జ్ఞాపకాల పందిరి-8

132
3

[box type=’note’ fontsize=’16’] “కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే…!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్. [/box]

నా మొదటి కథ ఇలా…

[dropcap]మ[/dropcap]నిషిలో ఆలోచనలు చాలా వుంటాయ్. ఆలోచనలను ఆచరణలోనికి తీసుకువస్తే ఎన్నో క్లిష్టమైన పనులు కూడా, కష్టం లేకుండా సాధించవచ్చు.

అన్నీ ఆచరణ యోగ్యమైన ఆలోచనలే వస్తాయా? అన్నది వేరే విషయం! ముఖ్యంగా ఆ ఆలోచన తనకు మాత్రమే కాకుండా సర్వజనావళికీ ఉపయోగపడేది అయితే ఆ ఆలోచన ఎంత కష్టమైనదైనా దానిని సాధించి ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయవలసిందే!

అలాగే, జీవితంలో మనకు కొన్ని కోరికలు ఉంటాయి. మరి కోరికలు ఉన్నంత మాత్రాన అన్ని కోరికలు నెరవేరుతాయా? అలా అని నిరుత్సాహపడి అసలు ప్రయత్నించకపోవడం సబబు కాదు కదా! కష్టపడకుండా సుఖం అసాధ్యం, కన్న కలలూ, కోరికలూ తీరాలంటే ఖచ్చితంగా సాధించే వరకూ కష్టపడాల్సిందే!

అది ఒక ప్రేమ విషయం కావచ్చు, ఒక స్నేహం విషయం కావచ్చు, ఒక ప్రజా సమస్య కావచ్చు, వస్తువు కావచ్చు, ధనం కావచ్చు, సాహిత్యం కావచ్చు, సంగీతమూ కావచ్చు. శ్రమ, పట్టుదల, ఆత్మవిశ్వాసం, గురి, ఆశ, ఇవన్నీ అనుకున్నవి సాధించడానికి ఉపయోగపడే ప్రధాన సాధనాలు.

చాలామంది ఆస్తుల కోసమో, అంతస్తుల కోసమో ప్రేమించిన ప్రేయసి కోసమో కలలు కనవచ్చు, అనుకున్నది సాధించనూ వచ్చు. చాలా మంది ఊహించని దానికోసం కలలు కన్నాను, కఠోర పరిశ్రమ చేసాను. నిరాశా నిస్పృహలతో మానసిక క్షోభ అనుభవించాను, అయినా పట్టువదలకుండా అనుకున్నది సాధించాను, అదేమిటో తెలుసా? అదే, ‘కథలు రాయడం’, కథకుడిగా పేరు తెచ్చుకోవడం. కథా రచయితల సమూహంలో నా పేరు కూడా నమోదుకావడం. దానికి శ్రీకాకుళం లోని కా.రా. మాష్టారు నెలకొల్పిన ‘కథా నిలయం’ సాక్ష్యం. అది ఎలా సాధ్యపడింది అంటే – ప్రతి దానికీ వున్నట్టే దీనికి ఒక కథ వుంది, అది చెబితేనే అందరికీ అర్థం అవుతుంది.

***

అవి నేను మహబూబాబాద్ తాలూకా (ఇప్పుడు జిల్లా) ఆసుపత్రిలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్‌గా పని చేస్తున్న రోజులు. అంటే, 1982-1994 మధ్య కాలం, అప్పటికే కవితలు రాయడం, వ్యాసాలూ రాయడం, ముఖ్యంగా దంత వైద్య విజ్ఞానానికి సంబంధించిన వ్యాసాలు రాయడంలో నా కలం పదునెక్కింది. పైగా ప్రాంతీయ వారపత్రిక ‘వార్తా లహరి’ (మిత్రుడు ఉబేద్ ఈ పత్రిక నడిపేవాడు) లో వారం.. వారం పిల్లల దంత సమస్యల మీద వ్యాసాలు రాస్తూండేవాడిని. హైద్రాబాదు ఆకాశవాణి నుండి మాట్లాడుతుండేవాడిని. ‘సారస్వత మేఖల’ అనే సాహితీ సంస్థకు అధ్యక్షుడిగా వుండి, కవి సమ్మేళనాలు నిర్వహించడం, యువతీ యువకుల్లో రచయితలను గుర్తించి వారిని ప్రోత్సహించడం, ఇలా పలు మార్గాల ద్వారా ఒక రచయితగా నాకు గుర్తింపు వచ్చింది. పైగా అప్పటి ఆంద్రజ్యోతి సంస్థ నుండి వెలువడే స్త్రీల మాసపత్రిక ‘వనితా జ్యోతి’లో దంత వైద్య విజ్ఞానంకు సంబంధించిన అంశంతో చిన్న పుస్తకం ప్రచురించింది.

ఇవన్నీ అదనపు ఆకర్షణలుగా నాకు అంది వచ్చిన నేపథ్యంలో ఒక రోజు ఒక వింత జరిగింది. అదే సంఘటన నా సాహితీ జీవితానికి, కథా రచయితగా పునాది పడిన రోజు. అది ఎన్నటికీ మరచిపోలేని మధురఘట్టం. అందుకే అది నా జ్ఞాపకాల్లోకి అతి సులభంగా చేరిపోయింది. అదేమిటంటే నా అధికారిక ఆసుపత్రి వేళలు ఉదయం 9గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకూ ఉండేవి. లంచ్ టైమ్‌‌లో ఆసుపత్రి నుండి ఇంటికి వెళుతూ మధ్యలో ఆంధ్రాబ్యాంక్ దగ్గర ఆగి కాస్సేపు మేనేజర్ గారితో కబుర్లు చెప్పి అప్పుడు ఇంటికి వెళ్ళేవాడిని.

ఆయనతో పరిచయం యెట్లా మొదలయిందో గుర్తు లేదు గానీ, ఆయన్ను కలవడం నా దినచర్యలో అది నిత్యకృత్యం అయిపోయింది. బహుశః మా మా ఇద్దరికీ కామన్ ఫ్రెండ్ అయిన స్వర్గీయ పి.వి.రమణ గారి వల్ల మా మధ్య పరిచయం ఏర్పడి ఉండవచ్చు. పైగా నాకు ఆంధ్రాబ్యాంకు లోనే ఖాతా ఉండడం వల్ల, మేనేజర్ తోట సాంబశివరావు గారు, ప్రకాశరావు గారు, సుబ్బారావు గారు, భుజంగరావు గారు, యాకుబ్ మియా, తిరుమలరావు గార్లు బాగా పరిచయం కావడంతో, తప్పక బ్యాంకుకు వెళ్లి కప్పు కాఫీ తాగి కాసేపు ముచ్చట్లు కొనసాగించి వచ్చేవాడిని. సాంబశివరావు గారు కళల పట్ల బాగా ఆసక్తి చూపేవారు. ముఖ్యంగా నాటకం పట్ల బాగా అభిరుచి ఉండేది. ఇతర సాహిత్య ప్రక్రియల గురించి కూడా చిన్న చిన్న చర్చలు కొనసాగేవి (అయన పదవీ విరమణ చేసిన తర్వాత ఇప్పుడు నాటికలు, కథలు, నవలలు కూడా రాస్తున్నారు). ఒక రోజు ఉన్నట్టుండి ఆయన ఒక మాట అన్నారు. ఆ మాట నన్ను ఛాలెంజ్ తీసుకునేలా చేసింది. పౌరుషం లాంటిది, పట్టుదల లాంటిది, సాధించాలి అనే ఒక దృఢ నిశ్చయం నా మదిలో మెరిసింది.

తోట సాంబశివరావు గారితో

ఇంతకీ ఆయన అన్న మాట ఏమిటంటే – “ఎప్పుడూ ఆ దంతాల గురించేనా? చక్కగా కథలు రాయొచ్చు కదా!” అన్నారు.

నవ్వి ఊరుకున్నాను. కానీ ఆయన మాటలు నాకు మనస్సులో ఉత్ర్పేరకంలా పని చేశాయి. దాని గురించి ఆలోచించుకుంటూనే స్కూటర్ నడుపుకుంటూ ఇంటికి వెళ్లాను. ఇంటికి వెళ్లేసరికి ఆ వారం కొత్త ‘స్వాతి వార పత్రిక’ వుంది. లంచ్ చేయకుండానే పత్రిక తిరగేస్తుండగా, ఒక పేజీ సందర్భానికి సరిపోయినట్టుగా నన్ను మరో పేజీ తిప్పకుండా చేసింది. ఆ పేజీలో పాఠకుల కోసం ఒక శీర్షిక కనపడింది. అదే – ‘బాపు బొమ్మకు కథ’. తప్పక ఈ పోటీలో పాల్గోవాలని నిర్ణయించుకున్నా. గబగబా.. లంచ్ అయిందనిపించి, అక్కడ బాపు గారు ఇచ్చిన బొమ్మకు కథ రాసేసాను. వెంటనే దానిని నీట్‌‌గా కాపీ చేసేసాను. సాయంత్రం నరసాపూర్ ఎక్స్‌ప్రెస్ (అప్పట్లో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ కాజీపేట మీదుగా వెళ్ళేది) ఆర్.ఎం.ఎస్.లో వేసేసాను. ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. దానిని నేను సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే నాకంటే బాగా రాసేవాళ్ళు వుండొచ్చుగా!

అయితే నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ, ఆనందంలో ముంచెత్తుతూ, తరువాతి సంచికలో బాపు గారి బొమ్మకు నేను రాసిన కథ అచ్చయింది. నా సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఆ సాయంత్రం పత్రిక తీసుకుని వెళ్లి ఆంధ్రాబ్యాంకు మేనేజర్ తోట సాంబశివరావు గారి ముందు పెట్టాను. అది చదివి ఆయన ముఖంలో చూపించిన ఆశ్చర్యాన్ని ఆనందాన్ని, ఇప్పటికీ మరచిపోలేను. అదీ నా మొదటి కథ వెనుక కథ. ఆ చిన్ని కథను చదివిన సాహితీ ఉద్దండుడు, మంచి సమీక్షకుడు, క్రిటిక్ స్వర్గీయ పి. వి.రమణగారు, “డాక్టర్ సాబ్, మీరిక కథలు రాయొచ్చు…” అని నిండు మనసుతో ఆశీర్వదించారు. అంతే – అప్పటినుండీ కథలు రాస్తూనే వున్నాను. దాని పర్యావసానమే నా కలం నుండి వెలువడ్డ మూడు కథాసంపుటాలు. సాహసమే వజ్రాయుధం మరి! ఇంతకీ కథ పేరు చెప్పలేదు కదూ… అదేనండీ ‘అస్త్రం’!!!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here