[dropcap]పి[/dropcap]ల్లలూ, మీలో ఎన్నో మంచి గుణాలున్నాయి కదా. ఉదాహరణకి దయ, జాలి, మీ స్నేహితులెవరన్నా ఇబ్బందిలో వుంటే వాళ్ళకి సహాయం చెయ్యాలనుకోవటం ఇవ్వన్నీ కూడ మంచి గుణాలే. మీ స్నేహితుడికెవరికన్నా దెబ్బ తగిలిందనుకోండి. మీరక్కడ వుంటే వెంటనే వాడికా దెబ్బ ఎక్కడ తగిలిందో, దేనితో తగిలిందో చూస్తారు. వాడిని కూర్చోబెడతారు. ‘నొప్పిగా వుందా, తగ్గిపోతుందిలే’ అని ధైర్యం చెబుతారు. వాడి చేతిలోవున్న పుస్తకాల సంచీ తీసుకుని మీరు పట్టుకుంటారు. ఇవ్వన్నీ చేస్తారు కదా. ఇవ్వన్నీ మంచి గుణాలు.
ఇదే రోడ్డుమీద ఎవరన్నా ఇద్దరు కొట్టుకుంటూ దెబ్బలు తగుల్చుకున్నారనుకోండి. మీరు వాళ్ళ దగ్గరకి కూడా వెళ్ళకూడదు. ఎందుకంటే మీరింకా చిన్న పిల్లలు.. వాళ్ళెందుకు కొట్టుకుంటున్నారో మీకు తెలియదు. పైగ పెద్దవాళ్ళు పోట్లాడుకుంటుంటే పిల్లలకి అన్ని విషయాలూ తెలియవు కదా. అందుకని అస్సలు కల్పించుకోగూడదు. అదే మీరు పెద్దవారయితే అప్పటి పరిస్ధితులను బట్టి మీరేం చెయ్యాలో ఆలోచించుకోవాలి.
అవసరంలేని చోట, అవసరంలేనివారి మీద దయ, జాలి చూపించకూడదు అనటానికి ఉదాహరణగా మీకు మహా భారతంలోని ఒక కధ చెబుతాను. కౌరవులకీ, పాండవులకీ మధ్య పెద్ద యుధ్ధం జరిగిందనీ, దానిని కురుక్షేత్ర యుధ్ధమంటారనీ మీరు వినే వుంటారు. కౌరవులూ, పాండవులు కూడా అన్నదమ్ముల బిడ్డలే కదా. యుధ్ధం చెయ్యటానికి వచ్చిన అర్జనుడు తన రథ సారథితో శత్రు వర్గంలో వారిని ఒకసారి చూస్తానని రథం రెండు వర్గాల మధ్యకి నడపమంటాడు. ఆ సారథి నడుపుతాడు. ఇంతకీ అర్జనుడి రథ సారథి ఎవరో తెలుసా మీకు? మనమంతా దేవుడని పూజ చేస్తామే .. ఆ శ్రీకృష్ణుడే.
శత్రువులలో ఎవరున్నారు? అంతా వీళ్ళ బంధువులూ, వీళ్ళకి విద్య నేర్పించిన గురువులూ, గురు పుత్రులూ ఇలా అంతా వీళ్ళవాళ్ళే!! అర్జునుడు మహా బలవంతుడు. దేవతలని మెప్పించి ఎన్నో ఆయుధాలు సంపాదించుకున్నాడు. ఎంతటి వీరులతోనైనా యుధ్ధం చెయ్యగల ధైర్యశాలి. అలాంటివాడి మనసులో శత్రువులలో వున్న తనవారిని చూసేసరికి ఒక్కసారిగా అధైర్యం వచ్చింది. అయ్యో, వీళ్ళందరినీ నేను యుధ్ధంలో చంపాలా అని బాధ కలిగింది. దానితో అతను మానసికంగా కృంగిపోయాడు.
నిజానికి క్షత్రియుడు, యుధ్ధ సమయంలో పిరికివాడు కాకూడదు. దానివల్ల వీళ్ళే ఓడిపోవచ్చు. అంటే బంధువులైనా సరే, అన్ని అవస్థలూ దాటి యుధ్ధందాకా వచ్చాక యుధ్ధం చెయ్యాల్సిందే. బంధువులని ఆలోచించకూడదు. అంటే జాలి, దయ, కరుణ, బంధుత్వం ఇలాంటివన్నీ సరైన సమయంలో సరైన వారిమీద చూపించాలి. లేకపోతే వాటికి విలువ వుండదు. సమయం, సందర్భం చూసుకోకుండా మనం చూపించే దయ తిరిగి మనకే హాని చెయ్యవచ్చు. ఇలాంటి యుధ్ధాలు ఇప్పుడు లేవుగానీ, మన పరిధిలో ఏమిటంటే….
మీ స్నేహితుడు పడిపోతే మీరు లేవదీసి, సహాయం చేసి, ఇంటి దగ్గర దిగబెడతానన్నారనుకోండి. అతనికేమో మీమీద ఎందుకో కోపం వుంది. అందుకే మిమ్మల్ని విదిలించుకుని, ఏమొద్దు, నేను వెళ్తానని వెళ్ళాడనుకోండి. మీరు బాధ పడకూడదు. అలాగే అని వచ్చేయండి. మీరు చెయ్యగలిగిన సహాయం చేశారు. ఇంక పట్టించుకోవద్దు. మీరు సహాయం చేసినా అతను మిమ్మల్ని విదిలించుకున్నాడనిగానీ, వేరే వాళ్ళతో వెళ్ళాడనిగానీ బాధ పడవద్దు. అక్కడితో వదిలేయాలి. దీనివల్ల తర్వాత కనిపించినప్పుడు అతడు మీతో మంచిగా మాట్లాడవచ్చు. లేకపోయినా పోయిందేమీ లేదు. మీరు మంచి పని చేశారు. మీ మనసు ప్రశాంతంగా వుంటుంది. చాలు కదా.