[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]
[dropcap]నే[/dropcap]ను కొంత హాస్యమూ, కొంత విషాదమూ కలగలిపి చెప్తూ మిమ్మల్ని ఫ్లాష్‌బ్యాక్ లోకి తీసుకెళ్ళిపోయా. కానీ ప్రస్తుత్తం ఆటా సభలయి, కాంతి గారూ, కిరణ్‌ప్రభ దంపతులతో డుబ్లిన్ వెళ్ళడానికి అట్లాంటా కన్‌వెన్షన్ సెంటర్‍లో రెడీగా వున్నాను!
ఎంతో మందిని కలుస్తాం… ఆ మూడు రోజులూ, స్నేహంగా వుంటాం, విడిపోతాం… జీవితం అంతా, ఇలాగే ఒక కలయికా, ఒక వీడ్కోలుగా వుంటుంది!
అట్లాంటా నుండి కిరణ్‌ప్రభ గారూ, కాంతి గారూ, నేనూ డెల్టా ఎయిర్‌లైన్స్‌లో కాలిఫోర్నియాలోని డుబ్లిన్ ఓక్‌లాండ్ ఎయిర్‌పోర్ట్‌కి రావడానికి ఫ్లయిట్ ఎక్కాము. కిరణ్‌ప్రభ గారికీ నాకూ కామన్‌గా చాలామంది తెలుసు అని తెలుసుకుంటూ వుంటాం…
“మీకు చిక్కడపల్లి స్వరాజ్ హోటల్ వాళ్ళమ్మాయి తెలుసా అండీ?” అంటే, నేను “స్వరాజ్ హోటల్ మేడ మీద మా చుట్టాలుండేవారు… తెలుసు” అని చెప్తాను.
“మీరు అజామాబాద్, ఆర్.టి.సి. కాలనీలో వుండేవారా? ఇందిర అనే అమ్మాయికి ఫొటోలు తీసి, ఫోటో వ్యాఖ్యలు రాసి పల్లకీకి పంపేవాడిని” అని ఆయన చెప్తుంటే, “ఆ ఇందిర నాకు తెలుసు! మా వారు చిన్నప్పుడు ఆ వీధిలో వుండేవారు” అని నేను చెప్తాను. మా ఇద్దరికీ చాలా చిన్నప్పటి విషయాలు కూడా గుర్తుంటాయి. ఆయనకి నాకన్నా మెమొరీ చాలా ఎక్కువ! నేనే నా ఐదో ఏట నుండీ కలిసిన వాళ్ళందరినీ, ఆ సంఘటనలనీ పొల్లు పోకుండా చెప్పగలను! ఇలా మా పెద్ద అబ్బాయి చెప్పగలడు! మా రెండవ అబ్బాయికి గుర్తు లేవు. ఇలా నేనూ, కిరణ్‌ప్రభ గారూ మాట్లాడ్తూ వుండగానే ఐదు గంటల ప్రయాణం అయిపోయి డుబ్లిన్ చేరాం.
ఎయిర్‍పోర్ట్ లోనే పార్క్ చేసిన ఆయన కారు తీసుకుని ఇల్లు చేరాము. వాళ్ళ ఇల్లు చాలా బాగుంటుందని చెప్పాగా. శారదాదేవి ఆలయంలా వుంటుంది ఎక్కడ చూసినా పుస్తకాలతో. అందం ఏవిటంటే బుక్ లీఫ్‍లు పెట్టి, సగం చదువుతూ పెట్టిన పుస్తకాలతో ఆ సోఫాలూ, కుర్చీలూ పునీతమై వుంటాయి. చలం గారు రాసిన ఓ వాక్యం గుర్తొస్తొంది. “ఈ క్లాస్ రూమ్‌లో కూర్చుని నిర్బంధ విద్య లెందుకు? వసంతం రాగానే ఈ మేజా బల్లలూ, కుర్చీలూ కూడా చిగురిస్తాయోమో అనిపిస్తుంది, పూర్వ జీవిత సువాసనలు గుర్తొచ్చి!” అంటారు. ఆహా! ఎంతటి అందమైన ఆలోచనా? ఏ చెట్టు నుండో కొట్టి తెచ్చిన ఆ చెక్కలు, పూర్వ వైభవం తలచుకుని చిగురించడం… వినడానికీ, ఊహించుకోడానికీ ఎంత బావుందీ? చలం వ్యక్తిగత జీవితం, ఆయన ఫిలాసఫీలూ, మళ్ళీ తనే కాదన్న ఫిలాసఫీల గురించి, నా మిత్రులతో నాకెన్ని డిబేట్లు జరిగినా, ఆయన భావుకత్వానికీ, శైలికీ నేను ‘ఫిదా’! పడి చచ్చిపోతాను.
వారింట్లో ఈ సమయంలో, అంటే ‘మే’ మాసంలో పూచె గులాబీలు అరచేయంత వుండి, ఎంతో అందమైన రంగుల్లో ఆహ్లాదాన్నిస్తాయి. వెనుక పెరట్లో గులాబీ మొక్కలూ, ఓ అందమైన టేబుల్, కుర్చీలూ, వూయలా అన్నీ ఎంతో బావుంటాయి.
పైన నా రూమ్ నాకే వుంటుంది. ఆ రూమ్‍లో నేనొస్తున్నానని పెడస్టల్ ఫ్యాన్ కూడా అమర్చారు కిరణ్‌ప్రభ గారు. కాంతి గారు చపాతీ, కూరా ప్రిపేర్ చేసారు. తిని పడుకున్నాము.
ఈ ట్రిప్ లోనే కిరణ్‌ప్రభ గారితో నేను “మీ ఈ.సీ.ఐ.ఎల్.లో కొలీగ్ జానకీదేవి మాకు చిన్నప్పుడు చాలా క్లోజ్! నేను జానకక్కా అంటాను. నన్ను చిన్నప్పుడు ఎత్తుకునేది. మా లక్ష్మక్కా, శాంతక్కలకి ఫ్రెండ్” అని చెప్పాను. మొదటిసారి అమెరికా వెళ్ళినప్పుడు నేను ఈ విషయం చెప్పలేదు. సమయం అంతా గొల్లపూడి గారితో మాట్లాడడం… మాట్లాడడం కన్నా ఆయన పంచే విజ్ఞానాన్ని అందుకోవడంలోనే సరిపోయింది. నేనీ మాట అనగానే, “అలాగా! జానకీదేవి గారూ, నారాయణమూర్తి గారూ, నాకు బాగా క్లోజ్… ఇప్పుడే కాల్ చేస్తాను” అని కిరణ్‌ప్రభ గారు ఫోన్ చెయ్యడం, నా పేరు విని “పాపాయి పిన్ని కూతురు… రమణి వచ్చిందా. అయితే ఈ శాటర్ డే మీరూ, రమణిని తీసుకుని భోజనానికి రావాలి మా ఇంటికి” అని పిలవడం, అన్నీ గబగబా జరిగిపోయాయి!
ఓసారి మా పెళ్ళయిన కొత్తలో నేనూ, మా ఆయనా సుదర్శన్ టాకీస్‌లో సినిమాకి వెళ్ళాం. ముందు వరుసలో కూర్చున్న నారాయణ మూర్తిగారిని చూసి మా వారు ” మా ఎక్స్ బాస్ రమణీ! చాలా లైక్ చేసేవారు నన్ను. ఇప్పుడు ప్రాగా టూల్స్ నుండి శ్రీరామాకి వెళ్ళిపోయారు” అని వెళ్ళి పలకరిస్తుంటే, నేనూ వెనకాలే వెళ్ళి, ఆయన పక్కన కూర్చున్న ఆయన భార్యతో, “జానకక్కా… నేను శాంతీ, రమా వాళ్ళ పిన్ని కూతుర్ని!” అని చెప్పాను. జానకక్క వాళ్ళాయనతో “ఈ అమ్మాయిని నేను చిన్నప్పుడు ఎత్తుకునేదాన్ని, ఎంత పెద్దదయిందో” అని చెప్తే, “వీళ్ళ ఆయన నా దగ్గర పని చేసాడు, మంచి అబ్బాయి” అన్నారు మూర్తి గారు.
ఆ తరువాత మళ్ళీ ఎప్పుడూ ఇండియాలో వాళ్ళని కలవలేదు! జానకక్క ఈ.సీ.ఐ.ఎల్. నుండి పని మానేసి అమెరికా వచ్చేయడం, వచ్చాకా, ఆవిడ వల్లే కిరణ్‌ప్రభ గారూ, విజయరామ్ అనే ఇంకో కొలీగ్ అందరూ రావడం జరిగిందట. జానకక్క పుట్టింటివాళ్ళు బొక్కా వాళ్ళు. అత్తగారింటి పేరు హోతా! హోతా జానకీదేవి అన్నమాట.
జానకక్క ఇల్లు అద్భుతమైన లొకేషన్‌లో వుంది ఫ్రెమాంట్‌లో. ఇల్లు చాలా అధునాతనంగా, విశాలంగా, అందమైన ఫర్నిచర్‌తో సౌకర్యవంతంగా వుంటుంది. నాకు చూడగానే ‘స్వర్గం’లా అనిపించింది. వెనుక గార్డెన్‍లో జానకక్క కిచెన్ గార్డెన్‌లో టమాటాలు, పచ్చి మిరపకాయలు, అన్నీ వేసింది.
ఆ రోజు డిన్నర్‍కి నేను వస్తున్నానని విజయరామ్ దంపతులు, ఇంకో బంధువులు, ఓ ఫ్యామిలీని కూడా పిలిచింది. విజయరామ్ భార్య రమా, వాళ్ళ బంధువుల అమ్మాయి పేరు కూడా రమణీ! వాళ్ళకో అబ్బాయి. విజయరామ్ కెమెరా తెచ్చారు. ఫొటోలు తీస్తూ, ఆయన చాలా జోక్స్ వేసారు. మనిషి మంచి జోవియల్.
ఇంక జానకక్క ఎన్ని ఐటెమ్స్ చేసిందో. గారెలు, అల్లం పచ్చడీ, మామిడికాయ పప్పూ, సాంబారూ, వంకాయ కారం పెట్టి కూరా, ఇవన్నీ వుండగా విజయరామ్ గారి భార్య విప్పింగ్ క్రీమ్, పైనాపిల్ ఎసెన్స్ వేసి, ఓ స్వీట్ – నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయేట్టు చేసి తెచ్చారు. “దీని పేరేంటి?” అంటే, ఆవిడ “తెలీదు, మీరే పెట్టండి” అంటే నేను “ప్లాంతర్ పగెడీ” అని పెట్టాను! ఎందుకంటే కమేడియన్ ఆలీ నోటి నుండి తరచూ ఆ మాట వింటూ వుంటాను.
నేను జానకక్కా మా చిన్నప్పుడు పెరిగిన సీతయ్య తోట గురించి చాలా మాట్లాడుకున్నాం. ఏదైనా చిన్నతనం, ఆ అనుభూతులూ, అప్పుడు తిన్న తిండ్లూ, పెద్దయ్యాకా అపరూపంగా అనిపిస్తాయి. నోస్టాల్జియాలో అంత మహిమ వుంది. దేవుడు ఎప్పుడూ ‘నిన్న బావుంది’ అనిపిస్తాడు… ఆ నిన్న వర్తమానంగా వున్నప్పుడు చేదుగా వున్నా సరే!
జానకక్కనే తీసుకుందాం! అమెరికాలో పెద్ద వుద్యోగం, తనకీ భర్తకీ కూడా. పెద్ద బంగళా, కావలసినంత డబ్బు. నలుగురికి చేతినిండా చేసి కడుపునిండా పెట్టగలిగిన గొప్ప గుణం! అయినా తన బాల్యం ఎంతో బావుందనే అంటోంది.
సీతయ్య తోట అనేది పెద్ద ఆవరణ… దానికో గేటు వుండేది. ఆ గేటు పక్కనే ఓ గదిలో భూదేవి అనే ఆవిడ వుండి, అందరిళ్ళలో అంట్లు తోమేది. ఆ గోడని ఆనుకొని, పైన ఎత్తుగా మెయిన్‌రోడ్డు, తెల్లారు ఝాము నాలుగు నుండీ అర్ధరాత్రి దాకా బస్సులూ, లారీలూ, సైకిళ్ళూ, రిక్షాలూ తిరిగేవి. అప్పటికిన్ని కార్లూ, ఆటోలూ లేవు. మేడమీద ఓ కుటుంబం అద్దెకుండేది, కింద గుండ్రంగా బోలెడు మంది రైల్వేలో పనిచేసేవాళ్ళు అద్దెలకుండేవారు. అందులో మా నరసప్ప నాన్నా (పెదనాన్నని అలా అనే వాళ్ళం), మా శ్రీదేవి పెద్దమ్మా, ఐదుగురు పిల్లలూ ఓ వాటాలో వుండేవారు. ఒక బావీ! ఆ ఇల్లు బావుండేది అంటోంది జానకక్క!
అంటే ఆ ఇంట్లో సౌకర్యాలు వున్నాయని కాదు! ఆ ఇంట్లో చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలెవో అలా అనిపిస్తున్నాయి. పిల్లలం అంతా వేసవి శలవుల్లో ఒక చోట చేరి ఆడుకునేవాళ్ళం. గార్డ్ గారి అబ్బాయి ఇంజన్ పెట్టె అయితే, వాడి చొక్కా చివర్లు పట్టుకుని వెనకాలా అందరం ‘కూ చుక్ చుక్’ అని పరిగెడ్తుంటే, వంటింటి వసారాలో కంచాలు పెడ్తున్న పెద్దమ్మ “అదేమిట్రా? అన్నాల మీద నుండి వెళ్ళిపోతున్నారు?” అని కేకలేస్తే ఒకడు “ఈ స్టేషన్‌లో రైలు ఆగదు… ఇది పాసింజర్ కాదు” అనేవాడు! “పవర్ వచ్చిందా? షెడ్డు కూసిందా? వెంకటాద్రి టైం కి ఓ మాత్ర వేసుకుని పడుకోండి… కృష్ణా టైంకి రావలసిన పేపర్ వాడు ఇంకా రాలేదు… ఏవిటే భూదేవీ, నువ్వూ గోదావరిలా రోజూ పావు గంట లేటూ?” అని ప్రతి ఇంట్లోనూ అంతా రైల్వే భాషే మాట్లాడేవారు. పేర్లు కూడా ‘పార్శిల్ శాస్త్రి’ గారూ, ‘గార్డ్ రామనాథం’ గారూ, ‘టికెట్ విశ్వనాథం’ గారూ, ‘బుకింగ్ కోటీశ్వర్రావు’ అని చెప్పుకునేవారు!
(సశేషం)