[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
అశ్వమేధ సహస్రస్య శ్రేయః సప్తరుచి సరః।
శ్రాద్ధం దానం తథా జప్యం స్నానం హోమస్తథార్చనమ్॥
[dropcap]స[/dropcap]ప్తరుచి సర వద్ద నైవేద్యం అర్పించటం వెయ్యి అశ్వమేధ యాగాల ఫలితాన్నిస్తుంది. వంద రాజసూయాలు, ఒక లక్ష గోదాన ఫలం కూడా లభిస్తుంది. ఈ స్థలంలో పూర్వీకులకు శ్రాద్ధం అర్పించటం, దానాలు చేయటం, జపం, స్నానం, హోమం, అర్చనలు చేయటం వల్ల కూడా నాశనము లేని రీతిలో సత్ఫలితాలు లభిస్తాయి.
‘నీలమత పురాణం’లో ప్రతి తీర్థం ప్రాశస్త్యం, అక్కడ అర్చనలు, పూజలు చేస్తే లభించే ఫలితాలు చదువుతుంటే కశ్మీరుకూ, సమస్త భారతదేశంలోని తీర్థాలకు, పుణ్యక్షేత్రాలకు నడుమ ఎలాంటి భేదం లేదని స్పష్టమవుతుంది.
సాధారణంగా మనిషి కోరికలు అనంతమైనవి అయినా, వాటిని వర్గీకరిస్తే అవి కొన్ని కేటగిరీల్లోకి ఒదిగిపోతాయి. పేరు ప్రఖ్యాతులు, సుఖశాంతులు, దుఃఖరాహిత్యం, ఆహారం, ఐశ్వర్యం, ఇలాంటివి. యజ్ఞయాగాదులు సామాన్యులు చేయలేరు. అలాంటప్పుడు వాటి వల్ల కలిగే ఫలితాలు కూడా సామాన్యుడు ఆయా యజ్ఞాలు చేయకుండానే పొందే వీలును తీర్థయాత్రలు, పవిత్ర స్థలాల దర్శనాలు కలిగిస్తున్నాయి. అంటే భారతీయ ధర్మంలో అసామాన్యుడి నుంచి అట్టడుగున ఉన్నవాడి వరకు అందరికీ సమానమైన అవకాశాలు ఉన్నాయన్న మాట. రాజు వద్ద ధనం ఉంటుంది. మంది మార్బలం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున యజ్ఞయాగాదులు నిర్వహించగలడు. దానధర్మాలు చేయగలడు. సామాన్యుడి దగ్గర ఇవేవీ ఉండవు. కాబట్టి పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించలేడు. దానధర్మాలు చేయలేడు. అలాంటివాడు ఎలాంటి పటాటోపాలు లేకుండా, శక్తికి మించిన పనులేవీ చేయకుండా తీర్థయాత్రలకు వెళ్ళి దైవదర్శనం చేసుకుంటే చాలు యజ్ఞ ఫలాలు లభిస్తాయి. గోదాన ఫలం లభిస్తుంది. అంటే భారతీయ ధర్మం సమస్త మానవాళిని, వారి స్థితిగతులలోని భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని గుర్తించి అందరికీ సమానావకాశాలు కల్పించే పటిష్టమైన ధార్మిక వ్యవస్థను ఏర్పాటు చేసిందన్నమాట. తీర్థయాత్రలు చేయలేనివారు ఇంటి దగ్గర ఉన్న పవిత్రక్షేత్రాన్ని దర్శిస్తే చాలు. అవే ఫలితాలు లభిస్తాయి. పూజకు ముందు తమ ఇంట్లో పట్టిన నీళ్ళలోకి గంగ, యమున, కావేరి వంటి పవిత్ర జలాల నీటిని ఆహ్వానించడం వల్ల ఈ నీరు ఆ నీరయిపోతుంది. పవిత్రమై పోతుంది. ఇది కూడా చేయలేని వాడి కోసం ‘మానసిక పూజ’ ఉంది. అంటే ఏ ధర్మమైతే సంకుచితమనీ, కొందరికే పరిమితం అనీ, అధికులను దూరం పెట్టి మనుషులుగా చూడదన్న ఆరోపణలను ఎదుర్కొంటోందో, దూషణలకు గురవుతోందో, ఆ ధర్మం తరచి చూస్తే అందరినీ తనలో కలుపుకుపోయే అత్యద్భుతమైన లక్షణం కలదని అర్థమవుతోంది. హెచ్చు తగ్గులు లేవు. మానవులంతా దైవత్వం తమలో ఇమిడి ఉన్నవారే. తేడా అల్లా దాన్ని గుర్తించటంలోనే. సామాజిక స్థాయితో సంబంధం లేకుండా తన శక్తిని అనుసరించి ప్రతి ఒక్కరూ అన్నీ పొందగలిగే అర్హత ఉన్నవారే. ఇంతటి విశాల దృక్పథం మరే ధర్మంలోనూ లేదనటం అతిశయోక్తి కాదేమో! అందుకే భారత ధర్మం, ఈ దేశంలోకి అడుగుపెట్టిన ప్రతీ వారినీ తనలో కలిపేసుకుంటూ సజీవనదిలా ప్రవహిస్తోంది.
‘వస్త్రపాద’ దర్శనంతో వ్యక్తులకు రుద్రలోకం ప్రాప్తిస్తుంది. భాగలేశ్వర దర్శనంతో కోరికలు తీరుతాయి. రుద్రుడి సేవలు చేయటం వల్ల రుద్రుడి సాంగత్యం లభిస్తుంది. పరోశ్ని ఆవిర్భావ స్థల దర్శనం వల్ల వేయి గోవుల దాన ఫలం లభిస్తుంది.
ఉష్ణోదకంలో స్నానం వల్ల వెయ్యి గోవుల దాన ఫలం లభిస్తుంది. సహస్రధారలో స్నానం వల్ల విష్ణులోకంలో ఆదరణ లభిస్తుంది.
విష్ణువు మూడు లోకాలలో తన పాదాలను ఉంచే సమయంలో (వామనావతారం) ఒక సరస్సు నిర్మితమైంది. ఈ సరస్సును ‘క్రమసార’ అంటారు. మరో ప్రాంతంలొ ఈ కారణం వల్లనే ఏర్పడిన సరస్సును ‘విష్ణుపాదం’ అంటారు. బ్రహ్మ క్రమసార వద్ద యజ్ఞం చేయటం వల్ల సకల పాపాలను నశింపజేసే శక్తి ఈ సరస్సుకు లభించింది. నాగకౌండిన్యుడు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవటం వల్ల కౌండిన్యసార ఏర్పడింది. ఈ సరస్సులో స్నానం చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర పర్వతాలను దర్శిస్తూ దేవతలను, అశ్వాలను పూజించటం వల్ల దేవతల లోకాలలో నివాసం ప్రాప్తిస్తుంది. బ్రహ్మ యజ్ఞస్థలాన్ని దర్శించటం వల్ల వ్యక్తి, అతని కుటుంబం రక్షించబడతాయి. అందమైన క్షీరసార దర్శనం వల్ల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
కృష్ణపక్షం చతుర్దశి నాడు ‘సుసార’ తీర్థంలో స్నానం చేయటం వల సకల పాపాలు నశిస్తాయి, రుద్రలోకంలో గౌరవం లభిస్తుంది.
“ప్రభూ… కశ్మీరులో, పరిసర ప్రాంతాలలో ఉన్న సమస్త పవిత్ర క్షేత్రాలు, పుణ్యస్థలాలు, తీర్థాల వివరాలు, ఆయా స్థలాల దర్శన మాత్రం వల్ల కలిగే ఫలాలను నీకు వివరించాను. ఇంకా ఏం తెలుసుకోగోరుతున్నావు?” అని అడిగాడు బృహదశ్వుడు గోనందుడిని.
బృహదశ్వుడి ప్రశ్నకు సమాధానంగా గోనందుడు వినమ్రంగా అతడికి తన మనసులో ఉన్న కోరికను వెల్లడించాడు.
“తప్పస్సుతో సకల పాపాలను పరిహరింపజేసుకున్న పవిత్రుడువు. కశ్మీరులోని ప్రధాన తీర్థాలు (నదులు), వాటిలో స్నానం చేయటం వల్ల కలిగే ఫలితాలను వివరించండి.”
(ఇంకా ఉంది)