అలనాటి అపురూపాలు-11

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

బాలీవుడ్ అతి పెద్ద విషాదం – సయీదాఖాన్ జీవితం.

[dropcap]సి[/dropcap]నీ ప్రపంచం ఒక మాయ ప్రపంచం. తళుకు తళుకు మనే తారలు, జిగేల్మనే మెరుపు తీగలతో నిండిన ఒక మాయా ప్రపంచం. కళ్ళు మిరుమిట్లు గొలిపే వెలుతురు వెనక వున్న అంతులేని చీకటి బయటివారికి కనపడదు. జిలుగు వెలుగుల తళుకు తారల హృదయలోతుల్లో బడబానలాల విస్ఫోటనాలు అనుభవించేవారికి తప్ప బయటివారికి తెలియవు. వారు ఊహించలేరు కూడా. అలాంటి ఒక తళుకుతార సయీదాఖాన్ విషాద గాథ ఇది.

సయీదాఖాన్ ఓ చిన్న నటి. 1960లో ‘అప్నా హాత్ జగన్నాథ్’ అనే సినిమాతో కెరీర్ ప్రారంభించారు. ఆమె ఎక్కువగా – వాంటెడ్-1961, ఫ్లాట్ నెంబర్ 9 (1961), మోడర్న్ గర్ల్ – 1961, హమ్ మత్‌వాలే నౌజవాన్ – 1961, మై షాదీ కర్నే చలా – 1962, ఏక్ సాల్ పహలే -1965, మై హుం అల్లాదీన్ (1965), సింద్‌బాద్, ఆలీబాబా అండ్ అల్లాదీన్ (1965) తదితర బి, సి గ్రేడ్ సినిమాలలో నటించారు. ‘ఉస్తాదోం కీ ఉస్తాద్‌’ (1963), ‘ఏ రాత్‌ ఫిర్‌ న ఆయెగీ’ (1966), ‘విక్టోరియా నెం. 203’ (1972) వంటి సినిమాలకు ప్రసిద్ధి చెందిన బ్రిజ్ సదానా (దర్శకనిర్మాత)ను ఆమె వివాహం చేసుకున్నారు. పెళ్ళయ్యాక ఆమె, హిందూమతం స్వీకరించారు. సయీదా, బ్రిజ్ లకు నమ్రత అనే కూతురు, కమల్ అనే కొడుకు పుట్టారు.

21 అక్టోబర్ 1990 నాడు ఆమె జీవితంలో అతి పెద్ద విషాదం ఎలా ఎదురైందో చదవండి: ఆ రోజు ఆమె కొడుకు కమల్ పుట్టినరోజు. ఈ దుర్ఘటన వాళ్ళ బంగ్లా ‘జల్ కమల్’ లో అర్ధరాత్రి సంభవించింది…

కమల్ తండ్రికి మద్యంతో ఎప్పుడూ సమస్య ఉంది. అందరితోనూ స్నేహంగా ఉండే వ్యక్తీ, ప్రతిభావంతుడైన దర్శకనిర్మాత అయిన బ్రిజ్ – మద్యం నోట్లో పడగానే ఓ మృగంగా మారిపోయేవారు. తను కొత్తగా సంపాదించిన రివాల్వర్‌తో భార్యా పిల్లల్ని బెదిరించిన ఉదంతాలు ఎన్నో ఉండేవి. ఒకసారి కమల్‌కి ఎనిమిదేళ్ళు ఉండగా – అమ్మ సయీదాని బెదిరించడానికి నాన్న గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ ఘటన తర్వాత సయీదా ఖర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదిచ్చి ఎఫ్‌ఐఆర్ దాఖలు చేశారు. పోలీసులు ఆ .32 బోర్ స్మిత్ అండ్ బెస్సన్ రివాల్వర్‌ని స్వాధీనం చేసుకున్నారు. తాగి ఉండగా బ్రిజ్ ఎప్పుడైనా విచక్షణ కోల్పోయి తన కుటుంబానికి హాని చెయ్యవచ్చని – సయిదాకి ఆప్త మిత్రురాలైన నర్గిస్ దత్‌ భయపడ్డారట. అందుకని తనకి తెలిసిన పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ రివాల్వర్‌ని తిరిగి బ్రిజ్‌కి ఇవ్వకుండా చూశారట. రివాల్వర్‌ని తిరిగి పొందడానికి బ్రిజ్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అది పదేళ్ళ పాటు పోలీసుల లాకర్‌లోనే ఉండిపోయింది. పదేళ్ళ తర్వాత, తనకు, తన కుటుంబానికి ఖలిస్థాన్ తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని పిటీషన్ పెట్టుకుంటే, బ్రిజ్ వినతిని మన్నించారు పోలీసులు. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం తన లైసెన్స్‌డ్ రివాల్వర్ కావాలని బ్రిజ్ పిటీషన్‌లో పేర్కొన్నారు. ఇక తప్పక, పోలీసులు ఆ తుపాకీని ఆయనకి ఇచ్చేసారు. అలా ఇవ్వడమే బాలీవుడ్‌లో అత్యంత దారుణమైన విషాదానికి నాంది పలికింది. ఆ తుపాకీ నుంచి వెలువడిన మూడు బుల్లెట్ షాట్లు కమల్ జీవితాన్ని పూర్తిగా మార్చేసాయి.

ఆ రోజు కమల్ 20వ పుట్టినరోజు. పుట్టినరోజు పార్టీ చేసుకుని ఇద్దరు మిత్రులతో కలిసి అప్పుడే ఇంటికి వచ్చాడు కమల్. మిత్రులని తీసుకుని మొదటి అంతస్తులో ఉన్న తన గదిలోకి వెళ్ళాడు.  అంతలో అతనికి మెట్ల దగ్గర నుంచి తుపాకీ పేలుడు చప్పుడు వినిపించింది. కమల్, అతని మిత్రులు గబగబా క్రిందకి వచ్చి చూశారు. అమ్మ సయీదా, సోదరి నమ్రత రక్తపు మడుగులో పడి ఉన్నారు. మరుక్షణమే తండ్రి తనకు తుపాకీ గురిపెట్టడం చూశాడు కమల్. బ్రిజ్ గురి ఎప్పుడూ తప్పేది కాదు, ఎంత తాగి ఉన్నా లక్ష్యం ఛేదించేవాడు. కమల్ గబుక్కున నేల మీద పడుకునే ప్రయత్నం చేసినా, మూడవ బుల్లెట్ అతని మెడలో దూసుకుపోయింది. నాల్గవ బుల్లెట్ ఓ మిత్రుడి మణికట్టుకి తాకింది. కుటుంబ సభ్యులని అందరిని కాల్చి చంపానని భావించిన బ్రిజ్ తన గదిలోకి వెళ్ళి మంచం మీద కూర్చున్నారు. కొన్ని క్షణాల తర్వాత లేచి తలుపుకి లోపల్నించి గడియ పెట్టుకున్నారు.

తండ్రి వెళ్ళిపోయాక, కమల్ లేచి అమ్మని, సోదరిని బాబా హాస్పిటల్‌కి తీసుకెళ్ళేందుకు అంబులెన్స్‌కి ఫోన్ చేశాడు. కమల్, తన ఇద్దరు మిత్రులు అమ్మనీ, సోదరినీ ఆసుపత్రికి తీసుకువెళ్ళేసరికి, వాళ్ళిద్దరు చనిపోయారు. కమల్‌కి కూడా చాలా రక్తం పోయిందని డాక్టర్లు గ్రహించారు, వెంటనే ఆపరేషన్ చెయ్యకపోతే బ్రతకడని అన్నారు. తెల్లవారు జామున మూడు గంటలకి కమల్‌ని హిందూజా హాస్పటల్‌కి షిఫ్ట్ చేశారు. అక్కడ అతనికి ఆపరేషన్ చేసి బుల్లెట్ బయటకి తీసారు. అయితే ఆ మర్నాటికి ఆ కుటుంబంలో కమల్ ఒక్కడే సజీవంగా మిగిలాడు. ఆ రాత్రి తన గదిలోకి వెళ్ళి తలుపు వేసుకున్న బ్రిజ్, హఠాత్తుగా తను చేసిన పని పర్యవసానాలను గ్రహించారు. బాధతోను, నేరభావనతోను క్రుంగిపోయారు. తుపాకీతో తన నోట్లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. బుల్లెట్ ఆయన పుర్రె నుంచి బయటకు దూసుకుపోయింది.

ఈ దుర్ఘటనతో కమల్ ఎన్నటికీ సమాధానపడలేకపోయాడు. అతనికి శాంతి లభించలేదు. మచ్చతో జీవించడం అతనికి ఇష్టం లేకపోయింది. చాలా కాలం తర్వాత, ఈ దుర్ఘటన జరిగిన 20 ఏళ్ళకి, కమల్ – ఆ రోజు ఏం జరిగిందో వివరిస్తూ ఒక లఘు చిత్రం రూపొందించి, యూట్యూబ్‌లో పెట్టాడు. వాళ్ళ నాన్న ఆ రోజు ఎందుకు కాల్పులు జరిపాడో తనకి తెలియదని కమల్ పేర్కొన్నాడు. ఇందుకు కారణం ఆర్థిక సమస్యలు కావనీ, రకరకాల ప్రాపర్టీస్‍లో తమ కుటుంబం పెట్టుబడులు పెట్టిందని చెప్పాడు. కాబట్టి డబ్బు ఇందుకు కారణం కాదని అన్నాడు. ఒక ‘వ్యక్తి’ గురించి అమ్మానాన్నలు పోట్లాడుకునేవారని తనకి తెలుసని చెప్పాడు. ఎవరినీ అప్రతిష్ఠ పాలు చేయకూడదని తానా వ్యక్తి పేరు వెల్లడించనని అన్నాడు. ప్రతీ వ్యక్తిలోనూ ఒక ఒక ఊహకందని వ్యక్తి ఉంటాడని, కొందరు దురదృష్టవంతులు దాని అనూహ్యమయిన దుష్ప్రభావానికి  బలయిపోతుంటారని ఒకసారి మహేష్ భట్ అన్న మాటలను కమల్ గుర్తు చేసుకున్నాడు. తన తండ్రిలో ఉన్న అవివేకతకి కారణం అదేనని కమల్ భావించాడు.

16 ఏళ్ళ వయసులో కమల్ ఒక అసిస్టెంట్ డైరక్టర్ అయ్యాడు, తండ్రి వెంట షూటింగులకి, ఎడిటింగ్ రూమ్‌కీ, ల్యాబ్ లోకి వెళ్తుండేవాడు. ‘క్షమించడం వల్ల నువ్వు గతాన్ని మార్చలేకపోవచ్చు, కాని భవిష్యత్తును మార్చగలవు’ అని తన తండ్రి ఎప్పుడూ చెబుతూ ఉండే మాటల్ని గుర్తు చేసుకున్నాడు కమల్.

తన 21 ఏళ్ళ నుంచి 27 ఏళ్ళ వరకు కమల్ ప్రతీ రోజూ సినీ పరిశ్రమలో పనిచేశాడు. ఆ విషాదం తాలూకు ప్రభావం నుంచి చక్కగా, వేగంగా బయటపడ్డాడు. ఆ తర్వాత రెండున్నర ఏళ్ళకి ‘బేఖుదీ’ అనే సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది తనూజ  పెద్ద కూతురు కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌.      అది ఆమెకు మొదటి సినిమా. 1992లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విఫలమైంది. అతని తర్వాత సినిమా ‘రంగ్’ హిట్ అయ్యింది. దురదృష్టవంతురాలైన దివ్య భారతి ఇందులో హీరోయిన్. తర్వాత ఏడేళ్ళ కాలంలో సుమారు ఓ డజను చిత్రాలలో నటించినా అవి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఈ సమయంలోనే అతను మహేష్ భట్ కూతురు, నటి పూజాభట్‌తో లివిన్ సంబంధం పెట్టుకోడం, వాళ్ళ ప్రైవేట్ ఫోటోలు వివిధ మ్యాగజైన్‌లలో రావడం జరిగింది. తర్వాత వాళ్ళిద్దరూ విడిపోయారు. కొంత కాలం బ్రేక్ తీసుకుందామని కమల్ రాఫ్టింగ్, స్కూబా డైవింగ్ వైపు మళ్ళాడు. ఆధ్యాత్మికత వైపు కూడా ప్రయత్నించాడు, కాని సఫలమవలేదు. ఈ గందరగోళంలోనే కమల్ పెళ్ళి చేసుకున్నాడు. తన కుటుంబం తుడిచిపెట్టుకుపోయిన చాలా ఏళ్ళకు 2011లో కమల్ మేకప్ ఆర్టిస్ట్ అయిన లిసా జాన్‌ని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె క్రైస్తవ మతస్థురాలు. ఈ పెళ్ళితో వాళ్ళు తమకంటూ ఓ కుటుంబాన్ని సృష్టించుకున్నారు. కొడుకుకి అంగద్ అనీ, కూతురికి తన సోదరి పేరిట నమ్రత అని పేరుపెట్టాడు కమల్. తన నిర్మాణ సంస్థకి కొడుకు పేర ‘అంగద్ ప్రొడక్షన్స్’ అని పేరు పెట్టాడు. తమ కుటుంబంలో జరిగిన విషాదంపై తన దృక్పథాన్ని తెలియజేయడానికి ఏడు నిముషాల లఘు చిత్రం ‘మూమెంట్ ఆఫ్ పాస్’ తీశాడు. నటుడు ప్రేమ్ చోప్రా అందులో తండ్రి పాత్ర పోషించారు. ఆ లఘుచిత్రాన్ని యూట్యూబ్‌లో చూడవచ్చు.

బ్రిజ్ సదానా తన కుటుంబాన్ని ఎందుకు కాల్చి చంపాడో ఆ రహస్యాన్ని ‘ఫిల్మ్‌ఫేర్’లో కొంతమేరకు బయటపెట్టారు రచయిత్రి షాగుఫ్తా రఫీక్. మహేష్ భట్ విశేష్ ఫిల్మ్స్ అనుసరణలైన ‘రాజ్ 2’, ‘మర్డర్ 2’ వంటి సినిమాలకు కథ అందిచారామె. ఆమె ఇలా చెప్పారు – “నా బాల్యమంతా తికమకగా సాగింది. నన్ను కన్న తల్లి ఎవరో నాకు తెలియదు. అన్వారీ బేగం (పాత తరం నటి) నన్ను పెంచారు, ఆమెనే నేను అమ్మగా భావిస్తాను. అయితే నేను మా అక్క, నటి సయీదా కూతురునని చాలా పుకార్లు ఉన్నాయి. నాకు రెండేళ్ళ వయసులో సయీదాకి బ్రిజ్ సాబ్‌తో పెళ్ళయ్యింది. అన్వారీ బేగంతో నన్ను చూసే పరిశ్రమలోని వ్యక్తులు చాలా మంది “అమ్మమ్మతో వెళ్తున్నావా?” అనేవారు. ఇదంతా నాకు తికమకగా ఉండేది.  నాలో సయీదా పోలికలు ఉన్నాయని చాలామంది నమ్మేవారు. అంతకు మించి మా మధ్య సామ్యం లేదు. నాతో ఎప్పుడూ ఉండే అన్వారీ బేగమే మా అమ్మని నేను రాజీపడ్డాను. అన్వారీ బేగం రెండవ భర్త పేరు మొహమ్మద్ రఫీక్. అందుకని నేను షాగుఫ్తా రఫీక్ అయ్యాను. నేనెవరో తెలియదు కాబట్టి బ్రిజ్ సాబ్ నన్ను బాగా అసహ్యించుకునేవారు. అందుకని తన కోపాన్ని సమర్థించుకునేవారు. ఆయన ఎంతో అయోమయంలో ఉండేవారు, ఆయన సినిమాలు ఫ్లాప్ అయ్యేవి. అందుకే ఆయనలా చేశారు. 21 అక్టోబర్ 1990 నాడు ఆ దుర్ఘటన జరగగానే, పనిమనిషి పరిగెత్తుకుంటూ మా ఇంటికి వచ్చి, సమాచారం అందించింది. ఆసుపత్రికి తీసుకువెళ్తున్నప్పుడు సయీదా అక్క నా ఒళ్ళోనే ఉంది, ఎంతో రక్తం పోయింది. ‘నమ్రత చనిపోయింది, నాకిక బ్రతకాలని లేదు’ అంటూ పదే పదే అంది. అక్క చనిపోయినప్పుడు నాకు 25 ఏళ్ళు. ఆమెను నేను అక్కలానే భావించాను, తల్లి రూపంలో ఎప్పుడూ చూడలేదు. కానీ ఆమె నా కోసం నిలబడిన తీరు, నా కోసం ఏడ్చిన విధానం, నా కోసం పోరాడిన పద్ధతి చూస్తే…. అక్క కంటే కొంచెం భిన్నమైన బంధమేనని అనాలి”.

ఎక్కడ మొదలైంది ఇదంతా… ఎలా ముగిసిందో చూడండి… అత్యంత విషాదకరం!

ఎడమ నుంచి కుడికి: బ్రిజ్ సదానా, అతని భార్య సయీదా ఖాన్; సయీదా ఖాన్, కమల్ సదానా, అన్వారీ బేగం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here