[dropcap]ఇ[/dropcap]న్నేళ్ళుగా గమనించనే లేదు
మా ఇంటి పైనా ఆకాశం ఉందని
ఇక్కడ కూడా
మేఘాలను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయిస్తాడని
అవే మబ్బుల మాటున అస్తమిస్తాడని
ఇక్కడే అవును ఇక్కడే
ప్రతి రాత్రి చంద్రుడు తన మెత్తని చల్లని వెన్నెలను కుమ్మరిస్తాడని
తారలు మిలమిలలాడుతూ తళతళలాడుతూ తమ హొయలు ప్రదర్శిస్తాయని
మాఇంటి పక్కన ఒక చెట్టుందని
ఆ చెట్టున
ఉదయం పిట్టలలాంటి పూలు పూస్తాయని
సాయంత్రం పూలలాంటి పిట్టలు వాల్తాయని
ఇంటి మిద్దె
ఇంత విశాలంగా ఉంటుందని
హిమాలయాలలోని హిమశిఖరాలకన్నా
మిద్దె నుంచి కనపడే శిఖరాగ్రాలు
చల్లదనాలు పంచుతాయని
మిద్దె పైకి పాకిన
గిన్నె మాలతీల సౌరభాలు
ఒళ్ళంతా తడుముతాయని
ఆ కనపడే ఆకాశంలో
కనపడని రహదారులు ఎన్నో ఉంటాయని
ప్రభాత సాయం సంధ్యలలో
కొంగలు ఆ రహదారులలో ప్రయణిస్తాయని
ఎన్ని తెలిసాలా చేశావు
మూసుకు పోయిన కళ్ళను తెరిపించావు
ఎన్నెన్ని తెలిసాయి
ఎన్నెన్ని నా మూసిన కళ్ళకి కనిపించాయి!!
అవును
ప్రతీ ఉపద్రవంలోనూ ఒక అవకాశం లేదూ…