[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా మంజూ బోరా దర్శకత్వం వహించిన బోడో సినిమా ‘దావూ హుడినీ మథాయి’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘దావూ హుడినీ మథాయి’ (బోడో)
[dropcap]బో[/dropcap]డో లేదా బోరో ప్రజలు అస్సాం రాష్ట్రంలో రెండో మెజారిటీ వర్గానికి చెందుతారు. 14 లక్షల జనాభా గల ఈ వర్గం వ్యవసాయ వృత్తిలో వుంటారు. 1980లలో ప్రత్యేక బోడోలాండ్ ఉద్యమంలో పావులుగా మారారు. బోరో భాష మాట్లాడే సాంస్కృతిక చైతన్యం గల ఈ వర్గం నుంచి మొట్టమొదటి సినిమా, 1986లో ‘అలవరన్” (ఉషోదయం)గా వచ్చింది. రావడం రావడం కేంద్ర ప్రభుత్వ ఉత్తమ ప్రాంతీయ చలనచిత్ర అవార్డూ అందుకుంది. చేతబడి సమస్య మీద ఈ సినిమా తీశారు. దీని దర్శకుడు జాగ్డో బొడోసా. ఆ తర్వాత నుంచీ నేటి వరకూ ఓ 250 సినిమాలు తీసి వుంటారు. చాలా వాటికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులే అందుకున్నారు. ఈ నేపథ్యంలో అస్సామీ కథానికల రచయిత్రయిన దర్శకురాలు మంజూ బోరా, ఒక కొమ్ములున్న గుడ్లగూబ పాటగా, బోడో ప్రజల జీవన్మరణ సమస్యని వాళ్ళ బోరో భాషలోనే ప్రపంచానికి ఎత్తి చూపింది.
1999లో మంజూ బోరా రంగ ప్రవేశం చేస్తూనే ‘బైభబ్’ (వైభవం) అనే కవితాత్మకంగా తీసిన చలనచిత్రంతో జాతీయ అవార్డు, గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు, ఢాకా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో మరొక అవార్డూ పొందింది. ఆ అవార్డులు మూడూ ఉత్తమ చలన చిత్రం కేటగిరీలోనే. ఆ తర్వాత ఇంకో 8 అస్సామీ సినిమాలూ తీస్తూ పోయింది. తొమ్మిదో ప్రయత్నంగా 2015లో, తొలిసారిగా బోరో భాషలో ‘దావూ హుడినీ మథాయి’ (కొమ్ముల గుడ్లగూబ పాట) తీసింది. ఇది మాంట్రియల్లో, ముంబాయిలో, కేరళలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శనకి నోచుకుని ప్రశంసలు పొందింది. తీసిన 8 అస్సామీ కళాత్మకాల్లో నాల్గిటికి 5 జాతీయ, అంతర్జాతీయ అవార్డులూ దక్కించుకుంది.
ప్రసిద్ధ అస్సామీ దర్శకుడు జానూబారువా సినిమా కళకి ప్రభావితురాలైన మంజు, తాజాగా 2018లో ‘బిష్కన్యర్ దెషోత్’ (విష కన్యల రాజ్యంలో) అనే అస్సాంలో మరొక భాషైన పంగ్చెన్పా లో తీసింది. నాటు వైద్యంతో ఆదివాసీ స్త్రీల ప్రాణాలు హరిస్తున్న ఆదివాసీ వృద్ధకన్యల కథగా దీన్ని తెరకెక్కించింది. దీనికీ ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డు పొందింది. అస్సామీ సినిమాలకి మంజూ బోరా మకుటంలేని మహరాణిలా వెలుగొందుతోంది.
తన మూలాలు మరువని వ్యక్తిగా – అస్సాంలోని పేదరికంతో బాటు, సామాజిక, సాంస్కృతిక అణిచివేత, రాజకీయ సంక్షోభం ఇవన్నీ కలిసి సృష్టించిన అర్థంలేని తీవ్రవాదంతో, మరోవైపు రాజకీయ నాయకుల, అవినీతిపరులైన అధికారుల స్వార్థంతో, అలమటిస్తున్న గ్రామీణ ప్రజల గురించే ఆమె నిత్యం మాట్లాడుతుంది. ఈ నేపథ్యంలోనే తీవ్రవాద చర్యలకీ, ప్రభుత్వ తీవ్రవాద వ్యతిరేక చర్యలకీ నడుమ బలైన అమాయక బోడో గ్రామీణుల కథగా, రేప్ బాధితురాలి దృక్కోణంలో దీన్ని తెరకెక్కించింది…
కథ
రైమలి (రేష్మా ముషాహరి) ఆ గ్రామంలో షాపు కెళ్తుంది. అక్కడ రేడియో వార్తలు ఉద్రేకంగా వింటూ నిల్చుండి పోతుంది- “ఆకాశవాణి వార్తలు… ఈ తెల్లవారు ఝామున ఖోక్రజార్ జిల్లా సెర్ఫన్గురి సమీపంలోని ద్విముగురిలో జరిగిన ఎదురు కాల్పుల్లో అయిదుగురు తీవ్రవాదులు మృతి చెందారు… ఒక జవాను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కాల్పుల మధ్య కొందరు తీవ్రవాదులు తప్పించుకుని పారిపోయారు. ఘటనా స్థలంలో మూడు ఏకే 56 రైఫిళ్లు, మూడు నాటుబాంబులు, మరికొన్ని తూటాలు భద్రతా దళాలకు లభించాయి…” వెంటనే ఆమెకి గత జీవితపు దృశ్యాలు మెదుల్తాయి…ఆ చిన్నప్పటి జీవితం, ఆ జీవితంలో చిన్నారి కూతురుగా (జాస్మిన్ హజోవారీ) తను, అమ్మా నాన్నలు (నీతా బాసు మటారీ, అజయ్ కుమార్ బోరో), నానమ్మ (అహల్యా దైమరీ), కుటుంబ వ్యవసాయం… నానమ్మని తను అడిగేది, కొమ్ములున్న గుడ్లగూబ పాట ఎప్పుడు విన్పిస్తుందని…
గుడ్లగూబ పాటేమో గానీ తుపాకీ మోతలే విన్పించేవి. చావుకేకలే మార్మోగేవి. గ్రామాల్లో అన్నలు, అన్నల కోసం పోలీసులు. వాళ్ళూ వాళ్ళూ కాల్చుకుంటూ ప్రజల్ని కూడా కాల్చేసేవాళ్ళు. ప్రజల్ని అనుమానితులుగా, శత్రువులుగా చూసి వేధించేవాళ్ళు, చిత్ర హింసలు పెట్టేవాళ్ళు. చంపేసేవాళ్ళు. సైకిళ్ళ మీద పోతున్న స్కూలు పిల్లల్ని సైకిళ్ళ మీదే కాల్చేసేవాళ్ళు. పిట్టల్లా రాలిపోయే వాళ్ళు పిల్లలు. చావులకి లెక్కేలేదు. అలా తను పెరిగింది. అతణ్ణి (టోనీ బాసు మటారీ) ప్రేమించింది. జీవితం చాలా అందంగా కన్పించింది చుట్టూ భయ వాతావరణంలోనూ. అంతలో ఒకరొకరే వెళ్ళిపోవడం మొదలెట్టారు. కాల్పులకి అమ్మానాన్నలు పోయారు. టౌనుకి వెళ్లి వస్తానన్న అతను కూడా మళ్ళీ తిరిగి రాలేదు. నానమ్మే మిగిలింది. తనూ మిగల్లేదు. మానాన్ని దోచేసుకుని చీకటి కూపంలో పడేశారు వాళ్ళు. తను గుడ్ల గూబ పాటకోసం నిరీక్షిస్తూ ఇలా… ఇక లాభంలేదని నదిలోకి దూకి అలా…
ఎలా వుంది కథ
రశ్మి రేఖా బోరా ‘దావో హుడుర్ గాన్’ అన్న నవల రాసింది. ఆ నవల ఆధారంగా మంజూ బోరా సినిమా తీసింది. బోడో ప్రజలకి ఒక నమ్మిక వుంది. అన్యాయాలకి బలై చనిపోయిన మనిషి గుడ్లగూబగా పుట్టి వచ్చి, ఇంటి చెట్టు కొమ్మల్లో కూర్చుని పాటలు పాడతాడని. రైమలీ పాత్ర దృక్కోణంలో ఈ కథ చిత్రీకరించిన మంజూ, తీవ్రవాద – రాజ్య హింసలకి బలైన తన ప్రేమికుడి పునర్జన్మని చూడాలని, పాట వినాలనీ తల్లడిల్లే కథగా మాత్రమే దీన్ని రూపొందించింది. తీవ్రవాదం నేపథ్యంలోకి వెళ్ళలేదు. తీవ్రవాదం- రాజ్యం తప్పొప్పుల చర్చ చేయలేదు. పరిష్కారాలూ చెప్పదల్చుకోలేదు. ఆమె దృష్టంతా తీవ్రవాదుల, భద్రతా దళాల ఆగడాలకి బలై పోతున్న గ్రామీణుల మీదే. జాతి పేరుతో, మతం పేరుతో, భాష పేరుతో గత రెండు దశాబ్దాలుగా జరిగిన హింసకి పదివేల మంది బోడో గ్రామీణులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్మరణాలు ఎత్తి చూపుతూ నిరసన ప్రకటించడమే ధ్యేయంగా ఈ బోడో పాట తీసింది.
గత 35 ఏళ్లుగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద హింసకి 40 వేలమంది అమాయక ప్రజలు బలయ్యారు. ఉల్ఫా, యూపీడీఎస్, బీఎల్టీఎఫ్, ఎన్డీఎఫ్బీ మొదలైన తీవ్రవాద సంస్థల వేర్పాటు ఉద్యమాలతో ప్రజలకే సంబంధమూ లేదు. వాళ్ళు పేద ఆదివాసీలు, దిన కూలీలు, ఎకరం అరెకరం పండించుకుని బతికే వాళ్ళు. ప్రత్యేక నాగాలాండ్, ప్రత్యేక అస్సాం, ప్రత్యేక బోడోలాండ్ వాళ్ళ కవసరం లేదు. అయినా వాళ్ళు అమరులై పోతున్నారు. ఇక్కడే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా తీవ్రవాద దళాలు, భద్రతా దళాలు ఒక్క క్షణం ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తోందీ గుడ్లగూబ పాట!
నిర్మాణ విలువలు
ప్రధాన పాత్ర నటించిన రేష్మా ముషాహరి, అంతర్ముఖీనురాలై చైతన్య స్రవంతి పంథాలో తన జీవితాన్ని తరచి చూసుకునే నిశ్శబ్ద బాధితురాలిగా గుర్తుండే నటన చేసింది. సుఖాల నుంచీ దుఃఖాల దాకా వేసే అడుగుల్లో మోద ఖేదాల అభినయాల్లో ఆమె తిరుగులేని నటి అని చెప్పొచ్చు. కెమెరా వర్క్ ఆమె పాత్ర ఆకర్షణని మరింత పెంచింది. దర్శకురాలి కవితాత్మక చిత్రీకరణలో ఆమే కాదు, ఆమె చుట్టూ ప్రతీదీ కళాత్మకంగా వెల్లివిరిశాయి వెండితెర మీద – అంటే మనం చూసిన బుల్లితెర మీద. బోడో ప్రాంతపు ప్రకృతి దృశ్యాలు పంచరంగుల్లో ఆశ్చర్య పర్చి, వెంటనే టూరు కట్టేలా చేస్తాయి. ఒకటి గమనించాలి. ఒక అందమైన భావుకతతో కూడిన నేపధ్య వాతావరణంలో హింస చూపించింది దర్శకురాలు. సాధారణంగా ఇలాటి హింసాత్మక కథల్ని ఆ కథలు డిమాండ్ చేసే డార్క్ మూడ్ వాతావరణాన్నే క్రియేట్ చేసి చూపిస్తూంటారు నేటి సినిమాల్లో. దీంతో ద్వంద్వాలు మిస్సవుతూంటాయి. సిడ్ ఫీల్స్ ఎగైనిస్ట్ ది గ్రైన్ వుండాలన్నాడు చిత్రీకరణ. కథ అందంగా వుంటే బ్యాక్ డ్రాప్ భీకరంగా వుండాలి, కథ భీకరంగా వుంటే బ్యాక్ డ్రాప్ అందంగా వుండాలి. ఈ రెండోదే చేసింది దర్శకురాలు. క్రైం నవలా రాణి అగథా క్రిస్టీ ఫేమస్ కొటేషనుంది : న్యూయార్కే ఒక క్రైం స్టోరీ, ఇంకా న్యూయార్క్ నేపథ్యంలో క్రైం స్టోరీ రాయడమేంటని. ఆమె క్రైం స్టోరీలు నిద్రాణంగా వుండే గ్రామీణ వాతావరణంలోనే వుంటాయి.
దర్శకురాలు బోడో ప్రజల జీవితాల్ని, వృత్తుల్ని, సంస్కృతినీ చాలా విపులంగా చూపించింది. అయితే రైమలీ పాత్ర దృక్కోణంలో చైతన్య స్రవంతి ప్రక్రియలో మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులుగా కథ చూపిస్తున్నప్పుడు, కంటిన్యుటీ చెదిరిన సందర్భాలూ వున్నాయి. కథాబలం దెబ్బ తిన్నమాటా నిజం.
కేవలం 22 రోజుల్లో ఈ దృశ్యకావ్యం లాంటి చిత్రీకరణ పూర్తి చేసిన దర్శకురాలు ఎదుర్కొన్న ఇబ్బందులూ వున్నాయి. మేఘాలయా – అస్సాం సరిహద్దుల్లో షూటింగ్ చేస్తున్నప్పుడు అంతా ఉద్రిక్త వాతావరణమే. అక్కడ షూటింగ్ వద్దని ఆర్మీ అధికారులు వారించినా వినకుండా షెడ్యూలు పెట్టుకుంది. చివరి రెండు రోజులు చుట్టుపక్కల ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా షూటింగు ఆపలేదు. పంటలు కోత కొచ్చి అందమైన వాతావరణం. ఈ వాతావరణం మళ్ళీ దొరకదు…