దివ్యాoగ ధీరులు 5 – బాడీ బిల్డర్ – బెస్ట్ డాన్సర్ గంధం సంతోష్ – 2

2
3

[box type=’note’ fontsize=’16’] దివ్యాంగులైనప్పటికీ, ధీరత్వంతో జీవనపోరాటం సాగిస్తున్న వ్యక్తులను పరిచయం చేస్తున్నారు గురజాడ శోభా పేరిందేవి. గంధం సంతోష్ అనే యువకుడు తన వైకల్యాన్ని అధిగమించిన తీరుని వివరిస్తున్నారు. ఇది రెండవ భాగం. [/box]

చెన్నైలో అశోక్ సర్ విద్యార్థులని గురువులా చూసుకోలేదు తండ్రిలా కాచాడు. అన్ని రాష్ట్రాలనుండి వొచ్చిన పిల్లలతో భోజనాల దగ్గర పెద్ద క్యూ ఉండటంతో అశోక్ సర్ తానే వెళ్లి అందరికి భోజనం తెచ్చాడు. మంచినీళ్ళందించాడు. వాళ్ళు ఇఛ్చిన కొత్త దుస్తులు అందించాడు.

డాన్సులో రజత పతకం వొచ్చింది సంతోష్‌కి. ఆటల్లో కాంస్య పతాకం వొచ్చింది. చప్పట్లు చప్పట్లు చప్పట్లు. బధిరులకు వినబడేంత జోరుగా, అంధుల కళ్ళముందు దృశ్యం ఆవిష్కరింపబడేంత అందంగా, నడవలేనివారికి తాము పరుగుతీసినంత ఆనందాన్ని కలిగిస్తూ మ్రోగాయి చప్పట్లు.

అవి అందుకుని అడుగులో అడుగేసుకుంటూ చంకలకింద కర్రలతో స్టేజి దిగి వొచ్చిన సంతోష్ నేరుగా అశోక్ సర్ దగ్గరికి వచ్చాడు. అసలు వేదిక మీద కూడా అతని కళ్ళు అశోక్‌ని చూస్తున్నాయి, ఎంత మందిలో వున్నా తండ్రికోసం వెతుక్కునే పసికూనలా అటే అటే చూస్తున్నాయి.

రెండు బహుమతులూ సర్టిఫికెట్లు సర్ చేతికిచ్చి కర్రలు పక్కన పెట్టి వొంగి ఆయన కాళ్ళకి దణ్ణం పెట్టాడు. సంతోష్‌కే కాదు అశోక్‌కీ కూడా ఒక సంఘటన గుర్తొచ్చింది.

ఒకసారి స్కూల్ అసెంబ్లీలో అంతర జిల్లా పోటీల్లో పాల్గొన్న నార్మల్ పిల్లలు తమ బహుమతులూ సర్టిఫికెట్లతో వేదిక మీదికి చేరడం ప్రిన్సిపాల్ మేడం అభినందించడం జరిగాయి.

అప్పుడు పక్కనున్న తనలాంటి అబ్బాయితో సంతోష్ అన్నాడు. “వాళ్లకి కాళ్ళున్నాయి ఆడతారు, మెరిట్ సర్టిఫికెట్లు తెచ్చుకుంటారు. మనని వాళ్ళతో పోల్చుకోకూడదు.”

ఆ పక్కనే వున్న అశోక్ సర్ ఏమీ మాట్లాడకుండా సంతోష్ భుజం తట్టాడు. ఆరోజే అతను మనసులో దృఢంగా అనుకున్నాడు – ఈ అబ్బాయిని తీర్చిదిద్దాలి అని.

హమ్మయ్యా అనుకున్నది సాధించాను అన్నాయి అశోక్ సర్ కళ్ళు.

అవును సర్ గెలిచింది సాధించింది మీరే. నన్ను నాకంటే ఎక్కువగా నమ్మి ముందుకు తీసుకు వెళ్తున్నదీ మీరే… అన్నాయి సంతోష్ కళ్ళు

కొన్ని కొన్ని సార్లు పెదవులు తడబడతాయి మాట పెగలదు. హృదయం ఉప్పొంగిపోతూ విషయ వివరణ ఇవ్వలేకపోతుంది. కానీ కళ్ళు మాత్రం స్వచ్ఛంగా సత్యాలు పలుకుతాయి మనసును విప్పి చూపుతాయి.

సంతోషుని దగ్గరికి తీసుకున్నాడు అశోక్. కాస్సేపటి తర్వాత విందు భోజనం పెట్టారు. అందులోని పదార్ధాలన్నీ రుచిగా వున్నాయి. కానీ కడుపు నిండిపోయినట్లయిన సంతోష్ ఏమీ తినలేకపోయాడు. అశోక్ సర్ కూడా ఏమీ తినకుండా ఎంగిలిపడి లేవడం గమనించిన సంతోష్ ‘నేను చేసుకున్న పుణ్యానికి లభించిన ఫలం అశోక్ సర్’ అని అనుకున్నాడు.

తిరిగి వొచ్చిన వాళ్లకి బ్రహ్మరథం పట్టాయి స్కూలు హాస్టలూ. కప్పులూ సర్టిఫికెట్లూ దుస్తులూ చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంది ప్రిన్సిపాల్.

“మన పిల్లలయిన మీరు మార్గదర్శులయ్యారు. ఇప్పటివరకూ విజయాలన్ని నార్మల్ పిల్లలకే వచ్చాయి. మొదటిసారి మీరు విజయ కేతనాన్ని ఎగరేశారు.”

సంతోష్ అండ్ పార్టీ జైత్రయాత్ర సాగడం మొదలయ్యింది. సోలోగా ఎన్నో సాధించినా గ్రూప్ గానూ విజయాన్ని వరించాడు సంతోష్. వైజాగ్ వెళ్ళి గెలుపుతో వచ్చారు. రాజస్థాన్‍లో జరిగిన పోటీలకి సంతోష్ మరికొందరు పిల్లలు అశోక్‌తో కలిసి వెళ్లడం మరో అనుభవం.

క్రికెట్ స్టేడియంలో పోటీలు జరగడం అభినందనీయమే అయినా భోజన వసతులు బాగా దూరంగా ఉండడంతో దివ్యాoగులు అవస్థ పడ్డారు. వాహనాలు ఒకటి రెండు పెట్టారు కానీ అవి సరిపోలేదు. వొచ్చిన పిల్లల సంఖ్య1500 దాకా వుండడంతో ముందు వచ్చినవారు, ఆడపిల్లలు బస్ లో ఎక్కే కూర్చున్నారు. మిగతావారికి సమస్య ఎదురయ్యింది.

”త్వరగా తిని రండి” అన్న అశోక్ సర్ మాట సంతోష్ వాళ్లకి గుర్తుంది. ”మీరు రండి సర్” అని సంతోష్ అన్నాడు. “పోటీ జరిగేదాకా నాకు తిన బుద్ధి కాదు మీరు వెళ్లి రండి. ఎంత త్వరగా రాగలిగితే అంత మంచిది. నడవాలి కదా” అని స్టేడియంలో అలాగే కూర్చున్నాడు అశోక్.

నడుచుకుంటూ వెళ్లారు సంతోష్ అండ్ పార్టీ. భోజనం నిదానంగా చేశారు. మరింత నిదానంగా భుక్తాయసంతో తిరుగు ప్రయాణమయ్యారు. వీళ్ళు వచ్చే సరికి షార్ట్‌పుట్ పోటీ అయిపొయింది. డిస్కస్, జావలిన్‌లలో ఆడినా డాన్సులో పాల్గొన్నా అది మాత్రం మిస్ అయ్యింది.

స్టేడియంకి చేరుకోగానే ముందు సంతోష్ చెంప పగలకొట్టాడు అశోక్.

“సారీ సర్” అన్నాడు మెల్లగా

రెండు బంగారు పతకాలు వచ్చాయి సంతోష్‍కి. ఆ రోజంతా మౌనంగా వున్నాడు అశోక్.

“అంత ఫీల్ అవ్వడమెందుకు సర్, రెండు బంగారు పతకాలు గెలుచుకున్నాం కదా” అన్నాడు సంతోష్.

“అందులోనూ నువ్వు ప్రథముడివి అయ్యేవాడివి కదా. కానీ వొదులుకున్నావు గుర్తుంచుకో సంతోష్, అందరూ నిద్రించే వేళలో బాణాలు చీకట్లో సంధించడం నేర్చుకున్న అర్జునుడు ఆదర్శంగా ఉండాలి. విజయాన్ని సాధించాలి అంటే విభిన్నంగా ఆలోచించాలి. విశ్రాంతిని పక్కన పెట్టాలి. దొరికినదానితో తృప్తిపడితే విజయం అక్కడే ఆగిపోతుంది. గెలుచుకున్న పతకం చూసుకుoటూ మురిసిపోతూ కూర్చుంటే నిన్ను దాటుకుని ఎందరో వెళ్ళిపోతారు. సమయ పాలన అత్యంత అవసరం. సమయానికి అక్కడ వుండి తీరాలి. ఇండియన్స్ టైం మెయిన్‌టెయిన్ చెయ్యరులే అనో, జాలిపడి అవకాశం ఇస్తారులే అనో, సర్ లేదా మేడం సాయపడతారులే అనుకోవద్దు. అలా అనుకున్నావు అంటే అక్కడే ఆగిపోయినట్టు లెఖ్ఖ. నిశ్శబ్దంగా నిత్యం శ్రమిస్తే గెలుపు చప్పట్లు వినిపిస్తాయి, అభినందించే చూపులు కనిపిస్తాయి. అనుసరించే పాదాల సంఖ్య పెరుగుతూ పోతుంది. కానీ గుర్తుంచుకో నీ శ్రమ ఎప్పుడు తగ్గితే అప్పుడు నిన్ను అనుసరించేవాళ్లే నిన్ను దాటి ముందుకు పోతారు.”

ఆ మాటలన్నీ మనసులో సుస్థిరం చేసుకున్నాడు సంతోష్.

సంతోష్ అండ్ పార్టీకి ఎన్నో అవకాశాలొచ్చేలా మొదట చూసాడు అశోక్. ఆ తర్వాత కొన్ని వెతుక్కుంటూ రాసాగాయి. కాసులు కురిసాయి. పాఠశాల చదువు పూర్తికాకముందే సంపాదనాపరుడైపోయాడు సంతోష్. తెచ్చిన డబ్బులు సిస్టర్‌కి ఇచ్ఛేవాడు. అవసరాలన్ని చూసే సిస్టర్ల నీడలో బంగారు బాల్యం బ్రహ్మానందంగా గడిచింది. ఎం.ఎల్. మేరీ ఫ్రీదా జాయింట్ అకౌంట్లో దాచిన డబ్బు తాలూకు పాస్‌బుక్ పదవతరగతి పాస్ అయ్యిన సంతోష్ చేతికిచ్చింది

పాసుబుక్ తెరిచాడు. అందులో లక్ష రూపాయలున్నట్టు వివరణ వుంది. “నువ్వు మేజర్ అయ్యాక అవన్నీ నీవవుతాయి.” ఆశ్చర్యపోయాడు సంతోష్. ప్రతీ పైసా కన్నా తల్లిలా ఎంత బాగా దాచి పెట్టింది ఎమిల్ మేరీ సిస్టర్. అతను ఇంకా ఆశ్చర్యం నుండి తేరుకోకముందే “ఇంక మీకు ఇక్కడ వుండే అవకాశం లేదు. బయలు దేరాలి” అంది ప్రిన్సిపల్.

“నేను కూడా వెళ్లిపోవాలా?” ఇంకొంత ఆశ్చర్యంగా అడిగాడు సంతోష్. అతనికి అదే తన ఇల్లు. అందులోని సిస్టర్స్ అందరూ అమ్మలు. వాళ్ళని వొదిలి తాను వెళ్లడమేంటి, ఆ మాటే అడిగాడు.

“లేదు నాన్నా నువ్వు వెళ్ళాలి. ఇంకా ఎన్నో సాధించి మాకు చూపించాలి. మీ లాంటి ఇంకెందరికో మేము సాయపడాలి” అంది సిస్టర్.

తెల్లవారుజామున 5 గంటలకల్లా నిద్రలేపడం, ఇటూ అటూ తిరిగి మళ్లీ నిద్రపోతే బుజ్జగించి చీవాట్లు పెట్టి లేపడం; అలా ప్రొద్దున్నే లేచి చదువు సంధ్య అంటూ ఉండడం నచ్చక మూడో క్లాసులో వొకసారి; ఐదోక్లాసులో ఒకసారి పారిపోయే ప్రయత్నం చెయ్యడం – అప్పుడు వాళ్ళు వెతికి పెట్టుకోడం గుర్తొచ్చాయి సంతోష్‍కి. మరోసారి కూడా పారిపోయే యత్నం చేసినప్పుడు ‘ఇంకోసారిలా చేస్తే హాస్టల్లో వుండే అవకాశం పూర్తిగా పోగొట్టుకుంటావు చూసుకో’ అని వార్నింగ్ ఇచ్చింది.

అప్పటికి ఆటల్లోనూ నృత్యంలోనూ విజయాలు చూస్తున్నసంతోశ్ మేడంకి సారీ చెప్పాడు. అసలింక అలాంటి ప్రయత్నాలేవీ చెయ్యనని చెప్పాడు.

ఏడవ తరగతి కల్లా లీడర్ అయ్యే స్థాయి తనకిచ్చింది హాస్టల్. తనకంటే పెద్దవాళ్ళని కూడా తనమాట వినేలా చేసుకునే ఆత్మవిశ్వాసాన్ని అందించింది హాస్టల్. ఆ హాస్టల్ని వొదిలి బయటకి రాక తప్పలేదు సంతోష్‌కి. పోలిటెక్నిక్‌లో సీట్ వఛ్చి చేరాడు.

వేళకి అన్నం, అనారోగ్యం రాగానే వైద్యం, డిస్సిప్లిన్ తప్పగానే పనిష్మెంట్ ఇలాంటివన్నీ చేసి తనని తీర్చిదిద్దిన ఆ దేవాలయాన్ని వదిలి హైద్రాబాద్లోని సాగర్ రింగ్‌రోడ్ లోని హాస్టల్లో చేరాడు. అక్కడ ప్రత్యేకమైన గది ఇవ్వలేదు. టీవీ గదిలో అందరూ టీవీ చూస్తున్నా అలాగే చదువుకుంటూ గడిపాడు. తర్వాత నెమ్మదిగా ఎప్పటికో కొంతకాలానికి గది ఇచ్చారు.

తెల్లవారుజామున నాలుగు గంటలకి లేచి నెమ్మదిగా రెడీ అయ్యి బయలుదేరినా ఎప్పటికో మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజీకి చేరవలసిన పరిస్థితి. క్యాంపస్‌లో కూడా లోపలికి వెళ్ళాలి. మూడంతస్తులు ఎక్కాలి. కాళ్లు చేతులూ కూడా బాగా నెప్పులుగా అనిపించసాగాయి. ఎన్నోసార్లు పడ్డాడు. దెబ్బలు తగిలించుకున్నాడు. పగటి వేళ అందరూ బిజీగా వుండే వేళ కావడం వల్ల ఎవరూ ఎవ్వరికీ సాయం చేసే ఆసక్తి చూపించరు. కిందపడినా లేపి సాయపడే తీరుబడి ఎవ్వరికీ ఉండదు.

వానాకాలంలో నడక, ట్రాఫిక్ రోడ్లు దాటటం అన్ని ఇబ్బందిగానే ఉండసాగాయి. బస్‌లో కూడా దివ్యాంగుల సీట్లో ఎవరో ఒకరు కూర్చుని లేవకపోడం సంతోష్‌ని బాధించసాగింది

ప్రతినిత్యం పోరాటమే. పోరాడితేనే డ్రైవర్ స్టేజి దగ్గర బస్సు ఆపుతాడు… పోరాడితేనే తమ సీట్లో తాను కూర్చోగలుగుతాడు. ఎంత ప్రయత్నించినా రోజూ క్లాసుకి ఆలాస్యం అవ్వడమే. అటెండెన్స్‌లో మళ్లీ పోరాటం. మూడో అంతస్తులని క్లాసుకి వెళ్ళడానికి కాళ్ళూ చేతులకి రోజూ నరకయాతన.

హాస్టల్ నుండి బయలుదేరే టైంకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టేవారు కాదు. బయట కొనుక్కునే డబ్బు సంతోష్‌కి లేదు. సీనియర్ శ్రీకాంత్ టిఫిన్ బాక్స్ లోది కాస్త షేర్ చేసి తిని తృప్తి పడ్డరోజులు ఎన్నోవున్నాయి.

ఆ రోజుల్లోనే తరుచూ రామానాయుడు స్టూడియో వైపుకు వెళ్ళసాగాడు సంతోష్. ఏదైనా సినిమాలో ఒక అవకాశం దొరుకుతుందేమో అన్న ఆశతో. తన చేతిలో వున్న అల్బమ్ లోని ఫోటోలు అందరికి చూపించి అవకాశం అడగాలనుకున్నాడు. స్టూడియో ముందు గేట్ తెరుచుకోడం పడవల్లాంటి కార్లు వెళ్ళిపోడం జరిగేది. వాళ్ళెవ్వరి దృష్టి సంతోష్ మీద పడలేదు.

పద్మాలయా దగ్గర ప్రయత్నించి విఫలమయ్యాడు. అన్నపూర్ణా స్టూడియో ముందు కూడా పడిగాపులు పడినా ఫలితం రాలేదు. మహానటులెందరో ఎన్నో కష్టాలు పడ్డాక ఎదిగారు. తనకి కూడా అలా మంచి రోజులు వొస్తాయని ఆశగా చాలా కష్టపడి ఎన్నో బస్‌లు మారి, కాలినడకన ఇంకెంతో దూరం సాగి ప్రయాణించి అన్నపూర్ణకు చేరుకోడం మాత్రం మానలేదు.

ఉన్నదానితో సరిపెట్టుకోవాలా, ఉన్నతంగా ఎదగాలా అన్నది ఆలోచించి ఆచరించవలసింది మనమే.

పిరికి వాళ్ళు ప్రయత్నించరు. బలహీనులు పూర్తి చెయ్యరు. మూడోరకంవారు కసిగా చేస్తూనే వుంటారు. అందుకే వాళ్ళు విజేతలు. ఏ ప్రయత్నమైనా సత్సంకల్పంతో కసితో కష్టం బాగా జోడిస్తే ఫలించి తీరుతుంది. ఎటొచ్చి ఆలస్యమవుతుంది. అంతే.

ఆ స్టూడియోలో టెక్నీషియన్ ఒకరోజు సంతోష్ దగ్గరికి వచ్చాడు. “బాబు నువ్వు రోజూ శ్రమించి వొస్తూనే వున్నావు. ఆ అవకాశం రావాలి అంటే రేపు బంజారాహిల్స్ ఆఫీసుకి వెళ్ళు. అక్కడ అదుర్స్ షూటింగ్‌కి నీ లైవ్ వీడియో తీసుకుని పంపిస్తారు” అని చెప్పాడు.

భగవంతుడు కష్టజీవికి తప్పకుండా ఏదో ఒక రూపంలో వొఛ్చి సాయం చేస్తాడు. సంతోష్ టెక్నీషియన్‌కి చేతులు జోడించాడు.

మర్నాడు బంజారాహిల్స్‌కి వెళ్ళాడు లైవ్ డాన్స్ తీసుకున్నారు. ఫోటోలు చూసి కొన్ని తీసుకుని తర్వాత పిలుస్తాము అన్నారు. పిలుపు రాలేదు.

కాలేజీ జీవితం చాలా కష్టతరం కాసాగింది సంతోష్‌కి. లేట్ అయ్యిందని పరీక్ష రాయనివ్వకపోడం, అలసటగా తిరిగి తిరిగి వచ్చాక చదవలేకపోడం, దాంతో బ్యాక్‌లాగ్స్ రావడం అన్ని సంతోషుని విసిగించాయి. చెప్పాపెట్టకుండా కాలేజీ వొదిలి హాస్టల్లోని సామాన్లు తీసుకుని తన వూరికి బయలుదేరాడు.

సిస్టర్లకి అది చెప్పలేదు. డిప్రెషన్ మొదలయ్యింది. సర్టిఫికెట్లు కాలేజీలో ఉండిపోయాయి. దినదిన గండం, నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టయింది. అన్న, వదిన, ముగ్గురు పిల్లల ఆపేక్ష మధ్య గడిపాడు.

బాగా జ్వరంగా పడుకున్న రోజున ఫోన్ వొచ్చింది ‘రేపు ఉదయం 9 గంటలకి అదుర్స్‌కి రావాలి’ అని.

‘అవకాశాలెప్పుడూ అంతే. హఠాత్తుగా వొస్తాయి. గబుక్కున వెళ్లి అందుకుంటే అదృష్టం. లేకపోతే మళ్లీ అలాంటి అవకాశం రాదు.

నాన్న ఎవరినో అడిగి రెండు వందల రూపాయలు ఇప్పించాడు. పాపం ప్రపంచ జ్ఞానం లేకపోయినా జ్వరంతో వున్నాడు కొడుకు అని తోడుగా హైద్రాబాద్ బయల్దేరాడు.

పాపం నాన్నలు. చాలామంది నాన్నలు తాగుడికి బానిసలు కావడం వల్ల వాళ్ళ పిల్లలని పట్టించుకోరు కానీ హోషులో ఉంటే వాళ్ళు చాలా మంచివాళ్ళు.

రాత్రి తొమ్మిదికి హనుమకొండ చేరారు. బస్సు స్టాండ్ హోటల్లో పూరీలు తిని బస్సు ఎక్కి ఉప్పల్ రింగ్ రోడ్‌లో దిగారు. అప్పుడు అర్ధరాత్రి రెండయ్యింది. సంతోష్‌కి జ్వరం. తండ్రి పెద్దవాడవుతున్న వ్యక్తి. ఆయన పాపం ఏమీ మాట్లాడలేదు. ఇద్దరూ దుప్పట్లు కప్పుకుని ఫుట్‌పాత్ మీద పడుకుని నిద్ర పోయారు.

తెల్లవారాక వొళ్ళంతా నెప్పులు సంతోష్‌కి. కానీ ఏమీ మాట్లాడలేదు. దారి కనుక్కుని ఎలాగో మాదాపూర్ చేరారు. అక్కడ బస్సు దిగాక కొద్ద్ది దూరం నడిచి అన్నపూర్ణ స్టూడియోకి వాళ్ళు చెప్పిన టైంకి చేరారు.

కాస్ట్యూమ్ ఇచ్చారు. మేకప్ చేశారు. కడుపులు వాళ్ళ పుణ్యమా అని చల్లబడ్డాయి. రాత్రి 9కి ఛాన్స్ వొచ్చింది. తన లెవెల్లో కసిగా విరగదీసాడు సంతోష్. తర్వాత చెక్ ఇస్తాము అన్నారు.

తిరిగి వెళ్ళడానికి డబ్బులు లేవు. వాళ్ళని బ్రతిమాలి 500 సంపాదించాడు. మిత్రుడు శ్రీకాంత్ వొఛ్చి బండి ఎక్కించుకుని బయలు దేరాడు.

20 రోజుల తర్వాత టెలికాస్ట్ అయ్యింది. టీవీ చూసిన సిస్టర్స్ పొంగిపోయారు. “నువ్వు చూడమన్నావని టీవీ పెట్టాము కానీ నీ ప్రోగ్రాం ఇంత అద్భుతంగా ఉండడం చూసి ఆశ్చర్యానందాలకు లోనయ్యాము” అన్నారు.

అమాంతంగా పాపులారిటీ వొచ్చింది. మిత్రులు, బంధువులు, ఊరివాళ్ళు అందరూ సంతోషుని ఒక సెలెబ్రిటీలా చూడసాగారు.

మాసాబ్ ట్యాంక్ కాలేజీ హెచ్.ఓ.డీ. ఫోన్ చేసి ”నీ టాలెంట్ గురించి తెలిసింది. నువ్వు మా కాలేజీకి గర్వకారణం. వొఛ్చి చేరు. నీ సమస్య తెలుసు కనక ఇబ్బంది పెట్టము” అన్నారు.

“లేదండి, థాంక్స్. నాకు అది చాలా ఇబ్బందిగా వుంది” అన్నాడు.

ప్రోగ్రామ్స్ మీద ప్రోగ్రామ్స్ రాసాగాయి. మిత్రులతో కలిసి చేసేవి, సోలోవి ఇలా లెక్క లేనన్ని ప్రోగ్రామ్స్ ధనం కూడా కూడకట్టుకుని వచ్చాయి. ఈలోగా ఒక ప్రోగ్రాంలో కలిసిన సర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇంటర్ వన్ సిట్టింగ్లో చెయ్యమని సలహా ఇచ్చారు.

వెంటనే ఫీజు కట్టి సీఈసీతో ఇంటర్ పరీక్ష రాసి ఓపెన్ యూనివర్సిటీలో తనతో రాసినవారందరికంటే చాలా మంచి మార్కులతో టాపర్ అయ్యాడు.

ములుగులో టీటీసీ పరీక్ష ఎంట్రన్స్ కి రాసాడు. సీట్ వచ్చింది.

కలెక్టర్ ఆఫీసు వరంగల్‌కి ఒకసారి పనిమీద వెళ్ళాడు సంతోష్. అక్కడ చుక్కా వెంకటేశ్వర్లు అనే ఎన్నారైని “ఆయన మానసిక వికలాంగుల స్కూల్ ఫౌండర్” అని సంతోష్‌కి తెలిసిన వెంకట్ అనే సర్ పరిచయం చేసాడు. “ఇతను ఆల్‌రౌండర్. డాన్స్, ఆట అన్నింట్లోనే కాదు చదువులోనూ ముందు” అని చెప్పాడు.

“నువ్వు నార్మల్ టీటీసీ కాక స్పెషల్ టీటీసీ చెయ్యి. త్వరగా సెటిల్ అవుతావు” అన్న ఆయన సలహా మీదట స్పెషల్ స్కూల్‌లో కోర్సు చేసాడు. మానసిక వైకల్యంతో బాధ పడే పిల్లలని దగ్గరగా గమనించాడు. ప్రపంచంలో చెడు ఉంటుందని తెలీని మంచి పిల్లలే అందరూ అక్కడ వున్నారు. అమాయకంగా చూసే కళ్ళు నవ్వుతున్న పెదవులు వున్న పిల్లలు తమ ప్రపంచంలో తాము హాయిగా వున్నారనిపించింది సంతోష్‌కి. ఏదైనా వైకల్యంతో జన్మిస్తే ఎంత కాదనుకున్నా అందరిలా లేము అన్న బాధ తరుచూ కలుగుతుంది. కానీ మానసిక వైకల్యం వున్నవారికి అదేమీ తెలీదు.

భగవంతుడి సృష్టిలో ఎన్నో రకాల పువ్వుల్లాంటి పిల్లలుంటారు. కొన్ని పూలు రంగుతో ఆకట్టుకుంటే ఇంకొన్ని సువాసనతో. భగవంతుడు మనిషిని బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలకి తీసుకు వెళ్లాకే తన దగ్గరికి తీసుకుపోతాడు. ప్రతీ మనిషి జీవితంలోనూ అద్భుతమైన కాలం బాల్యం. ఆ బాల్యం మానసిక సమస్యల్లో వున్న పిల్లలకి వరంగా నిత్యం ఇవ్వడం వెనక భగవంతుడికి వారి మీద ఎంతో ప్రేమ వున్నట్లనిపించింది సంతోష్‌కి. మనం చూసే దృష్టి మంచిదయితే ప్రతీ పూవులోనూ ఓ సొబగు ఉంటుంది అనుకున్నాడు సంతోష్.

సంతోష్, భాస్కర్, శేఖర్ ఇలా అయిదుగురు కలిసి వుండి రకరకాల ప్రాంతాలకెళ్లి ప్రోగ్రామ్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఛాంపియన్స్ జెమినీ టీవిలో చేసి భేష్ అనిపించుకోడం జరిగింది. తమిళనాడు, కేరళ ఇలా ప్రోగ్రామ్స్ చాలా చెయ్యడంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. సిరిఫోర్ట్ ఆడిటోరియంలో శ్రీమతి సోనియా గాంధీ సమక్షంలో సమర్థ్ 2014 మినిస్టర్ అఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారి కార్యక్రమంలో సోనియా గారి చేతుల మీదుగా 20,000 రొక్కం వొచ్చింది. 20 రాష్ట్రాల్లో జరిగిన నృత్య పోటీలో మూడవ స్థానం వొచ్చింది. వారి గ్రూప్ ఎన్నో చోట్ల నాట్యం చేసింది. సంతోష్ సోలో పెరఫార్మన్సులు పెరిగాయి. వినీల్, నరేష్, వివేక్, నేతాజీ, విక్రమ్ కలిసి చాలా చేశారు. టీటీసీ కోర్సుకి ఈ ఆదాయం వల్ల ఫీజులు కట్టగలిగాడు. వరంగల్లు లోని లోది సంస్థ, కాథలిక్ హెల్త్ అసోసియేషన్ అఫ్ ఇండియా చేయూత ఇచ్చారు. బాయ్స్‌లో టాపర్ గా నిలిచాడు.

అటు సిస్టర్స్, ఇటు అశోక్ సర్ సలహాలిస్తూ భుజం తడుతూ చివాట్లు కూడా పెడుతూ వెన్నంటి నిలిచారు. నాన్న, పిన్ని పిల్లలు, అన్నలు, వొదినలు ఊరి జనం అభిమానించారు.

డిస్టింక్షన్స్‌తో పాసవ్వడంవల్ల BA సైకాలజి, ఎమ్మే సైకాలజీ లోది, కాథలిక్ చర్చ్‌ల సాయంతో అయ్యాయి.

డివైన్ చారిటబుల్ ట్రస్ట్‌కి ఫండ్ రైసింగ్ ప్రోగ్రామ్స్ ఎన్నో చోట్ల చేశారు.

వుద్యోగం రావడంతో సెటిల్ అయ్యాడు. శైలజ అనే దివ్యాంగురాలైన అమ్మాయితో వినాయకచవితి ఉత్సవాల్లో పరిచయం ఏర్పడింది. అది పెళ్లికి దారి తీసింది. కూలీల కుటుంబం నుండి వచ్చినా కష్టపడి ప్రభుత్వ టీచర్ అయ్యింది శైలజ.

‘సుప్రీమ్’ సినిమాలో చిన్న పాత్ర చేసే అవకాశం వొచ్చింది సంతోష్‌కి. క్రిస్టియన్ స్కూల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా చేస్తూ డాన్స్ పోటీకి నెదర్లాండ్స్‌కి వెళ్ళాడు సంతోష్.

అక్కడ కూడా అభినందనలూ గుర్తింపు పొందాడు. అంతర్రాష్ట్రీయ కార్యక్రమానికి వెళ్ళవలసివుంది కానీ కరోనా ఎఫెక్ట్ వల్ల ఆగింది.

“ఎలా వుంది నీ విజయం? ఆనందంగా తృప్తిగా ఉందా?” అని అడిగిన వెంటనే – “ఇది విజయం అని నేను అనుకోడం లేదు. ఇంకా ఎన్నో సాధించాలి. కలసికట్టుగా దివ్యాoగులంతా కృషి చెయ్యాలి. అప్పుడు వచ్ఛేది అసలైన విజయం” అని అన్నాడు.

“దివ్యాంగులంతా….. తమ వైకల్యం చూసి వ్యథ చెందకుండా తమ బలం ఆ వైకల్యం నుండే పొందాలి. బలహీనతని బలంగా మార్చుకోవాలి. చిన్న చూపు చూసినవారంతా చప్పట్లు కొట్టే స్థాయికి రావాలంటే కష్టాన్ని కేవలం కష్టాన్ని పూర్తిగా నమ్ముకోవాలి. అప్పుడు దేముడు అశోక్ సర్ లాంటి వారిని మనకోసం పంపిస్తాడు. దివ్యాoగులు అన్ని రంగాల్లోనూ దివ్యంగా రాణించాలి. అందుకే నేనెంతో కష్టపడి బాడీ బిల్డరుగా నన్ను నేను మలుచుకున్నాను. దివ్యాoగ కళాకారులకు నాట్య సంస్థని ప్రారంభించాను. మొట్టమొదటి ఫ్లోర్ డాన్సర్‌గా, తెలంగాణా నుండి నెదర్లాండ్స్‌కి వెళ్లి నా కళని ప్రదర్శించగలిగాను. రక్తదానం చేసి సాటి మనుషులకి సాయపడుతూ వుంటాను.”

“అవకాశం ఇచ్ఛేవారి కోసం ఎదురు చూస్తూ కూర్చోకూడదు.. అవకాశాన్ని వెతుక్కోవాలి.”

“అంగవైకల్యం మీద దృష్టి వుండకూడదు. ఆశయం మీద దృష్టిని కేంద్రీకరించాలి. అలా చేస్తే ఓటమి కూడా ఓడిపోతోంది” అన్నాడు సంతోష్ .

అతని కళ్ళు ఆత్మవిశ్వాసంతో మెరుస్తున్నాయి. అతని చేతులు చంకల్లోని కర్రలను పట్టుకుని చకచకా ముందుకు సాగుతున్నాయి. వొళ్ళంతా స్వేదంతో నిండివున్న సంతోష్ తుడుచుకోడానికి కూడా ఆగక సాగిపోతున్నాడు.

శ్రమ తాలూకు స్వేదం అంటే అదే. అది అందించే విజయమంటే అదే. దివ్యాoగ ధీరుడి దివ్యమైన జీవితం ఇదే. భిక్షాటన చేసే కుటుంబంలోంచి వొఛ్చి బిగ్ షాట్‌గా మారిన అబ్బాయి విజయగాథ ఆదర్శవంతమూ, అనుసరణీయమూ, అభినందనీయమూ అంటే అతిశయోక్తి కాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here