసిన ఇంద్ర ధనుసులా
పువ్వులన్నీ పల్లవులై గీతాలను రచిస్తున్నాయి…
మనసుకిపుడు మరీ మరీ తెలుస్తోంది
నీరాక వసంత సమీరమై
గుండె గూటిలో సవ్వడిస్తోందని…
అందుకే వింటోందిప్పుడు
నువ్వినిపించే ఆ తేనె పాటను
గుండె సవ్వడికి నేపథ్యంలా
తెలుసా…!!