[dropcap]అం[/dropcap]తస్తులమేడకు
తలుపులు కిటికీలుగా మారి
వాకిట్లో ఒక పక్క జీవం పోసుకుని
తిరిగి చిగురిస్తున్న తలలేని ఒక మ్రాను
నావైపు చూస్తూ ఒక ప్రశ్న వేసింది
నన్ను ఆధారంగా చేసుకుని అంతస్తులు కట్టిన నీవు
ఒక్కసారైనా నాకు కృతజ్ఞతలు చెప్పాలనిపించలేదా?
నాశరీరాన్ని ముక్కలుగా కత్తిరించినప్పుడు
మరో మొక్క నాటాలనిపించలేదా?
సమాధానం చెప్పినంత మాత్రాన ……
కదలలేని వృక్షం నన్నేం చేస్తుందనుకున్నా
ఇప్పుడు బందీగా మారిన నన్ను చూసి
గుణపాఠం నేర్పుతున్నట్లు స్వేచ్ఛగా ఎదుగుతున్న
తన కొమ్మల్ని చూస్తుంటే
తనే నన్ను బందీగా మార్చిందని అర్థమయ్యింది
అలా
పొద్దున్నే కిటికీలోంచి బయట ప్రపంచాన్ని చూస్తే తెలిసింది
జీవరాశులన్నీ స్వేచ్ఛ గా విహరిస్తూ బంధీలైన
మానవుల్ని జాలిగా చూస్తున్నాయి
వాకిట్లో కడిగిన ముత్యం లా ఇంటిముందు
మల్లెతీగ పచ్చదనం పరుచుకుని
మంచుపూలతో నన్ను దగ్గరికి రమ్మంది
రెక్కలుతెగిన పక్షులను అక్కున చేర్చుకుని
వైద్యం చేస్తున్న తెల్లపూలు జీవితం పై ఆశలు కలిగిస్తున్నాయి
ప్రపంచాన్ని నాఇంట్లో చూపిస్తున్న జర్నలిస్టు”మూడవ కన్ను”
చేస్తున్న కృషి
నా మనసును చలింపజేస్తుంది
దేహాలకైన గాయాలను కనిపించకుండా
మన ప్రాణాలకు రక్షకులుగా మారిన
ఆయమ్మల దీనస్థితి చూసి నాలో ఆత్మ విమర్శ
మొదలైంది
తోకచుక్కల్లా రాలుతున్న ప్రాణాలకు గుండెలవిసిపోయేలా
ఏడుస్తున్న దేశానికి
ఏదైనా చేయాలని అడుగులు వేస్తున్నాను
నాచేతుల్లో రూపుదిద్దుకున్న
ఒక మాస్కుగానో
కడుపునింపేందుకు గుప్పెడు గింజలు గానో
మైళ్ళ దూరం నడుస్తున్న పాదాలకు
పాదరక్షలు గానో
చెట్టు నీడన కూర్చున్న వాళ్ళ ఆకలి తీర్చే మానవత్వం గానో
ఉదయించాలని అంతర్మధనంతో
బందీగా చేసుకున్న స్వీయ సంకెళ్ళను విడదీసుకుని
సుక్కపొడవకముందే నిద్రలేచి కడిగిన మనసుతో
నడక మొదలు పెట్టాను…!!