సరస్వతీ సంహారం కన్నడ నవల గురించి నాలుగు మాటలు

2
3

[dropcap]రా[/dropcap]యసం భీమసేనరావు కన్నడభాషలోని ప్రసిద్ధ రచయిత. వ్యంగ్యశైలి లో స్వాతంత్ర్యానికి దశాబ్దపూర్వం వ్రాసిన ఈ ‘సరస్వతీసంహారం’ కన్నడ నవల ఆనాటి సమాజంలోని సంస్కార, కుసంస్కార స్వభావాలకు అద్దం పడుతుంది.

ఈ నవలకు ముందుమాట బదులుగా –

“ఈ సాహిత్యకారులు వ్రాసిందంతా ఉత్తమమైన, నూతనమైన, శాశ్వతమైన సాహిత్యం. వీళ్ళు మాత్రం ఇది వ్రాయకుండా ఉండుంటే, ప్రపంచం నాశనమయ్యుండేది.” ఇలా ఎవరో తెలీని వాళ్ళ చేత ఒక కాండక్ట్ సర్టిఫికెట్ వ్రాయించుకుంటే నా గతి ఏమవుతుంది? అందుకే ఇలా వి.కృ.గోకాక్ గారి ఉత్తరాన్ని ముందుమాటకు బదులుగా ప్రకటించాను. వారు నా యీ పుస్తకాన్ని చదివి విమర్శనాత్మకమైన సుదీర్ఘ లేఖను వ్రాసి నాకెంతో ఉపకారం చేశారు.”

అని చెప్తూ ఆ విమర్శనే నవలకు ముందుమాట స్థానంలో ప్రచురించడం విశేషంగా చెప్పుకోదగిన మాట. అదీ నేడు పూట పూటా నోట నోటా వెలువడుతూ అచ్చవుతున్న రచనలు & పరస్పర ప్రశంసల ముందుమాటల కాలంలో , ఏమాత్రమూ విమర్శను సహించలేని మిథ్యాభిమానాల సమాజంలో ఇటువంటి సంయమనధోరణిని పరిశీలించి అలవరచుకోవలసిన అవసరం ఉంది.

కథావస్తువు

పనితనం, బుద్ధిబలం, చురుకుదనం, బాధ్యత కలిగిన సలక్షణమైన ఒక చిన్ని బాలిక జీవనగమనం, ఆమె శ్రేయోభిలాషులవల్ల మరియు స్వార్థ నీచబుద్ధి గలవారివల్ల కూడా ఎలా అధోగతి పాలవుతుందో ప్రత్యక్షప్రసారం వంటి కథనం ద్వారా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు రచయిత.

శైలి

నాటి సమాజంలో కుటుంబాలలోపల జరిగే ఆధిపత్యపోరు, అణచివేత తీరు చక్కని వ్యంగ్యశైలిలో చిత్రిస్తూ, అదే సమయంలో నాటి సామాజిక, రాజకీయ వాతావరణం పైన మెరుపుల్లా చమక్కులు విసురుతూ, కంట తడి పెట్టుకోదగిన సందర్భాలలోనూ మనందరి అసహాయతలపై మనమే ఫక్కున నవ్వుకొనేలా వాక్యాలు పేర్చారు. కథ లోతుకు వెళ్ళేకొద్దీ కొద్దిగా పూర్తిగా కుటుంబ వ్యవహారాలపై, భావోద్వేగాలమీద దృష్టి నిలబెడుతూ వ్యంగ్యం డోసు కొంచెం తగ్గించారు.

కథనపద్ధతి

రచయిత సర్వసాక్షికథనపు పద్ధతిలో కథ చెప్తూ, కేవలం పాత్రల మీద కామెంటరీ చెప్తున్నట్టున్నప్పటికీ నీచ పాత్రల మీద చిరాకుని స్పష్టంగా ధ్వనింపజేస్తారు.

కథా పాత్రల స్వభావ చిత్రణలో లోపాలు లేదా నాక్కలిగిన సందేహాలు –

కథకు శీర్షిక తన గాథగా కలిగిన సరస్వతి విషయంలో స్వ ఇచ్ఛను, దుఃఖాన్ని స్థితప్రజ్ఞతతో నిభాయించిన పాత్రలు, ఇతర పాత్రల విషయంలో అదే స్థితప్రజ్ఞతను ప్రదర్శించలేవు. గణపతి కనిపించకుండా పోయినప్పుడు, గౌరమ్మ దాష్టీకం మితిమీరినప్పుడు ఏ స్థిత ప్రజ్ఞత లేని మామూలు మానవుల్లా ప్రవర్తించే బ్రహ్మానందశాస్త్రి, గణపతి వంటి పాత్రలు సరస్వతి మీద అమితమైన ప్రేమ కలిగి కూడా ఆమె భవిష్యత్తు విషయంలో మాత్రం ఎందుకంత నిర్లిప్తంగా ‘స్థితప్రజ్ఞత’ తో ప్రవర్తించాలి??

ముగింపు మాట

సుమారు డెబ్భై ఏళ్ళ క్రితం నాటి రచనల నేటి విలువ ఏమిటి? అవెందుకు చదవాలి?

బాల్యవివాహాలు ఉండి, స్త్రీ విద్య మీద చులకన భావం ఉన్న నాటి పరిస్థితి ఇప్పుడు లేకపోవచ్చు. కథా వస్తువు వరకూ ఇప్పుడు రెలెవెంట్ కాకపోవచ్చు.

కానీ కథను నడిపే తీరు, వ్యంగ్యాత్మకశైలి, సమకాలీన సమాజంపై లోతైన, విశాలమైన గమనశీలత ఏ కాలపు రచనలకైనా పరిచయం ఉండితీరవలసిన విషయాలు. వీటి కోసం విపుల పఠనాదక్షత గలిగిన నాటి రచయితల రచనలు పరిశీలనా దృష్టితో చదవడం చాలా అవసరం.

పుస్తకం దొరుకు చోటు –

http://kanaja.in/ వెబ్ సైట్ లో కన్నడ ప్రతి దొరుకుతుంది.

పుట్టపర్తి నారాయణాచార్యుల వారి తెలుగు అనువాదం https://kinige.com/ లో దొరుకుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here