[dropcap]స[/dropcap]మాచార అనుసంధానం వలన సమాచార మార్పిడి స్వేచ్చగా జరుగుతుంది. ఆలోచనలు, ఆవిష్కరణలు సుదూర తీరాలకు సెకన్లలోనే చేరిపోతున్నాయి. అంతే వేగంతో సంఘవ్యతిరేక, చట్టవ్యతిరేక కార్యకలాపాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అనేక దేశాలలో సంఘ, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ప్రసారం కాకుండానే నిరోధించగలిగే చట్టాలూ వచ్చాయి.
‘జియోలొకేషన్’ సాఫ్ట్‌వేర్‍తో వాహనాలలోని నియంత్రిత వ్యవస్థను హాక్ చేయడం ద్వారా అమెరికా గూఢచారి వ్యవస్థ కిట్టని వాళ్ళను రోడ్డు ప్రమాదాలలో హత్య చేస్తోందన్న ఆరోపణలు ఈనాటివి కావు.
ఏ పరిజ్ఞానం అయినా, ఆవిష్కారమైనా దేశాల అభివృద్దికి, పౌరుల శ్రేయస్సుకు వినియోగింపబడాలి తప్ప వినాశనానికి కాదు. ప్రైవసీ కూడా ‘వ్యక్తిగౌరవం’ అన్న మౌలిక సూత్రం పరిధిలోనికే వస్తుందని 2017లో 9మంది సభ్యులతో కూడిన మన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చింది.
మొబైల్ డేటా వినియోగంలో మనదేశం ప్రపంచంలోనే మొదటిస్థానంలో ఉంది. 150 కోట్లు గిగా బైట్ల వినియోగంతో భారతదేశం చైనా అమెరికాల మొత్తం వినియోగాన్ని అధిగమిస్తోంది. ఇంత వినియోగం అంటే హాకర్ల పాలిటి కల్పతరువే. ‘జూమ్’ యాప్ లోని 5లక్షల ఖాతాల వివరాలు అమ్మకానికి పెట్టగలిగారంటే హాకర్ల హస్తలాఘవాన్ని, డేటాకు ఉన్న డిమాండ్‍నీ రెండింటినీ అర్థం చేసుకోవచ్చు.
ఒక ప్రజాతంత్ర వ్యవస్థలో అదీ వ్యక్తిగత సమాచారానికి సంబంధించి కోర్టులు వెలువరించిన విస్పష్టమైన తీర్పులు కూడా ఉన్న నేపథ్యంలోనే వ్యక్తిగత సమాచారానికి భద్రత లేకుండా పోవడాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలి?
నూటికి 80కి పైగా సైబర్ దాడులకు కారణం సెక్యూరిటీ పాచ్‌ల అప్‌డేషన్ లేకపోవడమే. నెట్‍వర్క్ లోకి సైబర్ నేరస్థులు ప్రవేశించిన ఎన్నో నెలలకు కాని నేరం జరిగినట్టు బయటపడటం లేదు. 2017సంవత్సరంతో పోలిస్తే 2018లో నూరుశాతం సైబర్ నేరాలు పెరిగాయి. బ్యాంకులు, స్టాక్ ఎక్స్చేంజి, చెల్లింపు సంస్థలు మొదలైన సంస్థలో సైతం సైబర్‍దాడులకు అతీతమైనవి కావు అని తేలిపోయింది.
డిజిలైజేషన్ క్రమంలో 3,20,0000 డెబిట్ కార్డులు హాకింగ్‍కు గురికావడం జరిగింది. మోడీ యాప్‍ను హాక్ చేసినది జావేద్ ఖత్రి అనే వ్యక్తి. ఇతడు ‘మేకర్ విలేజ్’ అంకుర సంస్థకు చెందినవాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్‍లెర్నింగ్‌లతో సెక్యూరిటీని పెంచడం ద్వారా సైబర్ దాడులు ప్రమాదాన్ని కొంతవరకైనా నిరోధించవచ్చు. డిజిటల్ ప్రపంచంలో సైబర్ నేరగాళ్ళ బారిన పడకుండా దేశపౌరుల ప్రయోజనాలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఆ కారణంగా ‘సైబర్ ఇన్సూరెన్స్’ ప్రతిపాదనలూ వెలుగుచూశాయి. కంపెనీలూ యథాశక్తి కృషి చేస్తున్నాయి.
మనం సెల్‍ఫోన్ వాడే విధానాన్ని అధ్యయనం చేయడం ద్వారా మన జాతకం మొత్తం పసిగట్టగల ‘గూగుల్’ ‘ప్రాజెక్ట్ అబాకస్’ పేరుతో గూగుల్ లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానం బృందం అధ్యక్షుడు కౌఫ్‍మన్ నేతృత్వంలో దశాబ్దం క్రిందటే పరిశోధనలు ప్రారంభించింది. 2016 మే నెలాఖరు నాటికే ఆ పరిశోధనలు పూర్తి అయ్యాయి.
అందరి వేలిముద్రలు సరిపోలనట్లే అందరి బ్రెయిన్ ప్రింట్లూ ఒక్కలా ఉండవు. కొన్ని ప్రత్యేకమైన పదాలను చదవడంలో, సంగీతం వినడం, భావోద్వేగపరమైన సన్నివేశాలను చూడటం వంటి సందర్భాలలో ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్పందిస్తారు. రక్తప్రవాహంలో చోటు చేసుకునే మార్పుల ఆధారంగా వ్యక్తి వివిధ సందర్భాలలో ప్రతిస్పందించే తీరును – మెదడులో కలిగే ప్రతిచర్యలను లెక్కగట్టడం ద్వారా ‘న్యూరో ఇమేజింగ్’ ను తెలుసుకోగల అవకాశం ఉంది. ‘ఫంక్షనల్ మేగ్నెటిక్ రెజునెన్స్ ఇమేజ్’ గా వ్యవహరించబడే ఈ విధానంలో ఒక వ్యక్తిని ఇంచుమించుగా నూరుశాతం ఖచ్చితత్వంతో గుర్తించవచ్చు.
ఆండ్రాయిడ్ ఉపయోగించేవారి ముఖకవళికలు, స్వైపింగ్, టైపింగ్, ముఖకవళికలు, శరీరం కదలికలు వంటి అంశాల ఆధారంగా రూపొందించబడే కోడ్‍ను పాస్‍వర్డ్‌గా తేవాలన్నదే ‘అబాకస్’ లక్ష్యం. ‘అబాకస్’ అన్నది కూడా ఆ ప్రాజెక్టుకు వినియోగించిన సంకేతనామమే!
సాంకేతిక విప్లవం కారణంగా వ్యక్తి దైనందిన జీవితంలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. రోజురోజుకూ సౌలభ్యాలు పెరుగుతున్నాయి. సౌలభ్యంతో పాటుగా అభద్రత పెరిగింది. నిదానం, నిశ్చింత స్థానాలలో వడి, వేగం సాధారణ విషయాలైపోయాయి. ఏ మేధస్సు నైపుణ్యాల కారణంగా మనిషి గతంలో కలలో కూడా ఊహించలేని అద్భుత ప్రపంచంలో ఇప్పుడు బ్రతుకుతున్నాడో ఆ నైపుణ్యాలే కొండొకచో వికటించిన కారణంగా మనిషి నిరంతరం జాగరూకుడై/అప్రమత్తతో మెలగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయన్నది చేదు నిజం.