[dropcap]మీ[/dropcap]రు చాలా పుస్తకాలు చదువుతారు కదా! మీరు చదివిన పుస్తకాల గురించి నాలుగు మాటలు రాసి వాటిని ఇతరులకు పరిచయం చేయండి అని చాలామంది అన్నారు. కానీ ఎందుకో రాయడం చేయలేకపోయాను. రాయలేక కాదు అదెలా రాయాలో తెలియక. కానీ ఎప్పుడో ఒకసారి మొదలెడితే అలవాటు అవుతుంది అనుకొని మొదటిసారిగా ఓ పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను.
ఇది పెద్దింటి అశోక్ కుమార్ రాసిన “జిగిరి” నవల. ఆయన సిరిసిల్లా వాసి. గణితశాస్త్ర అధ్యాపకులు. చాలా కథలు, నవలలూ ఆయన కలం నుండి వెలువడ్డాయి. ఇక పుస్తకంలోకి వెళితే…
జిగిరి చిన్న నవల. ఓ నాలుగు పాత్రలు అందులో ఒక పాత్ర మాటలురాని ఎలుగుబంటి… అంతే. మరో రెండు మూడు పాత్రలు ఒక్కో సన్నివేశంలో కనిపిస్తాయి. అయినా కథా, కథనం మనలను ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళతాయి. గతంలో పల్లెపట్టుల్లో భాగమయిన గుడ్డెలుగు (ఎలుగుబంటి) ఆట, తాయెత్తులు, ఫకీరోళ్ళు అని పిలవబడే ఈ కుటుంబాలు, వాళ్ళ జీవనశైలి ఇత్యాదిగా మనకు పరిచయం/పునఃస్మరణం చేయబడతాయి.
కథలోకి వెళితే… ఇమామ్ తన భార్య బీబమ్మ, కొడుకు చాంద్ మరియు షాదుల్ అని పిలవబడే గుడ్డెలుగుతో జీవిస్తుంటాడు. దాదాపుగా ఇరవయ్యేళ్ళు ఆ కుటుంబంతో కలిసి ఆ కుటుంబానికి తన ఆట ద్వారా డబ్బు సంపాదించి పోషిస్తుంది షాదుల్.
షాదుల్, చాంద్ ఇద్దరూ సమవయస్కులు. ఇద్దరినీ కన్న బిడ్డల్లానే సాకింది బీబమ్మ. తల్లి నుండి దూరం చేసి తమతో తీసుకొచ్చేసిన షాదుల్ ఆహారం తీసుకోకుండా, తీసుకున్నా ఆ ఆవుపాలు పడక చావుబతుకుల మధ్య పడితే తన పాలు తాపి, తాయెత్తులు కట్టించి బతికించింది బీబమ్మ.
చాందూ, షాదుల్ని తన తోబుట్టువులానే చూసుకున్నాడు. ఇక ఇమామ్ అయితే కన్న కొడుకు లాగానే, సంపాదిస్తోన్న పెద్దకొడుకులానే చూసుకున్నాడు. ఆ కుటుంబం హాయిగా ఉంది. ఆర్థికపరిస్థితి సజావుగానే ఉంది .
ఇదే అయితే మరి కథ ఏముంది…
కథ… షాదుల్ని ఎలా దూరం చేసుకోవాలా అని ఆ కుటుంబం ఆలోచించడంతో కథ రసకందాయంలో పడుతుంది. చివరకు షాదుల్ని చంపేసే ప్రయత్నాలు కూడా సాగుతాయి. కన్నతల్లిలా సాకిన బీబమ్మే, తన కళ్ళముందే దాన్ని చంపే ప్రయత్నాలకు తోడ్పాటునిస్తుంది. కొడుకైన చాంద్, షాదుల్ని చంపాలని చూస్తుంటే అడ్డుపడి దెబ్బలు తింటుంటాడు ఇమామ్.
నేను కావాలా? షాదుల్ కావాలా? అని కొడుకు చాంద్ వేస్తున్న ప్రశ్నలకు జవాబివ్వలేక, షాదుల్ని చంపుకోలేక, అమ్మేద్దామనుకుంటే కొనేవాళ్ళు లేక, దూరంగా విడిచిపెట్టేసినప్పటికీ ఇంటికి వచ్చేస్తున్న షాదుల్ కి వెర్రిమందు తినిపించి అడివిలో విడిచిపెట్టి వస్తానని వెళ్ళిన ఇమామ్ ఆ పని చేయలేకపోతాడు. మళ్ళీ కథలోకి రాడు. తన ‘జిగిరి’తో అక్కడే ఉండిపోయాడేమో అనే ఊహను పాఠకుడికే వదిలేసాడు రచయిత.
మరి, మనసుకు అంత దగ్గరైన, కుటుంబంలో భాగమైన ఆ షాదుల్ని, ఆ కుటుంబం ఎందుకు వదుల్చుకోవాలనుకుంది ? కారణం ఏమిటి ??
…… వాళ్ళకు ప్రభుత్వం ఓ రెండెకరాల భూమి ఇస్తానని అనడం, వాళ్ళకు మరో జీవనాధారం లేకపోతేనే అది వీలవుతుందని అనడం, వన్యప్రాణులను బంధించి ఉంచడం నేరం అని పోలీసులు అనడం….
వీళ్ళ వద్ద గుడ్డెలుగు ఉంది కాబట్టి దాని ఆట ద్వారా వీళ్ళ బాగా సంపాదిస్తున్నారు కాబట్టి వీళ్ళకు భూమి ఇవ్వడం సరికాదు అని ఇతరులు కంప్లైంట్ చేయడం,…
భూమి వస్తుంది, బతుకు బంగారమవుతుంది కాబట్టి షాదుల్ని దాచిపెట్టి గుడ్డెలుగు లేదు, చచ్చిపోయింది అని వీళ్ళు చెప్పడం…
ఇలాంటి పరిస్థితుల్లో అది తమ వద్ద ఉంటే బంగారంలాంటి రెండెకరాల భూమి ఎక్కడ తమది కాకుండా పోతుందో అన్న భయంతో మానవసహజ స్వార్థంతో అలాటి పాపపు పనికి ఒడిగట్టారు….
మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అన్న ఒక చిన్న లైను మీద రచయిత ఈ నవల అద్భుతంగా తీర్చిదిద్దారు. చాలా బాగుంది.
నవచేతన పబ్లిషింగ్ వారిది. చదవండి.
***
జిగిరి (నవల)
రచన: పెద్దింటి అశోక్ కుమార్
ప్రచురణ: నవచేతన పబ్లిషింగ్ హౌస్
పుటలు: 112
వెల: ₹ 75/-
ప్రతులకు:
- నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్
- ఇతర ప్రముఖ పుస్తక కేంద్రాలు