“కాలం విలువ తెలియాలంటే ఏమి చేయాలనా?” అంటా
బజ్జన్నని అడిగితిని.
“ఏమి చేయాలని ఏచన చేయిరా” నగతా అనె అన్న.
“నీ కొవ్వు పట్టిన మాటలు యినియిని నాకి సాలయిందినా
అడిగిందానికి నేరుగా చెప్పునా, ఏల ఇట్ల మండిస్తావు” అదో మాద్రిగా
అంట్ని.
“అదేలరా అట్లంటావు తమాషాకి అంట్నిరా, కష్టపడితే
కాలం విలువ తెలుస్తుందిరా” అంటా తిరగా అనె.
“ఇన్నేండ్ల నింకా కష్టపడి కష్టపడి ఇబుటికి 43 ఏండ్లు
మిందేసుకొని వుండాను, ఇది సాల్దా?” అడిగితిని.
“ఇన్నేండ్లలా నీకి కాలం విలువ ఏమని తెల్యేదా?”
“దానికేం బాగ్యం శానాకితాలు తెలిసె. కాని దీని కన్నా
ఇంగేమన్నా వుందేమో తెలుసుకోవాలని అడిగితినినా?”
“అట్లనారా”
“ఊనా”
“అయితే సచ్చిపోతావుండే వాని ఉసురు పోకుండా
కాపాడు, రవంత సేపయినా వాడు కండ్లు మూయకుండా సూడి
అబుడు తెలుస్తుంది కాలం విలువ ఏమని” అని చెప్పి పోయ అన్న.
***
కితాలు = సార్లు