[dropcap]ఒ[/dropcap]కరోజు ఆ ఊరి న్యాయాధిపతి న్యాయం కోసం వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకుని, తగిన పరిష్కారాలు సూచిస్తూ, తప్పు చేసిన వారి తప్పులు ఋజువైనప్పుడు తగిన శిక్షలు వేస్తున్నాడు.
అప్పుడే భటులు ఒక అరవై ఏళ్ల వృద్ధుణ్ణి అక్కడికి తీసుక వచ్చారు. అతని మొహం ఎంతో దిగులుగా కనబడుతుది.
“అతని సమస్య ఏమిటి?” అని అడిగాడు న్యాయాధిపతి.
“అయ్యా, ఈయన పూటకూళ్ళ ఇంటికి వెళ్లి నాలుగు చపాతీలు దొంగలించాడు. తమరు విచారించి తగిన శిక్ష వేయండి” చెప్పారు భటులు.
“పెద్దాయనా చపాతీలు దొంగలించడం తప్పు కదా, ఎందుకు దొంగతనం చేశావు? దొంగలించిన దానికి మూడు రోజుల జైలు శిక్ష అనుభవించాలి లేదా ఏభై రూపాయల జరిమానా కట్టాలి” చెప్పాడు న్యాయాధిపతి.
“అయ్యా, ఆకలి నన్ను అంత పని చేయించింది. పని చేసి డబ్బు సంపాదించాలనుకుంటే నాకు పని ఎక్క డా దొరకలేదు. నా వయస్సు బట్టి నాకు పని ఎవరూ ఇవ్వలేదు, ఈ పరిస్థితిలో నా భార్య ఇద్దరు మనవలు ఆకలితో అల్లాడుతుంటే ఇక చేసేది ఏమీ లేక దొంగతనం చేశాను” అని నీళ్లు నిండిన కళ్ళతో చెప్పాడు.
“నిజమే ఆకలి అంత పని చేయిస్తుంది, కానీ మరికొంత ప్రయత్నంచి ఉంటే నీకు పని దొరికేదేమో, కానీ దొంగతనం శిక్షార్హం, మరి ఏభై రూపాయల జరిమానా కడతావా? లేక జైలుకు వెడతావా?” అడిగాడు న్యాయాధిపతి.
“అయ్యా, నా దగ్గర ఏభై రూపాయలు ఉండి ఉంటే అసలు ఆ చపాతీలు దొంగతనం చేసి ఉండేవాడిని కాదు, పోనీ శిక్ష అనుభవించడానికి జైలుకు వెళితే నా భార్య నా మనవల ఆకలి ఎవరు తీరుస్తారు?” అని చెప్పి ఆ పెద్దాయన భోరున ఏడ్చాడు.
ఆయన మాటలకి అక్కడ నిశ్శబ్దం ఆవరించింది.
ఆ ముసలాయన చెప్పిన మాటలను విన్న తరువాత వారిలో ఆయన పట్ల కొంత హృదయ వేదన కలిగింది. న్యాయాధిపతి మనసులో కూడా ఒకింత కదలిక వచ్చింది.
ఇక న్యాయాధిపతి ఒక్క నిముషం కళ్ళు మూసుకుని ఆలోచించి ఈ విధంగా చెప్పాడు.
“ఈయన తిండి దొంగతనం చేయడానికి మనమదరం కారకులం, ఎందుకంటే ఒక్కొక్క సారి మనం తోటి వాడిని పట్టించుకోం, ఎదుటి వారి కష్టాలను గురించి అసలు పట్టించుకోం. సమాజంలో మనం చేయగలిగిన మంచి, చేయగలిగిన సహాయం చేస్తే తప్పకుండా ఇటువంటి తప్పుల్ని నివారించగలం… ఈ పెద్దాయన డబ్బు కట్టలేడు, జైలుకి పంపితే నేను అయన భార్యకు మనవలకి, అన్యాయం చేసినవాడినౌతాను, అందుకే నేనే ఏభై రూపాయల జరిమానా ఆయన తరపున ప్రభుత్వ ఖజానాకు కడుతున్నాను. మీరు కూడా ఆలోచించి తలా ఐదో పదో అతనికి ఇవ్వండి, పని దొరికే వరకు అతని కుటుంబం తిండికి అలమటించదు” అని చెప్పాడు న్యాయాధిపతి.
అక్కడ ఉన్న వారిలో అనేక మంది ఐదో పదో తమకు తోచినంత ఆవృధ్దుడికి ఇచ్చారు. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న ధనుంజయడనే ధనవంతుడు ఈ విధంగా చెప్పాడు.
“అయ్యా, ఇప్పుడు డబ్బులు ఇస్తే ఆ డబ్బు కొద్ది రోజుల వరకు సరిపోతుంది. ఆ తర్వాత మరలా ఆయన తిండి కోసం డబ్బు కోసం వెతుక్కోవాలి, అందుకే నేను ఆయనకు పని ఇచ్చి, నెలనెలా జీతం ఇస్తూ ఆయన, ఆయన కుటుంబం పస్తులు లేకుండా చూస్తాను. నాకు ఒక తోట ఉంది, ఈ పెద్దాయనను తోటమాలిగా నియమిస్తున్నాను. జీతాలు కాక తోటలో పండిన పండ్లు కూడా కుటుంబానికి ఉపయోగపడతాయి” అని చెప్పాడు.
న్యాయాధిపతితో సహా అందరూ ధనుంజయడి మంచి ఆలోచనకు చప్పట్లు కొట్టారు.
అలాగే పెద్దాయన ధనుంజయడకి నమస్కారం పెట్టి ఆనందంతో ధనుంజయడి వెంట బయలుదేరాడు. ఊరిలో బీదవారు, అంగవైకల్యం ఉన్న వారు, వృద్ధులు ఆకలితో అలమటించకుండా తగిన ప్రణాళికలు ఆ ఊరి పెద్దకు సూచించడానికి న్యాయాధిపతి బయలు దేరాడు.
ఊరి పెద్ద న్యాయాధిపతి చెప్పిన ప్రణాళికలు బాగా ఆలోచించి పని కల్పించే ప్రణాళికలు అంగవైకల్యం, పనిచేయలేని వృద్ధులకు ఆహారం, వసతి శిబిరాలు కట్టించాలని నిర్ణయించాడు. ఊరి పెద్ద మంచి మనసుకు న్యాయాధిపతి హర్షం వెలిబుచ్చాడు.