[dropcap]యు[/dropcap]గాలెన్నో మారిపోయెను
జగము మార్పు వేదికాయెను.
జనము, జలముల వేరు చేసియు
భూగోళము దిరుగు చుండెను.
అనాగరిక కాలమ్ము నుండి
అత్యాధునికమ్ము దాకా,
మానవుని మేధస్సు కొకటే
మార్పు లేని సవాలాయెను.
మరణమే లేకుండ మందుల
కనుగొనుట అసాధ్యమాయెను.
***
జంతువుల వేటాడి జంపిరి
తిరిగి ప్రాణము పోయరైరి.
యోధులైనా, యోగులైనా
చచ్చి తిరిగి బతక లేదే!
శాసనాలు చేసినోళ్ళతో
శాస్త్రవేత్తలు మరణమాయె.
కోట్ల కోట్లకు పడగలెత్తిన
కోటీశులు కన్ను మూసిరి.
నాటి నుండి నేటి దాకా
ప్రయోగాలు సాగుచుండెను.
***
సాంకేతిక యుగమ్ము నందున
దూర, చరవాణుల గూర్చిరి.
ప్రయోగమ్ముల ఫలితములుగా
వైద్యశాస్త్రము వృద్ధిబొందె.
రాకెట్లను ప్రయోగించిరి
గ్రహమ్ములను చుట్టి వచ్చిరి.
ధర్మ శాస్త్రములెన్నో చదివిరి
దాన ధర్మాదులు చేసిరి.
సృష్టి గుట్టు రట్టు చేయుట
మానవుల కసాధ్యమాయెను.