[dropcap]ప[/dropcap]లుకరిస్తూ ఉండు
ఫోనులోనో, రాసేసిన కార్డుపైనో
వాట్సప‌్పు పోస్టుతోనే
ఫేసుబుక్కు మెసేజుగానో
అపుడపుడు పలుకరిస్తూనే ఉండు
కాలం వేడికి
కరిగిపోతుంటాయి గతంలోని జ్ఞాపకాలు
కాలం ధాటికి
రూపు మార్చుకుంటాయి నీ నా ఇష్టాయిష్టాలు
నీకు నచ్చినదేదో నేను మరిచిపోతాను
నేను మెచ్చుకునేదేదో నీకెప్పటికీ గుర్తురాదు
ఏదేదో చెప్పుకోవాలని,
ఏవేవో గుట్లు విప్పుకోవాలని
ఇంకేమిటి ఇంకేమిటి అని
తరచి తరచి అడుగుతుంటే
చెప్పాలనుకునే మాటలకు
మొహమాటం చెడ్డగా అడ్డమొస్తుంది
నచ్చుతుందో లేదా అనే
అనుమానం అడ్డంగా అంకురిస్తుంది
చెప్పేందుకు ఏమీలేని
దౌర్భాగ్యం దీనంగా దాపురిస్తుంది
కట్టకుండా మరిచిన వడ్డీకి
అసలులాంటి గతమంతా గల్లంతవుతుంది
ఐసుఫ్రూటు కరిగిపోయి
పుల్లలాంటి పరిచయమే మిగిలిపోతుంది
అందుకే
అడపాదడపా పలుకరిస్తూనే ఉండు
పలుకరించి
పాత విషయాలు తిరగేస్తూ ఉండు
అప్పుడప్పుడు
కొత్త కొత్త ముచ్చట్లు జతచేస్తూ ఉండు
నీకో నాకో
ఆరడుగుల జాగా దొరికేంతవరకూ
నిన్నో నన్నో
ఏడుకట్ల సవారీపై మోసేంతవరకూ
పలుకరిస్తూ ఉండు!
అపుడపుడూ పలుకరిస్తూనే ఉండు!!