[dropcap]తె[/dropcap]ల్లరాజుకి కొపము వచ్చె. అందర్నీ అనరాని మాటలు అని
అందరిమిందా నీలాపనిందలు యేసే. అన్నీ చేసి ఆమీట వచ్చి తన దర్బారులా కూకొనె.
“మనము ఎన్ని పారిశ్రామిక విప్లవాలు, చమురు సంక్షోభాలు
పుట్టబడి చేసినా, ఆంక్షలు యేసి బెదిరిచ్చినా భారతదేశం అదరకుండా
వుంది. దీనికి కారణము ఏమని నాకి తెలియాలా బిర్నా తెలియాల” అని
కుక్క బొగిళినట్ల బొగిళి నక్కలా పారిపోయ.
రాజు కోపానికి కారణమైన కారణాన్ని కనిబెట్టేకి తెల్ల
బటులు నల్ల బట్టలేసుకొని భారతదేశానికి వచ్చిరి. ఈడ వుండే కొందరికి
బాగా నాకిపిచ్చి, నక్కిపిచ్చిరి (తాపి తినపడం). ఆ మైకంలా ఒగడు
“నువ్వు ఇందువు ఎట్లయితివిపా” అనె. “అదేంరా అట్లంటావు సింధూ
నదికి ఈ పక్క వుండేవాళ్లందరు ఇందువులే కదా” అనే ఇంగొగడు. కానివాడు
వొప్పకోలే. ఇద్రు కొట్టుకొని తిట్టుకొనిరి. జనాలు ఎవురూ వీళ్లని
పట్టించుకోలే. చేనులా ఒగడు. చెట్టులా ఒగడు. కొలిమిలా ఒగడు.
చెప్పులు కుడతా ఇంకొకడు ఇట్ల ఎవరి పని వాళ్లు చేస్తావుండారు.
అబుడు అసలు కారణము ఏమని తెల్లబటులకి తెలిసే.
అట్లే వాళ్ల రాజు తాకి పోయిరి, “రాజాదిరాజ తెల్లరాజ మనము ఏమి
చేసినా భారతదేశం అదరకుండా బెదరకుండా వుందంటే దానికి కారణము
వాళ్ల పని వాళ్లు చేస్తావుండేది. ఇంగా చెప్పాలంటే వాళ్ల కులవృత్తులు
కూడా దీనికి కారణము” అని బొగిళిరి (చెప్పిరి).
“అదా అసలు సమాచారము, వాళ్ల కులవృత్తున్ని కూలకొడతా.
వాళ్ల పని కాదని వాళ్లు నా పని చేసే మాద్రిగా చేస్తా, దానికి వాళ్ల
కుల, మతాలని అడ్డం పెట్టుకొంటా, ఆటలు ఆడతా, పాటలు పాడతా”
అని ఎగురుకొని పోయే తెల్లరాజు. వాని ఎనకనే వాని బళగము
పోయె.
***
బళగము = సమూహము