సాధించెనే ఓ మనసా!-16

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రముఖ తమిళ, ఆంగ్ల రచయిత వరలొట్టి రంగసామి రచించిన ఆంగ్ల నవలకు కొల్లూరి సోమ శంకర్ తెలుగు అనువాదం. ఇది 16వ భాగం. [/box]

[dropcap]శి[/dropcap]వ ఇప్పుడు దాదాపు అన్ని పత్రికలలోనూ కనిపించాడు. కొన్ని టీవీ ఛానెల్స్ సౌందర్య చీరల గురించి ఇంటర్వ్యూ చేశాయి.

ఈ పరిణామాలతో పరిమళ, మాల్యా, పద్మ ఇంకా అందరికంటే సంజన చాలా సంతోషంగా ఉన్నారు.

సంజన శివ ఇంట్లో వాళ్ళకి కొన్నెమరాలో పార్టీ ఇచ్చింది.

శివ కుటుంబం పార్టీ చేసుకుంటున్న సమయంలోనే, ఎంఎస్ సిల్క్స్ ప్రకటనను చూస్తూ రెండు జతల కళ్ళు అసూయతో రగిలిపోతున్నాయి.

పట్టు చీరల అమ్మకంలో రంగా సిల్క్స్ ఎప్పుడూ మొదటి స్థానంలో నిలిచేది. సౌందర్య చీరల కారణంగా తొలిసారిగా ఎంఎస్ సిల్క్స్ – రంగా సిల్క్స్‌ని అధిగమించింది.

తనకు తెలియకుండానే తన బాబాయిలపై ప్రతీకారం తీర్చుకునే మొదటి దశను పూర్తి చేశాడు శివ.

శివ బాబాయిలు మురుగేశన్, సెల్వకుమార్ కోపంతో మండిపోతున్నారు.

“సెల్వా, దీని గురించి మనం ఏదైనా చేయాలి. వాడిని ఇలా ఎదగనివ్వకూడదు.”

“కొంతకాలం వేచి చూద్దాం. వాడు మన దారికి అడ్దొస్తే వాడ్ని లేపేద్దాం.”

శివ వారి మార్గానికి అడ్డు వెళ్ళాలని ఎప్పుడూ కోరుకోలేదు. అతను తన సొంత మార్గంలో నడవడంలో తీరిక లేకుండా ఉన్నాడు. కానీ విధి వారి మార్గాలను – చాలా త్వరగా ఒకరి ఒకరు అడ్దొచ్చే విధంగా – వక్రీకరించింది. హత్యా ప్రణాళికలను రూపొందించడానికి ఆ వంచకులకు అది ఒక సాకుని అందించింది.

***

శివకి మంచి రోజులు మొదలయ్యాయి. అది కూడా భారీ స్థాయిలో. కానీ అతని గడ్డు కాలం ఇంకా పూర్తిగా ముగియలేదు.

ప్రస్తుతానికి అతను తన బాబాయిల చెడు దృష్టిలో ఉన్నాడు. శివ బాబాయిలు తమ మనుష్యులని శివ చుట్టూ ఉంచారు.

సూరత్‌లోని ఒక వ్యాపారి నుండి పట్టు చీరలకు అవసరమైన జరీని కొనాలనుకున్నాడు శివ.

అయితే అకస్మాత్తుగా అతను అమ్మనని చెప్పాడు, శివ మొత్తం విలువకి నగదు చెల్లిస్తానన్నా నిరాకరించాడు. పాపం! ఆ వ్యాపారి శివ ఆర్డర్ తిరస్కరించడానికి కారణం – తన బాబాయిలేననీ, వారు తమ వ్యాపార శక్తిని ఉపయోగించారని శివకి తెలియదు.

తన బాబాయిలు వారి దుర్మార్గపు ఆట యొక్క రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించారని శివకి తెలియదు. శివ తండ్రి మొదటి బాధితుడు; అయినా తృప్తి చెందని వారు రెండోసారి శివ అంతం కోరుకుంటున్నారు.

అయితే శివ బాబాయిలు కూడా అతని పెరుగుదలను ఆపలేకపోయారు.

***

అది నెల చివరి శనివారం. ఎంఎస్ సిల్క్స్ మేనేజింగ్ పార్టనర్ రామనాథన్ ఖాతా పుస్తకాలు చూస్తున్నారు. ఆయన మేనేజర్ అక్కడే ఉన్నాడు.

గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే అమ్మకాలు 20% పెరిగాయి.

“మీరు అమ్మకాల గణాంకాలను బాగా చెక్ చేసారా, ఒకటికి రెండుసార్లు చూశారా? గత పదేళ్లలో నేను సంవత్సరానికి 20% వృద్ధిని చూడలేదు.”

“చూశాం సార్. మేము మూడుసార్లు గణాంకాలను చెక్ చేసాము. ఇందుకు ప్రధాన కారణం సౌందర్య చీరలే అని తెలుసుకున్నాం. మనం ఇప్పుడు సౌందర్య చీరలకి ప్రత్యేకమైన విభాగాన్ని ప్రారంభించాము. ఇంకా రాబోయే పండుగ సీజన్ కోసం ఇంకొకటి ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించాలి.”

ఇదే ధోరణిని కొనసాగితే, భారీ ప్రకటన బడ్జెట్‌ను మినహాయించిన తర్వాత కూడా తమకి 5 కోట్ల రూపాయల అదనపు లాభం వస్తుందని రామనాథన్ సులభంగా అంచనా వేశారు.

ఆయనలో అపరాధ భావన తలెత్తింది. ‘శివ కోసం ఇంకేమైనా చేసుండాల్సింది’ అనుకున్నారు.

ల్యాండ్‌లైన్ ఫోన్ మోగింది.

“రామనాథన్”

“సర్, నా పేరు గణేశన్. నేను నటుడు రవికాంత్ పి.ఎ.ని. సార్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదా అని తెలుసుకోవాలనుకుంటున్నారు.

ఒకవేళ కాకపోతే, మీ అనుకూలమైన సమయం చెప్పమన్నారు. దయచేసి మీ మొబైల్ నంబర్ ఇవ్వండి సర్.”

అతను రవికాంత్ పేరు చెప్పాడా? రామనాథన్ విస్తుపోయారు. సూపర్ స్టార్ ఒక సాధారణ పట్టు-చీరల వ్యాపారి అయిన తనతో మాట్లాడాలనుకుంటున్నారా?

వ్యక్తిగత జీవితంలో రవికాంత్ ఒక రత్నం అని రామనాథన్‌కి తెలుసు. పైగా చాలా వినయశీలి. కానీ అంత గొప్ప వ్యక్తి తనతో మాట్లాడే ముందు తన సౌలభ్యాన్ని నిర్ధారించుకోవడం ఆయన ఎప్పుడూ ఊహించలేదు. ఓ మై గాడ్!

“నా మొబైల్ నంబర్‌ తీసుకోండి. ఆయన నాకు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. ఈ రోజుకి నా పని పూర్తి అయింది. నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను.”

నెంబరుని ధృవీకరించడానికి పిఎ ఆయన మొబైల్ నంబర్‌ను రెండుసార్లు పైకి చదివాడు. మరో ఐదు నిమిషాల్లో నటుడి నుండి కాల్ వస్తుందని కూడా చెప్పాడు.

రామనాథన్ మేనేజర్‌ను పంపించేశారు. తన హ్యాండ్‌సెట్‌ను తన ముందు ఉంచుకుని దానికేసే చూస్తూ ఉన్నారు.

మూడవ నిమిషంలో ఫోన్ రింగ్ అయింది. రామనాథన్ మొదటి రింగ్‌కే ఫోనెత్తారు.

“మిస్టర్ రామనాథన్?”

“అవును, సర్, నేనే రామనాథన్‌ని.”

నటుడి గంభీరమైన స్వరాన్ని ఆయన గుర్తించగలిగారు.

“గుడ్ ఈవినింగ్ సర్. నేను రవికాంత్‌ని, నటుడిని. మీతో మాట్లాడడం ఇదే మొదటిసారని అనుకుంటున్నాను. ”

“అవును అండి.”

“సర్, నేను మీకో శుభవార్త చెప్పాలనుకుంటున్నాను. మా చిన్నమ్మాయి పెళ్ళి కుదిరింది. తేదీ నవంబర్ 24. ”

“కంగ్రాట్స్ సర్. చాలా సంతోషం.”

“మీకు తెలిసే ఉంటుంది, మా పెద్దమ్మాయి పెళ్ళికి నేను అన్ని చీరలు రంగా సిల్క్స్ నుండి కొన్నాను. రంగనాథన్ గారి పట్ల నాకు చాలా గౌరవం ఉంది. ”

“చాలా సంతోషం సార్. వారు మా గురువు గారు. ”

“బాగుంది. కానీ ఈసారి రంగా సిల్క్స్ నుండి చీరలు కొనడం నాకు ఇష్టం లేదు. వారి సోదరులు వారిని, వారి కుటుంబాన్ని మోసం చేశారని విన్నాను. సొంత అన్నకి ద్రోహం చేసిన వారి షాపు నుండి పెళ్ళి చీరలు కొనడం నాకిష్టం లేదు.

ఆ దుర్మార్గులు అంటే రంగనాథన్ సోదరులు, పట్టు చీరలను ఉచితంగా ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు తెలుసా! నేను స్థిరంగా ఉండి, వీల్లేదని గట్టిగా చెప్పాను.”

న్యాయం చేయాలన్న ఓ తపన! పైగా అది కూడా ఒక నటుడి నుండి!

రామనాథన్ దాదాపు కన్నీరుమున్నీరయ్యారు. తడబడుతున్న గొంతుతో రవికాంత్‌తో మాట్లాడారు.

“తంబీ (తమ్ముడూ), నేను మీకంటే వయసులో చాలా పెద్దవాడిని.  మిమ్మల్ని తంబీ అని పిలవడానికి దయచేసి నన్ను అనుమతించండి. మీరు తప్పుగా భావించరని నేను నమ్ముతున్నాను.”

“అస్సలు లేదు సర్. మీలాంటి మంచివాళ్ళ చేత తంబీ అని పిలిపించుకోవాలి…  ఆ పైవాడి దీవెనలు ఉంటే గాని మీలాంటి వాళ్ళ చేత అలా పిలిపించుకోలేను. అలాగే తంబీ అని పిలవండి.”

“తంబీ, మీరు – మీ కుటుంబం ఆయురారోగ్యాలతో, శాంతి, శ్రేయస్సుతో కలకాలం జీవించాలి. సినీ ప్రపంచంలో మీరు చాలా కాలం పాటు మొదటి స్థానంలో ఉండాలి.”

“థాంక్యూ, సర్. చాలా ధన్యవాదాలు. నేను మీ నుండి చీరలన్నీ కొనాలనుకుంటున్నాను. నేను నటుడినని మీరు రిజర్వేషన్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.

సినీ ప్రపంచం నుండి చాలా మంది వ్యక్తులు చీరల షాపులు, ఆభరణాల షాపులను మోసం చేస్తారని నాకు తెలుసు.

నేను మీకు కొంత అడ్వాన్స్ ఇస్తాను. కొనుగోళ్లు ముగిసిన వెంటనే బ్యాలెన్స్‌ను డబ్బులు ఇచ్చేస్తాను.”

“తంబీ, మిమ్మల్ని డబ్బు ఎవరు అడిగారు? మీరు ఇక్కడకు రావటానికి వీలవుతుందా లేక మా మేనేజర్లను చీరలతో మీ ఇంటికి పంపించాలా? ”

“రెండూ కావాలి. దగ్గరి కుటుంబీకుల కోసం మీ వాళ్ళు ఇక్కడకు రావాలి. మిగిలిన వారు మీ దుకాణానికి వస్తారు. నా బడ్జెట్ సుమారు యాభై లక్షలు, సన్నిహితులకు 25, మిగతావారికి 25 ఉంటుంది. ”

“తంబీ, చాలా ధన్యవాదాలు. మీరు చీరలు కొనడానికి మా షాపు ఎంచుకోవడం గొప్ప గౌరవంగా నేను భావిస్తున్నాను. ”

“నేను కూడా, సర్.”

రామనాథన్ డిస్కనెక్ట్ చేయబోతూ, శివ గురించి ఆలోచించాడు. శివ తనకి కొన్ని కోట్ల లాభం వచ్చేలా చేశాడు. శివకి కూడా కాస్త ప్రయోజనం కలగాలంటే, ఈ ఆర్డర్‌లో కొంత భాగం అతనికి మళ్ళించడమే న్యాయం.

“తంబీ, ఇంకో రెండు నిమిషాలు మాట్లాడచ్చా?”

“తప్పకుండా సార్.”

“మేము ఇటీవల సౌందర్య చీరలను పరిచయం చేసాము. మీరు మా ప్రకటనలను చూశారా?”

“మా అమ్మాయి ఆ ప్రకటన కాపీని చూపించింది. మీరు ప్రకటనలో డిజైనర్ ఫొటో వేశారు అదే కదా? ”

“అవును. మీరు చెప్పింది నిజమే. ఆ అబ్బాయి పేరు శివ. తను రంగనాథన్ గారి కొడుకు. రంగా సిల్క్స్… రంగనాథన్ గారి అబ్బాయి. “

“అవునా, నిజంగానా…”

“తంబీ, మీకో సలహా ఇవ్వనా? మీ దగ్గరి కుటుంబీకుల చీరల డిజైన్‌ని శివ చేత ఎందుకు చేయించుకోకూడదు? వాటిని అతని సొంత దుకాణం, శివ సిల్క్స్ నుండి కొనచ్చు కూడా!

మీరు ఒక స్త్రీ కలర్ ఫోటో ఇస్తే, అతను తాజాగా విభిన్నంగా ఉండే అద్భుతమైన డిజైన్లతో వస్తాడు. మీ ఇతర బంధువులు, స్నేహితుల కోసం మీరు మా దుకాణం నుండి కొనుగోలు చేయవచ్చు.”

“మీ మంచి మనసుకు నా నమస్సులు సార్. ఈ రోజుల్లో ఇలాంటి సూచన ఎవరిస్తారు? నేను మీ సలహా ప్రకారమే చేస్తాను. రేపు నన్ను కలవమని శివని అడగవచ్చా? వివరాలకు కోసం మిమ్మల్ని సంప్రదించమని నా పి.ఎ.కి చెప్తాను.”

“తప్పకుండా, తంబీ.”

“మీతో మాట్లాడం చాలా బాగుంది సర్. నేను శుభలేఖ పంపుతాను. మీరు మీ కుటుంబంతో వచ్చి పిల్లలను ఆశీర్వదించాలి.”

“తప్పకుండా, మీరు కోరుకున్నట్లే, తంబీ.”

కొద్ది నిమిషాల్లో రవికాంత్ పిఏ లైన్‌లోకి వచ్చాడు. మరుసటి రోజు నటుడు తీరికగానే ఉంటారని రామనాథన్‍కి చెప్పాడు. మరుసటి రోజు వరుడి కుటుంబం కూడా నటుడి ఇంటికి వస్తున్నారని చెప్పాడు.

ఏర్పాట్ల గురించి చర్చించటానికి వీలుగా తనతో సంప్రదించమని శివకి చెప్తారా అని అడిగాడు పి.ఎ.

రామనాథన్ శివకి సమాచారం ఇచ్చాడు.

***

నటుడి పిఎ, ఇంకా శివ వివిధ విషయాల గురించి చర్చిస్తుండగా, రంగనాథన్ సోదరులు వారి భారీ దుకాణంలో కోపంతో రగిలిపోతున్నారు.

“సెల్వా, నటుడు రవికాంత్ కూతురి పెళ్ళి చీరల ఆర్డర్ ఏమైంది? తన మొదటి కుమార్తె వివాహం అయినప్పుడు అతను మన దగ్గర యాభై లక్షలకు చీరలు కొన్నాడు.”

“నేను దాని గురించి నటుడి పి.ఎ.తో మాట్లాడుతూనే ఉన్నాను. నేను 10 లక్షల విలువైన చీరలను ఉచితంగా ఇస్తానని మాట ఇచ్చాను. అయినా సరేననడానికి పి.ఎ. ఇష్టపడడం లేదు. ”

“అతనికి లంచం ఇవ్వడానికి ప్రయత్నించావా? ‘

“ఆఫర్ చేశాను. ఒక లక్ష రూపాయల నగదు ముందస్తుగా, మొత్తం కొనుగోళ్లలో పది శాతం ఇస్తానని చెప్పాను. కాని అతను లొంగడం లేదు. ”

“ఈ ఆర్డర్ కేవలం లాభం గురించి కాదు. ఇది మన ప్రతిష్ఠకి సంబంధించినది. మార్కెట్లో మన ఖ్యాతికి చెందినది. ఆర్డర్ మన పోటీదారులకు వెళితే మనం మార్కెట్లో ముఖం చూపించుకోలేం.”

“మనం ఇప్పటికే ఎంఎస్ సిల్క్స్ వాళ్ళ వల్ల మన మొదటి స్థానాన్ని కోల్పోయాము. ఇప్పుడు ఇది…”

“నాకు ఒక ఆలోచన వచ్చింది, సెల్వా. నటుడి ఇంటి దగ్గర ఎవర్నైనా నియమంచమని మన డిటెక్టివ్ ఏజెన్సీని అడుగుదాం.

ఆర్డర్ ఎవరికి లభిస్తుందో మొదట తెలుసుకుందాం. మన శక్తినంతా ఉపయోగించి వాళ్ళని నాశనం చేద్దాం.”

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here