[dropcap]”శ్రా[/dropcap]వణీ!…” అని పిలుస్తూ లోపలికి చూశాను. పలుకలేదు. బయటనుంచి వస్తూ కనిపించింది శ్రావణి. చేతిలో నాలుగు మునగకాడలు కనిపించినవి.
వస్తున్న ఆమెను చూస్తూ “ఎక్కడికి వెళ్ళి వస్తున్నావ్?” అని అడిగాను.
“బస్టాప్ దాకా వెళ్ళి బుజ్జిగాడ్ని బస్సు ఎక్కించి వస్తున్నాను. వాడి స్కూలు 8.30 గం.లకే కదా! అయినా మీ బాక్సు కట్టి మీ టేబుల్ మీదే పెట్టేశాను. మీ ఆఫీస్ 10.30గం.లకు గదా!” అంది
“అవును” అని అంటుండగానే శ్రావణి దగ్గరకి వచ్చింది.
వాచీవైపు చూసుకొని, “కొంచెము ఆఫీస్‍లో పని ఉందోయ్. ఒక అరగంట ముందు వెళ్తున్నాను” అంటూ బాక్సు తీసికొని మెట్లు దిగి స్టాండులో ఉన్న స్కూటర్ దగ్గరకు వచ్చాను. పక్కన కిటికీలో ఉన్న స్కూటర్ తుడిచే గుడ్డను తీసికొని దాన్ని చకచకా శుభ్రం చేసి గుడ్డను యథాస్థానములో ఉంచి స్కూటర్ స్టార్ట్ చేస్తూ ఆకాశం వైపు చూశాను. ఆకాశం చెదురుమొదురుగా మేఘావృత్తమై ఉంది. చల్లని గాలి తెర వచ్చి దూరాన వర్షం పడ్డ జాడను తెలుపుచున్నది. గాలి కొంత వేగాన్ని పుంజుకుంటూ కనిపించింది. తుఫాను లాంటి హెచ్చరిక టి.విలో చెప్పిన జాడ లేదు. అయినా వాతావరణ నిర్వహకులు చెప్పినట్లుగా చెప్పినప్పుడల్లా జరుగుతుందా? అనుకొని దైవంపై భారం వేసి స్కూటర్ ముందుకు నడిపాను. అయినా నేను చేరవలసిన గమ్యానికి 10 ని.ల సమయం చాలు. దీనికంత ఆలోచన అనవసరం.
స్కూటర్ నడుస్తూంటే మబ్బుల తీరు కొద్దిగా మారినట్లు అనిపించింది. ఇంకొంచెం వేగం పెంచాను. అటు ఇటు తిరుగుతున్న వాహనాల పొగ ముక్కుపుటాలకు సోకుతుంది.
బాటన జనం రద్దీగా తిరుగుతున్నారు. వర్షం పడుతుందనే భావన వారి వేగాన్ని పెంచింది. ఒంటిపై నాలుగైదు వర్షపు చినుకులు నాపై పడ్డట్టు అనిపించింది. తిరిగి పైకి చూశాను. ఈలోపు నా కాలేజి గేటు వచ్చింది. అమ్మయ్య అని నిట్టూర్చుతూ కాలేజీలోనికి వెళ్ళాను. వాహనాలు నిలిపేచోట స్కూటర్ ఉంచి కాలేజీ భవనంలోనికి నడిచాను. నడుస్తూండగా నేను ఈ కాలేజీలో చదివిన రోజులు మదిలో మెదిలినాయి. ఎదురుపడ్డ విద్యార్థులు విష్ చేస్తూండగా స్టాఫ్ రూమునకు వెళ్ళాను. లెక్చరర్‌ను కనుక హజరుపట్టికలో సంతకము పెట్టి కూర్చున్నాను పుస్తకం తిరగేస్తూ.
ఇది SR & BGNR ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి. పూర్వాశ్రమంలో ఇది మిరపకాయల మార్కెట్టు ప్రక్కన రేకుల షెడ్డులో ప్రారంభమైంది. సమ్మర్‍లో వేడికి మలమల మాడేవాళ్ళం. మంచి ఫలితాలు రావడం వల్ల, యాజమాన్యం చొరవ వల్ల, సమర్థులైన ఉపాధ్యాయిల వల్లా, కాలగమనాన అదే పేరుతో ప్రభుత్వ కళాశాలగా రూపాంతారం చెందింది. ప్రస్తుతం మేము ఉన్నది మంచి భవన సముదాయంతో విశాలమైన ప్రాంగణంలో నెలకొని ఉండి, ఈ నగరానికి తలమానికగా అనిపిస్తూ ఉంది. ఈ కాలేజీ ప్రారంభాన నేను ఇక్కడే చదివాను. ప్రస్తుతం ఇక్కడే అధ్యాపకుడిగా నియామకం కావడంతో ఉపాధ్యాయుడుగా కొనసాగుతున్నాను. అలా సైన్సు అధ్యాపకుడిగా ఇక్కడ చేరి ఇది ఆరవ సంవత్సరము. నేను అధ్యాపక వృత్తిలో చేరి 12వ సంవత్సరము. మొదట కరీంనగర్, ఆ తరువాత వరంగల్‍లో చేసి చివరకు ఇక్కడకి వచ్చాను.
ఇక్కడే సైన్స్ head of the department గా నాలుగు సంవత్సరాల నుండి కొనసాగుతున్నాను. నేను ఈ నౌకరిలో చేరిన మంకటికి నా వివాహ ప్రస్తావన ఇంట ప్రారంభమైంది. తదుపరి మూడు సంవత్సరములకు గాని లగ్గం కాలేదు. అదీ మా దూరపు బంధువుల అమ్మాయితో. ఆవిడ B.Ed. పాసైంది. ఓ ప్రవేటు పాఠశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తోంది. నా better half పేరు శ్రావణి. అంత గొప్ప చూపరి కాకున్న, సభ్యతా, సంస్కారం తెలిసిన మనిషి. మితభాషి. కనుక మా సంసార జీవితం ఎటువంటి ఒడుదుడుకులు లేక సాగితున్నది. అనురాగ, ఆత్మీయతలు దండిగా ఉన్న దాంపత్యం మాది. మాకు వివాహమైన నాలుగో సంవత్సరంలో బాబు కలిగాడు.
ఈ సృష్టిన ప్రతి జీవికి బాల్యం అనేది అందమైన పూదోట. అమాయకులతో నిండిన మధుర స్వప్నంలాంటిది. బాధ్యత పూర్తిగా మనంలో లేని గమనం గదా! నాకు తెలిసిన మేర పెద్దబాల శిక్ష మన పిల్లలకు వెలుగుదివ్వెనిచ్చే విజ్ఞానశాస్త్రం. మన పూర్వీకులు, వేమన, భాస్కర శతకకారుడు, సుమతి శతకకారులు సామాజిక, నీతి శాస్త్రాలలో అవగాహనలో నిల్చిన ఆణిముత్యాలు. లోకపు నడత, నడక నేర్పిన సూచికలు.
యవ్వనం మరీచిక లాంటిది. కాలపు నడక తీరున వేగంగా అనిపించడం దీని స్వభావం. విద్యాలయం పిల్లల ఉరుకుల పరుగులతో హడావుడిగా ఉంది. ఉదయమే నాకు రెండు మూడు పిరియడ్లు ఉండడాన నేరుగా వెళ్ళి నా పని ముగించుకొని స్టాఫ్ రూంలో కూర్చున్నాను. అక్కడ ఇద్దరు ముగ్గురు అధ్యాపకులు తప్ప మిగిలిన వారు వారి వారి క్లాసులు తీసుకునేందుకు వెళ్ళి ఉంటారు. నాతో పాటు హిందీ చెప్పే మేడం చివరిగా కూర్చొని ముందున్న కాగితాలను చూస్తున్నది. నా వైపు చూస్తే విష్ చేశాను. నవ్వి తన పనిలో తానుంది. మంచి స్వభావం కలది. తన పనేదో తాను చూసి బాట పట్టే స్వభావం. సాహిత్యాభిలాష దండిగా ఉన్న మనిషి. నా చేత నున్న పుస్తకాన్ని గమనించి నా వైపు తలెత్తి చూసి, మీరు ’యశ్‍పాల్ సాహిత్యం ఏమైనా చదివారా అడిగింది. సమాధానంగా “విపులలో వచ్చిన అనువాద కథలు తప్ప చదవలేదు. అలాగే ప్రేమ్‍చంద్ అనువాదాలు కూడా అంతే. కాని నాకు హిందీ అంతగా రాదు. చదవలేను. మనం మాటాడుకునే భాషలో ఇక్కడి అలవాటు చొప్పున మాటాడగలను” అని నవ్వాను. ఆనక చేతనున్న పుస్తకం చదవడంలో తలదూర్చాను. ఇంతలో శ్యామల అన్న సోషియాలజీ ఉపాధ్యాయురాలు వస్తూంటే విష్ చేస్తే హలో అన్నాను. తిరిగి పుస్తకాన తలవంచుతూ.
“ఎక్సుజ్‍మీ” అన్న ఆడగొంతుక వినిపించి, తలెత్తాను, ‘నన్నేనా’ అన్నట్టు.
“మిమ్మల్నే. డిస్ట్రబ్ చేయలేదు కదా” అంది ప్లెజెంట్‍గా.
‘నో’ అన్నట్లు చూశాను. కాని ఎక్కడో ఈవిడను చూసినట్టు, గొంతు విన్నట్టు అనిపించింది.
”ఇక్కడ ఆఫీస్ రూం ఎటుంది” అనడిగింది ‘చెప్తారా’ అన్నట్టు అభ్యర్థనగా చూసి.
నేనామెను అంత శ్రద్ధగా గమనించుకున్నా. గొంతు మాత్రం చాలాసార్లు విన్నట్టుగా అనిపించి తేరిపార చూసి, “రండి” అని ఆఫీస్ వరకు తీసుకువెళ్ళి చూపి, వెనుదిరిగాను. ఆవిడ నడక కూడా పరిచయమైనదిగా అనిపించి, ఓ క్షణం ఆగి గుర్తులోకి తెచ్చుకునే ప్రయత్నం చేశాను. ఆలస్యంగా గుర్తులోకి వచ్చింది. పదిహేనేళ్ళ క్రితం కాలేజీ చదువున కనిపించిన చూపే ఇప్పుడు కొంత చెదిరి కనిపించినా ‘అవును శ్రీలతే ఈవిడ’ అనిపించింది. కాలేజీలో కలసి తిరిగిన జాడ కూడా మనసున మెదిలింది. మనస్సు ముద్దబారింది. ఆవిడ ఆఫీస్ పని పూర్తయ్యాక తిరిగి వచ్చేటపుడు అడుగుదామనుకున్నా. అరగంట తరువాత నా దగ్గరకే వస్తూ కనిపించింది. కూర్చోమని, కూర్చున్నాక శ్రద్దగా గమనించి “మీరు శ్రీలతే కదూ” అనడిగాను. అప్పుడు మాత్రమే నన్ను పరిశీలనగా చూసి నా మందటి కళ్ళద్దాలను అనుమానంగా చూసి, “మీరు శ్రీనివాస్ కదూ?” అనడిగి ‘am I correct’ అన్నట్టు చూసింది. అవునన్నట్టు చూసి నవ్వాను. సంతోషంతో చూసి గబుక్కున లేచి “మీరు ఇక్కడ?” అని అంది ఆశ్చర్యంతో.
“నేనిక్కడ అధ్యాపకుడిగా నాలుగేళ్ళ నుంచి పని చేస్తున్నాను” అని చేయి కలిపాను.
“ఈ ఆఫీస్‍లో మీకున్న పని?” అడిగాను వెంటనే.
“నెమ్మదిగా చెప్తాను” అంది దగ్గరికి జరిగి.
“మా వారిక్కడ L.I.C.లో పనిచేశారు. మాకిద్దరు పిల్లలు. ప్రస్తుతం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. మనం కాలేజీలో ఉన్నప్పుడు B.Sc. చదివాను కదా. మా పిల్లలు చదివే స్కూలులో నా చదువుకు సంబంధించిన పోస్ట్ ఖాళీగా ఉంది. రమ్మన్నారు. నా పరిస్థితులు చెప్పాను. చేరమన్నారు. నా టి.సిలు ఇప్పుడు కావలసి వచ్చినాయి. లోగా అక్కరలేదనుకొని తీసుకోలేదు” శ్రీలత మాటాడుతుంటే విన్నాను. గతంలోకి వెళ్తూ ఆగి అయినా అడిగాను.
“మీవారు?”
“ఆరుమాసాల క్రితం జీపు ప్రమాదంలో మరణించారు” అంది విషాదంగా.
“సారీ” అని లేచాను.
“ఒంటరిగానే ఉంటున్నారన్నమాట.”
తలూపింది తప్పదుగా అన్నట్టు.
“మీరు రేపు మా ఇంటికి రాకూడదూ?” అడిగాను బెరుకుగానే అనుకోకుండా. నవ్వుతూ అలాగే అన్నట్టు చూసి మరుక్షణాన ఏం జరుగుతుందో తెలీదు. “అయినా భరోసాగా నడుస్తూనే ఉంటా” అంది.
నా మనసంతా ఎలాగో అయ్యింది. అఫ్టర్‍నూన్ వెళ్ళి సూపరిటెండెంట్‍తో చెప్పి పరిచయం చేసుకుని వచ్చాను.
పని పూర్తిచేసుకుని గంట తరువాత వచ్చింది.
***
ఈ శ్రీలత నాకు కాలేజీలో మూడు సంవత్సరాల పరిచయం. చివరి సంవత్సరంలో శ్రీలతతో చనువేర్పడింది. దాంతో ఆవిడ పరిస్థితులను, స్థితిగతులనూ గమనించాను. ఆవిడ ఇష్టపడితే నాకు తగ్గ జోడి అనుకున్నాను. చదువు పూర్తయ్యాక ప్రపోజ్ చేద్దామనుకున్నాను. శ్రీలత మనస్సున ఏముందో కనుక్కునే ప్రయత్నం చేశాను. అయితే అఖరు ఏడాది పూర్తయ్యాక కాలేజి ఆవరణం నుంచి బైటికొచ్చే టైంలో “కృష్ణమందిరానికి ఇవ్వాళ సాయంత్రం రండి. మాటాడాలి. అక్కడే అంతా చెప్తాను” అంది.
సరేనన్నాను. ఎవరి దోవన వారు పోయాం.
అయితే నేను శ్రీలతతో అన్న ప్రకారం కృష్ణమందిరానికి వెళ్ళలేకపోయాను. శ్రీలత వచ్చి చాలాసేపు చూసి వెళ్ళిపోయి ఉంటుంది. ఆమెకు నాటి నుంఛి కాలేజీ శలవలు. తరువాత కలుద్దామని పించింది. శ్రీలత ఇంటి చిరునామా నాకు తెలియదు. ఆమె స్నేహితురాలి ద్వారా తెలిసింది. కాని నేను అక్కడకు చేరి వాకబు చేస్తే క్రితంరోజే వాళ్ళ తాతగారితో పాటు ఇల్లు ఖాళీ చేసి, వెళ్ళారని తెలిసింది. ఇదంతా నా తల నలుగగాడింది.
అసలు జరిగిందేమిటంటే మా నాన్నకు లారీ యాక్సిడెంట్ అయింది. అయన్ను హాస్పటల్‍లో చేర్చి వార్డుకు కబురు చేసినా నేనక్కడనుంచి బయటకు వచ్చేందుకు మూడు దినాలు పట్టింది. శ్రీలత బాధపడుతూ వెళ్ళిపోయివుంటదనుకుని ఉండలేదు. జాడ తీస్తూనే ఉన్నా. కాని కుదరలేదు.
అరగంట తరువాత శ్రీలత ఆఫీసు గది నుంచి నా దగ్గరకొచ్చి “ఒకసారి ఆఫీస్‍లోకొస్తారా” అని అడిగింది. వెళ్ళాను. ఆఫీసు సూపరిటెండెంటు అతనికున్న అనుమానాలడిగాడు. తీర్చాను. ఈ కాలేజీలో ఫలానా సంవత్సరం నుంచి చదివిందని చెప్పా. ఆధారాలు చూసుకొని తృప్తిపడి “ఓ గంట తరువాత రండి, కాగితాలు తయారు చేసిస్తాను” అన్నాడతను.
ఇద్దరం వచ్చి స్టాఫ్‍రూంలోనే కూర్చున్నాం. అప్పుడు జరిగిన విషయం చెప్పాను బాధపడుతూ. “నేను వచ్చాను. మీరు మనసిప్పి మాటాడి మీకు సమ్మతమైతే ఇద్దరం ఒకటవుదామనే నా రాక. రాత్రి పదిదాక చూశాను. ఒంటరి ఆడపిల్లనైనా మీకిష్టం లేదేమోనని అభిమానంగానే వెళ్ళిపోయాను.” ఇది చెపుతున్నపుడు శ్రీలతలో అప్పటి అనురక్తి స్పష్టంగా కనిపించింది.
ఓ మాటు అగి “ఇంతకాలానికి ఇలా కలిసాం. విధి” అంది నిట్టూరుస్తూ.
***
ఆదివారం శ్రీలత అనుకున్న ప్రకారం మా ఇంటికొచింది. వచ్చిందన్నా సంతోషమున్నా నా మనస్సంతగా బాగాలేదు. అంటే ఏదో కోల్పోయినట్టుగా. శ్రీలతలో కూడా ఉత్సాహం కనిపించలేదు. నా భార్యను కలిపాను. ఇద్దరూ మాటల్లో పడ్డారు పరిచయం ఉన్నవారిలా.
వరండాలోకి వచ్చాక మా ఆవిడ వైపు చూస్తూ “ఈ పక్క పోర్షనెవరిది?” అడిగింది శ్రీలత.
“బ్రాహ్మలు ఉంటున్నారు. ఈ ఒకటో తేదీన ఖాళీ చేస్తున్నారు. బదిలీ అవడంతో హుజూరాబాద్ వెళ్తున్నారు” అంది శ్రావణి. అంతటితో ఆగక “అద్దెకూడా భరించగల్గేది. మీకిష్టమయితే మాట్లాడుతాను” అంది.
“అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నాకు పూర్తిగా నచ్చాకనే ఇక్కడ దిగాను. ఈ ఇంటి ఓనరు ఇక్కడుండడు. ఆరుమాసాలకొక సారి వచ్చి అద్దె తీసుకుని వెళతాడు. నీళ్ళ పన్ను, ఇంటి పన్ను, వగైరాలన్న మావారే కట్టి మిగిలినవి ఇస్తారు. కరంటు బిల్లు మాత్రం నెలవారీగా మనం కట్టుకోవాలి” అంది ఇల్లు చూపుతూ.
శ్రీలతకు ఇల్లు నచ్చింది. ప్రక్కన అండ దొరికింది మనస్సున ఇక్కడ ఉంటేనే బాగు అనుకుంది.
“శ్రీలతా జరిగిందేదో జరిగిపోయింది. ఇందులో మనిద్దరి తప్పులేదు. కనుక మనం దోషులం కాదు. ప్రేమ పేరున కట్టుదప్పి తిరిగిన వాళ్ళం కాము. విధి ఆడించిన నాటకం ఇది. దాన్నుంచి మనం బయట పడలేం కదా. మీరు ఇష్టమై వస్తే మాకు తోడుగా ఉన్నట్టుంది. మన గతాలు గతించినయ్. వాటిని మరచిపోయి నా తోబుట్టువులా అనిపిస్తున్నా. నాకు అక్కచెల్లెల్లు, అన్నదమ్ములు లేరు. కలసి ఉందాం” అని సూటిగా చూస్తూ చెప్పాను.
“తెల్సినా తెలియకున్నా నా ద్వారా జరిగిన పొరపాటు మనల్ని విడదీసింది. ఇప్పుడిలా ఈ బంధం కలుపుతుంది. ఇలా మనకు పూర్తి శాంతి దొరుకగలదనే భావన నిన్న నువ్వు కలవగానే అనిపించింది” అని శ్రీలత వైపు చూశాను. ఆనందంగా తల ఊపి శ్రావణి దగ్గరికెళ్ళి “మీ పక్కకు వస్తాను వదినా. కలిసే ఉందాం” అంది. శ్రావణిని దగ్గరికి తీసుకుని హత్తుకుంది. నా మనస్సున సంతోషం నిండింది.
***
నూటికి డెబ్బై మంది దాకా సమాజాన దాంపత్యాలు మాలా ప్రేమ దూరమైనవేమో! మా మధ్య కుదిరి ఉన్న బంధం ఆ సంబంధపు కొనసాగింపునేమో! పిల్లల్ని కనడం, వారిని వదలలేని బంధం; అనుబంధం – కదల లేని స్థితి మాత్రమేనేమో!
నిలిచి కనిపిస్తున్న ఈ సంసారాలలోని నిజం చాలా వరకు నేతి బీరకాయ చందమేనేమో! కాక నా భావన తప్పా?