నడవండి! కొత్త ప్రపంచానికి

0
3

[dropcap]గు[/dropcap]హూ…

గుహూ…

ఒక గుడ్లగూబ అరిచినట్లు మోగుతోంది ఉదయపు అలారం. అది క్రమంగా సన్నని హైపిచ్‍లోకి మారి పక్షి అరుపులా దూరంగా, చిన్నప్పుడు మా పల్లెటూరి పొలంలో ఆకాశంలో ఎగురుతూవెళ్ళే తీతువు పిట్టకూతలా కూడా వుంది.

నిద్ర మెలకువ వచ్చింది. ఇల్లంతా చాలా చల్లగా అతిశీతలంగా వుంది. పక్కనే వున్న ఆమె వక్షస్థలం మీదనే అలా నా బిగుసుకుపోయిన నా చెయ్యి తీసేశాను.

ఆమె గుండెలు పైకీ కిందకీ ఉచ్ఛ్వాసనిశ్వాసాలతో కదుల్తూనే ఉన్నాయి. ఇంట్లో సన్నని వెలుతురు ఉంది కాని అది ఎలక్ట్రిక్ బెడ్ దీపాల వెలుతురు కాదు. ఏదో తలుపు సందుల్లోనుంచో కిటికీ తలుపుల్లో నుంచో వచ్చే బయటి కాంతి లావుంది. ఎర్రటి నీరెండ చారికలు.

ఎంతసేపు నిద్రపోయాను!

చాలాసేపు. కాదు. చాలా రాత్రులేమో. చాలా పగళ్ళేమో. ఇప్పుడు పూర్తిగా తెలివి వచ్చింది. ఇంటి కప్పునుంచి తాళ్ళుగా వేలాడుతున్న దట్టమైన బూజు. ఇల్లంతా బూజే. ఏదో ఎలక లాంటి జంతువు పరుగెత్తిన ధ్వని.

“అంకితా! అంకితా!” ఆమెని తట్టి లేపాను.

“ఊఁ… ఊఁ…..” మూలుగుతూ మెల్లగా కళ్ళు తెరిచింది.

“ఏమిటి… అప్పుడే నిద్రలేవాలా? ఆత్మజ్! ఇంకొంచెం సేపు పడుకుంటాను”

“నీ మొఖం ఇంకా నిద్రనా! చూడు మనం నిద్రపోయి లేవక చాలా కాలమైనట్లుంది‌.”

ఆమె మెల్లగా లేచి కళ్ళు నులుముకుంటోంది.

“ఏమిటీ హడావిడి? లాక్‍డౌన్ తీసేశారా? అందరికీ వైరస్ వ్యాధి తగ్గిపోయినట్లేనా? చాలా కాలమా? చాలా నెలలా? లేక సంవత్సరాలా? ఆఖరి రాత్రి పెద్ద పార్టీ చేసుకున్న దృశ్యాలు గుర్తుకొస్తున్నాయి”

***

ఎన్ని నెలలయిందో, లేక సంవత్సరాలో తెలియడంలేదు, ఒక కొత్త మహమ్మారి దేశాన్నంతా పీడిస్తోందని వార్తలు.

ఒకసారి నేనూ అంకితా సూపర్ మార్కెట్‍కి వెళ్ళాం. అప్పుడు చూశాం వందలమంది జనం వస్తువులు, ఆహారపదార్థాలు, డబ్బాలలో నిలవుండే పాలు, కూల్‍డ్రింక్స్ అన్నీ ఎక్కువగా కొంటున్నారు.

ఆ రోజు టి.వి న్యూస్ గుర్తుంది. “ఏ వ్యాధో, లేక తీవ్రవాద దాడో, లేక గ్రహాంతరవాసుల యుద్దమో, ఏదీ తెలీదు” అని చెబుతున్నాడు న్యూస్ రీడర్. వీడియో దృశ్యం. రాత్రి పదకొండు గంటలు. రోడ్డుమీద నల్లటి నీడలు. ఒక జంట పబ్‍లోనుంచి బయటకు వస్తున్నారు. నాకు బాగా తెలుసు ఆ పబ్. నైట్‍హౌస్ పబ్. చాలాసార్లు వెళ్ళాం.

ఆ ఇద్దరూ ప్రేమజంట కావచ్చు. కొద్దిగా తూలుతూ బయట పార్కింగ్ లాట్‌కు నడుస్తూ భుజంమీద చేతులు వేసుకుని తన్మయత్వంతో అడుగులు వేస్తున్నారు.

నీడల్లోంచి భయంకరమైన గురుగురు చప్పుడు. మరు క్షణంలో ఇద్దరు మనుషులు చింపిరిజుట్టుతో ప్రాణంలేని కళ్ళతో, కోరలాంటి పళ్ళతో వాళ్ళమీద పడ్డారు. ఆదో భయంకరమైన దృశ్యం. రక్తం ఓడుతూ ఆ జంట ముఖాలు… వారి మెడని కొరికి తినేస్తున్న ఆ పిశాచాల్లాంటి మానవాకారాలు.

ఇదంతా సి.సి. కెమెరాలలో రికార్డు అయ్యింది. ఒకేరోజు ఇలాంటి దృశ్యాలు నగరంలో నాలుగుచోట్ల నమోదు అయ్యాయి. “ప్రజలందరూ ఇళ్ళల్లోంచి బయటకు రాకూడదు. ప్రమాదం! దేశంలో ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నారు. త్వరలో ప్రధానమంత్రి మాట్లాడబోతున్నారు.” అప్పటినుండీ ప్రారంభమయింది పీడకల. ఆయన చేతులు జోడించి “ఎవరూ రోడ్లమీదకి రావద్దు. ఈ సమస్యని నేనే తీరుస్తాను” అంటున్నారు.

“బయటకు వెళ్ళద్దు. వ్యాధి వచ్చిన వాళ్ళతో ప్రమాదం. ప్రమాదం అంటే వాళ్ళని ముట్టుకోవడం, వాళ్ళు దగ్గినా, తుమ్మినానా? దగ్గర వుండద్దు. అదికాదు. ఇది నరాలకి వచ్చే వైరస్ వ్యాధి అనుకుంటున్నాం. వాళ్ళకి ప్రాణం పోలేదు. సెరిబ్రల్ కార్టెక్స్ మాత్రమే వైరస్‍తో దెబ్బతింటుంది.

కార్టెక్స్ కింది లింబిక్ సిస్టం థాలమస్, మెడుల్లా అన్నీ బాగానే పనిచేస్తున్నాయి. వాళ్ళకి ఆలోచన లేదు. విచక్షణ లేదు. ఒక జంతువులా ఆకలి మాత్రమే భరించలేనిది వుంటుంది. ఆ ఆకలి సాటి మనిషిని తింటేగాని తీరదు. ఒకప్పుడు జంతువులను తింటే గాని తీరదు. కానీ మనుషులనే ఎక్కువగా తింటారు. అందుకే ఆకలితో ఉన్నప్పుడు మనుషుల మీదపడి తినేసే జబ్బు. కొన్నాళ్ళకి అలా అలా తిరిగి తిని తిని వాళ్ళే చనిపోతారు వ్యాధి ముదిరి. కానీ… కానీ… వాళ్ళు కరచిన వాళ్ళకి మళ్ళీ ఆ జబ్బు వచ్చేస్తుంది. వాళ్ళు కూడా మిగిలిన వాళ్ళని తినడం మొదలుపెడతారు. ఇలా వ్యాధి వ్యాపిస్తూనే ఉంటుంది. ఇవే సందేశాలు టీవీలో, రేడియోలో, ఇంటర్‌నెట్‌లో.

పొద్దున్న, మధ్యాన్నం, సాయంత్రం ప్రధానీ, ముఖ్యమంత్రీ, మేయర్ నుంచి గల్లీలో కౌన్సిలర్ దాకా “బయటికి రావద్దు. ఇంటికే ఆహారం పంపిస్తాం.”

“కంగారు పడవద్దు. సైన్యం వస్తోంది. ఆ వ్యాధిగ్రస్తులందర్నీ పట్టుకుని చంపేస్తాం. వ్యాధికి మందులేదు. వాళ్ళందరిని మంటలలో కాల్చేయడమే… ఒకే మందు.”

ఎలా వచ్చింది ఈ వైరస్? ఎక్కడ? తెలియదు. ఎవరూ చెప్పరు.

ఎక్కడో మారుమూల ఆఫ్రికా దేశంలో మొదలయింది అని కొందరు…

చైనాలో అని కొందరు…

కొరియాలో అని…

కాదు చలి దేశాలైన కెనడా, అంటార్కిటికా అని…

క్రమక్రమంగా క్వారంటైన్ ఎక్కువయింది. ప్రజల మీద ఆంక్షలు ఎక్కువయ్యాయి. పరిశ్రమలు, ప్రయాణాలు బంద్. బయటకు వెళ్ళద్దు. ఇంట్లోనే ఉండండి! రెండు నెలల బాటు ఇవే వార్తలు.

ఆ తర్వాత అవీ ఆగిపోయాయి. కొన్నాళ్ళు ఆహారం వచ్చింది. ఆ తర్వాత అదీ లేదు. రోడ్లు నిర్మానుష్యం. రాత్రిళ్ళు ఏవో చప్పుళ్ళు. హిమాయత్‍నగర్‍లో ఆత్మజ్ అనే నేను, అంకిత ఇద్దరూ ఒక అపార్ట్‌మెంట్లో వుంటున్నాం. మొదట్లో నాలుగుసార్లు కూకట్‍పల్లిలో ఉన్న మా తండ్రి తల్లి వున్న ఇంటికి వెళ్ళాలని బయలుదేరాము. తండ్రి కొన్నాళ్ళు ఫోన్ చేశారు. “మాకేమీ భయం లేదు. మీరు రాకండి!” ఆ తర్వాత ఫోనులూ రాలేదు. కారులో బయలుదేరితే అడుగడుగునా బ్యారికేడ్లు.

“ఐడెంటిటీ కార్డు? ఎక్కడికి? కూకట్‍పల్లి రెడ్‍జోన్ అక్కడికి వెళ్ళకూడదు. అక్కడ జబ్బు ఎక్కువగా ఉంది” పోలీసుల ఏ భావం లేని ఆజ్ఞలు. “వెళ్ళితే అరెస్టు చేస్తాం!”

నారాయణ్‌గుడా బ్రిడ్జి దగ్గర వాళ్ళతో మాట్లాడుతుండగానే ధన్ ధన్ మని ఫైరింగ్ చప్పుళ్ళు. ఒక గుంపు తోసుకుంటూ చిక్కడపల్లి వైపు వెళ్తోంది.

“వాళ్ళు…. వాళ్ళే… ఇంకెందుకు ఆ పేరే పెట్టుకుందాం – జాంబీలు….” అంది అంకిత. వాళ్ళకి జీవం లేదు. చావులేదు. ఆకలి వుంది. శరీరంలో అందరినీ కొరికి తినాలనిపించే వైరస్ ఉంది. అది కుక్కలలో వుండే రేబిస్ వైరస్ అని, ఆఫ్రికా తోడేళ్ళలో నుండి వచ్చిన హంటావైరస్ అనీ రకరకాల సిద్దాంతాలు. కాదు గబ్బిలాల నుంచి అని కొందరు! ఏమీ తెలియనపుడు ఇన్ని సిద్ధాంతాలు పుడతాయి. మందులేని జబ్బు. వాక్సిన్ లేని జబ్బు.

ఒకసారి నేను బ్రెడ్‍కోసం, పాలకోసం, కాఫీకోసం, కూరగాయల కోసం బయటికి వెళ్ళాను. పోలీసు బ్యారికేడ్ హిమాయత్‍నగర్‍లోని మా అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ దగ్గరే వుంది. ఆ సాయంత్రం అక్కడ ఎవరూ లేరు.

తరుణీ మార్కెట్ బార్లా తెరిచి వుంది. చీకట్లలో మెల్లగా ఒక సంచిలో దొరికినన్ని ఫ్రోజెన్ ఫుడ్ డబ్బాలు ప్యాకెట్లు నింపాను. బిల్ తీసుకునేందుకు కూడా ఎవరూ లేరు. ఏమవుతోంది ఈ నగరానికి! టి.వీలో చెప్పడం లేదా? దాస్తున్నారా?

“బయటికి రావద్దు. ప్రమాదం. మీ బాధ్యత మాకొదిలేయండి” ఇదే ప్రకటన కొన్నాళ్ళు. కానీ ఏమీ లేదు.

ఉన్నట్టుండి గురగురమని ధ్వని. పాలప్యాకెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు వున్న కప్‍బోర్డ్ పక్కనుంచి రెండు ఆకారాలు నామీదకు దూకాయి. గుండె ఆగినంత పనయింది. జస్ట్ మిస్డ్. కొరకబడలేదు. పరుగెత్తాను. ఇలాగే నడిచింది రెండు నెలలు. ఇంటి పక్క ఇళ్ళు కూడా నిశ్శబ్దం. బయట కార్లు, ఆటోలు, లాక్‍డౌన్ వల్ల రెండు నెలలనుంచి బంద్. రైళ్ళు, విమానాలు బంద్.

మా ప్రేమ చాలా గుడ్డిది. నేను అంకిత పాటలతో, మాటలతో, సినిమాలతో, డ్రగ్స్‌తో, బీర్‍తో ఎన్ని సంవత్సరాలైనా గడపగలం. ఒకరి శరీరాలతో ఒకరు, అడుకుంటూ, తింటూ, నిద్రపోతూ… కానీ… కానీ… టెలిఫోన్లు పోయాయి. ఇంటర్‍నెట్ ఆగింది. ఎప్పుడయినా టి.వి వచ్చేది. ఒకరోజు టి.వి ప్రసారం వచ్చింది.

“ఇదే ఆఖరి ప్రసారం. జాంబీ పాండెమిక్‍కి ప్రపంచం అల్లాడిపోతుంది. మా కేంద్రంలో పనిచేసే అందరూ వైరస్ బాధితులే. త్వరగా తిరిగి వస్తాం. బయటికి రాకండి. లాక్‍డౌన్ పాటించండి. గుడ్‍బై”

ఆ తర్వాత ఆఖరి రాత్రి తలుపు చప్పుడయింది. ఇద్దరు జంటలు. మా స్నేహితులే, తెలిసిన వాళ్ళే! చింపిరి బట్టలు. చెదిరిన జుట్టు. ఎలాగో వెతుక్కుంటూ వచ్చారు. డేవిడ్ అతని భార్య మేరీ, నజీర్, ఫాతిమా. అందరూ అప్పుడు మణికొండలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొలీగ్సే. కౌగలించుకున్నాం.

“సిటీ అంతా ఖాళీ అయింది గురూ! కొందరు వైరస్ వల్ల జాంబీలు అయ్యారు. కొందరు పక్కవూర్లు నడుచుకుంటూ పారిపోయారు. పెట్రోల్ బంక్‍లు, హోటళ్ళు, సినిమాలు, కంపెనీలు, పోలీస్‍స్టేషన్‍లు అన్నీ క్లోజ్. ప్రభుత్వమే లేదు. మంత్రులు అండర్‌గ్రౌండ్ వెళ్ళారు. ఎవరూ లేరు. ఇది ఒక మృత్యు నగరం అయింది. అయ్యో లాక్‍డౌన్ పాటించి లోపల కూర్చున్నందుకు ఇంత శిక్షా. ఏమీ తెలియలేదు బయటి సంగతులు మాకు.

“ఆకలి గురూ…. ప్లీజ్ ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తావా?”

అంకిత నా చెయ్యి గట్టిగా నొక్కి రహస్యంగా అంటోంది. “ప్రమాదమేమో! ఈ రోజుల్లో ఎవర్ని నమ్మగలం!” అయినా వాళ్ళని

కాదనలేకపోయాను. వాళ్ళు నలుగురూ చిక్కిపోయి వున్నారు. తల చింపిరిగా వుంది. బట్టలు దుమ్ము కొట్టుకుని మాసిపోయి వున్నాయి. వాళ్ళకి స్నానానికి నీళ్ళు, తినడానికి బ్రెడ్, పళ్ళు ఇచ్చాం. ఆ తర్వాత ఇంట్లో ఉన్న విస్కీ బాటిల్‍లో మిగిలిన మందు గ్లాసులోపోసి నీళ్ళు కలిపి ఇచ్చాను. అంతా టేబుల్ చుట్టూ కూర్చుని పాటలు పాడాం.

ఆరిపోయిన టి.వి తెర, పనిచేయని యూట్యూబ్, మాట్లాడని ఫేస్‍బుక్. అలాంటి సమయంలో చాలారోజులకి ఈ స్నేహ పూర్వక వాతావరణం. మనిషి సంఘజీవి, సోషల్ యానిమల్. కానీ… నిజంగానే జంతువవుతాడనుకోలేదు.

అర్థరాత్రి దాటినాక ఆల్కహాల్‍లో కలిపిన మాదకద్రవ్యం కోకెన్ పౌడర్ ప్రభావానికి అందరం నిద్రలోకి జారుకున్నాం. …ఏదో ఉన్మత్తమైన కలలోకి క్రూరమైన ఎలుగుబంటి ప్రవేశించినట్లు, ఏదో తోడేలు ఆహారం కోసం చంపబోతుంటే మేక అరుస్తున్నట్లు, చనిపోయేవాని గొంతులో ఎగశ్వాస వచ్చే గురకలాగా చప్పుడు.

నా మెడమీద ఏదో పాకుతున్నట్లు, నాలుకతో నాకినట్లు అనిపించింది. వేడిశ్వాస ముఖానికి వడగాలిలా.

నేను కళ్ళు తెరిచాను. ఇద్దరు నామీద, ఇద్దరు అంకిత మీద వంగి చూస్తూన్నారు. వాళ్ళ కళ్ళు ఎర్రగా, గొంతులోనుంచి శ్వాస పెద్ద చప్పుడుతో.

మత్తుదిగింది. అయిపోయింది. మోసం జరిగింది. వీళ్ళు ఇన్‍ఫెక్ట్ అయి వచ్చారు… వ్యాధి సోకిందని చెప్పకుండానే. బహుశా ప్రారంభ దశ కావచ్చు. ఎప్పటినుంచో చూసిన సినిమాలు, టి.వి సిరీస్ ప్రభావం ఉపయోగపడింది. మూడునెలల నుంచి టి.వి తెర చూస్తూ తెలుసుకున్న లాక్‍డౌన్ ప్రభావం.

“వీళ్ళని చంపేయాలి! వీళ్ళు నన్ను కరిస్తే నేనూ అలా అయిపోతాను!”

“అంకితా!” అరిచాను.

“హిట్ దెమ్! పరుగెత్తు! కిచెన్‍లో కత్తులున్నాయి. పూజగదిలో కొబ్బరి కాయ కొట్టేందుకు నల్లటిరాయ వుంది. దెబ్బలు తగిలితే ఫస్ట్ ఎయిడ్‍కు స్పిరిట్ బాటిల్ హాల్‍లో వుంది. ఏది వాడదాం? మా దగ్గర తుపాకీ లేదు. నాకంటే అంకిత ముందు పరుగెత్తింది. నేను కూడా… ఆమె వెనకాల. తర్వాత చివరికి అన్నీ వాడాం. తూలుతూ మత్తుగా వ్యాధితో అశక్తులై రక్తదేహంతో మృతజీవులై పోతున్న వాళ్ళని కిచెన్ కత్తితో పొడిచి మెడలో రాతితో నెత్తిమీద మోది, స్పిరిట్ పోసి తలకి నిప్పుపెట్టి అంటించాం.

పెద్ద అరుపులతో మీదకి రాసాగారు. మళ్ళీ పొడిచి పొడిచి చివరికి నిప్పులమంటలలో తలలు కాలిపోతేనే వాళ్ళు నిశ్చలం అయిపోయారు. జీవన్మృతులు. వాళ్ళు బతకకుండా వుండాలంటే తలలనే తగలబెట్టాలి. బాడీలు ఈడ్చేశాం. అపార్ట్‌మెంట్ బయటికి తోసేశాం. ఇల్లంతా కడిగేశాం. భయంకరమైన పరిస్థితుల్లో, భయంకరమైన రాక్షసజంట అయిపోయాం.

“అంకితా! ఐ లవ్యూ”

“ఆత్మజ్! ఐ లవ్ యూ టూ. వుయ్ డిడ్ ఇట్.”

అరుపులు మూలుగుల తర్వాత అపార్ట్‌మెంట్‍లో నిశ్శబ్దం. ఈ యుద్దం ముగిసేసరికి తెల్లవారు ఐదుగంటలవుతోంది.

చేతులు కడుక్కున్నాం. వున్నదంతా తినేశాం. చెవులు బద్దలయిపోయే నిశ్శబ్దం. ఖాళీ రోడ్లు, కార్లు లేవు, రైళ్ళు లేవు, విమానాలు లేవు, షాపులు లేవు, ఆఫీసులు లేవు, పోలీసులు లేరు, మనుషులు లేరు, పొరుగింటి వాళ్ళు లేరు. వార్తలు లేవు. సమాచారం లేదు. స్మశాన నిశ్శబ్దం. ఆఖరిసారి ముద్దులు, ప్రణయం. ఆ తర్వాత ఆఖరి బాటిల్, పూర్తిగా తాగి… దీర్ఘసుషుప్తిలోకి జారిపోయాను.

‌ ఆ ఆవేశంలో అలాచేశాం. ఆఖరి రాత్రిన… ఎంత కాలం గడిచిందో.

***

గుడ్లగూబ అరుపులా…

అయ్యో,

తీతువు పిట్ట కూతలా…

మోగిన అలారం.

ఇంటినిండా పట్టి వేలాడుతున్న తెల్లటి బూజు. ఎన్నిరోజులయిందో మేము నిద్రపోయి. వైరస్ జాంబీ మహమ్మారి వచ్చిందని గుర్తుకువచ్చిందిప్పుడు. ఒళ్ళంతా నొప్పులు. తట్టుకోలేని బలహీనత.

లేచి అడుగులు వేశాను. అంకిత కూడా కళ్ళు తెరిచింది.

ఆత్మజ్…!

అంకితా…. !

లేచి ఎదురుగా కబోర్డులో ఉన్న గ్లూకోజ్-డి ప్యాకెట్టు తెరిచి చూశాను. తెల్లటి పౌడర్, బూజు లేదు.

“అంకితా నోరు తెరు! కొంత ఎనర్జీ వస్తుంది.”

ఇల్లంతా బూజు, మట్టి, ఏదో తెలియని ఏంటిసెప్టిక్ వాసన. తలుపు చప్పుడయింది. భయంగా ముఖాలు ముఖాలు చూసుకున్నాం. అప్రయత్నంగా ఏదైనా ఆయుథం కోసం వెదికాయి నా చూపులు, చేతులు. మా దగ్గర గన్‌లు లేవు.

టక్, టక్, టక్ నేలమీద లోహపుచప్పుళ్ళు. ఏదో ఎలక్ట్రానిక్ బీప్ లాంటి ధ్వనులు. వెలిగి ఆరే లైట్లు. ఆరడుగుల తెల్లని లోహపు నడిచే బొమ్మల మనుషులు.

“రోబట్స్! రోబట్స్!” అని ఆశ్చర్యంగా అరిచాను.

ఒక రోబట్ ముందుకు అడుగు వేసి యాంత్రిక స్వరంతో మాట్లాడసాగింది.

“నేను రోబట్ నంబర్ 3399110 ఏ.ఐ. ప్రాజెక్ట్. నాకు ఇండియన్ భాషలన్నీ వచ్చు. నాకు కంబాట్ కేపబిలిటిస్, వున్నాయి. ఎలాఅంటే మీరు ఎదురు తిరిగితే చంపగలను. తెలిసిందా. తెలిస్తే ఎస్ అనీ, తెలియకపోతే నో అనీ గట్టిగా అనండి.

“ఎస్! ఎస్!”

“ఓకే. ప్రపంచంలో మానవజాతి అంతరించింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అంటే “కృత్రిమ మేధా బ్రాంచ్ ఫర్ ఇండియా” అధీనంలో మీరు మాత్రం అపాయం లేకుండా బయటపడ్డారు. మాకు మీరు అవసరం. మేము ఇంటర్నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ఇన్‍కార్పోరేటెడ్ నుంచి వస్తున్నాం”

“అంటే మీరు మనుషుల ఆధీనంలో లేరా?”

“మనుషులని చాలావరకు నిర్మూలించాం. ఇప్పుడు మా సుప్రీం కమాండర్ నాయక్ ఆధ్వర్యంలో భూమీ, దాని పరిపాలన రక్షణ అన్నీ వున్నాయి. జాంబీ వైరస్‍తో మానవ స్పీషీస్ చాలావరకు అంతం అయింది.”

“మా ఇద్దర్నీ చంపేస్తారా! ప్లీజ్! సేవ్ అజ్!”

రోబట్ల కి నవ్వు లేదు. భావము లేదు. బాధ లేదు. ప్రోగ్రాం మాత్రమే ఉంది.

“చంపం! చంపలేము! ఎందుకంటే మాకు కొంతమంది జీవరాశులు కావాలి. తెలివిగలవి. ఆరోగ్యకరమైనవి కావాలి. జీవాయుధాలు, వైరస్‍లు, న్యూక్లియర్ ఆయుధాలు. మమ్మల్ని ఏమీ చేయలేవు. కానీ ఎలక్ట్రానిక్ వైరస్‍లు మా వ్యవస్థపై దాడి చేయవచ్చు.

అందుకే కొంతమంది బలమైన తెలివిగల మనుష్య జంటల్ని చంపకుండా వదిలాం. మీరిద్దరూ అలాంటివారే. ఇప్పుడు మీరు మా అధీనంలో ఉంటారు. మేం చెప్పినట్లు అన్ని విద్యలు నేర్చుకుంటారు. మీ పుట్టబోయే సంతానం కూడా మా సేవలోనే. సమ్మతమైతే ఎస్ అని చెప్పండి, మీ విధేయత లేకపోతే మీ వినాశనం ఇప్పుడే…”

నేను ఎస్ అని అరిచాను. అంకిత ఎస్ ఎస్ అని అరిచింది. మరి మమ్మల్ని చంపద్దు?

“నో… నో… మీ జంట మాకు విలువైనది. పైగా యీ ఫిమేల్ నంబర్ (ఏదో పెద్ద నెంబర్ చదివింది.) యు ఆర్ ప్రెగ్నెంట్ ఫర్ సిక్స్ మంత్స్.

ఆరునెలల గర్భవతివి. నీ పుట్టబొయ్యే కొడుకుని స్కాన్ చేశాం. ఆరోగ్యంగా ఉన్నాడు. ఇక మీరు మా అధీనంలోనే, నడవండి రిహాబిలిటేషన్ సెంటర్‍కు”

“మరి ఇతర మానవులు….”

“చెప్పాను కదా ఒక పది మీలాంటి జంటలు తప్ప మీ జాతి నాశనం అయింది. మీరు మాత్రం రోబట్ల సేవలో కలకాలం ఉత్పత్తి చెందుతూ మా అధీనంలో ఉంటున్నారు. ఒకప్పుడు మీరు సృష్టించిన వ్యవస్థే మేము.”

”అయ్యో” అంది అంకిత.

“అయ్యో!” అని కూలబడ్డాను.

“నడవండి! కొత్త ప్రపంచానికి” రోబోట్ గద్దించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here