[dropcap]పూ[/dropcap]ర్వం కుక్కలకి తోక వంకరగా ఉండేది కాదు(ట)!.. సాఫీగా, కర్రలా ఉండేది, దాని తోక వంకరవడానికి ఒక కథ వుంది.
ఒక అడవిలో జంతువులన్నీ కలిసి మెలిసి ఉండేవి. వాటిలో కుక్క కూడా ఒకటి. దానికి కొన్ని గొప్ప గుణాలుండేవి. దూరం నుండి చప్పుడు వినగలదు, వాసన పసిగట్టగలదు. అందుకే కుక్క అడవికి కూడా కాపలాదారునిగా ఉండేది.
అడవికి రాజైన సింహం.. కుక్కలోని ప్రతిభని గుర్తించింది. అందుకే అడవికి కుక్కను సేనాధిపతిని చేసింది. గొప్ప పదవి దక్కిందన్న గర్వంతో కుక్క తలబిరుసు తనంగా ప్రవర్తించడం మొదలు పెట్టింది.
అడవిలోని ఇతర జంతువులను లెక్క చేసేది కాదు.. సమస్యలను సింహం రాజుకు విన్నవించుకుందామని వచ్చే చిన్న చిన్న జంతువులను తన కర్రలాంటి తోకతో తరిమి కొట్టేది.
కుక్కకు పెరిగిన అహంకారాన్ని చూసి మిగిలిన జంతువులు ఏంతో విసిగిపోయాయి. ఒకనాడు దాని పొగరుబోతుతనం గురించి సింహానికి ఫిర్యాదు చేశాయి. విచారణ కొరకు సింహం కుక్కని రమ్మని కబురు చేసింది. కుక్క సింహం రాజు దగ్గరకొచ్చింది.
”అడవిలో జంతువులన్నింటిని నువ్వు బాధ పెడుతున్నావని విన్నాను.. సేనాధిపతివై ఉండి.. వారి కష్టాలను తీర్చాల్సింది పోయి.. నువ్వే ఇలాగ ప్రవర్తిస్తే ఎలా..! నీకిదే చివరి హెచ్చరిక.. ఇంకోసారి నీ మీద ఫిర్యాదు రాకూడదు.. ఇకనుండైనా బుద్దిగా ఉండు పో!” అని మందలించింది సింహం.
”అయ్యో… ఒట్టి అబద్దం సింహరాజా..! నా తోకను చూడండి.. ఆ భగవంతుడు నాకు కర్ర లాంటి బలమైన తోకను ఇచ్చాడు.. అది చూసి మిగిలిన జంతువులు అసూయ పడుతూ.. నాపై నిందారోపణలు చేస్తున్నాయి. కావాలని నామీద లేని పోనీ చాడీలు చెబుతున్నాయి .. అంతే!..” అంది కుక్కఅమాయకత్వాన్ని నటిస్తూ.
”అయితే.. మిగిలిన జంతువులు అసూయ చెందకుండా నేనో ఉపాయం చెబుతాను. ఈ కుక్క తోకను మడిచి తాడుతో కట్టు..” అని భటుడు తోడేలుకు చెప్పింది సింహం.
సింహం చెప్పినట్టే చేసింది తోడేలు. అలా నాలుగుగైదు నెలలు గడిచిపోయాయి.
తోక మడిచి రాయి కట్టడం వాళ్ళ కుక్కకు బాగా నొప్పి కలిగింది.. పైగా మిగిలిన జంతువుల ముందు అవమానంగా భావించి అడవి నుంచి పారిపోయి వేరే ఊరికి వచ్చేసింది.
ఆ ఊరిలో ఒక రైతు పొలం పని చేసుకుని ఇంటికి తిరిగి వెళుతూండగా తోకను కట్టేసిన కుక్కను చూసి జాలిపడి కట్టు విప్పదీశాడు.
మునుపటిమాదిరి కర్ర లాగా లేదు. వంపుతిరిగి పైకి లేచి ఉంది.
తలతిప్పి పైకి తిరిగి ఉన్న తోకను చూసింది కుక్క. ‘ఆ తోకతో ఇప్పుడు ఎవర్నీ బెదిరించలేదు. కర్రలా ఉపయోచించి ఎవ్వరనీ కొట్టలేదు.. ఇక అహంభావంతో ఉండకూడదు..’ అని మనసులో అనుకుంది.
రైతు వెంటే ఇంటికి వచ్చింది.
వెంట పడి వచ్చిన కుక్కకి కొంత అన్నం పెట్టి నీళ్లు తాగించాడు. పెట్టిన తిండికి విశ్వాసంగా తోక ఊపింది కుక్క. అప్పట్నుంచి రోజూ తనతోనే ఉంటూ.. తాను పెట్టింది తింటూ.. తనతో పాటు పొలానికి వెళుతూ, ఇంటికి కాపలాగా ఉండిపోయింది.
కుక్కకి కూడా తను చూపించే ప్రేమ, ఆప్యాయత బాగా నచ్చేసింది..
ఎందుకంటే ”అడవి జంతువుకులుకన్నా మనుషులే మంచివారు, దయార్ద్ర హృదయులు” అని తలచి విశ్వాసం గల పెంపుడు జంతువుగా నాటి నుండి నిలిచిపోయింది.