[dropcap]వేం[/dropcap]పల్లి రెడ్డి నాగరాజు గారు రచించిన వైవిధ్యమైన నాలుగు మినీ కథలను అందిస్తున్నాము.
1. బొట్టు గొలుసు
“వెళ్లిన పని ఏమైందయ్యా?” అడిగింది సులోచన సాయంత్రం భర్త ఇంట్లోకి రాగానే.
“ఆ రంగారావు మొత్తం పొలాన్ని తానే కొంటానన్నాడు, నాలుగు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు” చెప్పాడు రాఘవయ్య డబ్బు సంచి భార్య చేతికి అందిస్తూ.
“పెళ్లిరోజుకు వ్యవధి మరో పది రోజులేవుంది మనం రేపే పట్నం వెళ్లి అమ్మాయికి బంగారం కొనేద్దామా” అంది సులోచన .
“సరే ఉదయాన్నే బయలుదేరుదాం” చెప్పాడు రాఘవయ్య.
“అన్నట్లు బంగారం కోసం ఎటూ వెడుతున్నాం కదా, అలాగే పెళ్లికి కావలసిన బట్టలు కూడా కొనేద్దాం” చెప్పింది సులోచన.
“బట్టలకు కూడా అంటే ఈ సొమ్ము చాలదేమో, నాలుగు రోజులకు పొలం రిజిస్ట్రేషన్ అయ్యాక వచ్చే బ్యాలెన్స్ సొమ్ముతో మరోసారి వెళ్లి కొందాంలే” అన్నాడు రాఘవయ్య.
“బంగారానికి ఈ నాలుగు లక్షలు సరిపోతుందంటారా?” భర్తను అడిగింది సులోచన. “అనుకోకుండా బిడ్డ పెళ్లి కుదిరి పొలం అమ్మేస్తున్నాం కదా, ఈసారి పైరు సాగుబడి కోసం సుబ్బయ్య దగ్గర అప్పుగా తెచ్చిన లక్ష రూపాయల సొమ్ము బంగారానికే వాడుకుందాం గానీ, అమ్మాయికి ఇంకా ఏమైనా కావాలేమో అడుగు” అన్నాడు రాఘవయ్య.
“నాకు వేరే ఏమీవద్దు గానీ, తాళిబొట్టు గొలుసు తూకం మాత్రం మనం ముందుగా అనుకున్నట్లుగా కాక మరో పది గ్రాములు ఎక్కువ బరువు వుండేలా తయారు చేయించండి నాన్నా” తండ్రితో చెప్పింది మరో పది రోజుల్లో వధువుగా పెళ్లి పీటల మీద కూర్చోబోతున్న స్వర్ణ.
“కేవలం ఒక్క ‘బొట్టుగొలుసు’కే మూడు తులాలు పెడుతున్నామమ్మా, అది చాలదా?”అడిగాడు రాఘవయ్య.
“ఎలాగూ కొంటున్నాం కదా నాన్నా, మీకు కాబోయే అల్లుడు గారు రేపు ఎప్పుడైనా వ్యవసాయ అవసరాల కోసం ఏ బ్యాంకు లోనో, మార్వాడి వద్దనో ఆ గొలుసు తాకట్టు పెట్టాల్సి వస్తే సొమ్ము కాస్తంత ఎక్కువగా వస్తుంది కదా అని చెబుతున్నా” అంది స్వర్ణ మెల్లగా గొణుగుతున్నట్లుగా.
2. వాచీ
“అన్నా, ఈ వాచీ తీసుకొని వంద రూపాయలు డబ్బులు ఇస్తారా?” పట్నంలోని గడియారాలు అమ్మే షాపు యజమానికి తన చేతిలోని వాచీని చూపిస్తూ అడిగాడు పదమూడేళ్ల రవి.
“ఈ వాచీ నీకు ఎక్కడిది?” అడిగాడు షాపు యజమాని ఇంకా కవర్ కూడా విప్పని తళతళ లాడుతున్న ఆ కొత్త వాచీ వంక సందేహంగా చూస్తూ.
“నాదే అన్నా, స్కూల్లో బహుమతిగా వచ్చింది”చెప్పాడు రవి.
“నిజం చెప్పు, ఇంతకీ నువ్వెవరు? ఏం పని చేస్తావు?”గద్దించినట్లుగా అడిగాడు షాపు యజమాని.
“నేను అబద్ధం చెప్పడం లేదు అన్నా, నా పేరు రవి,మాది పొరుగున ఉన్న పల్లెటూరు, ఇక్కడే హాస్టల్లో ఉండి ఎనిమిదో తరగతి చదువుతున్నా” అన్నాడు రవి తనను నమ్మమన్నట్లుగా చూస్తూ.
“చేతికి కట్టుకోమని తీసిస్తే, చీట్ల పేక ఆడటానికో, లేక దేనికోసమో చేసిన బాకీ తీర్చడానికో, దీన్ని అమ్మేస్తున్నావు కదా?” మళ్ళీ రెట్టించి అడిగాడు షాపతను.
“నేను నిజమే చెబుతున్నా అన్నా, రేయింబవళ్ళు కష్టపడి చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకున్నందుకు స్కూల్లో మా టీచర్ నాకు ఈ వాచీ గిఫ్టుగా కొనిచ్చారు, డబ్బుతో కొంచెం అవసరం ఉంది” అన్నాడు రవి.
“నువ్వు చెప్పింది నమ్ముతాగానీ, ఇప్పుడు నీకు డబ్బుతో ఏం అవసరం?” ప్రశ్నించాడు షాపు యజమాని.
“రేపు ఊరికి వెళుతున్నా, మా అమ్మకు చెప్పులు కొనుక్కోని వెళ్ళాలి” చెప్పాడు రవి.
“మీ అమ్మకు చెప్పులు కావాలంటే మీ నాన్న కొనిస్తాడు కదా, నువ్వెందుకు వాచీ అమ్మడం?” అడిగాడు షాపతను.
“మా నాన్న ఏ పని చేయడు అన్నా, మా అమ్మే పొలంలో కూలి పనులకు వెళ్లి, కష్టపడి సంపాదించుకొని వస్తే, ఆ సొమ్ము కూడా తన త్రాగుడు కోసం ప్రతిరోజూ కొట్టి లాక్కుంటాడు, కాళ్లకు చెప్పులు లేక ఈ మధ్య మా అమ్మ పొలంలో ముళ్ళు తొక్కి ఆ బాధతో కనీసం నడవలేక పోతోందట, అయినా కూడా కూలికి ఎందుకు వెళ్ళలేదు అంటూ మా నాన్న అమ్మను రాత్రి కూడా బాగా కొట్టాడట” రవి ఏం చెబుతున్నాడో ఏ మాత్రం వినిపించలేదు షాపతనికి.
3. అర్థం
“చిన్నీ, రాత్రి పడుకునే ముందు టీ.వీ.లో బాహుబలి సినిమా వస్తే గుర్తు చేయమని చెప్పావుగా, వస్తోంది, చూద్దువు గాని రా” తన ఏడేళ్ల మనవరాలిని కేక వేసింది అరవైఏళ్ల రాజేశ్వరమ్మ.
“పూజ చేసుకొని రెండు నిమిషాల్లో వచ్చేస్తా నానమ్మా” బదులిచ్చింది చిన్ని దేవుని గదిలోకి పరుగుతీస్తూ.
సరిగ్గా ఓ అయిదు నిమిషాల తరువాత…
“దేవుడి గదిలోకి వెళ్లావు, ఏమి కోరుకున్నావే?” ప్రశ్నించింది రాజేశ్వరమ్మ హాల్ లోకి వచ్చిన మనవరాలు చిన్నీని.
“కరోనా మహమ్మారిని అర్జంటుగా నాశనం చేయమని కోరుకున్నా నానమ్మా” చెప్పింది చిన్ని టెలివిజన్ స్క్రీన్ పై దృష్టి సారిస్తూ.
“ఇంత చిన్న వయసులోనే నీది ఎంత పెద్ద మనసే, లోక కల్యాణాన్ని కోరుకున్నావు”మనవరాల్ని మెచ్చుకుంటున్నట్లుగా అంది రాజేశ్వరమ్మ.
“నానమ్మా, ఇంతకూ ‘ముదనష్టపు పీడ ‘అంటే ఏంటి?”అమాయకంగా అడిగింది చిన్ని.
“ఆ పదానికి అర్థం చెప్పినా, ఈ వయసులో నీకు సరిగా అర్థం కాదుగానీ, ఇంతకూ నీకు ఎందుకు వచ్చింది ఆ సందేహం ?”అడిగింది రాజేశ్వరమ్మ మనవరాలి వైపు చూస్తూ.
“మరేంలేదు, నెలన్నర క్రితం ఆస్పత్రిలో చెకప్ కోసం వచ్చిన నువ్వు ఈ కరోనా వల్ల బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయి ఇక్కడే తిష్ఠ వేసావనీ, నీ ముదనష్టపు పీడ ఇంకా ఎన్నాళ్ళు భరించాలో, బస్సులు మళ్లీ మొదలైతే నీ దరిద్రం త్వరగా వదిలిపోతుందని ఉదయం అమ్మ పక్కింటి ఆంటీ తో అంటుంటే విన్నా, ఆ పదానికి ‘అర్థం’ ఏంటో తెలియక నిన్ను అడుగుతున్నా” చెప్పింది అమాయకంగా చిన్ని సోఫా మీద నుంచి లేచి వచ్చి రాజేశ్వరమ్మ ఒడిలో కూర్చుంటూ.
4. ఎదురు ప్రశ్న
“ఏమయ్యా, ఆత్మహత్య చేసుకోవడం మహా పాపం అనే సంగతి తెలుసునని అంటున్నావు, అయినా కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నావు? నీకు శిక్ష పడాల్సిందే” తన ఎదురుగా బోనులో వున్న వ్యక్తితో చెప్పాడు యమధర్మరాజు.
“సంతోషం పట్టలేక స్వామీ” తన ఆత్మహత్యకు కారణాన్ని చెప్పాడా వ్యక్తి.
“సంతోషం పట్టలేకనా?” నమ్మలేనట్లు ఆశ్చర్యంగా అడిగాడు సమవర్తి.
“అవును ప్రభూ, నేనొక సామాన్య రైతును. దశాబ్దాల చరిత్ర తిరగరాస్తూ ఈ ఏడాది సీజన్‌లో వర్షాలు కురిశాయి, చచ్చులు, పుచ్చులు లేకుండా అధికారులు కూడా చాలినన్ని విత్తనపు కాయల్ని క్యూలో నిలబెట్టకుండా మా ఇళ్ల వద్దకే చేర్చారు” చెప్పాడు అతడు వస్తున్న ఆయాసాన్ని ఆపుకుంటూ.
“అయితే?” సందేహంగా అడిగాడు యముడు.
“వడ్డీ వ్యాపారులు, బ్యాంకర్లు ఒక్క నయాపైసా వడ్డీ అవసరం లేదని వెంటబడి మరీ పైరు సాగుకోసం పెట్టుబడులు ఇచ్చారు, దాంతో పంటలు పండిస్తే చీడపీడలు ఏమాత్రం లేకుండా, రెట్టింపు దిగుబడులు దక్కాయి, పైగా దళారుల ప్రమేయం లేకుండా మా ఉత్పత్తులు మంచి ధరలకే అమ్ముడుపోయి గతంలోని అప్పులన్నీ తీరిపోయాయి” చెప్పాడు రైతు మెరుస్తున్న కళ్ళతో.
“నీ ఆత్మహత్యకు, నీవు చెబుతున్న విషయాలకు ఏమిటి సంబంధం?” ప్రశ్నించాడు యముడు.
“ఎన్నో దశాబ్దాలుగా కరువు వాతపడి ఎప్పుడూ బాధల్లో, అవమానాల్లో కూరుకుపోయిన నాకు ఏ మాత్రం ఊహించని ఈ ఆనందం తట్టుకోవడం చేతకాక ఆత్మహత్య చేసుకున్నా దేవా” జవాబిచ్చాడు రైతు.
“ఏది ఏమైనా ఆత్మహత్య చేసుకున్నందుకు నిన్ను శిక్షించాల్సిందే”అన్నాడు యముడు.
“ఇది నా తప్పెలా అవుతుంది ప్రభూ, తగినన్ని వానలు కురిపించిన మీ వానదేవుడినీ, పైరు సక్రమంగా పండేలా చేసి దళారులు లేకుండా మా పంటలకు అధికధరలు పలికేలా చేసిన మీ విష్ణుమూర్తినీ శిక్షించాలి గానీ” ‘ఎదురు ప్రశ్న’ వేసి నిలదీశాడు రైతు బిక్క చచ్చిన మొహంతో చూస్తున్న యమధర్మరాజును.