భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 2

0
3

[box type=’note’ fontsize=’16’] “భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 2” వ్యాసంలో హేమావతి లోని ‘సిధ్ధేశ్వర ఆలయం’ గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

హేమావతి

[dropcap]అ[/dropcap]నంతపురం జిల్లాలో మా యాత్ర మూడు విడతలుగా జరిగిందని చెప్పాను కదా. ముందు మూడోసారి వెళ్ళినవాటి గురించి చెబుతా. మొదటి రెండుసార్లు వెళ్ళినప్పుడు ఇలా ఆలయాల గురించి వ్యాసాలు రాసే ఉద్దేశంగానీ, యాత్రా దీపికలు ప్రచురించే ఆలోచనగానీ అస్సలు లేదు. అందుకని ఆ వివరాల కోసం తవ్వకాలు మొదలెట్టాలి. పైగా అప్పటి కెమేరా కూడా డిజిటల్ కాదు యాషికా. ఫోటోలు కూడా నేను సరిగా ఇవ్వలేక పోవచ్చు. అందుకే అన్నీ వున్న మూడో భాగం ముందు మొదలు పెట్టాను.

2015 ఫిబ్రవరి 22వ తారీకు బయల్దేరి 23 పొద్దున్న హిందూపూర్ చేరుకున్నాము నేనూ, మా స్నేహితురాలు బొండాడ ఉమామహేశ్వరి. ఆటో అతన్ని మంచి హోటల్‌కి తీసుకు వెళ్ళమంటే పల్లాస్ రెసిడెన్సీకి తీసుకు వెళ్ళాడు. డబల్ బెడ్ రూమ్, ఎ.సీ. లేదు రూ. 1000 అన్ని టాక్స్‌లూ కలుపుకుని అన్నారు. సరేనని, మా పని.. అదే మీ జిల్లాలోని ఆలయాలు చూడటానికి వచ్చాము, పురాతన ఆలయాల వివరాలు చెప్పండి అంటే హోటల్ వాళ్ళూ సహాయం చేశారు ప్రోగ్రాం వేసుకోవటంలో, వాహనం మాట్లాడటంలో.

ఆ రోజు కార్యక్రమం నాలుగు ఊళ్ళు.. హేమావతి, పావగడ, విదురాశ్వధ్దం, లేపాక్షి.. ఈ నాలుగు ఊళ్ళూ, అదే వరసలో చూపించి తిరిగి హోటల్ దగ్గర దించటానికి కారు.. ఇండిగోకి ఆ రోజుకి రూ. 2,300 చెల్లించేటట్లు ఏర్పాటు చేసుకుని ఉదయం 10గంటల కల్లా బయల్దేరాము. ఇందులో పావగడ, విదురాశ్వధ్ధం రెండూ కర్ణాటక రాష్ట్రంలోవి. ఇక్కడికి దగ్గర. అందుకే అవ్వి కూడా చూశాము.

ముందుగా హేమావతి బయల్దేరాము. హేమావతి అనంతపురం జిల్లా, అమరాపురం మండలానికి చెందిన గ్రామం. హిందూపురం నుంచి దాదాపు 67 కి.మీ.ల దూరం వుంటుంది. హిందూపురం నుంచి మడకశిర 35 కి.మీ.లు అక్కడనుండి హేమవతి 30 కి.మీ.లు. అమరాపురం రోడ్డులో వెళ్ళాక ఎడమవైపు తెల్లటి పెద్ద నంది, కుడిపక్క ఆర్చి కనబడతాయి. ఆ ఆర్చి దగ్గర బోర్డు వుంది హేమావతి 6 కి.మీ. లు అని. ఉదయం 11-30కి హేమవతి చేరాము.

సిధ్ధేశ్వర ఆలయం

హేమావతిలో సిధ్ధేశ్వర ఆలయం చాలా ప్రసిధ్ధి చెందింది. ఇది శివాలయం. కాలుష్యానికి దూరంగా, ప్రకృతి మధ్యలో వెలసిన ఈ ఆలయానికి కొన్ని విశిష్టతలున్నాయి. భారతదేశంలో శివుడు సాధారణంగా లింగ రూపంలో దర్శనమిస్తాడు. అతి అరుదుగా మాత్రమే విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు. అందులోనూ సిధ్ధాసనంలో కొలువై వున్నది ఇదొక్కటేనేమో. సిధ్ధాసనం అంటే కూర్చుని వుండటం. అందుకేనేమో ఇక్కడ శివుణ్ణి సిధ్ధేశ్వరుడంటారు. ఇందులోని శిల్ప కళ చాల విశిష్టమైనది. ఏడవ శతాబ్దానికి చెందిన ఆలయమిది. ఈ ప్రాంతాన్ని అప్పట్లో నొళంబ రాజులు పాలించారు. అందుకే ఈ స్వామిని నొళంబేశ్వరుడు అని కూడా పిలుస్తారు.

 

పూర్వం ఇదంతా హెంజేరు సామ్రాజ్యంలో వుండేది. కాలక్రమంలో హెంజేరు హేమావతి అయిందంటారు. హెంజేరు సామ్రాజ్యంలో అనంతపురం, చిత్తూరు, కర్ణాటకలోని చిత్రదుర్గ కోలార్, తమిళనాడులోని ధర్మపురి, సేలం జిల్లాలోని 32 వేల గ్రామాలు ఉండేవని ఇక్కడ చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. 10వ శతాబ్దంలో ఈ ప్రాంతం పల్లవుల ఏలుబడిలోకి వచ్చింది. ఆ సమయంలో ఈ ఆలయం బాగా అభివృధ్ధి చెందిందంటారు.

 

ఈ స్వామి నొళంబ రాజ వంశీకుల కులదైవం. వీరి వంశానికి చెందిన చిత్ర శేఖర, సోమ శేఖర అనే రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చారిత్రికాధారాలను బట్టి తెలుస్తున్నది. వారలో ఒకరు సంతానం కలిగితే విగ్రహ రూపాన శివాలయం నిర్మిస్తామని శివుడికి మొక్కుకున్నారట. అనంతర కాలంలో వారికి ఆడపిల్ల పుట్టిందనీ, ఆమెకి హేమావతి అని పేరు పెట్టుకున్నారనీ చెబుతారు. వారి కోరిక నెరవేరడంతో సుందరమైన ఈ ఆలయాన్ని నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. సిద్దేశ్వరుడితో పాటు వారు మరో నాలుగు శివలింగాలను దొడ్డేశ్వర, విరూపాక్షేశ్వర, మల్లేశ్వర, సోమేశ్వర లింగాలు ప్రతిష్ఠించారు. వాటిలో మూడు ఆలయ ప్రాంగణలోనే ఉండగా, నాలుగోది ఊళ్లోని మరో శివాలయంలో ఉంది. స్వామి కొంచెం భీకరంగా వుండటంతో భైరవుడని కూడా అంటారు. భైరవుడూ, శివుడూ ఒకరేనని వీరి భావన. భైరవ రూప ధారి అయిన శివుడు సిద్ధాసనంలో కూర్చొని ఉండటం వల్ల ఈ ఆలయానికి సిధ్ధేశ్వరాలయంగా పేరు వచ్చింది.

స్వామి దర్శనం

ఆలయ ప్రవేశ ద్వారం పడమర ముఖంగా వుంటుంది. గంగమ్మను తలదాల్చి చతుర్భుజాలాతో కొలువైన సిద్దేశ్వరుని జటాఝూటాన సూర్య చంద్రులు కనిపిస్తారు. కుడి చేత బ్రహ్మకపాలాన్ని, దక్షిణ హస్తాన జపమాలను ధరించి అర్థనిమీలిత నేత్రుడై ఉంటాడు స్వామి. ఇలా శివుడు విగ్రహరూపంలో అశీన స్థితిలో కొలువై ఉన్న ఆలయం భారతదేశంలో ఇదొక్కటే నంటారు స్థానికులు. ఇక్కడి మరో ప్రత్యేకత ఏంటంటే… ఆలయంలో సిద్దేశ్వరుడి ఎదురుగా కొలువై ఉన్న నంది ముఖం ఆ స్వామిని దర్శించుకున్నట్టుగా కాకుండా పక్కకు తిరిగి ఉంటుంది. ఆలయ కుడ్యాలపై కనిపించే చోళ రాజుల శిల్ప కళా చాతుర్యం సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. రామాయణ, మహాభారత గాథలు జీవం ఉట్టి పడేలా చెక్కారు. ఒకానొకప్పుడు ఈ క్షేత్రంలో కోటి లింగాలు, కోటి నందులు ఉండేవని చెబుతారు. అందుకు నిదర్శనమా అన్నట్టు ఇప్పటికి తవ్వకాల్లో అక్కడక్కడా నందులు శివలింగాలు బయట పడుతుంటాయి.

 

ఇక్కడ ఇంకొక విశేషమేమిటంటే శివరాత్రి రోజు సూర్యాస్తమయం సమయంలో సూర్య కిరణాలు సిధ్ధేశ్వరస్వామి నుదుటిని తాకుతాయిట.

పూర్వం ఇక్కడ శిల్పకళకు చెందిన విశ్వవిద్యాలయం వుండేదని స్ధానికులు చెబుతారు.

శివరాత్రి సమయంలో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. దానికి ఆంధ్ర ప్రదేశ్ నుంచే కాక, తెలంగాణా, కర్ణాటకా, మహారాష్ట్రలనుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు.

 

ఇక్కడ చిన్న పిల్లలకి సంబంధించిన అనేక శుభకార్యాలు జరుగుతూ వుంటాయి. మేము వెళ్ళినప్పుడు భక్తులు ఎక్కువ సంఖ్యలోనే వున్నారు. మేము వెళ్ళినప్పుడు ఒక కార్యక్రమం జరుగుతోంది. అక్కడి వస్తువులు, వాటిని అమర్చే పధ్ధతి కొంచెం ప్రత్యేకంగా కనబడి ఏమిటని అడిగాము. కన్నడం తెలుగు కలిపి ఒకావిడ ఇచ్చిన సమాధానంలో నాకర్థమయిందేముటంటే .. అది పుట్టు వెంట్రుకలు తీసే కార్యక్రమం. ఆ సమయంలో వక్కపూలతో బియ్యం గిన్నెలో కలశం పెట్టి దేవుడికి మొక్కు తీర్చుకుంటారు.

 

ఒక పురాతన ఆలయం చూశామన్న తృప్తితో అక్కడనుండి 12-25 కి బయల్దేరి మడకశిర వచ్చాము. దోవలో మడకశిర కోట (వెళ్ళి చూడలేదు).. ఒక వైపునుంచి సింహం పడుకున్నట్లు వుంటుందని డ్రైవరు చెప్పాడు. నేను ఫోటో తీశాను. మీకేమన్నా కనబడుతుందేమో చూడండి.

మధ్యాహ్నం 1-00 గం.నుంచీ, 1-40 దాకా మడకశిరలో ఒక హోటల్ లో లంచ్. ముగ్గురికీ ఇడ్లీ వడ, కాఫీ రూ. 139 అయింది.

మడకశిరనుంచీ మా తర్వాత మజిలీ కర్ణాటకలోని పావగడ బయల్దేరాము. ఇక్కడికి 17 కి.మీ.లు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here