[dropcap]పూ[/dropcap]ర్వపు తరం రైతుల సాగు విధానాలు సాంప్రదాయకమైనవి. ప్రకృతి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి సాగిన ఆ విధానాలు ప్రకృతి సమతౌల్యం దెబ్బ తిని ప్రకృతి ప్రకోపాలు చెలరేగుతున్న నేటి వాతావరణానికి సరిపడవు. ఆధునిక సాంకేతిక విధానాలను కూడా వినియోగించుకుంటూ సమయానుకూలంగా సాగిపోతేనే గాని పరిస్థితులు చక్కబడవు. అదే జరగాలంటే విద్యాసంస్థలు నాణ్యమైన యువ వ్యవసాయ శాస్త్రవేత్తలను, నిపుణులను తయారుచేయాలి. అపుడు సాంప్రదాయ విధానాలలోని మెలకువలు, ఆధునిక విధానాలలోని నైపుణ్యాల కలబోతగా వ్యవసాయ రంగం పునరుత్తేజితం కాగలుతుంది. ఆహార భద్రతకు భరోసా లభిస్తుంది. జీవరాశులు ఉన్నంతవరకు ఆహార అవసరాలు – ఆ అవసరాలను తీర్చుకోగలగటానికై ఆహారోత్పత్తి కొనసాగటం ఒక నిరంతర చక్రభ్రమణం. కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ వ్యవసాయరంగాన్ని కాపాడుకొంటూ పోవలసిందే. లేకపోతే ఆహారభద్రతకే ముప్పు.
2050 నాటికి భారతదేశ జనాభా 1.9 బిలియన్లకు చేరుతుందని అంచనా. గత దశాబ్ది చివరవరకూ గ్రామాలలో యువత గణనీయమైన శాతం ఉండేవారు. నూటికి 60/70 మంది యువకులు గ్రామాలలోనే ఉన్న కారణంగా వారంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో వ్యవసాయరంగానికి సంబంధించిన పనులలోనే ఉండేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. వ్యవసాయ కుటుంబంలోని యువత సైతం వ్యవసాయం పట్ల చాలా అనాసక్తంగా ఉన్నారు. మిగిలిన అన్ని రంగాలలో కంటే వ్యవసాయరంగంలో ఆదాయం చాలా తక్కువగా ఉండటమే అందుకు కారణాలు. 2011 సెన్సెస్ ప్రకారం రోజుకు రమారమి 2000 మంది వ్యవసాయం నుండి తప్పుకుంటున్నారు. అభిరుచితో వ్యవసాయ విద్యాలయాలలో చదువుకుని పట్టాలు పుచ్చుకున్న వారు కూడా వేరే వృత్తుల వైపు మళ్ళిపోతున్నారు. 2017కు సంబంధించి ఒక N.G.O విడుదల చేసిన రిపోర్టు ప్రకారం గ్రామీణ యువతలో వ్యవసాయాన్ని జీవికగా చేసుకుందామని అనుకుంటున్నవారు 1.5% లోపే. భారతదేశంలో అగ్రికల్చరుకు సంబంధించిన కోర్సుల్లో చేరేవారు చాలా తక్కువ. మెలకువలను నేర్చిన క్రొత్తతరం రాకుండానే ఉన్న తరంతోనే వ్యవసాయం ఆగిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమస్య ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూచినా వ్యవసాయరంగంలో యువత చాలా తక్కువగా ఉంటోంది.
జపాన్‍లో రైతుల సగటు వయసు 67 సంవత్సరాలు. అమెరికాలో అది 58 సంవత్సరాలు కాగా ఐరోపాలో 30%కి మించి రైతులు 65 సంవత్సరాలు పైబడినవారే!
భారతదేశంలో రైతుల సగటు వయస్సు 50 సంవత్సరాలు. జపాన్‍లో వచ్చే పదేళ్ళలో నూటికి 40మంది రైతులు వ్యవసాయాన్ని వదిలిపెడతారని అంచనా. ప్రమాద తీవ్రతను పసిగట్టిన జపాన్ 40-45 సంవత్సరాల వయస్సు లోపు వ్యక్తులను వ్యవసాయం వైపు మళ్ళించడానికి ప్రోత్సాహకాలతో కూడిన ప్రణాళికను సిధ్దం చేసుకుంటోంది.
హరిత విప్లవం:
ఆహారధాన్యాల కొరత కారణంగా తిండిగింజలకై బయట దేశాలపై ఆధారపడిన స్థితినుండి మిగులుధాన్యాల స్థితికి భారతదేశాన్ని తీసుకువచ్చిన ఘనత మాత్రం ఖచ్చితంగా హరితవిప్లవానికి, దానిని దేశానికి అందించిన వ్యవసాయశాస్త్ర పితామహుడు డా. M.S. స్వామినాథన్‌కూ దక్కుతుంది.
1960లలో తెగుళ్ళను తట్టుకుని, త్వరగా కోతకు రావడమే కాకుండా, హెచ్చు దిగుబడులనూ ఇచ్చే వంగడాలను మెక్సికో నుండీ దిగుమతి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నప్పుడు స్వామినాథన్ ఢిల్లీ శివార్లలో ఉన్న ‘జౌంటి’ గ్రామాన్ని ప్రయోగ కేంద్రంగా ఎంచుకోవడం జరిగింది. ‘భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ’కు 30కి.మీ దూరంలో ఉన్న గ్రామం అది. ఆ క్రొత్తరకం గోధుమ వంగడాన్ని ప్రయోగాత్మకంగా పండించడానికి అక్కడి రైతులు సైతం ఉత్సహం చూపారు. ఫలితాలు అధ్బుతం. 10.4 హెక్టారులకి 8 క్వింటాల్స్ వచ్చే దిగుబడి 24 క్వింటాల్స్ వచ్చింది. అంటే హెక్టారుకు ఎప్పుడూ వచ్చే దిగుబడికి మూడురెట్లు ఖాయమని ప్రయోగాత్మకంగా ఋజువైంది.
కనీస మద్దరు ధర క్వింటాలు ధర 70 రూపాయలుగా ఉన్నప్పుడు ఆ ఊర్లో పండిన విత్తనం క్వింటాలుకు 300 రూపాయలకు అమ్ముడయ్యేది. ఈ సంగతులన్నీ ఒకప్పటి జౌంటీ గ్రామపెద్ద వెల్లడించారు. వ్యవసాయాభివృద్దికి, రైతాంగం సిరిసంపదలతో తులతూగగలడానికి కారణమై తద్వారా దేశం ఆహార ధాన్యాలకు సంబంధించి స్వయంసమృద్ధి సాధించగలగడానికి కారణమైన హరితవిప్లవానికి పుట్టినిల్లుగా ‘జౌంటి’ గ్రామం రైతుల పాలిటి ఇతిహాసభూమిగా వినుతికెక్కింది.
అయితే –
అధిక దిగుబడి వంగడాలకు సమృద్ధిగా నీరు కావాలి. ఈ వంగడాలతో వర్షాధార సాగు కుదరదు. 1960లలో వ్యవసాయ అవసరాల నిమిత్తం నిర్మించబడిన ‘జౌంటి మైనర్ కెనాల్’ సాగునీటి అవసరాలను తీర్చేది. 10 సంవత్సరాల క్రిందట ‘జౌంటి’ గ్రామం స్టేటస్‍ను కోల్పోయిన కారణంగా ఆ గ్రామానికి ‘జౌంటి కెనాల్’ నుండి నీటి సరఫరా ఆగిపోయింది.
ఇదివరకు 30 అడుగులకంటే తక్కువ లోతులోనే లభ్యమయ్యే భూగర్భజలాలో ఇపుడు 30 మీటర్ల లోతున గాని లభ్యం కావటం లేదు. గ్రామంలోని చాలా ప్రాంతాలు కాంక్రీటు కట్టడాలతో నిండిపోవడంతో వాననీరు ఇంకే భూతలం తగ్గిపోయింది. చారిత్రాత్మకమైన ‘జౌంటి’ ఇపుడు తీవ్రమైన నీటిఎద్దటిని ఎదుర్కొంటోంది.
డా. స్వామినాథన్ మాటల్లో చెప్పాలంటే “పంజాబ్, హరియానా, ఉత్తర ప్రదేశ్‍లలో మితిమీరిన రసాయన ఎరువుల కారణంగా పర్యావరణం సైతం దెబ్బతింటోంది. పర్యావరణానికి హాని చేయని దిగుబడులను పెంచే ‘సతత హరిత విప్లవం’ నా ప్రతిపాదన కల! విపరీతమైన తోడివేత కారణంగా భూగర్భజలాలు అడుగంటడమే కాకుండా ఉప్పుదేరిపోయాయి కూడా” అని ఆయన ఆవేదన చెందారు. ఆయనే అన్నట్లు భవిష్యత్తు ‘గింజలు ఉన్నవాడిదే గాని గన్నులు ఉన్నవాడిది కాదు’.
‘హరితవిప్లవం’ ఒకప్పటి విజయగాథ. ఆ గాథను నెమరువేస్తూ కూర్చుంటే పెరుగుతున్న ఆహార అవసరాలు ఏమాత్రం తీరవు. కారణం ‘ఆహార సంక్షోభం’ నుండి స్వయం సమృద్దిని సాధించి సగర్వంగా తలెత్తుకొని నిలబడగలిగిన భారతదేశం ఇపుడు వ్యవసాయ సంక్షోభం దిశగా జారిపోతోంది. ఇది ఇంకా ప్రమాదకరమైన పరిణామం.
దేశంలోనికి విదేశీ చీడపీడలు ప్రవేశించకుండా సమర్థవంతంగా అడ్డుకోవడమూ ముఖ్యమే – వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు – 1914 నాటి D.I.P.A వినాశకర కీటకాలు, చీడపీడల చట్టం (డిస్ట్రక్టివ్ ఇన్‍సెక్ట్ అండ్ పెస్ట్ ఏక్ట్) పరిధిలోనికి వస్తాయి. పెద్దవైన ఎయిర్‍పోర్టులు, సముద్రపు పోర్టులు, రైల్వేపోర్టులు అన్నీ కలిపి మొత్తంగా 108 చోట్ల మొక్కల క్వారంటైన్స్ ఉన్నాయి. ఈ క్వారంటైన్స్ కేంద్రాలలో ఉండే తనిఖీ కేంద్రాలు CBITC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్) నియంత్రణలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలోని వ్యవసాయం, రైతుల సంక్షేమం మంత్రిత్వ శాఖ (MAFW) పై శాఖలన్నీ నియమాలను పాటించి విదేశాల నుండి చీడపీడలు, హానికారక కీటకాలు దేశంలోకి ప్రవేశించకుండా జాగ్రత్త వహించేలా జవాబుదారి వహిస్తుంది. డైరెక్టరేట్ ఆఫ్ ప్లాంట్ ప్రొటెక్షన్ అండ్ క్వారంటైన్ స్టోరేజి ఫరీదాబాద్, హర్యానాలో ఉంది.
ఇంత చట్టబద్దమైన యంత్రాంగం ఉన్నప్పటికీ 2000-2012 నడుమకాలంలో గోధుమ, జొన్న, కొబ్బరి, ప్రత్తి, టమోటా, బొప్పాయి మరికొన్ని పంటలకు సరిహద్దులను దాటివచ్చిన చీడపీడల బెడద తప్పలేదు. ఆఫ్రికా, దక్షిణ ఐరోపా, పశ్చిమాసియా దేశాలకు చెందిన కలుపుమొక్క ఉల్లిపంటను – మహారాష్ట్రలో దెబ్బతీసింది.
దేశంలోనికి ఏదైన వ్యవసాయ ఉత్పత్తి ప్రవేశిస్తున్నపుడు కస్టమ్స్ అధికారులో ఫైటోశానిటరీ సర్టిఫికేట్ ఉందో లేదో చూస్తారు. సంబంధిత ఉత్పత్తిని ఎగుమతి చేసిన దేశపు ప్రభుత్వం ఆ దృవపత్రాన్ని ఇస్తుంది. ఆ సర్టిఫికేట్ ఉంటేనే శాంపిల్ టెస్ట్ అనంతరం ఉత్పత్తిని దేశంలోనికి అనుమతిస్తారు. అటువంటి సర్టిఫికేట్ లేని సందర్భాలలో ఎగుమతిదారైన దేశం భారతదేశానికి ఆ విషయాన్ని తెలియచేయాల్సి ఉంటుంది. అటువంటప్పుడు దేశంలోని చీడపీడల నివారణసంస్థ ఆ ఉత్పత్తులను మిథైల్ బ్రొమైడ్‌తో 2 నుండి 48 గంటల వ్యవధి బాటు సంబంధిత పరీక్షలు నిర్వహించిన అనంతరం వాటిని విడుదల చేస్తుంది. ఆ పరీక్షల ఖర్చును సదరు కంపెనీయే భరించవలసి ఉంటుంది. ఆ కారణంగా లంచాలతో పని జరిపించుకునే సందర్భాలకూ కొదువ ఉండదు.
ఇటువంటి లొసుగులను నివారించడానికి భారతదేశపు క్వారంటైన్ వ్యవస్థ సమగ్ర పక్షాళన చేపట్టాలి.
హానికారక చీడపీడలు, కీటకాలు, కలుపుమొక్కలు మొదలైన వాటికి సంబంధించి ప్రవేక్షణ పరిశోధనలకై యుద్ధప్రతిపాదిన చర్యలు తీసుకోగల విధంగా వివిధ వృక్షజాతుల సమగ్ర సమాచారంతో కూడిన కేటలాగ్‍ను సిద్దం చేసుకొని విడుదల చెయ్యాలి. అపుడు పరిస్థితులు కొంతవరకు అదుపులోకి వస్తాయని ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న లాభాపేక్షలేని సంస్థ దక్షిణాసియా జీవసాంకేతిక పరిజ్ఞానకేంద్రం నిర్వాహకుడు భగీరథ్ చౌధురి అబిప్రాయపడుతున్నారు. అనుమతి ఉన్న, పరిమితులు విధించబడిన, నిషేధించబడిన జాతుల జాబితాను తయారు చేసి వెలువరించి సంసిద్దంగా ఉండటం ద్వారా వ్యవసాయోత్పత్తుల దిగుమతుల ద్వారా తెలియకుండా వాటిల్లగల హానిని చాలావరకు నివారించడానికి వీలుపడుతుంది.
ప్రణాళికాబద్ధంగా సాగిపోవాలి:
వాననీటిని ఒడిసిపట్టడం ద్వారా భూగర్భ జలాల పెంపుదల దిశగా చర్యలు, సమర్థవంతమైన నీటి నిర్వహణ ప్రణాళికలు, సేంద్రీయ వ్యవసాయం వంటి ‘ప్రకృతి మిత్ర’ విధానాలను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి కొనసాగించాలి. వ్యవసాయం కూడా లాభసాటి జీవనోపాధే అన్న నమ్మకాన్ని కలిగించిన నాడు మిగిలిన అన్ని వృత్తి వ్యాపారాల లాగే వ్యవసాయ రంగం కుడా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లగలుగుతుంది. ఆకర్షవంతమైన జీవనోపాధిగా మన్ననలనూ అందుకోగలుగుతుంది.