[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]
ఢిల్లీలో 70 రోజుల శిక్షణ – 1976 ఆగస్టు:
నేను ఆకాశవాణి కడపలో 1975 ఆగస్టులో చేరాను. కొత్తగా చేరినవారికి బేసిక్ కోర్స్ పేరుతో 70 రోజుల పాటు శిక్షణను ఢిల్లీలో ఇస్తారు. 1976 ఆగస్టు 2 నుండి అక్టోబరు 8 వరకు ఆకాశవాణి భవన్ నాలుగో అంతస్తులో మా శిక్షణ. యావద్భారత దేశం నుండి 22 మంది ప్రొడ్యూసర్లు, ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్‌లు, డ్యూటీ ఆఫీసర్లను పిలిచారు. ఆంధ్రప్రదేశ్ నుండి నేను, విజయభూషణశర్మ (విశాఖపట్నం) వెళ్లాము. కడప నుండి ఢిల్లీకి ఆ రోజుల్లో నేరుగా రైలు లేదు.
నెల్లూరు నుండి జి. టి. ఎక్స్‌ప్రెస్‌లో ఫస్ట్ క్లాసులో (రూ.278 ఛార్జి) ఢిల్లీ బయలుదేరాను. ఇటీవలే బెజవాడ గోపాలరెడ్డి కడప వచ్చినప్పుడు వారి మిత్రులు రాజంపేట పార్లమెంటు సభ్యులు పి. పార్థసారథిని పరిచయం చేశారు. ఆ పరిచయంతో నేను, 4 జంతర్ మంతర్ రోడ్డులోని వారి విశాల భవనంలో అతిథిగా 70 రోజులున్నాను. ఆయన ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉపమంత్రిగా మూడేళ్ళు పని చేశారు. కొత్త రఘురామయ్య ఆ శాఖ కేంద్ర మంత్రి. వారి ఇంటి పక్కనే వీరి భవనం. జంతర్ మంతర్ రోడ్డు నెంబర్ 1లో అఖిలభారత కాంగ్రెస్ పార్టీ కార్యాలయం. కిలోమీటరు లోపు ఆకాశవాణి భవనం.
ఆగస్టు 11న వి.వి.గిరి గారిని కలిసి (Western Court లో) వారిపై నేను వ్రాసిన జీవిత చరిత్రను అందించాను. ఆయన అభినందించారు. ఆగస్టు 15న ఎర్రకోటపై నుండి శ్రీమతి ఇందిరాగాంధీ ప్రసంగం విన్నాను. పార్లమెంటు సభ్యులు పార్థసారథి గారి పాస్ మీద అది సాధ్యపడింది. లోక్‌సభ, రాజ్యసభ సభలు ఆ పర్యటనలో సందర్శించాను. ఢిల్లీకి నా తొలి ప్రయాణమది.
ట్రైనింగ్ సెంటరులో ప్రతీ రోజు నాలుగేసి ఉపన్యాసాలు సీనియర్లచే ఇప్పించేవారు. యస్. కపూర్ డైరక్టరు. నాయర్ డిప్యూటీ డైరక్టరు. పాండే అసిస్టెంట్ డైరక్టరు. వీరు మాకు ఆకాశవాణి వివిధ విభాగాలు పని చేసే తీరును బోధించారు. 70 రోజులలో ఢిల్లీ లోని వివిధ పర్యాటక స్థలాలను ఆదివారం, సెలవు రోజుల్లో చూసేవాడిని. నేనున్న చోట రాజంపేటకి చెందిన శివమోహనరెడ్డి ఎం.ఎ. ప్యాసయి, ఐఎఎస్ పరీక్షలకు తయారవుతూ, అదే భవనంలో మరో గదిలో వుండేవారు. తర్వాత ఆయన చిత్తూరులోని న్యూట్రిన్ ఫ్యాక్టరీ ఎం.డి.గా రిటైరయ్యారు. పార్థసారథి గారు పార్లమెంటు సమావేశాలు జరిగే రోజుల్లో ఢిల్లీ వచ్చేవారు. ఆగస్టు నెల అంతా వారున్నారు.
కడప కేంద్రాభివృద్ధి:
ఎన్నడో 1963లో రిలే స్టేషన్‌గా ప్రారంభమై 1975 జూన్‍లో మూడు ప్రసారాల స్థాయికి కడప కేంద్రం చేరుకొంది. తొలిసారిగా మదనపల్లెకు చెందిన టి. రామచంద్రారెడ్డి అసిస్టెంట్ డైరక్టరుగా వచ్చారు. నాకు పార్థసారథి గారితో పరిచయాన్ని పురస్కరించుకుని ‘కడప కేంద్ర ప్రసార శక్తిని 100 KHZ స్థాయికి పెంచమని నలుగురైదుగురు రాయలసీమ ఎం.పి.ల సంతకాలు సేకరించి సమాచార శాఖ మంత్రికి మీ పలుకుబడితో సమర్పించమ’ని రెడ్ది గారు నాకు సూచించారు. నేను తిరుపతి, చిత్తూరు, నంద్యాల, కడప, నెల్లూరు, కావలి ఎం.పి.ల సంతకాలు తొమ్మిది సేకరించాను. వాటిని సమాచారశాఖ మంత్రికి స్వయంగా అందించేలా ఎం.పి.లను కోరాను. కడప కేంద్రం 900 కిలోవాట్లపై ప్రసారాలు చేస్తుంది. అదే ఫ్రీక్వెన్సీపై రేడియో సిలోన్ ప్రసారాలు శక్తివంతంగా వినిపించేవి. అందువల్ల ఆ ప్రతిపాదన అలా అలా నలిగి 1983 నాటికి గాని ఫలవంతం కాలేదు. 1983లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య ప్రారంభించారు. హైదరాబాదు నుండి నేను వెళ్ళి ఆ సభలో పాల్గొన్నాను.
పార్థసారథి సహృదయులు. నెలకు రెండు సార్లు 20 మంది దాక ఎం.పి.లకు డిన్నర్ ఏర్పాటు చేసేవారు. సాయంకాలాలు సరదాగా కబుర్లు చెప్పుకోవడానికి తరచూ వారి ఇంటికి కాసు బ్రహ్మానందరెడ్డి, ఏ. యస్. చౌదరి, బెజవాడ పాపిరెడ్డి వగైరాలు వచ్చి భోం చేసి వెళ్ళేవారు. నాయర్ అనే వంట కుర్రవాడు చక్కని దక్షిణాది భోజనాలు తయారు చేసేవాడు.
సిమ్లా ప్రయాణం:
ప్రభుత్వోద్యోగుల ప్రయాణ సౌకర్యాల నియమాల ప్రకారం టూర్ మీద 30 రోజులు మించి ఒకే చోట వుంటే వారికి ఆ ఊర్లో యిచ్చే కరువు భత్యం 31వ రోజునుంచి సగానికి తగ్గిస్తారు. అంటే ఢిల్లీలో డి.ఎ. రూ.200 అనుకుంటే, 100 రూపాయలకు తగ్గుతుంది. అది భోజనానికి కూడా సరిపోదు. అందుకని ఆకాశవాణి ఒక ప్రణాళిక సిద్ధం చేసి ట్రెయినీలను నెల దాటగానే ఢిల్లీ నుండి సిమ్లా తీసుకెళ్ళారు. అక్కడ అప్పట్లో ఆకాశవాణి మానిటరింగ్ సెంటర్ వుండేది. విదేశాల రేడియో ప్రసారాలను రికార్డు చేసి మన దేశానికి వ్యతిరేక ప్రసారాలను విదేశీ మంత్రిత్వ శాఖకు తెలియజేసేవారు. దాని పనితీరును పరిశీలించడనికి 5 రోజులు అక్కడే వున్నాం. కాల్కాజీ నుండి సిమ్లాకు చిన్న రైలులో ప్రయాణించడం సరదా. ప్రభుత్వ గెస్ట్ హౌస్ – గ్రాండ్ హోటల్‌లో బస ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకెళ్ళి చూశాను. సిమ్లా లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ – అత్యున్నత పరిశోధనా కేంద్రం దర్శించాను.
సిమ్లా మాల్ రోడ్డు మీద సాయంకాలాలలో ఆహ్లాదకర వాతావరణంలో సరదాగా తిరగడం గొప్ప అనుభూతి. మా సహచర బృందంలో ఆరుగురు యువతులు, పదహారు మంది పురుషులు ఉండడంతో సిమ్లా ప్రయాణం ఉత్సాహభరితంగా సాగింది.
ఢిల్లీ కేంద్రంతో అనుసంధానం:
శిక్షణలో భాగంగా ఢిల్లీకి తిరిగి రాగానే సెప్టెంబరు 7 నుండి రెండు వారాలు ఢిల్లీ కేంద్రం పనితీరును పరిశీలించడానికి ఏర్పాట్లు చేశారు. ఆకాశవాణి ప్రసారాలకు హృదయ స్థానం ఢిల్లీ కేంద్రం. విశాలమైన బ్రాడ్‍కాస్టింగ్ హౌస్‌లో మూడంతస్తుల భవనంలో ఢిల్లీ కేంద్రంతో బాటు విదేశీ ప్రసారాల విభాగము, అన్ని భాషల వార్తా విభాగాలు పని చేస్తాయి. ఒక రోజు నేను తెలుగు వార్తా విభాగానికి వెళ్ళి అక్కడి ఆంగ్ల బులెటిన్‌ను తెలుగు చేయడంలో న్యూస్ రీడర్ ఏడిద గోపాలరావుకు సహకరించాను. ఆయనతో బాటు నేనూ ఆయన వార్తలు చదివే గదిలో వుండి లైవ్ కార్యక్రమాలలో క్రమశిక్షణను గమనించాను. అప్పట్లో తెలుగు వార్తా విభాగంలో దుగ్గిరాల పూర్ణయ్య, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, అద్దంకి మన్నార్ తదితరులు న్యూస్ రీడర్లు. అన్ని ప్రాంతీయ భాషల వార్తా విభాగాలు వెనుక భాగంలో వుండేవి. అదే ఢిల్లీ కేంద్రం అధిపతిగా నేను తర్వాతి కాలంలో (1997-2000) పని చేస్తానని కలలో కూడా ఊహించలేదు. మాతో బాటు శిక్షణ పొందినవారిలో గంగేష్ గుంజన్ మంచి హిందీ కవి. సుక్జీందర్ కౌర్ జలంధర్‌లో ప్రొడ్యూసర్‌గా పనిచేస్తూ శిక్షణకు వచ్చింది. 2000 సంవత్సరంలో ఆమె తర్వతా నేను నేషనల్ ఛానల్ డైరక్టర్‌గా బాధ్యతలు స్వీకరించాను.
జైపూరు కేంద్ర పనితీరు:
సెప్టెంబరులో ఐదు రోజులు రాజస్థాన్ రాజధాని అయిన జైపూర్ కేంద్రం పనితీరు పరిశీలించడానికి అందరం కలిసి వెళ్ళాం. సుందర పర్యాటక కేంద్రమైన జైపూర్ రాజభవనాలు అద్భుతం. స్థానిక ఆకాశవాణి డైరక్టరు అన్ని ఏర్పాత్లు వసతిగా వుండేలా చూశాదు. అక్కడి ప్రసార ప్రముఖులతో ప్రసంగాలు ఏర్పాటు చేశారు. వివిధ ఉత్తర ప్రాంత కేంద్రాల పరిశీలన, డైరక్టరేట్ పనితీరు, ప్రముఖుల భాషణలు భవిష్యత్ మార్గదర్శకాలయ్యాయి. జైపూరు నుండి ఢిల్లీకి విమానంలో ప్రయాణించాను. ఢిల్లీలో ఖాన్‌పుర్‌లో హై పవర్ ట్రాన్స్‌మిటర్ వుంది. అక్కడికి కూడా తీసుకెళ్ళారు. స్వయంగా మాతో విడి విడి బృందాలుగా కార్యక్రమాలు చేయించారు. చివరి వారంలో ఒక్కొక్కరు ఒకొక్క అంశంపై మాట్లాడాలి. నేను చిన్న కేంద్రాల ఇబ్బందుల గూర్చి పత్ర సమర్పణ చేశాను. డబుల్ స్పీడ్‌గా చదివానని మా డైరక్టరు వ్యాఖ్యానించారు.
జలగండం:
అక్టోబరు రెండు మూడు సెలవులు రావడంతో నేను కాశీ ప్రయాణం పెట్టుకున్నాను. కాశీలో మా ఆవిడ బాబాయి – పట్టాభి రామారావు వారణాసి డీజిల్ లోకోమోటివ్ వర్క్‌షాపులో సీనియర్ ఇంజనీరుగా రెండు దశాబ్దులుగా పని చేస్తున్నారు. అందువల నా శ్రీమతి నెల్లూరు నుండి రైల్వేలలో పని చేసే వాళ్ళ నాన్న రామమూర్తి గారితో కలిసి ముందుగా కాశీ చేరుకుంది.
1976 అక్టోబరు 1న ఉదయం పది గంటల ప్రాంతంలో మా చిన్నబ్బాయి జనార్దన్, పట్టాభి రామరావుతో కలిసి గంగాస్నానానికి వెళ్ళాము. జనార్దన్ రెండేళ్ళ లోపు పిల్లవాడు. అతనిని పట్టుకుని పట్టాభి రామరావు నది ఒడ్డున నిలబడ్డారు. నేనూ, నా శ్రీమతి గంగలోకి దిగాం. నదీ ప్రవాహం తీవ్రంగా వుంది. ఇద్దరం రెండు మెట్లు దిగాం. ప్రవాహానికి ఆవిడ కాళ్ళు నేల మీద నిలవలేదు. ఆమె చేయి గట్టిగా పట్టుకొన్నాను. ఇద్దరం తేలిపోతూ వుంటే ఎవరో అగంతకుడు (కాశీ విశ్వనాథుడు) నా చేయి పట్టుకుని గట్టు మీదకి విసిరాడు. నేను మా ఆవిడ చేయి పట్టుకుని వున్నాను కాబట్టి ఇద్దరం ఒడ్డున పడ్డాం. ఆ సమయంలో ఇద్దరం గంగలో కలిసి ఉంటే మా పిల్లలు ముగ్గురు – ఐదు, మూడు, సంవత్సరం పిల్లలు అనాథలై వుండేవారు. వృద్ధులైన నా తల్లిదండ్రులకు ఆసరా లేకపోయేది. అంతా భగవత్ కృప. జీవితంలో నేను సాధించవలసిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయనుకొని, కాశీ విశ్వేశ్వరుని దర్శించి, వారణాసి, సారనాథ్, ఆగ్రాలు దర్శించి తిరిగి నేనూ, శోభ ఢిల్లీ చేరుకొన్నాం.
యు.పి.యస్.సి. ఇంటర్వ్యూ:
ఢిల్లీలో అక్టోబరు 8వ తేదీతో ట్రైనింగ్ పూర్తి అయింది. జూలై నెలలో నేను ఆకాశవాణి ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ ఖాళీలకు దరఖాస్తు చేశాను. అక్టోబరు 13 న ఇంటర్వ్యు వుందని లెటర్ వచ్చింది. మధ్యలో హరిద్వార్, ఋషీకేశ్ వెళ్ళి చూసి వచ్చాము. ఇంటర్వ్యూలో ఆచార్య ఎస్.వి.జోగారావు సాహిత్యం గూర్చి ప్రశ్నలు వేశారు. 30 నిమిషాల పాటు ప్రశ్నోత్తరాలు అయిపోగానే, బోర్డ్ చైర్మన్ “ప్రస్తుతం ఆకాశవాణిలో మీ బేసిక్ ఎంత?” అన్నారు. “రూ.350/- సార్” అన్నాను. “ఈ ఉద్యోగానికి బేసిక్ కూడా రూ.350/- గదా! మరో నిరుద్యోగికి ఇస్తాం” అని నా కళ్ళ ముందే ‘నెగటివ్’ చేశారు. నేను పనిచేస్తున్న ప్రొడ్యూసర్ ఉద్యోగం ప్రభుత్వోద్యోగితో సమానం కాదు. పెన్షన్ రాదు. ప్రమోషన్ లేదు. ఇవన్నీ ఆయనకు తెలియవు. ఎలాగైతేనేం నాకా ఉద్యోగం దక్కలేదు. అదే సంవత్సరం నవంబరు 1976లో అసిస్టెంట్ డైరక్టర్ పోస్టుకి యు.పి.యస్.సి. వారు మరో ఇంటర్వ్యూకి పిలిచారు. ఆకాశవాణిలో నాకంటే సీనియర్లను ఆ దఫా సెలెక్ట్ చేశారు. 1981 చివరలో మరోమారు వెళ్ళి యు.పి.యస్.సి. ద్వారా అసిస్టెంట్ డైరక్టరు కాగలిగాను. అదృష్టరేఖ నీ చేతిలో వుందని హితులు వ్యాఖ్యానించారు.