నీలమత పురాణం-75

0
4

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]గో[/dropcap]నంద ఉవాచ।

దౌశస్యా సమీపేతు తీర్థాని వదతాం వర।

గృధకూట పర్వతంపై నుంచి భగవంతుడి విగ్రహాన్ని క్రిందకు తెచ్చి పర్వత పాదాల వద్ద సకల జనుల సౌఖ్యం కోసం రాముడు ప్రతిష్ఠించిన గాథ విన్న తరువాత గోనంద మహారాజుకు మరో కోరిక కలిగింది.

బృహదశ్వుడికి వందనం చేసి, “మహానుభావా, అత్యంత ఆసక్తిగా గాథ వినిపించారు. నాకు కశ్మీర దేశంలోని పవిత్ర స్థలాల గురించి తెలుసుకోవాలని ఉంది. ఆ పవిత్ర స్థలాల దర్శన ఫలితాలను కూడా గురించి వివరించండి” అని అభ్యర్థించాడు.

రాజు కోరికను అనుసరించి బృహదశ్వుడు కశ్మీరులోని పవిత్ర స్థలాలు, వాటి దర్శన ఫలితాలను వివరించడం ప్రారంభించాడు.

గృధకూట పర్వతారోహణం వల్ల వేయి గోవుల దాన ఫలితం లభిస్తుంది. వితస్త, మధుమతి నదుల సంగమంలో స్నానం చేయటం వల్ల స్వర్గంలో స్థానం లభిస్తుంది.

ఆధునిక కాలంలో మధుమతి నదిని నీలమ్ నది అనీ, కృష్ణగంగ అనీ పిలుస్తారు. ఈ నీలమ్ నది, శాండిల్య నదుల సంగమం వద్ద ప్రస్తుతం శంకరాచార్య నిర్మిత పవిత్ర శారదా పీఠం ఉంది. శాండిల్య నదికి  ఆ పేరు రాక ముందు వితస్త నది అనేవారు. నీలమత పురాణంలో ఈ సంగమ స్థలిని అతి పవిత్రంగా భావించటం కనిపిస్తుంది. ఈ సంగమ స్నానం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుందన్న నమ్మకం కనిపిస్తుంది.

అయితే మరో ఆలోచన ప్రకారం శారదా పీఠం ఉన్న మధుమతి, శాండిల్య నదుల సంగమం వేరని భావిస్తారు. నీలమత పురాణంలో రెండు మధుమతి నదుల ప్రస్తావన ఉంటుంది. ఒక మధుమతి నది శారదాపీఠం వద్ద శాండిల్య  నదితో కలుస్తుందనీ, రెండవ మధుమతి నది ‘బండిపారా’ వద్ద ఉన్న ‘వూలర్’ సరస్సు (మహాపద్మ సరస్సు)తో కలుస్తుందని భావిస్తారు. ఈ మధుమతి నది వూలర్ సరస్సు వద్దనే వితస్త నదితో కలుస్తుంది. అయితే నీలమత పురాణంలో అతి పవిత్రంగా ప్రస్తావించిన మధుమతి నదిని ప్రస్తుతం స్థానికులు ‘మధుమతి నాలా’ అని చులకనగా ప్రస్తావిస్తారు. పురాతన వైభవం కోల్పోయి ఓ మురికి నీటి పాయలా మిగిలిపోయి ఆధునిక స్థితికి దర్పణం పడుతుంది మధుమతి నది. మరో మధుమతి నది ప్రస్తుతం పాక్ ఆక్రమిత కశ్మీరులో భాగం!

ఇక మళ్ళీ నీలమత పురాణంలోకి వద్దాం!

ఇంద్రనీల పర్వతారోహణం వల్ల వెయ్యి గోవుల దాన ఫలం వస్తుంది. కుమునారి నదీ స్నానం వల్ల సకల పాపాల నుండి విముక్తి లభిస్తుంది.

నీలమత పురాణంలో దాదాపుగా 60కి పైగా నదుల ప్రస్తావన వస్తుంది. వాటిల్లో అనేక నదులను గుర్తించటం కుదరలేదు. అలా గుర్తించని నదులు గౌతమి, నోత్ర నది, మాధవ, మాలిని, వమదాకిని, సాముల, శేషశిల, శీలమ, శాండిలి, సుగంధ, సఖ, త్రికోటి వంటి నదులతో పాటు ‘కుమునారి ‘ నదిని కూడా గుర్తించటం కుదరలేదు. అయితే ఇప్పటికీ ఈ నదుల గురించి ఊహాగానాలు సాగుతున్నాయి.

కృష్ణ, వితస్త నదుల సంగమంలో స్నానం చేయటం వల్ల వెయ్యి గోవుల దాన ఫలం లభిస్తుంది. మధుమతి నది తీరంలో శాండిల్య మహర్షి ప్రతిష్ఠించిన చక్రేశ్వర విగ్రహ దర్శనం వల్ల వహ్నిస్తోమ యాగ ఫలితం లభిస్తుంది.

ఇక్కడ రెండు విషయాలు ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. జోనరాజు రచించిన రాజతరంగిణిలో అప్పటి కశ్మీరు ముస్లిం సుల్తాన్ ‘జైన్ ఉల్ అబ్‌దిన్’ శారదా పీఠం వచ్చి శారదాదేవి దర్శనం కోరాడు. అతడికి సరస్వతి దేవి దర్శనం లభించకపోతే, మందిరం ప్రాంగణంలోనే ఉండిపోయాడు. అప్పుడతనికి దేవి దర్శనం అయింది. అలాగే శారదా పీఠం నిర్మించిన మధుమతి, శాండిల్య నదుల సంగమంలోని శాండిల్య నదిలో స్నానం చేస్తే చక్రేశ్వర స్వామి దర్శనం లభిస్తుందని నమ్మకం ఉంది. నీలమత పురాణంలో మధుమతి నది తీరంలో శాండిల్య మహర్షి చక్రేశ్వరుడిని ప్రతిష్ఠించాడని ఉంది. ఈ రెంటిని కలిపి చూస్తే, భారతదేశంలో కథలు గాథలు ఇలా అభివృద్ధి చెంది ఒక తరం నుంచి మరో తరానికి అందేసరికి ఎలా రూపాంతరం చెందుతాయో బోధపడుతుంది.

‘దుర్గ’ దర్శనంతో కోరిన కోరికలు ఫలవంతమవుతాయి.

ఇక్కడ ప్రవహించే ‘శాండిలి’ నది పాపాలను హరిస్తుంది. ఈ నదిలో స్నానం చేయటం వల్ల పాపాలు నశించి స్వర్గం ప్రాప్తిస్తుంది.

శాండిలి, మధుమతి నదుల సంగమ స్నానం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది.

శాండిలి నది గురించి, ఈ సంగమ స్థలిలో శారదా పీఠం నిర్మాణం గురించి పలు భిన్నమైన గాథలు ప్రచారంలో ఉన్నాయి.

ఈ శారదా పీఠం ఉన్న స్థానంలో శాండిల్య మహర్షి యజ్ఞం చేస్తున్న సమయంలో ఒక అందమైన యువతి ‘బ్రాహ్మణి’ వచ్చి ఆహారం ఇమ్మని అడిగింది. యజ్ఞం పూర్తయితే కానీ ఆహారం లభించదని శాండిల్యుడు అనడంతో ఆమె ఉగ్రరూపం ధరించి ఆ గ్రామాన్ని, ప్రజలను నాశనం చేసింది. అది చూసి శాండిల్యుడు ప్రాణాలు విడిచాడు. శాంతించిన దేవి శాండిల్యుడిని బ్రతికించింది. కోరిక కోరుకోమంది. శాండిల్యుడు దేవిని, గ్రామప్రజలందరినీ బ్రతికించాలని కోరాడు. అతడి భక్తికి సంతోషించిన దేవి మధుమతి నది (నీలమ్ నది) తీరంలో ఆశ్రమం నిర్మించుకోమని చెప్పింది. తాను అక్కడే శారద రూపంలో కొలువైంది.

మరో గాథ ప్రకారం శాండిల్యుడు సరస్వతి దేవి కోసం తపస్సు చేశాడు. శారద వనంలో అతడకి దర్శనం ఇస్తానని చెప్పింది దేవి. ఆ వనం కోసం జరిపిన అన్వేషణలో శాండిల్యుడు అత్యద్భుతమైన అనుభవాలు పొందాడు. చివరికి దేవి శారద, సరస్వతి, వాగ్దేవి అనే మూడు రూపాల మిశ్రమ మయిన సంపూర్ణ దర్శనం ఇచ్చింది. ఆమెకు అర్పించేందుకు శాండిల్యుడు మహాసింధు నది నుండి జలం గ్రహించాడు. ఆ నీటిలో కొంత నీరు తీయని తేనె ధారలా, నీటి ధారలా రూపొందింది. అదే మధుమతి నది. శాండిల్యుడు సృజించిన మరో నది శాండిల. ఈ శాండిల, మధుమతి నదుల సంగమ స్థలిలో శారదాపీఠం ఉంది.

రాజవాసంలో కొలువై వున్న హరి దర్శనంతో కోరినది లభిస్తుంది. రజోవినిర్మలలో స్నానం వల్ల పాపాలు నశిస్తాయి. ఇక్కడ స్నానం చేయటం వల్ల గౌరీశిఖర దర్శనం లభిస్తుంది. ఉమ గౌరీ శిఖర దర్శనం చేస్తూ, స్నానం చేయటం వల్ల చంద్రలోకం ప్రాప్తిస్తుంది. కృష్ణపక్షంలో కూడా గౌరీ శిఖరం వెన్నెలలో దర్శనం ఇచ్చినట్టే కనిపిస్తుంది. తేలల, భూర్జల నదులలో స్నానం వల్ల వంద గోవుల దాన ఫలితం లభిస్తుంది. ఈ రెండు నదుల సంగమ స్థలిలో స్నానం వల్ల వాజపేయ యజ్ఞం చేసిన ఫలితం వస్తుంది. మధుమతి నది ఆరంభస్థలిని దర్శించిన వారి పాపాలు నశిస్తాయి. రుద్రలోకం పొందుతారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here