రెండు తలల పాము

0
3

[dropcap]భూ[/dropcap]గ్రహాన్ని చుట్టుకున్న కాలనాగు కరోనా
రెండు తలల పడగలు విప్పి ఆడుతోంది
ఉన్నతులకోసం తలెత్తిన పడగ ఒకటయితే
పేదలకోసం తల వాల్చిన పడగ మరోటి
డాలర్ల కోసం
విదేశాలకు ఎగబడిన వాళ్ళకోసం
ప్రత్యేక లోహవిహంగాల చేతులు చాస్తుందొకటి
శ్రామిక శక్తిని పంచిన
పేద కార్మికుల కాలేకడుపుల వలసలకు
నడక గాయాలను బహుకరిస్తుంది మరొకటి
లాకౌట్ నిబంధనలు పాటించకపోతే
పోలీసుల లాఠీదెబ్బలన్నీ సామాన్యులకేగానీ
ఒక్క అధికారం కూడా కందిపోలేదు
కరోనా కదనంలో పోరాడే వైద్యులను
పొగుడుతూ కవిత్వంరాస్తాం
దండాలు పెడతాంగానీ
వాళ్ళెవరయినా మన ఇరుగు పొరుగయితే
వెలివేసి వీలయినంత వేధిస్తాం
అనవసరంగా బయటికి రావద్దనే పోలీసులకు సెల్యూట్ చేస్తాం
కానీ వాళ్ళను మోసగించటంలో
డాక్టరేట్లు చేశాం
శానిటరీ స్టాఫ్ పైన
పూలజల్లు కురిపిస్తాంగానీ
మనింట్లో చెత్తంతా రోడ్డుమీదే పోస్తాం
ఒక అన్నంముద్దయినా
ఆకలి చేతులకు అందించకుండా
కొత్త కొత్త రుచులు ఆనందించగలం
రేపు ఉందో లేదో తెలీకపోయినా
ఇంకా ఏవేవో ఆలోచనలు చేస్తూనే ఉంటాం
రెండు పడగల కరోనా కాటుకి
బలయ్యే పేదలను
కులం మతం పట్టించుకోకుండా
అక్కున చేర్చుకునే మనుషులకోసం
రెండోపడగ బుసలుకొడుతున్నది
మొదటి పడగను తలదించి చూడమంటున్నది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here