సాధించెనే ఓ మనసా!-14

0
4

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 14వ భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap]మె శివని అతని తల్లి పరిమళ వద్దకు తీసుకువెళ్ళింది.

“శివా, ఈవిడ శ్రీమతి పరిమళా రంగనాథన్‍. ఈమె ఆశీర్వాదం నిన్ను ఊహించలేని ఎత్తులకు తీసుకెళ్ళబోతోంది. నువ్వు పడుకున్న ఊయలని ఊపిన అదే చేతులతో మీ అమ్మ ఈ షాప్‌ని ప్రారంభించారు.”

శివ తన తల్లి పాదాలకు నమస్కరించాడు.

“శివా, ఈ అమ్మాయి నీ కోసం చేసిన పనిని మీ నాన్న కూడా చేసి ఉంటారని నేను అనుకోను.”

అప్పుడు పరిమళ తన చేతిని సంజన తలపై ఉంచింది.

“సంజన, నువ్వు నన్ను ఓ తల్లిగా గర్వించేలా చేశావు. నిండు నూరేళ్ళు వర్ధిల్లు.”

“థాంక్యూ ఆంటీ.”

సంజన తదుపరి విఐపి వద్దకి కదిలింది.

“శివా, ఈవిడ పద్మ, బ్రాంచ్ మేనేజర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రికార్డు సమయంలో ఈ షాపు కోసం ఆమె రూ.25 లక్షల రుణం మంజూరు చేశారు. కానీ ఆవిడ ఎప్పుడూ నిబంధనలను ఉల్లఘించలేదు.

రుణం మంజూరు చేయడానికి ముందు నా హామీతో పాటు నాన్న గ్యారెంటీ కూడా తీసుకున్నారు. ఎన్ని ఖచ్చితమైన ప్రణాళికలున్నా, ఈ ప్రాజెక్ట్‌కి ఒక రూపం తెచ్చి షాపుని సిద్ధం చేయడానికి నాకు మరో ఐదు లక్షలు అవసరమయ్యాయి.

నేను ఆమె వద్దకు పరిగెత్తాను. అప్పటికే షాపుకి గరిష్ట రుణం ఇచ్చినందున ఆమె కుదరదన్నారు. కాని ఆమె వ్యక్తిగతంగా తన డబ్బు ఇచ్చారు.

‘చూడండి, ఇది వడ్డీ లేనిది, ఇవ్వగలిగినప్పుడు తిరిగి చెల్లిస్తే చాలు’ అన్నారు. ఆవిడ లేకపోతే, మనం ఈ రోజు ఈ షాపుని తెరిచేవాళ్ళమే కాదు.”

“పిన్నీ…” అంటూ శివ పద్మ కాళ్ళపై పడబోయాడు. ఆమె అతన్ని అడ్డుకుని కౌగిలించుకుంది.

“ఒక విధంగా మీ బాబాయిలు నీకు సహాయం చేసారు, శివా.  నువ్వు ఆ రంగా సిల్క్స్ సముద్రంలోనే ఉంటే, నీ ప్రతిభ బయటకు వచ్చేది కాదు.

ఇప్పుడు నువ్వే రాజు. ప్రపంచం అంతా నీ దుకాణం ముందు నిలబడబోతోంది. నువ్వు గొప్ప జీవితాన్ని గడపబోతున్నావు శివా. శుభాకాంక్షలు.”

ఆమె శివ తలపై ముద్దు పెట్టుకుంది.

“ఆఁ శివా, ఇక ఈ విఐపి పేరు మిస్ మాల్య. ఇంటీరియర్ డెకరేటర్. ఆమె సేవలను కోరుకుంటే, మీరు ముందుగానే బుక్ చేసుకోవాలి, ఆమె అపాయింట్‌మెంట్ పొందడానికి ఒక నెల వేచి ఉండాలి.

కానీ మన విషయంలో ఆమె కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ షాపుని అందంగా అలంకరించింది, దగ్గరుండి అన్ని పనులను పర్యవేక్షించింది.

ఆమె ఫీజులో ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దానికి అదనంగా ఆమె యాభై శాతం సామాగ్రి ఖర్చును భరించింది.”

“అక్కా…”

“ఏంటి శివా? చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తున్నావు. నువ్వు నా చిట్టి తమ్ముడివి. రా. ఆ కన్నీళ్లను తుడుచుకో, నువ్వేమిటో ఈ ప్రపంచానికి చూపించు. ఈ దేవదూతకి, నువ్వు కృతజ్ఞతలు చెప్పాలి శివా. మనకి తట్టని ఆలోచన ఆమెకి వచ్చింది. నువ్వు ఆమెకు ఎంతో ఋణపడి ఉన్నావు. నువ్వు నాన్నని కూడా అధిగమిస్తావని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.”

“నాన్నకి దొరకనిది నాకు లభించింది. నాన్న తన షాప్‌ని ప్రారంభించినప్పుడు ఆయనకి నలుగురు దేవదూతలు లేరు.”

అంతలో సంజన శివుడిని అవతలి వైపుకు లాగింది.

“నువ్వు మరో ఇద్దరు విఐపిలను కలవాలి. ఈ వృద్ధుడిని చూడు. అవును, ఈయన నావారు. మా నాన్న డాక్టర్ కన్నప్పన్.

నగరంలోని ప్రముఖ కార్డియాలజిస్ట్. ఆయన నా తరపున పెట్టుబడి పెట్టారు. బ్యాంకు నుండి మనకు లభించిన రుణానికి వ్యక్తిగతంగా హామీ ఇచ్చారు. ఈ ఉదయం నేను రూపొందించిన నాటకంలో తన పాత్రను బాగా పోషించారు.”

కళ్ళల్లో నీళ్ళతో శివ ఆయనకి రెండు చేతులతో నమస్కరించాడు.

“శివా గత కొన్నేళ్లుగా నా కూతురుని ఇంత సంతోషంగా చూడలేదు. ఈ ఆనందం కోసం నేను మరో పది రుణాల కోసం హామీ పత్రాలపై సంతకం చేయడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నారు కన్నప్పన్.

“ఆఁ శివా, ఈ పెద్దమనిషిని చూడు, ఇతను మిస్టర్ వినూ. శ్రీనివాస్ సిల్క్స్ యజమాని. నువ్వు అతన్ని ఉద్యోగం అడిగిన రోజున, నేను ఇవ్వద్దు అన్నానని, నీకు అదే మాట చెప్పి, పాపం, ఆ రాత్రి అన్నం తినలేదు, నిద్ర పోలేదు, తెలుసా!

ఉద్యోగం ఇవ్వడానికి బదులుగా, నేను చెప్పినట్టుగా వినూ తన విఐపి కస్టమర్లను నీకు పరిచయం చేయడం ద్వారా చాలా విలువైన కాంటాక్ట్స్ ఇచ్చాడు.

అంతే కాదు, ఈ షాపు లోని మొత్తం స్టాక్‌ను అతను క్రెడిట్‌గా ఇచ్చాడు; పైగా మనం ఈ చీరలను విక్రయించే వరకు చెల్లింపు కోసం వేచి ఉండటానికి అంగీకరించాడు.

ఇంకా, సరైన కంప్యూటర్లను ఎన్నుకోవటానికి నాకు సహాయం చేసాడు. అతని షాపులో నువ్వు ఉపయోగించిన కంప్యూటర్‌ను కూడా నీకు బహుమతిగా ఇచ్చాడు.”

శివ తన ప్రాణ స్నేహితుడిని కౌగిలించుకున్నాడు.

“నువ్వు మేధావివి, శివా. నీకు నా వంతు చేయగలిగినందుకు నేను సంతోషంగా ఉన్నాను.”

***

హై టీ తర్వాత విఐపిలు, సందర్శకులు వెళ్ళాకా – శివా, సంజన కలిసి ఒక వ్యాపార వ్యూహాన్ని రూపొందించడానికి కూర్చున్నారు.

“శివా, ఈ షాపు కేవలం స్టేటస్ సింబల్ కోసం పట్టు చీర కావాలనుకునే వారికి కాదు. అలాంటి వాళ్ళు ఒక చీరని ఎంచుకునే ముందు వెయ్యి రకాలు చూడాలనుకుంటారు.

ఆ విభాగంలో మేము నల్లి, కుమరన్స్, పోథీస్ ఇంకా ఆర్‌ఎమ్‌కెవి వంటి పెద్ద పెద్ద షాపులతో వాణిజ్యంలో పోటీ పడలేము. డిజైన్ కోసం చూసే కస్టమర్‌ లకు మనం సేవలందిద్దాం, కళాత్మకంగా రూపొందించిన చీర కోసం రేటు కాస్త ఎక్కువ పట్టించుకోని వారికి, చీర-డిజైన్ల పట్ల మంచి అభిరుచి ఉన్నవారికి సేవలందిద్దాం.

మనం ఫిల్మ్-వరల్డ్, ఫ్యాషన్-షోలు, మోడలింగ్ అమ్మాయిలు ఇంకా అత్యధిక ఆదాయవర్గాలలో ఉన్నవారిని దృష్టిలో ఉంచుకోవాలి.

ఈ విధంగా మనం డబ్బును చాలా వేగంగా సంపాదించగలం. మనం పెరిగేటప్పుడు ప్రజల అవసరాలు తీర్చడానికి ఒక పెద్ద షాపుని తెరవవచ్చు.”

శివ తన భాగస్వామి వ్యాపార చతురతను మెచ్చుకున్నాడు, దీనిని త్వరలో స్టోర్స్ పాలసీగా స్వీకరించారు. చిన్న బోటిక్ త్వరలో నగరం యొక్క అభివృద్ధి చెందుతున్న పట్టు చీరల వ్యాపారంలోకి ప్రవేశించడం ప్రారంభించింది.

***

సంజన శంకర్‌ల జోడీ స్థిరంగా వెళ్తోంది. ఇప్పుడు ఆమె ఎక్కువ సమయం చాలావరకు శివతోనే గడుపుతోంది. ఆమె శంకర్‌ను కలిసినప్పుడు సహజంగానే శివ ప్రతిభను ప్రశంసిస్తోంది.

సంజన చాలా అమాయకురాలు, ఆమె మాటలు శంకర్ హృదయంలో అసూయ అనే నిప్పును రగిలిస్తుందని ఆమెకు తెలియదు.

ఒక రోజు అది ఎంతవరకు వెళ్లిందంటే, శంకర్ సంజనతో తన సాయంత్రం కలయిక ముగిసిన వెంటనే శివ గురించి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నాడు.

సమయం రాత్రి తొమ్మిది. శంకర్ తన ఇద్దరు మిత్రులతో అక్కడికి చేరుకున్నప్పుడు శివ షాపు మూసివేయబోతున్నాడు. శివ అతన్ని లోపలికి స్వాగతించి డ్రింక్స్ ఆఫర్ చేశాడు.

శంకర్ ఈ ప్రతిపాదనను నిర్మొహమాటంగా తిరస్కరించాడు. శివని బెదిరించేలా పెద్ద గొంతుతో మాట్లాడాడు.

“గుర్తుంచుకో, సంజన నా మనిషి. ఆమె త్వరలో నా భార్య కానుంది. నువ్వు ఆమెతో సన్నిహితంగా ఉండడం నాకు ఇష్టం లేదు. ఎక్కువ జోక్యం చేసుకుంటే, నేను నిన్ను చంపుతాను.”

“సర్, ఇది దారుణం. ఆమె నా భాగస్వామి. ఆమె ఈ స్టోర్‌లో పెట్టుబడి పెట్టారు. ఆమె ఆ హోదాలో మాత్రమే నన్ను కలుస్తున్నారు. మీరు లేనిపోని విషయాలు ఎందుకు ఊహించుకుంటారు…”

శివ మాటలు పూర్తి కాకుండానే, శంకర్ స్నేహితుడు అతని ముఖం మీద కొట్టాడు.

“హే, మీరు ఎవరు? నన్ను ఎందుకు కొడుతున్నారు?”

ఆ ముగ్గురు కలిసి శివని కొట్టడం ప్రారంభించారు. షాపులో మరెవరూ లేరు. సేల్స్ గరల్స్ అప్పటికే బయలుదేరారు.

అదృష్టవశాత్తూ శివ కోసం సెక్యూరిటీ గార్డు పరిగెత్తుకుంటూ వచ్చాడు. దాడి చేసినవారు అక్కడి నుంచి పారిపోయారు.

గార్డు ఆందోళనతో అడిగాడు – “అయ్యా, ఆ గుండాలు ఎవరు? వారు మీపై ఎందుకు దాడి చేశారు?”

“వాళ్ళు రౌడీ కస్టమర్లు. భారీ తగ్గింపు కావాలట. నేను కుదరదన్నాను…” శివకి అబద్ధం చెప్పడం కూడా సరిగ్గా రాదు.

గార్డు నమ్మలేనట్టుగా చూస్తుండగా, శివ మరికొంత జోడించడానికి తొందరపడ్డాడు, “మేడమ్‌కి ఈ విషయం తెలియనీయద్దు. ఆమె కలత చెందుతారు. సరేనా?”

గార్డు తల ఊపి వెళ్లిపోయాడు. అతనికి ఇతర ఆలోచనలు ఉన్నాయి. ఏదో తీవ్రమైన తప్పు జరిగిందని అతనికి తెలుసు.

షాపుకి వచ్చిన కార్ల రిజిస్ట్రేషన్ నంబర్లను రాసుకునే అలవాటు అతనికి ఉంది. అతను తిరిగి రిజిస్టర్ వద్దకు వెళ్లి కారు నంబర్ చూశాడు. అనంతరం తన మొబైల్ నుంచి కాల్ చేశాడు.

శివుడు స్తంభించిపోయాడు. శంకర్ తనను అసహ్యించుకున్నాడని అతనికి తెలుసు. సంజన తనకు సన్నిహితంగా ఉంటున్నందున శంకర్ అసూయతో రగిలిపోయాడని అతనికి తెలుసు. కానీ శంకర్ వ్యక్తిగత హింస స్థాయికి దిగజారుతాడని శివ ఎప్పుడూ ఊహించలేదు.

ఈ సంఘటన గురించి ఎవరితోనూ… ప్రత్యేకంగా సంజనతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడు.

శివుడు అతి కష్టం మీద రెస్ట్ రూమ్‌లోకి నడిచాడు. తనను తాను అద్దంలో చూసుకున్నాడు.

అతని ముఖం వాచి ఉంది. తను ఇలా ఇంటికి వెళ్ళలేడు.

అది విపత్తును ఆహ్వానిస్తుంది. అతని అక్క, పిన్ని ఖచ్చితంగా నిజం కనుగొని ఈ విషయాన్ని సంజన దృష్టికి తీసుకువెళతారు.

శివ సెక్యూరిటీని పిలిచి కొన్ని వేడి నీళ్ళు అడిగాడు.

***

వేడి నీళ్ళు రాకముందే, చాలా కోపంగా ఉన్న సంజన షాపులోకి ప్రవేశించింది.

“శివా” అంటూ ఆమె అరిచింది, తనకేదో హక్కున్నట్టు.

“శంకర్ ఇక్కడికి వచ్చాడా?”

“లేదు మేడమ్.”

“చంపేస్తాను శివా. అబద్ధాలు చెప్పకు.”

“మేడమ్.. ఆఁ… ఏమీ లేదు… చిన్న…”

“శంకర్ తన ఇద్దరు అనుచరులతో వచ్చి నిన్ను కొట్టాడా?”

ఈ సంఘటన గురించి చెప్పేటప్పుడు సెక్యూరిటీ గార్డు సంజనకి కారు నంబర్ చెప్పాడు. అది శంకర్ కారు అని సంజనకు తెలిసింది.

“నేను ఇప్పుడు అతన్ని చంపబోతున్నాను.”

“మేడమ్.. ప్లీజ్.. మేడమ్.. అతను పొజెస్సివ్‌గా ఉన్నాడు. అంతే. అతను మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, నేను మీతో మాట్లాడటం భరించలేకపోయాడు. ఇది ప్రేమకు చిహ్నం, మేడమ్, అంతే తప్ప మరేమీ కాదు.”

“నోరు మూసుకో శివా. అమరవీరుడిగా ఉండటానికి ప్రయత్నించవద్దు. ఇది నా జీవితం. నేను అతనిలాంటి హింసాత్మక వ్యక్తిని వివాహం చేసుకుంటే నా జీవితం నరకం అవుతుంది.”

“ఇది చపలత్వంతో జరిగిన సంఘటన మేడమ్. ఒక రకమైన ఊహించని భావోద్వేగ ప్రకోపం. దయచేసి దీనిని మరిచిపొండి.”

శివ సంజనను ఓదార్చడానికి ప్రయత్నించాడు. కానీ అది పని చేయలేదు. సంజన కొద్దిసేపు మాట్లాడలేదు. చివరగా ఆమె అన్ని భావోద్వేగాలతో కూడిన స్వరంతో చెప్పింది.

“నాకు అయోమయంగా ఉంది శివా. నేను రెండు నెలలు శంకర్‌ను చూడను.  ఆలోచించుకోడానికి నాకు కొంత సమయం కావాలి. రెండు నెలల తర్వాత నేను ఏదో ఒక మార్గం నిర్ణయించుకుంటాను.”

శివ దగ్గర వీడ్కోలు తీసుకోకుండా షాపు నుండి వెళ్లిపోయింది సంజన.

ఇంతలో శివ సెల్ ఫోన్ మోగింది. వినూ.

“శివా, నువ్వు 20 నిమిషాల్లో ఇక్కడకు రావాలి, వెంటనే.”

“ఇప్పుడా? రేపు కలుద్దామా? నీకు తెలుసా, నాకు కాస్త…. బాలేదు.”

“ఇది క్లాస్ వన్ ఎమర్జెన్సీ శివా. నువ్వు ఇక్కడ ఉండాలి. సాకులు చెప్పకు.”

శివ ప్రతిస్పందన వినకుండానే వినూ డిస్‌కనెక్ట్ చేశాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here