అలనాటి అపురూపాలు-13

0
2

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి  వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపరూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు‘ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

డప్పు కళాకారుడు అమృతయ్య:

ప్రపంచం వారి వాయిద్యాల మధురమైన స్వరం వింటూ మైమరచిపోతుంది. ఊగిపోతుంది. తమ వాయిద్యాల సుస్వరనాదాలతో ప్రజలను అలరించి మైమరపించిన కళాకారులనేకులు అజ్ఞాతంగా వుండిపోతారు. వారి స్వరతరంగాలు శ్రోతల మనసులోతుల్లో మార్మ్రోగుతూంటాయి. కానీ ఆ అమృతప్రాయమైన స్వరతరంగాల సృష్టికర్తల గురించి ఎవరికీ తెలియదు. అలాంటి ఒక అద్భుతమయిన కళాకారుడు డప్పు అమృతయ్య.

కొన్ని పాత సినిమాలలో ఏదో పల్లెలో ఓ జాతరలోనో, లేదా జనసామాన్యాన్ని ఉద్దేశించో జానపద పాటలు/బ్యాక్‌గ్రౌండ్ సాంగ్ ఉండడం కద్దు. అందులో ప్రధాన నటీనటులు కాకుండా ఏ జానపద కళాకారుడో లేక నర్తకో ఆడి పాడేవారు. అలా సినిమాలకి సేవలందించిన జానపద కళాకారులెందరో ఉన్నారు. డప్పు అమృతయ్య వారిలో ఒకరు.

అమృతయ్య కృష్ణాజిల్లా గుడివాడ తాలూకా కనుమూరు గ్రామానికి చెందినవారు. ఆయన చదువుకోలేదు కానీ, వాయిద్య పరికరాలంటే ఆసక్తి పెంచుకున్నారు. ఆయన మొదట తరిగొప్పల సీతయ్యగారి వద్ద, ఆ తరువాత పురుషోత్తమ పట్నంకి చెందిన తిరుపతి స్వామి వద్ద డోలు వాయించడం నేర్చుకున్నారు. ఉయ్యూరు కరణం వడ్లమన్నాటి వెంకటేశ్వరరావు గారి వద్ద భరతనాట్యం కూడా నేర్చుకున్నారు. అటు పిమ్మట డప్పు వాయించడం నేర్చుకుని అందులో ప్రావీణ్యత సాధించారు. కొద్ది కాలానికి యువకుడైన యేసుదాసయ్య అమృతయ్య గారికి శిష్యుడయ్యాడు. ఇద్దరూ కల్సి డప్పు ప్రదర్శన లివ్వసాగారు.

1944లో గూడవల్లి రామబ్రహ్మంగారు వారి ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేశారు. తరువాత 1946లో ప్రజా నాట్య మండలికి చెందిన డా. రాజారావు గారు ప్రదర్శన ఇమ్మని ఆహ్వానించారు. ఆ పిమ్మట ప్రజా నాట్య మండలి తరఫున వారెన్నో ప్రదర్శనలిచ్చారు (జమున గారికి, అల్లు రామలింగయ్య గారికి తొలి అవకాశాలు ఇచ్చినది ఈ డాక్టరు గారే). 1949లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం ప్రారంభమైంది. అప్పటి సమాచార శాఖ మంత్రి ఆర్. ఆర్. దివాకర్ సమక్షంలో వీరు డప్పు ప్రదర్శన ఇచ్చారు. ఆయనకి బాగా నచ్చింది. అమృతయ్య గారికి ఎన్నో ప్రశంసలు అందాయి. 1955లో జాతీయ సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా – సోవియట్ యూనియన్ కమ్యునిస్ట్ పార్టీ ఫస్ట్ సెక్రెటరీ నికితా కృశ్చేవ్, సోవియట్ ప్రధాని నికోలాయ్ బుల్గానిన్, భారత ప్రధాని జవహర్‍లాల్ నెహ్రు సమక్ష్యంలో తమ కళను ప్రదర్శించారు అమృతయ్య. నెహ్రూ వారిని ప్రశంసించి, ‘దేశంలో ఇటువంటి కళాకారులున్నందుకు గర్విస్తున్నాను’ అన్నారు. తెలుగువారికి అదెంతో గర్వకారణం.

తరువాత వారికి భారత రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ సమక్షంలో ప్రదర్శనిచ్చే అవకాశం వచ్చింది. ప్రదర్శన అనంతరం రాజేంద్రప్రసాద్ గారు అమృతయ్యని హత్తుకున్నారట.

ఆహ్వానం అందినప్పుడు – నిరక్షరాశ్యుడవడం వల్ల – ఢిల్లీకి ఎలా వెళ్ళాలో అమృతయ్యగారికి తెలియలేదుట. కానీ ఎలాగోలా ఢిల్లీ చేరుకున్నారు. తర్వాత ఏం చేయాలో తెలియలేదు. ఆయనకి తెలుగు మాత్రమే వచ్చు. అప్పుడు శ్రీమతి వాణి అనే ఆవిడ ఆయనకి సాయం చేశారట. దాంతో ఆయన అంతమంది ప్రముఖుల ముందు ప్రదర్శననీయగలిగారు. తదుపరి శ్రీమతి వాణి తన కుమార్తె వివాహం అప్పటి ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ వివి గిరి గారి కుమారుడితో జరిపించారట. ఆ వివాహ సందర్భంగా అమృతయ్య ఒక ప్రదర్శననిచ్చారు.

ఈ కీర్తి ప్రతిష్ఠలు వారిని సినీ రంగంవైపు మళ్ళించాయి. తమ సినిమాలో జిక్కీ పాడిన, వహీదా రెహమాన్‌పై చిత్రీకరించిన ‘ఏరువాకా సాగారో’ పాటకి డప్పు వాయించడం కోసం గుడివాడ నుంచి కళాకారులు వచ్చారని కొసరాజు గారు తమ పుస్తకంలో రాశారు. 1956లో తమ సినిమా ‘ముద్దుబిడ్డ’లో ‘పదరా సరదాగా పోదాం’ పాటకి అమృతయ్య గారి చేత డప్పు వాయింపజేశారు కె.బి. తిలక్. ఆ తరువాత వారు వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఎన్నో జానపద పాటలకు డప్పు వాయిద్య సహాకారం అందించారు. ‘సిరిసిరిమువ్వ’ చిత్రంలో చంద్రమోహన్ అభినయానికి నేపథ్యంగా డప్పు వాయిద్య సహకారం అందించడం కోసం కె. విశ్వనాథ్ గారు పిలిపించడంతో వారి కీర్తి శిఖరాగ్రం చేరుకుంది. అమృతయ్యగారికి సొంత తమ్ముడి కంటే ఎక్కువైన శిష్యుడు ఏసుదాసయ్య ‘సిరిసిరిమువ్వ’ చిత్రం విడుదలకి కొద్ది కాలం ముందు దురదృష్టవశాత్తు 41 ఏళ్ళకే మృతి చెందారు. కీర్తి ప్రతిష్ఠలయితే సాధించారు గానీ, వచ్చిన డబ్బుని దాచుకోవడం అమృతయ్యగారికి తెలియలేదు. దాంతో అమృతయ్య గారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వారి కుటుంబాన్ని కె.వి.మహదేవన్ గారు అన్ని విధాలా ఆదుకున్నారు. అమృతయ్య గారికి ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. అమృతయ్య గారి కూతుళ్ళ పెళ్ళిళ్ళు చేసి, ఒక కొడుకుని మహదేవన్ గారు మెడిసిన్ చదివించారు. ఇలా సాటి కళాకారులకి సహాయం చేసిన ఎందరో కళాకారుల ఔదార్యం సినీ చరిత్ర పుటలలో నిక్షిప్తమై మసకబారింది. ఇలాంటి వారి గురించి తెలుసుకోవడం వ్యక్తిగతం నాకెంతో ఇష్టం, వారికి నా వందనాలు.


అంజాద్‍ఖాన్ కెరీర్‌ని నాశనం చేసిన ప్రమాదం:

బొంబయిలోని నానావతి ఆసుపత్రిలో కొడుకు షాదాబ్ ఖాన్‍తో అంజాద్ ఖాన్

సాధారణంగా కొన్ని ప్రమాదాలు శారీరక గాయాలు చేస్తాయి, మరికొన్ని ప్రమాదాలు శారీరకం గానూ మానసికంగానూ వేధిస్తాయి. హిందీ నటుడు అంజాద్‌ఖాన్‌కి సంభవించిన ప్రమాదం అటువంటిదే. ‘ది గ్రేట్ గాంబ్లర్’ సినిమా షూటింగ్ కోసం కుటుంబంతో సహా వెళ్తున్నప్పుడు ఘోర ప్రమాదం జరిగింది. గర్భవతిగా ఉన్న ఆయన భార్యకి చిన్న చిన్న దెబ్బలు తగలగా, కొడుక్కి మెడ మీద చిన్న గాటు పడింది. కానీ అంజాద్ ఖాన్‌కి తీవ్రగాయాలయ్యాయి. పక్కటెముకలు విరిగిపోయాయి, ఊపిరితిత్తులకి చిల్లుపడింది. గాయాల నుంచి కోలుకున్నాకా, ఆయనకి ఛాతి మీద నుంచి మెడ వరకు ఓ పెద్ద మచ్చ ఏర్పడిపోయింది. తనకి భారీ ప్రమాదం జరిగిందని తెలిసి కూడా ‘ది గ్రేట్ గాంబ్లర్’ యూనిట్ షూటింగ్‌ కొనసాగించినందుకు ఆయనకు మనస్తాపం కలిగింది. ఆ సినిమాలో ఇక నటించేందుకు, అందుకు గోవా వెళ్ళేందుకు ఆయన నిరాకరించారు. ఆయన కుడికాలికి ఫ్రాక్చర్ కూడా అయింది. చాలా రోజుల పాటు మంచానికి, ఆపై చక్రాల కుర్చీకి పరిమితమయ్యారు. వారి ‘పాలి హిల్’ ఇంటికి లిఫ్ట్ సౌకర్యం లేనందున చాలా రోజులు బాంద్రాలోని బండ్‌స్టాండ్ ప్రాంతంలోని తమ అత్తగారింట ఉన్నారు. అప్పుడు విపరీతంగా బరువు పెరిగిపోయి, ఆయనది ఊబకాయమయ్యింది. సినిమా కెరీర్ నాశనమయ్యింది. కష్టకాలంలో ఆ కుటుంబాన్ని అమితాబ్ బచ్చన్ ఎంతగానో ఆదుకున్నారు.


స్వరకర్త గులామ్ మొహమ్మద్:

తమ తమ రంగాలలో విశేషంగా రాణించిన ప్రతిభామూర్తులను స్మరించుకోవడం ఎంతైనా అవసరం. అటువంటి వారిలో తన సంగీతంలో హిందీ చిత్రసీమను ఉర్రూతలూగించిన గులామ్ మొహమ్మద్ ఒకరు.

వయసులోనూ, అనుభవంలోను నౌషాద్  కన్నా  15 సంవత్సరాలు పెద్దవారైన స్వరకర్త గులామ్ మొహమ్మద్ కి స్వతంత్ర సంగీత దర్శకుడిగా మొదటి అవకాశం ‘బాంకే సిపాహియా’ (1937) అనే సినిమాతో లభించింది. వాస్తవానికి ‘ఆర్గాన్ ప్లేయర్’గా అవకాశాలు లేకుండా బాధ పడుతున్న నౌషాద్ ని ఉస్తాద్ ఝండేఖాన్ కి పరిచయం చేసింది మొహమ్మద్. అయినా, విధివశాత్తు నౌషాద్ కి అసిస్టెంట్‌గా చేయాల్సి వచ్చింది. అద్భుతమైన చిత్రం ‘పాకీజా’ని అజరామరం చేసింది స్వరకర్త గులామ్ మొహమ్మద్ .

1905లో బికనేర్ సమీపంలోని నాల్ గ్రామంలో జన్మించారు గులామ్ మొహమ్మద్. గులామ్ మొహమ్మద్  తండ్రి నబీ భక్ష్ సుప్రసిద్ధ తబలా వాయిద్యకారులు. ఢోలక్, తబలా, పఖవాజ్ వంటి వాయిద్యాలలో కుమారుడు విశిష్టంగా రాణించేందుకు తొలి శిక్షణ ఆయనే ఇచ్చారు. ఆయన జోధ్‌పుర్ – బికనేర్ థియేట్రికల్ కంపెనీ కోసం, లాహోర్ లోని న్యూ ఆల్‌ఫోర్డ్ థియేటర్ కంపెనీకి పని చేసేవారు. మట్కా, డఫ్, కంజీరా, చిమ్టా వంటి వాయిద్యాలను ప్రయోగించడంలోని తన నైపుణ్యాలను మెరుగుపర్చుకునేందుకు హైదరాబాద్‍కి చెందిన ఉస్తాద్ రసూల్ ఖాన్ వద్ద శిక్షణ పొందారు.

గులామ్ మొహమ్మద్  1924లో బొంబాయి చేరారు. తబలా వాయిద్యంలో తన మొదటి అవకాశం సరోజ్ మూవీటోన్ వారి చిత్రం ‘రాజా భర్తృహరి’ రూపంలో వచ్చింది. అతి త్వరలోనే వాయిద్యకారుడిగా ఆయనకి గుర్తింపు వచ్చింది, తరువాతి కాలంలో అనిల్ బిస్వాస్ తో కలిసి పనిచేసే అవకాశమూ లభించింది. నౌషాద్  ఉస్తాద్ ఝండేఖాన్  వద్ద చేరినప్పుడు గులామ్  మొహమ్మద్ కూడా వారితో చేరారు. వారి స్నేహం జీవితాంతం కొనసాగింది. తర్వాతి కాలంలో నౌషాద్  స్వతంత్ర సంగీత దర్శకుడు అయ్యాకా, గులామ్ మొహమ్మద్ ని  తన అసిస్టెంట్‌గా పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ‘సంజోగ్’ (1943) నుంచి ‘ఆన్’ (1952) వరకూ ఎన్నో సినిమాలు చేశారు. సినిమా పాటలలో లయకి ప్రాధాన్యతనిచ్చారు. 1943లో ‘మేరా క్వాబ్’ విజయంతో గులామ్ గారు తొలి విజయాన్ని అందుకున్నారు. 1947లో గులామ్ గారు పి.ఎన్. అరోరా  ‘డోలీ’ చిత్రానికి సంగీతం అందించారు. అందులో షంషాద్ బేగం పాడిన ‘ఆంగనా బోలే కాగా రే’ పాట ఎంతో ప్రసిద్ధి చెందింది. తరువాతి కాలంలో, అరోరా , గులామ్ మొహమ్మద్  కలిసి పది సినిమాలు చేశారు. అయితే గులామ్ మొహమ్మద్  సంగీత ప్రయాణంలో వారిని గుర్తుంచుకోదగ్గ స్వరకర్తగా నిలిపింది మాత్రం ‘కాజల్’ చిత్రం. ఆ సినిమాలో సురయా తో పాడించిన ‘దిన్ పే దిన్ బీతే జాయె’ అనే పాట సూపర్ హిట్ అయింది. ఆయన సంగీతం అందించిన ‘గృహస్థి’, ‘పగ్డీ’ అనే సినిమాలు దేశాన్ని ఊపేశాయి.  ‘గృహస్థి’ సినిమాలో షంషాద్ – ముఖేష్‍ల యుగళ గీతం ‘తేరే నాజ్ ఉఠానే కో’ లో గులామ్ గారికే సొంతమైన డోలక్ థేకా ఉంది. మరొక సుప్రసిద్ధ గీతం షంషాద్ ఆలపించిన ‘వాహ్ రే దునియా వాహ్ రే జమానా’. పగ్డీ సినిమాలో ‘ఏక్ తీర్ చలనేవాలే’ అనే పాటలో (ముఖేష – సితార గానం) తొలిసారిగా అడుగుల చప్పుడుని ఉపయోగించారు. ఈ పాట ఎంతో సుప్రసిద్ధమయ్యింది.

1949లో రెండు గొప్ప మ్యూజికల్ హిట్స్ – అందాజ్ (నౌషాద్), బర్సాత్ (శంకర్ జైకిషన్) – సినీ పరిశ్రమ అందుకుంది. అదే సంవత్సరంలో గులామ్ మొహమ్మద్  ‘పారస్’ విడుదలైంది. లత మంగేష్కర్ పాడిన ‘ఇస్ దర్ద్ కీ మారీ దునియా’, ‘బర్బాద్ యే దునియా’, ‘దిల్ కా సహారా ఛుటే నా’ అనే పాటలు; ముఖేష్ పాడిన రెండు సోలో పాటలు జనరంజకమయ్యాయి. ఈ పాటలలో గులామ్  మొహమ్మద్ తన ట్రేడ్‌మార్క్ మట్కా రిథమ్ ఉపయోగించారు. ‘అందాజ్’, ‘బర్సాత్’ ‌లతో పాటుగా ‘పారస్’ కూడా ఆ సంవత్సరపు మ్యూజికల్ హిట్‌గా నిలిచింది.

పి.ఎన్. అరోరా  దర్శకత్వంలో మధుబాల, రెహ్మాన్, కరణ్ దీవాన్ నటించిన ‘పర్‌దేశ్’ చిత్రానికి సంగీతం అందించారు గులామ్ మొహమ్మద్. ఈ సినిమా కూడా పెద్ద హిట్ అయింది. ఇందులోని రఫీ-లతా యుగళ గీతం ‘అఖియా మిలా కే జరా బాత్ కరో జీ’ గులామ్ మొహమ్మద్  ‘సిగ్నేచర్ సాంగ్’ అంటారు. షంషాద్  హుషారుగా పాడిన ‘మేరే ఘుఘర్ వాలే బాల్ ఓ రాజా’, ‘ఏక్ రాత్ ఆయే’ పాటలు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. లతా  సోలో పాటలు ‘ఓ జో ధీరే చలే రంజ్ దేకర్’, ఇంకా ‘రాత్ హైం తారోం భరీ’ సంగీతాభిమానుల మన్ననలు పొందాయి.

‘సీషా’ సినిమాకి గులామ్ మొహమ్మద్  కూర్చిన సంగీతం విశేషమైనది. ఇందులో లతా మంగేష్కర్ ‘ఖుషీ దిల్ సే హఁసీ హోటోం సే’, ‘జవానీ కీ రాస్తే మే ఆజ్ మేరా దిల్ హై’ వంటి చక్కని మధుర గీతాలు ఆలపించారు. ‘గౌహార్’ (1953) సినిమాలో గులామ్ మొహమ్మద్,  సుధా మల్హోత్రా చేత రెండు ఘజళ్ళు పాడించారు. అవి ‘ఆవాజ్ దే రహా హై ఆస్మాన్ సే’, ఇంకా ‘చలే గయే తుమ్ సూనీ బహార్ కర్ కే’. వాటిల్లోని భావాన్ని అనుభవించి పాడారామె. ఈ సంగీత దర్శకుని కోసం తొలిసారిగా ఆశా భోస్లే రఫీ తో కలిసి ‘ధీరే ధీరే మేరా దిల్ లే కే చలె’ అనే యుగళగీతం పాడారు. జయంత్ దేశాయ్  ‘హజార్ రాతేఁ’లో ‘ఠండీ హవా మే జియా డోలే’, ‘మత్‌వాలీ నజర్’,  ఇంకా ‘ఆయే హై రాత్ ఖిలీ చాందినీ’ వంటి కొన్ని శ్రావ్యమైన పాటలను షంషాద్ బేగం స్వరంలో గులామ్ మొహమ్మద్ అందించారు. ఈ సినిమాలోని యుగళ గీతాలు ‘మేరే దిల్ కే ముసాఫిర్‌ఖానే మే’, ‘తుమ్ మేరీ కహానీ క్యా జానో’ సంగీతాభిమానుల ఆదరణ పొందాయి.

1953లో గులామ్ మొహమ్మద్  అయిదు సినిమాలకు సంగీతం అందించారు. ఇందులో షమ్మీ కపూర్‌వి రెండున్నాయి. ‘రైల్ కా డిబ్బా’ లో జనరంజకమైన యుగళ గీతం ‘లే దే మోహే  బల్‌మా’, ‘ఆస్‌మానీ చూడియాఁ’, ఇంకా ఆశా స్వరంలో ‘భగవాన్ తెరీ దునియా మే ఇన్‌సాన్ నహీ హై’ అనే సోలో ఉన్నాయి. ‘లైలా మజ్నూ’ కోసం ఆయన తలత్ మహమూద్ – లతా స్వరంలో ‘ఆస్‍మాన్ వాలే తేరీ దునియా సే దిల్ భర్ గయా’ అనే యుగళ గీతం, తలత్ మహమూద్ స్వరంలో ‘చల్ దియా కారవాన్, లూట్ గయే హమ్ యహాఁ’ అనే సోలో పాడించారు. ఇవి అజరామరంగా నిలిచాయి. షంషాద్ పాడిన ‘యే సనమ్ యే జిందగీ’, ఇంకా ఆశా పాడిన ‘యాద్ తేరీ జిందగీ కే సాథ్’ అనే పాటలు కూడా గొప్ప హిట్‌లే!

ఏ. ఆర్. కర్దార్  ‘దిల్-ఏ-నాదాన్’ (1953) సినిమాలో గాయకుడు తలత్ మహమూద్‌ ప్రధాన పాత్ర పోషించారు. మామూలుగా లతా, రఫీ గులామ్ మొహమ్మద్  అభిమాన గాయనీగాయకులు. కానీ ఈ సినిమాలో వారిద్దరూ పాడలేదు. నటులు శ్యామా, పీస్ కన్వల్ కోసం గులామ్ మొహమ్మద్  సుధా మల్హోత్రా, జగ్జీత్ కౌర్‍లను ఎంచుకున్నారు. ‘యే రాత్ సుహానీ రాత్ నహీ’, ‘జో ఖుషీ సే చోట్ ఖాయే’ ఇంకా, ‘జిందగీ దేనేవాలే సున్’ వంటి సోలో గీతాలను తలత్ అద్భుతంగా ఆలపించడంతో ఈ సినిమా గొప్ప మ్యూజికల్ హిట్ అయింది. తలత్, సుధా మల్హోత్రా, జగ్జీత్ కౌర్ ఆలపించిన ‘మొహబ్బత్ కీ ధున్ బేకరారోం సే పూఛో’ అనే పాట ఎందరినో ఆకట్టుకుంది. ఈ సినిమాలో షంషాద్ పాడిన ‘అయే దిల్ న సతా ముఝ్‍కో’ అనే హుషారైన పాట కూడా ఉంది. అయితే ‘మీర్జా గాలిబ్’ కోసం గులామ్ బేకరారోంకె కూర్చిన సంగీతం – కమల్ అమ్రోహీ  కలల ప్రాజెక్టు – ‘పాకీజా’కి స్వరాలందించేట్టు చేసింది. తొలుత ఈ సినిమాకి – ‘అనార్కలి’ చిత్రానికి సంగీతం అందించిన సి. రామచంద్ర ని అనుకున్నారు అమ్రోహి , కానీ ఆ చిత్రం విజయంతో ఆయన విపరీతమైన సంతోషంలో ఉండిపోవడం వల్ల, ‘మీర్జా గాలీబ్’ చూసి, గులామ్ మొహమ్మద్ కి అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

ఈ మధ్యలో గులామ్ మొహమ్మద్  ‘సితార’ అనే సినిమాకి సంగీతం అందించారు. ఇందులో ‘జమునా కే పార్ కోయీ బన్సీ బజాయే’, ‘చందా ధీరే సే ఆ’ అనే అద్భుతమైన పాటలను లతా పాడారు. లతా పాడిన మరో పాట ‘తక్దీర్ కీ గర్దిష్ క్యా కమ్ థీ’ సూపర్ హిట్ అయింది. కాని దురదృష్టవశాత్తు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది.

సినిమా ఎలా ఆడినా, గులామ్ మొహమ్మద్ మరో అద్భుతమైనా క్లాసిక్ ‘మాలిక్’‌ (1958) కి సంగీతం అందించారు. తలత్ – సురయా నటించిన ఈ చిత్రంలో వారిద్దరూ పాడిన ‘మన్ ధీరే ధీరే గాయే రే’ – కలకాలం నిలిచిపోయింది. సురయా గారి చివరి సినిమా ‘షామా’ (1961), దీనికి గులామ్ మొహమ్మద్ స్వరకర్త. అద్భుతమైన సంగీతాన్నందించారు. ఈ సినిమాలో పరిచయం చేసిన విజయ్ దత్ పక్కన నిమ్మీ నటించారు.

తనకి అత్యంత పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టిన ‘పాకీజా’ సినిమా కోసం గులామ్ మొహమ్మద్ 15 ఆణిముత్యాలను కూర్చారు, కాని సినిమాలో ఆరు పాటలనే వాడారు. ఈ పాటలన్నీ బావుండడంతో హెచ్.ఎం.వి. వాళ్ళు (మిగతా పాటలతో సహా) ‘పాకీజా రంగ్ బ రంగ్’ పేరిట ఒక ఆడియో డిస్క్ తీసుకొచ్చారు. ‘పాకీజా’ సినిమా కోసం గులామ్ మొహమ్మద్ ప్రాణం పెట్టారు. తనకి తెలిసిన విద్యనంతా ఈ సినిమాలో వాడేశారు. తనకిష్టమైన సారంగి పండితుడు పండిట్ రామ్‌నారాయణ్ – లతా  పాట ‘సారే రాహ్ చల్తే చల్తే’లో కావల్సిన ఎఫెక్ట్ కోసం 21 టేకులు ఇచ్చారట. ‘మౌసమ్ హై అషియానా’ పాటని కళ్యాణి రాగంలో కూర్చి నేపథ్యం అందించారు, ‘చలో దిల్ దార్ చలో’ పాటకి పహాడీ రాగంలో బాణీ కట్టారు. సాంప్రదాయ గీతమైన ‘ఇన్హీ లోగోం నే లే లీనా దుపట్టా మేరా’ అనే పాటని కొత్తగా అన్వయించారు గులామ్ మొహమ్మద్ (1940లలో వచ్చిన రెండు సినిమాలలో ఈ గీతాన్ని స్వరకర్త గోబింద్ రామ్ ఉపయోగించుకున్నారు).

‘మహల్’ చిత్రానికి ‘ఆయేగా ఆనేవాలా’ అనే పాటకి తన సంగీతం యొక్క విజయాన్ని చూడలేకపోయిన ఖేమ్‍చంద్ ప్రకాశ్ లానే అయింది గులామ్ మొహమ్మద్  పరిస్థితి. పాకీజా సినిమా పూర్తవడానికి పదేళ్ళు పట్టింది. రెండు పాటలు మినహా అన్ని పాటలను గులామ్ మొహమ్మద్  రికార్డ్ చేశారు. ఆ రెండిటినీ కూడా రిహార్సల్స్ చేయించారు. అనారోగ్యంతో గులామ్ మొహమ్మద్  17 మార్చ్ 1968 నాడు మృతి చెందారు. ఆ రెండు పాటలని నౌషాద్  రికార్డు చేసి, ఆ సినిమాకి నేపథ్య సంగీతం అందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here