లోకల్ క్లాసిక్స్ – 20: పెళ్ళింటి పట్టు చీర

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన తమిళ సినిమా ‘కాంచీ వరం’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘కాంచీ వరం’ (తమిళం)

[dropcap]త[/dropcap]మిళంలో విరివిగా ఆర్ట్ సినిమాలు వస్తూంటాయి, అంతర్జాతీయ దృష్టి నాకర్షిస్తూంటాయి. వీడు, తన్నీర్ తన్నీర్, మల్లుం మలురం, ఆపూర్వ రాగంగళ్, మౌనరాగం, ధిక్కట్ర పార్వతి, విసారనై ల వంటివి. కె. బాలచందర్, సింగీతం శ్రీనివాసరావు, మణిరత్నం, సంతోష్ శివన్ ల కాడ్నించీ – భారతీ రాజా, బాలూ మహేంద్ర, వెట్రిమన్, చెళియన్‌ల వరకూ దర్శకులు తమిళ ఆర్ట్ సినిమాల సారథులుగా వ్యవహరించారు. అత్యధికంగా కె. బాలచందర్ నాల్గు సార్లు జాతీయ అవార్డు లందుకున్న దర్శకుడుగా వున్నారు. మొత్తం కలిపి 1954 – 2018 మధ్య కాలంలో 80 సినిమాలకి జాతీయ అవార్డులు సాధించారు. ఈ జాబితాలో మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ కూడా వున్నారు. ఆయన తమిళంలో ‘కాంచీ వరం – కమ్యూనిస్టు మేనిఫెస్టో’  తీసి, జాతీయ ఉత్తమ చిత్రం అవార్డుని తన వంతుగా తమిళ సినిమాకి సాధించి పెట్టారు.

ప్రియదర్శన్ పేరు తెలియని వారుండరు. మలయాళ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఆయన 95 సినిమాల కమర్షియల్ దర్శకుడు. మలయాళంతో తను తీసిన కామెడీల్ని హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్‌లో పెద్ద పేరు గడించారు. హెరా ఫేరీ, గరం మసాలా, హంగామా ల వంటి హిందీ హిట్స్‌తో ఆయనదొక ట్రెండ్. మొత్తం 23 హిందీ రీమేకులు చేశారు. ఇక తాజాగా వచ్చే ఆగస్టులో ‘హంగామా – 2’ రాబోతోంది. అయితే 1995లో మలయాళంలో తీసిన బ్రిటిష్ కాలపు పీరియడ్ మూవీ ‘కాలాపానీ’తో తొలిసారిగా జాతీయ అవార్డులకి నోచుకున్నారు. ఈ సినిమాకి నాల్గు సాంకేతిక విభాగాల్లో జాతీయ అవార్డులు లభించాయి. తిరిగి 2007లో తమిళంలో తీసిన ‘కాంచీ వరం – ది కమ్యూనిస్టు కన్ఫెషన్’తో జాతీయ ఉత్తమ చలన చిత్రంతో బాటు, ప్రకాష్ రాజ్‌కి ఉత్తమ నటుడి అవార్డూ సాధించి పెట్టారు.

కంచి పట్టు చీరల చేనేత కార్మికుల కథగా దీన్ని తీశారు. స్వాతంత్ర్య పూర్వం, ఆ తర్వాతా వాళ్ళ జీవితాల్లో వచ్చిన మార్పు వాస్తవికంగా చూపెట్టారు. పట్టు చీరలు నేసే చేనేత కార్మికులు సొంతానికి ఓ పట్టు చీర నోచుకోలేని దురదృష్టకర జీవిత దృశ్యాన్ని కడు దయనీయంగా తెరకెక్కించారు ప్రియదర్శన్.

కథ

1948 లో మహాత్మా గాంధీ మరణించిన రెండు నెలలకి ఈ కథ ప్రారంభమవుతుంది. చేనేత కార్మికుడు వెంకటం (ప్రకాష్ రాజ్) రెండు రోజులు పెరోల్ మీద జైలు నుంచి విడుదలవుతాడు. వెంట వస్తున్న ఇద్దరు కానిస్టేబుల్స్‌తో సొంతూరు కాంచీ పురంకి ప్రయాణం చేస్తూంటే వర్షం పట్టుకుంటుంది. ఈ వర్షపు ప్రయాణంలో అనుభవాలు గతాన్ని గుర్తుకు తెస్తూంటాయి. 1932లో అన్నం (శ్రియ) ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకు వచ్చాడు వెంకటం. ఆమె పట్టు చీర కట్టుకు రాలేకపోయింది. వీడైనా కొని పెట్టొద్దా అని పెద్దలు అనుకుంటారు. అసలు పట్టు చీర కట్టుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని శపథం కూడా చేసిన వాడు. పేదరాలైన అన్నం అందరి అభిమానం పొందుతుంది. వెంకటంకి ఇంట్లో పెళ్ళయిన చెల్లెలు (గీతా విజయన్) కూడా వుంటుంది. ఆమె భర్తకి ఉపాధి లేకపోవడంతో అన్న దగ్గరే వుంటోంది. వెంకటం తల్లి చనిపోతుంది. జీవితంలో పట్టు చీర చూడలేక పోయిన ఆవిడ పార్ధివ దేహానికి కప్పడానికి ఆఖరికి పట్టు వస్త్రం కూడా లేకపోయింది. బొటన వేళ్ళు కలిపి కట్టడానికి చిన్న పట్టు దారం ప్రాప్తమైంది, అంతే.

కాంచీ పురంలో తోటి చేనేత కార్మికులతో జమీందారు పార్థసారథి (జయకుమార్) దగ్గర పనిచేస్తూంటాడు వెంకటం. ఆ జమీందారు వీళ్ళ చేత పట్టు చీరలు నేయించి ఎగుమతి చేస్తూంటాడు. అతడి బంగళాకి ఇంగ్లీషు దొర (అలెక్స్) వస్తే ఒక పట్టుచీర గర్వంగా చూపిస్తాడు జమీందారు. అది చూసిన ఇంగ్లీషు దొర కళ్ళు చెదిరి పోతాయి. ఈ చీర మన్నిక 600 ఏళ్లని చెప్పేసరికి కొనడానికి సిద్ధపడతాడు ఇంగ్లీషు దొర. ధర 800 రూపాయలని చెప్తాడు జమీందారు. ఈ చీర తన కూతురి పెళ్ళికి నేయించాననీ, ఇంకోటి ప్రత్యేకంగా నేయించి అందిస్తాననీ విన్నవించుకుంటాడు జమీందారు. ఈ చీర వెంకటం నేశాడని చెప్పి, కూలి డబ్బులు ఏడు రూపాయలకి ఇంకో రూపాయి అదనంగా కలిపి, గొప్పగా ఇప్పిస్తాడు వెంకటంకి జమీందారు.

వెంకటంకి కూతురు పుడుతుంది. అన్నప్రాసనకి ఆచారం ప్రకారం కూతురు తమరై కి వాగ్దానం చేస్తాడు – ‘నువ్వు పెద్దయ్యాక, నీకు పెళ్ళయ్యాక, నీకు పట్టు చీర కట్టి పంపుతా’ అని. అన్నం నొచ్చుకుంటుంది. సాహసించి సాధ్యం కాని వాగ్దానం చేయడం తప్పని అంటుంది. కష్టపడి పనిచేసి వాగ్దానం నెరవేరుద్దామంటాడు. ఇంతలో చెల్లెలి భర్త (సంపత్ కుమార్) వచ్చి, తను వ్యాపారం చేసుకోవడానికి ఆర్థిక సాయం చేస్తే తప్ప భార్యని పోషించుకోలేననీ, విడనాడుతాననీ చెప్పేస్తాడు. దీంతో చేసేదిలేక పట్టుచీర కోసం పొదుపు చేస్తున్న డబ్బునంతా  హుండీ పగులగొట్టి ఇచ్చేస్తాడు వెంకటం. అన్నం ఖిన్నురాలవుతుంది. వెంకటం ఇక పని చేస్తున్న చోట పట్టు దారం తస్కరించి తెచ్చి ఇంట్లో రహస్యంగా దాయడం మొదలెడతాడు. కొంత దారం పోగయ్యాక, అర్ధరాత్రిళ్లు భార్యకి తెలీకుండా మగ్గం మీద పట్టు చీర నేయడం మొదలెడతాడు.

ఇలా వుండగా వూళ్ళోకి ఒక రచయిత (పి. శ్రీకుమార్) వచ్చి, వెంకటం ఏర్పాటు చేసిన చోట బస చేస్తాడు. అందరిలో కలిసిపోతాడు. ఇదిలా వుండగా, జమీందారు కారు కొని తీసుకొస్తున్నాడన్న వార్తకి వూరు వూరంతా పోగయి ఎదురు చూస్తూంటారు. కూతుర్ని తీసుకుని భార్యతో తనూ వస్తాడు వెంకటం. జమీందారు ఎంతో దర్జాగా కారులో వస్తూంటే, చూడ్డానికి ఎగబడ్డ జనంతో తొక్కిసలాట జరుగుతుంది. ఆ తొక్కిసలాటలో అన్నం తీవ్రంగా గాయపడుతుంది. సరైన వైద్యమందక చనిపోతుంది. హతాశుడైన వెంకటం దిక్కుతోచని స్థితిలో కూతురితో మిగుల్తాడు.

ఇక్కడ్నించీ వెంకటం జీవితమెలా సాగింది? ఆ రచయిత ఎవరు? అతడికి ప్రభావితుడై వెంకటం చేనేత కార్మికుల్లో ఎలాటి మార్పు తీసుకొచ్చాడు? అసలు వెంకటం జైలు కెందు కెళ్ళాడు? చివరికి కూతురి పెళ్ళికి పట్టు చీర పెడతానన్న వాగ్దానం నెరవేర్చాడా?…ఇవీ మిగతా కథలో తెలిసే విషయాలు.

ఎలావుంది కథ

మౌలికంగా చేనేత కార్మికుడి పట్టు చీర కోరిక ఈ కథ. బేళ్ళ కొద్దీ పట్టు చీరలు నేస్తున్నా, ఇంట్లోకి ఒక్క పట్టు చీరా కళ్ళారా చూసుకోలేని, కనీసం పట్టు చీర ఎలా వుంటుందో చూడకుండానే జీవితాలు చాలించుకు వెళ్ళిపోయే ఇంటి ఆడపడుచుల దైన్యానికి పరిష్కారంలేని, దిక్కుమాలిన జీవితాల కథ. ఏడు రూపాయల కూలీలో తిండికి పోను, ఎంత దాచుకుంటే ఎంత కాలానికి తాము నేసిన ఒక్క పట్టు చీర ఆ జమీందారు దగ్గరే  కొనగలరు? కంచి పట్టు చీరలకి తమిళనాడు జిల్లా కేంద్రం కాంచీ పురం ప్రసిద్ధి. కంచి కామాక్షి దేవాలయం, ఆది శంకరాచార్య శంకర మఠం ఇక్కడే నెలకొన్నాయి. 400 సంవత్సరాలుగా ఇక్కడ చేనేత వృత్తికారులు ప్రపంచ ప్రసిద్ధి పొందిన పట్టు వస్త్రాలు నేస్తున్నారు. ప్రియదర్శన్ వీళ్ళ జీవితాల్ని దృశ్యమానం చేశారు. అయితే కథాకాలాన్ని స్వాతంత్ర్య పూర్వకాలం, స్వాతంత్ర్యానంతర తక్షణ కాలం మధ్య స్థాపించారు. ఈ కాలాల్నుంచీ సంఘర్షణలో పుట్టిన చేనేత సహకారోద్యమమనే చారిత్రక ఘట్టాన్ని మరోవైపు చిత్రించారు. తీవ్ర పోరాటాల అనంతరం 1949లో కమ్యూనిస్టు నాయకుడు కేఎస్ పార్ధసారథి ఏర్పాటు చేసిన చేనేత సహకార సంఘం, 79 మంది సభ్యులతో ప్రారంభమయ్యింది. నేడు అది 24 సంఘాలుగా విస్తరించింది. ఇవన్నీ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో వున్నాయి. 50 వేలమంది చేనేత కార్మికుల సంక్షేమం ఈ సంఘాలు చూసుకుంటున్నాయి. ఇది రికార్డు చేశారు ప్రియదర్శన్.

పట్టు చీర కోరిక అనే మౌలిక కథ, ఉద్యమ బాధ్యతల్లోకి దారితీయడమనే బృహత్కథగా విస్తరించింది. దీంతో వ్యక్తి నైతిక నిబద్ధత అనే ప్రధానాంశం తెరపైకొచ్చి, ఇదే కేంద్ర బిందువైంది. అతను ఉద్యమ నాయకుడు అవచ్చు. అయితే కూతురి పట్టుచీర వాగ్దానం కోసం పట్టు దారాల వుండల దొంగతనాలకి పాల్పడితే ఎలాటి ఉద్యమ నాయకుడవుతాడు, చెప్పు దెబ్బలు తినడం తప్ప? ఎలాటి తండ్రి అవుతాడు, కూతురి ముందు ద్రోహి తప్ప? అతణ్ణి ఈ స్థితికి నెట్టేసిందెవరు? ఈ స్థితిని నివారించే మార్గమేమిటి?

ప్రకాష్ రాజ్ మెలోడ్రామా

ఈ పాత్ర ప్రకాష్ రాజ్ భావోద్వేగాల కాన్వాస్. కమర్షియల్ భావోద్వేగాలు కావు. కమర్షియల్ సినిమాల్లోలాగా భావోద్వేగాల ప్రదర్శనకి ఎడిటింగ్ గిమ్మిక్కుల, నేపథ్య సంగీతపు విరుపుల తోడ్పాటూ లేదు. ఇది ఆర్ట్ సినిమా. ఎలక్ట్రానిక్ టూల్సు వుండవు, మాన్యువల్ తాపీ మేస్త్రీతనమే. ఆ కాలపు కథని ఈ కాలపు సినిమాటోగ్రఫీతో చూపించే డిజైనర్ పీరియెడ్ మూవీ కాదిది. ఆ కాలపు కథని, పాత్రల్ని, ఏది ఎలా వుండేదో అలా ఆ కాలపు ఫోటోగ్రఫీతోనే చూపించే క్రాఫ్ట్ ఇది. ఈ క్రాఫ్ట్‌లో ప్రకాష్ రాజ్ పాత్ర అంతరంగాల్లోంచి సున్నిత, సునిశిత నటన కట్టి పడేస్తుంది. చాలా వరకూ పాత్రేమిటో చర్యలే చెప్తాయి. జమీందారు ఇంగ్లీషు దొరకి తనని పరిచయం చేసే దృశ్యం. ఇందులో షేకాండిద్దామని ఇంగ్లీషు దొర చేయి ముందుకు చాపుతాడు. దానమిస్తున్నాడనుకుని తను రెండు చేతులు అమాయకంగా భిక్షం పడతాడు ప్రకాష్ రాజ్.. గొప్ప అంతరార్థముంది ఈ చర్యలో. డబ్బుకి మొహం వాచి వుండే చేనేత కార్మికుడు, షేకాండుని దానమనుకుని దోసిలియే పట్టే మనస్తత్వంతో కదా వుంటాడు.

జమీందారు తన కూతురి పెళ్ళికి పట్టు చీర తయారు చేసే పనిని ప్రకాష్ రాజ్‌కి అప్పజెప్పినప్పుడు, ఆ చీర ఎలా వుంటుందని తోటి కార్మికుడు వేసే ప్రశ్నలకి ప్రకాష్ రాజ్ జవాబులు – వూహల్లో, ఇంకా చెబితే కలల్లో తేలిపోతూ, ఆ చీర డిజైన్ గురించి వర్ణ శోభితంగా, కవితాత్మకంగా చెప్పే తీరు – ఒకటే చెప్తుంది – కళాకారుడు తన కళారాధనలో పడితే కూలి ఏమిస్తున్నారనేది కూడా మర్చిపోతాడని!

భార్య ప్రాణాలు ఇక పోతాయనగా, ఆమెని ఎత్తుకుని దూరం నుంచి కూతురి పెళ్ళికి తను నేస్తున్న పట్టు చీర చూపించే దృశ్యంలో- బాధ, ఆనందం, అపరాధ భావం ఏది అనుభవించాలన్న భావ సంక్షోభం. పట్టుచీర చూడకుండానే తల్లిపోయింది, చివరి చూపుగా ఇప్పుడు భార్యకి చూపిస్తున్న బాధ ఓ పక్క; తన నేత పనిలో చీర అద్భుతంగా వస్తోందన్న ఆనందం ఇంకో పక్క; ఈ చీర దొంగిలించిన పట్టు దారాలతో నేస్తున్నాడన్న అపరాధ భావం మరో పక్క! దేన్ని అనుభవించాలి?

చివరికి తన దొంగతనం బయట పడి, చీర నేత పని అభాసు అయి, ఆ నేసిన పూర్తికాని ఎర్ర చీరని కొడవలితో పర్రుపర్రున కోసేసి, కూతురి మృత దేహం మీద నిండుగా కప్పే ప్రయత్నంలో – కాళ్ళ మీదికి లాగితే మొహం మీద నుంచి జరిగిపోతుంది, మొహం మీదికి లాగితే కాళ్ళ మీద నుంచి జరిగిపోతుంది చాలీ చాలని చీర … ‘ఇక వెళ్దామా?’  అని వెంట వచ్చిన పోలీసు అంటే, పిచ్చిచూపులు చూసి పిచ్చిగా నవ్వే నవ్వు వ్యవస్థ మీద కొరడా చరుపు. కొడవలితో ఎర్ర చీర కోసి పతాకంలా వూపుకుంటూ తీసుకురావడం విప్లవ నాందికి సంకేతం. పట్టు పతాకమైతే గానీ జీవితాలు పట్టుబడేలా లేవు. ఇలాటి చర్యలనేకం పాత్రని, కథనీ చెపుతూంటాయి.

కూతురి పాత్ర నటించిన షమ్ముకి ఒక నిలబెట్టే సన్నివేశముంది. ఆమె బావ యుద్ధానికి వెళ్లిపోతూంటే చాటున ఏడుస్తూంటుంది. ప్రకాష్ రాజ్ ఇది గమనించి వూరుకుంటాడు. తర్వాత నిదానంగా అడుగుతాడు- నువ్వు నచ్చావని బావ నీకు చెప్పాడా అని. నచ్చానని చెప్పాడనే ఏడ్చేస్తూ చెప్పేస్తుంది. పదిహేను పదహారేళ్ళ అమాయకత్వం, భోళాతనం ఆమె పాత్రలోంచి పెల్లుబుకుతాయి. భార్యపాత్రలో శ్రియ చాలావరకూ మౌనంగా వుండే పాత్ర.

సాబు సిరిల్ కళా దర్శకత్వం ఆ కాలపు సహజత్వంలో కలిసిపోయి వుంటుంది. కళా దర్శకత్వమున్నట్టే అన్పించదు. అలాగే తిరు ఛాయాగ్రహణం, ఎంజీ శ్రీకుమార్ సంగీతం వున్నట్టే అన్పించవు. ప్రకాష్ రాజ్ జైలు నుంచి పెరోల్ మీద బయల్దేరి వూరు చేరేవరకూ, జరిగే వర్షపు ప్రయాణంలో జ్ఞాపకం వచ్చే మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకులుగా ఈ మొత్తం కథ సాగుతుంది. ఫ్లాష్ బ్యాకుల ట్రాన్సిషన్స్ పరస్పరం సన్నివేశాలని కనెక్ట్ చేస్తూ స్మూత్ గా జరిగిపోతూంటుంది.

చివరికేమిటి

అంత కమర్షియల్ దర్శకుడు ప్రియదర్శన్, ఇంత ఆర్ట్ సినిమాని కమర్షియల్ వాసన సోకని స్వచ్ఛమైన ఆర్ట్ సినిమాగా నిర్మించడమే ఆయన సాధించిన పెద్ద విజయం. భౌతికంగా, మానసికంగా పూర్తిగా కమర్షియల్ దర్శకుడి వస్త్రాలు విసర్జిస్తే గానీ ఈ ఆర్ట్ సాధ్యం కాదు. ఇందులో కొన్ని దృశ్యాలు వర్తమానంతో కలుస్తాయి. ఇంకో ఇంగ్లీసు దొర పట్టు చీరలకి భారీ ఆర్డరిస్తాడు. దీంతో జమీందారు కార్మికుల హక్కులు అణిచేస్తాడు. ప్రతీరోజూ ఎక్కువ పని గంటలు, అదే జీతానికి చేయాలని ఆదేశిస్తాడు. ప్రసుతం దేశంలోని మూడు రాష్టాల్లో విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించే వంకతో కార్మిక చట్టాల్ని రద్దు చేసి, ఎక్కువ పనిగంటలు – కనీస వేతనం వూసు లేకుండా, ఏ ఉద్యోగ భద్రతా లేకుండా చేయాలనీ ఆర్డినెన్సులు తెచ్చినట్టు.

దీన్ని ప్రకాష్ రాజ్ వ్యతిరేకిస్తూ మరిన్ని డిమాండ్లు పెడతాడు. ఈ అవగాహన అతడి కేర్పడింది రచయిత ముసుగులో వచ్చిన కమ్యూనిస్టు ఏజెంటు వల్లే. పైగా రెండో ప్రపంచ యుద్ధం నడుస్తున్న ఈ కాలంలో,  బ్రిటన్ రష్యాలు హిట్లర్‌కి వ్యతిరేకంగా మిత్రపక్షా లయ్యాయనీ, దీంతో రష్యా కమ్యూనిజాన్ని బ్రిటన్ ఆమోదించిందనీ శుభ వార్త రావడమూ ప్రకాష్ రాజ్ పోరాటానికి కారణం. ఇక సమ్మెకి దిగడమూ, ఆకలి చావులూ, అప్పులూ దుర్భరమై సమ్మె ఉపసంహరిస్తే, యజమాని సొమ్ము తిన్నాడని ఆరోపణలు. ఈ డ్రామా అంతా  ‘మనుషులు మారాలి’ (1969 – మలయాళ ‘తులాభారం’ రీమేక్) ని గుర్తుకు తెస్తుంది. ప్రకాష్ రాజ్ కార్మిక ద్రోహిగా ముద్రపడడం, అమితాబ్ బచ్చన్ ‘దీవార్’లో తండ్రి పాత్ర సత్యేన్ కప్పూ పరిస్థితిని గుర్తుకు తెస్తుంది. కార్మిక పోరాటాల చిత్రీకరణలు ఒక టెంప్లెట్ లోనే వుంటాయేమో.

ఇదంతా అలా వుంచితే, ‘నా పెళ్ళికి పట్టు చీర తయారవుతోందా? ఎవరు తయారుచేస్తున్నారు?’ అని కూతురు అడుగుతుంది. భగవంతుడని చెప్తాడు ప్రకాష్ రాజ్. ‘భగవంతుడు తయారు చేస్తున్నాడా? ఎక్కడ తయారు చేస్తున్నాడు? నేను చూడాలి ఆ చీర’ అంటుంది కూతురు. స్వర్గంలో తయారు చేస్తున్నాడని అంటాడు ప్రకాష్ రాజ్. పట్టు చీర చూసుకోవడానికి ఆ స్వర్గానికే వెళ్ళిందామె – ప్రకాష్ రాజ్ అన్నంలో కలిపిచ్చిన విషానికి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here