జ్ఞాపకాలు – వ్యాపకాలు – 7

1
3

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

విజయవాడలో 20 నెలలు (నవంబరు 78 – జూన్ 1980):

నా ఉద్యోగ ప్రస్థానంలో నేను విజయవాడలో, ఢిల్లీలో రెండు సార్లు, కడపలో మూడు దఫాలు పనిచేశాను. విజయవాడకు తొలిసారిగా 1978 నవంబరులో వెళ్ళాను. విజయవాడ వెళ్ళవలసి వచ్చిన నేపథ్యం చెప్పాలి. నేను కడపలో 1975 ఆగస్టులో చేరాను. 1978 తొలి రోజుల్లో కొందరు ప్రొద్దుటూరు సాహితీ మిత్రులు నా మీద రకరకాల ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ స్టేషన్ డైరక్టర్ యస్.డి. బవేజా కడపకు ఇన్‍స్పెక్షన్‍కి వచ్చారు. అప్పటికే విజయవాడ ఆకాశవాణి నుండి ఉషశ్రీని కడపకు మార్చాలనే ఆలోచనలో ఉన్నారు. నన్ను విజయవాడకు వెళ్ళమని బవేజా ఆదేశించి ఆర్డరు తెప్పించారు. ఉషశ్రీని కడపకు, నన్ను విజయవాడకు మార్చారు. విద్యా సంవత్సరం మధ్యలో అయినా, నేను ముగ్గురు పిల్లలను అక్కడ స్కూళ్ళలో చేర్చి విజయవాడకు బదిలీపై వెళ్ళాను.

పున్నమ్మతోటలో పాత భవనాలలో స్టూడియోలు, ఆఫీసు నడుస్తున్నాయి. యం. శివప్రకాశం స్టేషన్ డైరక్టరు. సహోద్యోగులుగా బి.ఆర్. పంతులు, ఆర్. విశ్వనాధం, చల్లా ప్రసాదరావు, పి.వి. రమణ, యన్. యం. జి. రామకృష్ణ తదితరులు పని చేస్తున్నారు. సంగీత విభాగం ప్రొడ్యూసర్‌గా సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు వోలేటి వెంకటేశ్వరులు,  నాటక విభాగంలో నండూరి సుబ్బారావు, సి. రామమోహనరావు, స్క్రిప్ట్ రైటర్‌గా ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, నిలయ విద్వాంసులుగా అన్నవరపు రామస్వామి, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, దండమూడి రామమోహనరావు, యన్.సి.వి. జగన్నాథాచార్యులు, సుందరపల్లి సూర్యనారాయణమూర్తి తదితర లబ్ధప్రతిష్ఠులు వ్యవహరిస్తున్నారు. ఉషశ్రీ సెలవుపై వెళ్ళారు.

గోరావీధి – ఏలూరు రోడ్డులో మిత్రులు సాంబశివరావు ఇంట్లో బాడుగకు చేరాము. ఆదివారం నాడు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే ధర్మ సందేహాలు కార్యక్రమాన్ని గత 6 సంవత్సరాలు ఉషశ్రీ నిర్వహిస్తూ రామాయణం పూర్తి చేసి భారతం చెప్పడం నడుస్తోంది. చివరి పర్వాలలోకి వచ్చింది. ఆయన ఆకాశవాణికి ఎనలేని కీర్తి తెచ్చాడు. వెంటనే ఆ బాధ్యత నాపై పడింది. 30  నిమిశాల లైవ్ కార్యక్రమం. నేను, సి. రామమోహనరావుకు శ్రోతల నుండి వచ్చిన సందేహాలకు సమాధానం, భారత వ్యాఖ్యానం కూడా వ్రాసి యిచ్చి రెండు నెలల్లో భారతం పూర్తి చేశాం. 1979 జనవరి నుండి నేను హరివంశం (ఎర్రన) ప్రవచనం మొదలుపెట్టి శిష్యునిగా మల్లాది సూరిబాబును చేపట్టి దిగ్విజయంగా నడిపాను (18 నెలలు).

సాంస్కృతిక రాజధాని:

ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని విజయవాడ. సంగీత, సాహిత్య, కళా, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. 1948 డిసెంబరు 1న విజయవాడ ఆకాశవాణి కేంద్రాన్ని స్థాపించారు. బాలాంత్రపు రజనీకాంతరావు వంటి ప్రసార ప్రముఖులు సంగీత సాహిత్యాలకు, నాటక ప్రసారాలకు పట్టం కట్టిన ప్రదేశం. బాలమురళీకృష్ణ, బందా కనకలింగేశ్వరరావు, జి.వి.కృష్ణారావు, పింగళి లక్ష్మీకాంతం వంటి ప్రముఖులు పని చేసిన కేంద్రం. అక్కడ పనిచేసే అవకాశం నాకు లభించింది.

రాజమండ్రి ఇవతల కొవ్వూరు నుండి నెల్లూరు జిల్లా తడ వరకు ఈ కేంద్ర పరిధి. కార్యక్రమాలకు ఈ కోస్తా జిల్లాలలోని కళాకారులు, కవి, పండితులను పిలిచేవారం. తెలంగాణలోని ఖమ్మం జిల్లాను కూడా కలిపారు. నేను పని చేసే తెలుగు ప్రసంగాల శాక క్రింద ప్రసంగాలు, రూపకాలు, పరిచయాలు, కథలు, కవితలు వస్తాయి. సరసవినోదిని సమస్యా పూరణ కార్యక్రమం, బావగారి కబుర్లు, ధర్మ సందేహాలు, ధ్వని – సాహిత్య సంచికా కార్యక్రమం మా ప్రసారాలలో భాగాలు.  మూడు నెలలకొక షెడ్యూలు తయారు చేసి డైరక్టర్ ఆమోదం పొంది నెల ముందుగా ప్రసంగకర్తలకు కాంట్రాక్టులు పంపేవాదిని. నా సెక్షన్‌లో ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా (సుత్తి) వీరభద్రరావు సహాయకులు.

ప్రసంగశాఖ:

బావగారి కబుర్లను రోజూ ఐదు నిమిషాలకు సరిపడేలా ఆ రోజు వార్తలలో వచ్చిన ప్రముఖ వార్తను గూర్చి వ్రాసి నాకు చూపించేవాడు. దానిని నండూరి సుబ్బారావు, సి. రామమోహనరావు తమదైన శైలిలో చదివేవారు. బాగా పాపులర్ ప్రోగ్రాం అది. ఆదివారాలు ఉదయం 11.30 ప్రాంతంలో ఏలూరు రోడ్డులో మా యింటి నుంచి స్టూడియోకు వెళుతూ మల్లాది సూరిబాబును కలుపుకొని వెళ్ళేవాడిని. ఎర్రన హరివంశంలో కొన్ని పద్యాలను వారం వారం ఆయన రాగయుక్తంగా తంబురా మీటుతు గానం చేసేవాడు. సరిగ్గా 12 గంటలకు శ్రోతల సందేహాలను ఆయన నా శిష్యుదిగా ప్రశ్నల రూపంలో అడిగేవాడు. “అర్జునుడు నిరాయుదుడైన కర్ణుని చంపడం ధర్మ విరుద్ధం కాదా?” వంటి ప్రశ్నలు వచ్చేవి. 10 నిముషాలలో ఐదారు ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడిని. మిగతా 20 నిముషాలు హరివంశ ప్రవచనం. హరివంశాన్ని నేను తర్వాత సిద్ధార్థ పబ్లికేషన్స్ ద్వారా ప్రచురించాను. ఉషశ్రీ సోదరులు పురాణపండ రాధాకృష్ణమూర్తి (రాజమండ్రి) తర్వాత ఆ హరివంశాన్ని పదివేల కాపీలు ప్రచురించారు.

కవి సమ్మేళనాలు:

నా హయాంలో విజయవాడలో ఆహుతులైన ప్రేక్షక సమక్షంలో నేను నిర్వహించిన రెండు ప్రముఖ కవి సమ్మేళనాలు పేర్కొంటాను. 1979 సంక్రాంతి కవి సమ్మేళనానికి దాశరథి అధ్యక్షత వహించగా మధునాపంత్రుల సత్యనారాయణ శాస్త్రి, జంధ్యాల పాపయ్యశాస్త్రి, ఆవంత్స సోమసుందర్, జ్ఞానానంద కవి, ఊటుకూరు లక్ష్మీ కాంతమ్మ, నాగభైరవ కోటేశ్వరరావు, వేగుంట మోహన్ ప్రసాద్‌లు పాల్గొన్నారు.

జూన్ నెలలో మరో కవి సమ్మేళనం విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో జరిపాం. సుప్రసిద్ధ కవులు తుమ్మల సీతారామమూర్తి, ఆరుద్ర, శ్రీశ్రీ, పువ్వాడ తిక్కన సోమయాజి, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, మధునాపంతుల సత్యనారాయణమూర్తి, పురిపండా అప్పలస్వామి, కొలకలూరి ఇనాక్, పులికంటి కృష్ణారెడ్డి, రాజన్న కవి తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు ఖచ్చితంగా కవులను వేదికపైకి ఆహ్వానించాను. 15 మంది కవులు పైకి వచ్చారు. ఆఖరి నిముషం వరకూ శ్రీశ్రీ రాలేదని గాభరా పడ్డాను. మరుక్షణంలో శ్రీశ్రీ ప్రత్యక్షం. అద్భుతంగా కొనసాగిన కవితా సౌరభం. బహుశా తుమ్మల సీతారామమూర్తి పాల్గొన్న ఆకాశవాణి కవి సమ్మేళనం అదే చివరిది.

కవి పండిత మండలి:

కోస్తా జిల్లాలలో ఎందరో సుప్రసిద్ధులైన్ కవి పండితులున్నారు. ఏడాది పొడుగునా వారిని ఏదో ఒక సందర్భంలో ప్రసారాలకు ఆహ్వానించాను. జాతీయ కవి సమ్మేళనంలో తెలుగు కవిగా మధునాపంతుల సత్యనారాయణమూర్తిని ఢిల్లీ పంపాను. విశ్వనాథ కుమారులు అచ్యుత దేవరాయలు అప్పట్లో దూరదర్శన్ చీఫ్ ఇంజనీరుగా ఢిల్లీ లో ఉండేవారు. విజయవాడ దూరదర్శన్ నెలకొల్పే ఏర్పాట్లకు ఆయన విజయవాడ వచ్చారు. నేను వారిని ఇంటర్వ్యూ చేశాను. అచ్చం విశ్వనాథ చదివినట్లు పద్యం చదివారు.

పైడిపటి సుబ్బరామశాస్త్రి, ప్రకాశచంద్ర శతపథి, వింజమూరి శివరామారావు, జంధ్యాల మహతీ శంకర్, బేతవోలు రామబ్రహ్మం, ప్రసాదరాయ కులపతి, ఏలూరిపాటి అనంతరామయ్య, ఇస్మాయిల్,  నాగళ్ళ గురుప్రసాదరావు, కోటగిరి విశ్వనాథరావు వంటి కవులు, పండితులు ఎందరో కార్యక్రమాలకు వచ్చారు. బెజవాడ గోపాలరెడ్డి గవర్నరుగా రిటైరయి, నెల్లూరులో స్థిరపడ్డారు. వారు తొలిసారిగా తమ కవితలు వినిపించారు. వారు వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకుని ఉద్యోగుల సమావేశం ఏర్పాటు చేశాం. గుంటూరు, మచిలీపట్నం, ఏలూరు వంటి నగరాల నుండి అభ్యుదయ కవులు, ప్రాచీన సంప్రదాయ కవులు పలువురు వచ్చారు కార్యక్రమాల రికార్డింగుకు.

ప్రముఖుల గళాలు భద్రపరచడం:

వయోభారంతో వుండి స్టూడియోకు రాలేని వ్యక్తుల గళాలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే కార్యక్రమం చేపట్టాను. కడపలో వుండగా ప్రొద్దుటూరు వెళ్ళి గడియారం వెంకటశేషశాస్త్రిని ఓ గంట రికార్డు చేశాను. నెల్లూరు వెళ్ళి ప్రముఖ పత్రికా సంపాదకులు మరుపూరు కోడందరామిరెడ్డిని, పండితులు దీపాల పిచ్చయ్యశాస్త్రిని రికార్డు చేసి వారి అనుభవాలు భద్రపరిచాను. రాజమండ్రి వెళ్ళి ప్రకాశం అనుచరులు క్రొవ్విడి లింగరాజును, ప్రకాశం మంత్రివర్గంలో మంత్రి డా. యం.బి. నాగేశ్వరరావును ఇంటర్వ్యూ చేశాను. సాదా జీవితాన్ని గడుపుతూ వారిద్దరూ వానప్రస్థాశ్రమంలో వుంటున్నారు. తాడేపల్లి గూడెంలో పసల సూర్యచంద్రరావును రికార్డు చేశాను. వయోవృద్ధులైన కాశీనాథుని పూర్ణమల్లికార్జునుడు (పార్లమెంటు సభ్యులు), గురజాడ రాఘవశర్మ, కొండా పార్వతీదేవి (వెంకటప్పయ్య కుమార్తె)ల అనుభవాలు భద్రపరిచగలిగాను. హైదరాబాదులో వుండగా రాయప్రోలు సుబ్బారావు మరణశయ్యపై వుండగా వారి గళాన్ని భద్రపరిచాను. శ్రీశ్రీ ఇంటర్వ్యూ, విప్లవ కవి కె.వి.రమణారెడ్డి ఇంటర్వ్యూ చెప్పుకోదగిన విశేషాలు. రమణారెడ్డి నా చేత ఒక హామీపత్రం వ్రాయించుకొన్నారు. వారి సిద్ధాంతాల ప్రకారం వారి ఇంటర్వ్యూని వారి జీవితకాలంలో ప్రసారం చేయకూడదు. అంగీకరించి స్టూడియోకి తీసుకొచ్చి రికార్డు చేశాను. ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చిన సందర్భంగా ‘కీర్తి తోరణం’ శీర్షికన ఇంటర్వ్యూ చేశాను.

కథకులలో, నాటక రచయితాలలో ఎందరో స్టూడియోకి వచ్చారు. తుమ్మపూడి సంజీవ్‌దేవ్ గారితో ఇంటర్వ్యూ పూర్తి కాగానే ఆయన బస్సులో వచ్చారని తెలిసి, స్వయంగా ఆఫీసు కార్లో తీసుకెళ్ళి ఇంటి వద్ద దించి వచ్చాను. పోలాప్రగడ సత్యనారాయణమూర్తి, కొండముది శ్రీరామచంద్రమూర్తి, కొర్రపాటి గంగాధరరావు, ఆమరేంద్ర, ఆర్. ఎస్. సుదర్శనం, బొడ్దుపల్లి పురుషోత్తం ప్రభృతులతో పరిచయాలు మధుర స్మృతులు.

పత్రికా సంపాదకులు:

1979 నాటికి విజయవాడలో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, విశాలాంధ్ర ప్రముఖ పత్రికలు. రేడియో అనుబంధంతో నండూరి రామమోహనరావు, తుర్లపాటి కుటుంబరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తులసీకృష్ణ, సి.వి.రాఘవాచారి, ఏటుకూరి బలరామమూర్తి, మహీధర రామమోహనరావు, కె.ఎస్. సుబ్రహ్మణ్యం బాగా సన్నిహితమయ్యారు. నా వ్యాసాలు ప్రచురించారు. కవితలు వ్రాశాను. స్వాతి బలరామ్ అప్పుడప్పుడే విస్తరిస్తున్నాడు. జమీన్ రైతు నెల్లూరు శ్రీరామముర్తి, మచిలీపట్ణణం లోని సంపాదకులు కోటేశ్వరరావు తమ గళాలు వినిపించారు. వాణి పక్షపత్రిక మదరాసు నుండి విజయవాడ కేంద్రానికి మార్చారు. కొత్తపల్లి సుబ్రమణ్యం సంపాదకులుగా వచ్చారు.

విశేషాలు మరోసారి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here