అశరీరవాణి

1
3

[dropcap]మ[/dropcap]నిషీ ఎలా ఉన్నావు
చూస్తూనే ఉన్నాను
ప్రపంచమంతా పద్మవ్యూహంలో చిక్కుకుంది
ఎక్కడిదో వైరస్ పయనించే మార్గాలు వెతుక్కుంది
వూహాన్ లో జన్మెత్తి వ్యూహాలు
పన్నుతూ సాగిందని నువ్వంటావు
వ్యూహాలు నీకులేవా మనిషీ
అభివృద్ధంటూ టెక్నాలజీ అంటూ
నీ సుఖంకోసం సౌకర్యం కోసం
విషవాయువులను ఎగజిమ్మావు
వృక్షాలను నరికేశావు
అడవులను అంతరింపచేశావు
మీలో మీకే ఎన్ని లుకలుకలు
G-7 అంటావు,G-20 అంటావు
ఫస్ట్ వరల్డ్ దేశాలంటావు థర్డ్ వరల్డ్ కంట్రీలంటావు
కలహించుకోవడానికి ఏపేరయితేనేం
ఫుట్ బాల్ కోర్టులా గేమ్స్ మీవి
నొప్పినాది
క్వాలిటీ లేని బతుకులు
ఈక్వాలిటీ లేని మనుషులు
ఓజోన్ పొరను నాశనంచేసేదీ మీరే
నాశనమైపోతోందని మైక్రోఫోన్ పబ్లిసిటీ మీదే
కాలుష్యాన్ని పెంచేది మీరే
నగరీకరణ చేసేదిమీరే
పల్లెకు పరిగెడదామని నినాదాలు మీవే
వైరస్ లు ఎక్కడో పుట్టవు
ఎవరూ సృష్టించరు
సీతమ్మ వారి కోపం లంకను దహించినట్టు
నాకోపాన్ని ప్రకటిస్తూనే ఉన్నా
మార్పేలేనిచోట మరో పద్ధతి ఉంటుందికదా
అందుకే ఒక్క కణం కోట్లాది మందిని
ఇంటిఖైదు చేసింది
పంచభూతాలను పునీతంచేస్తున్నా
మనిషీ ఇక నీ జీవితం క్రీస్తుతర్వాతలా ‘కొవిడ్’ తర్వాత కానున్నది
నీ ఆర్థిక హర్మ్యాలు కూలుతున్నాయి
దారితప్పిన ప్రతిసారీ ఇదే జరగబోతుంటుంది
ఈ హెచ్చరిక ఇకనీతోనే ఉండబోతుంది
వింటావో వినవో నీ ఇష్టం
కల్క్యావతరం గురించి
అడుగుతుంటారు మీరంతా
ఇలా దారితప్పినప్పుడల్లా
ఆలోచన పక్కదారిపట్టినప్పుడల్లా
అకస్మాత్తుగా వస్తుంది
తస్మాత్ జాగ్రత్త అనిపిస్తుంది
ఇప్పటికైనా కళ్ళు తెరిచి
పుడమికి ప్రణమిల్లు
ఇల్లే స్వర్గమని
మనిషే మాధవుడని
గ్రహించిన క్షణాలను రేపటికి దాచిపెట్టి అందించు
పురావారసత్వాన్ని మరిచావా
రాబోయే తరాలన్నీ
ముంపుకు గురయ్యే గ్రామాల్లా
ఉనికిని కోల్పోతాయి
ఉదయ కిరణమవుతావో
నిశీధి నిశ్శబ్దాన్ని మోస్తావో
నిర్ణయంనీది
….
అశరీరవాణి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here