లోకల్ క్లాసిక్స్ – 22: తండ్రికి రెండు ప్రశ్నలు!

0
3

[box type=’note’ fontsize=’16’] ‘లోకల్ క్లాసిక్స్’ సిరీస్‌లో భాగంగా డాక్టర్ బిజూ దర్శకత్వం వహించిన హిందీ సినిమా ‘సౌండ్ ఆఫ్ సైలెన్స్’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]

‘సౌండ్ ఆఫ్ సైలెన్స్’ (హిందీ, టిబెట్, పహాడీ)

ఆర్ట్ సినిమాలు ఆధ్యాత్మిక కోణాన్ని ప్రదర్శించినప్పుడు మిగతా భక్తి సినిమాలకి భిన్నంగా వుంటాయి. భక్తి సినిమాలు దేవుణ్ణి కొలుస్తాయి, ఆర్ట్ సినిమాలు తాత్వికతని వెల్లడిస్తాయి. నేనేం పాపం చేశానని నాకీ కష్టాలని దీనంగా దేవుణ్ణి అడగవు, నువ్వేం చేశావని మనిషినే ధైర్యంగా అడుగుతాయి. అందులోనూ అది బౌద్ధం అయినప్పుడు ఖచ్చితంగా మనిషినే నిలదీస్తాయి. మనిషి తనని ప్రశ్నించుకోకుండా తప్పించుకోవడం వల్లే ప్రపంచంలో ఇంత దుఖం. కుటుంబం నుంచీ వసుధైక కుటుంబం దాకా ఇందరు బాధితులు, ఇందరు పీడితులు, ఇంత బాధ. మలయాళం నుంచి ఆర్ట్ సినిమాల్ని అంతర్జాతీయం చేస్తున్న దర్శకుడు డాక్టర్ బిజూ, హిమాలయాల దిగువున ఎగువ స్థాయికి చేరేసే మానసిక పరిపక్వతని ఈ ఆధ్యాత్మిక ఆర్టుతోనే రూపకల్పన చేశాడు.

2005 నుంచీ రంగంలో వుంటున్న కేరళకి చెందిన డాక్టర్ బిజూ (బిజూ కుమార్ దామోదరన్), మలయాళంలో 9 ఆర్ట్ సినిమాలు తీశాడు. ఇంగ్లీషులో ఒకటి, మూడు భాషల్లో ఇంకోటీ తీశాడు. ఏది తీసినా సామాజిక అసమానతలు, లింగ వివక్ష, పర్యావరణం వంటి అంశాల చుట్టూ తీశాడు. మూడు సార్లు జాతీయ అవార్డులందుకున్నాడు. 14 సార్లు అంతర్జాతీయ అవార్డులు పొందాడు. తన సినిమాలకి పనిచేసిన నటులు, సాంకేతికులు 12 మందికీ వివిధ అవార్డులు లభించాయి. మరో 11 కేరళ రాష్ట్ర అవార్డులు తన సినిమాలకి వరించాయి. 2017 లో తీసిన ‘సౌండ్ ఆఫ్ సైలెన్స్’ 40 అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో పాల్గొని 4 అవార్డులూ సాధించుకొచ్చింది. వాటిలో ఉత్తమ దర్శకుడు అవార్డు ఒకటి.

‘సౌండ్ ఆఫ్ సైలెన్స్’ ని హిందీ, టిబెట్, పహాడీ భాషల్లో తీశాడు. పహాడీ భాష దిగువ హిమాలయాల్లో మాట్లాడతారు. దిగువ హిమాలయాల్లో, అక్కడి బౌద్ధ మఠంలో ఈ సినిమా తీశాడు. ఒక పన్నెండేళ్ళ మూగ బాలుడి అంతర్ సంఘర్షణగా ఈ కళాత్మకాన్ని పూర్తి ప్రకృతి నేపథ్యంలో తీశాడు. ఈ మూగ బాలుడి పాత్రలో దర్శకుడి తనయుడు మాస్టర్ గోవర్ధన్ నటించాడు. బాలుడి తండ్రిగా భూషణ్, బౌద్ధ సన్యాసిగా ఉదయ చంద్ర నటించారు. పాత్రలు వేటికీ పేర్లు ఇవ్వలేదు.

కథ

హిమాలయా గడ్డి మైదానాల్లో పశువుల్ని మేపడం, తండ్రికి వండి పెట్టడం, రాత్రి నిద్ర పోవడం, తెల్లారి మళ్ళీ పశువుల్ని మేపడం ఆ బాలుడి దినచర్య. మూగ వాడైన తను పుడుతూనే తల్లిని పోగొట్టుకున్నాడు. దీంతో తండ్రికి విపరీతమైన ద్వేషం. తల్లిని బలిగొన్న దురదృష్ట జాతకుడని, శాపగ్రస్తుడనీ, అందుకే మూగగా పుట్టాడనీ నిత్యం హింసిస్తూ వుంటాడు తాగుబోతు తండ్రి. తనకి కొడుకే కాదని ఇతరుల ముందు ప్రకటిస్తూంటాడు. ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటాడు. తండ్రి పెట్టే బాధల్ని మూగగా భరిస్తూ వుంటే, ఒకరోజు తాగుడు కోసం తండ్రి ఆవుని అమ్మేస్తూంటే అడ్డుపడి దెబ్బలు తింటాడు. వీడు పనిలేకుండా ఆవారాగా మారాడని ఆపిల్ వ్యాపారి దగ్గర పళ్ళ అమ్మకంలో పెట్టిస్తాడు తండ్రి. పోటాపోటీగా ఆపిల్స్ అమ్మలేకపోవడంతో ఆ పని కాస్తా పోతుంది. దీంతో ఇంకా ద్వేషం పెంచుకుంటాడు తండ్రి. మేన మామ వచ్చి, కొడుకుని ఇలా వేధిస్తున్నందుకు మందలిస్తాడు. నాదగ్గర తాగి నన్నే అంటావా అని కొట్టి చంపేస్తాడు తండ్రి. ఇంకా నువ్వుంటే నిన్నుకూడా చంపేస్తాననేసరికి పారిపోతాడు కొడుకు. తండ్రి జైలుకి పోతాడు. ఓ బౌద్ధ సన్యాసి చూసి చేరదీస్తాడు అనాథ అయిన కొడుకుని.

మఠంలో మత గురువు దగ్గరికి తీసికెళ్ళి పరిస్థితి వివరిస్తాడు. మాటలు రాని వీడు మన బోధలు ఏం నేర్చుకుని రేపు లామాగా మారి ఇతరులకి బోధిస్తాడని అభ్యంతరం లేవదీస్తాడు మతగురువు. మనమిచ్చే జ్ఞానం ఇతడికెలా ఉపయోగ పడతుందన్నది సమస్య కాదనీ, శరణార్ధికి ఆశ్రయమివ్వకపోతే సమస్యవుతుందనీ చెప్తాడు సన్యాసి. ఇలా మఠంలో చేరిన కొడుకు కొత్త జీవితం ప్రారంభిస్తాడు. ఈ జీవితంలో ఏం నేర్చుకుని తనలో రగులుతున్న అంతర్గత సమస్యకి సమాధానం పొందాడో, ఆ సమాధానంతో తండ్రికి రెండు ప్రశ్నల్తో ఏమని ఉత్తరం రాశాడో అన్నది మిగతా కథ.

ఎలావుంది కథ

ఫిలాసఫికల్ స్టోరీ. తనని ఇంత ద్వేషిస్తున్న తండ్రి, ఒక్క క్షణం కూడా ఎప్పుడైనా తనని ప్రేమించనే లేదా? తనని కొడుకే కాదంటున్న తండ్రి, ఎప్పుడైనా ఒక్క క్షణం కూడా తనని కొడుకుగా భావించనే లేదా?… ఈ ప్రశ్నలు ఉదయించేలా చేసిన ఫిలాసఫికల్ జ్ఞానం. జ్ఞానం పొందాక అజ్ఞానం వల్ల ఇంతకాలం తను పడిన వేదన తీరిపోయింది. తన వేదనకి కారణమేమిటో తెలిశాక మనసు తేలికైపోయింది. కారణం ఈ రెండు ప్రశ్నలే. ఈ రెండు ప్రశ్నలకి తండ్రి నుంచి సమాధానం పొందితే అటో ఇటో తేలిపోతుంది. ఐతే తండ్రీ కొడుకుల సంబంధం పునః స్థాపిత మవుతుంది, కాకపోతే తను జ్ఞాని అవుతాడు.

తన నోటి నుంచి శబ్దం రాదు. అయితే తనలో నిశ్శబ్దం కూడా లేదు ఇంతకాలం. మానసిక ఘోష నిశ్శబ్దమయ్యే మార్గం సన్యాసి నేర్పాడు: ‘కళ్ళు మూసుకుని ప్రకృతిలో ఏకాంతంగా కూర్చుంటే, నీవు ఏకాకివి కావని తెలుసుకుంటావు. యావత్ సృష్టీ నీతో వుందని తెలుసుకుంటావు. అడవిలో అనేక అలికిళ్ళున్నాయి …పక్షులు, జంతువులూ, వృక్షాలు చేసే అనంత శబ్దాలు మనం పట్టించుకోం… జలపాతాలు, గాలీ ఎండా వానా, భూమీ ఆకాశం మనతో మాట్లాడే భాష మీద దృష్టి పెట్టం… ఇవన్నీ నీతో వున్నాయి. ఎవరూ ఒంటరి కారు. ఒంటరులవడం అసాధ్యం. ప్రకృతి నీతో వున్నాక! సంబంధాలు ఎంతకాలం నిలబడతాయన్నది వాటిపట్ల నీ భావాత్మక శక్తి పైన ఆధారపడుతుంది…

సంబంధాలు తెగత్రెంపులవుతాయి. కొత్త సంబంధాలు పెన వేస్తాయి. కానీ ప్రకృతిలో మన సంబంధం తెగేది కాదు, తెంచుకునేదీ కాదు…’

బౌద్ధ సన్యాసి బోధలు జీవితానికో మార్గం చూపాక కొడుకు జీవితం సులభమై పోయింది. తండ్రికి తను రాసిన ఉత్తరంతో మఠంలో తనకి గొప్ప గుర్తింపు వచ్చింది. వేడుక అయింది. ఈ కథ సమస్యలకి సులభ పరిష్కారాలు ఆ సమస్యల్లోనే దాగివుంటాయన్న అంతర్లీన సత్యాన్ని చెబుతుంది.

చిత్రీకరణ కళాత్మకం

కథ వర్తమాన, భూతకాలాల్లో సాగుతుంది. వర్తమానంలో మఠం జీవితం, భూతకాలంలో ఫ్లాష్‌బ్యాకులుగా తండ్రితో దుర్భర జీవితం. ఎప్పుడో గానీ శబ్దాలు విన్పించని నిశ్శబ్ద వాతావరణమే ఆవరించి వుంటుంది. శబ్దం కాదు, శబ్దం పలకని అర్థాలు నిశ్శబ్దంలో అనుభవమవుతాయి…శబ్దంలో, మాటల్లో, నిశ్శబ్దాలు చెప్పే అర్థాలు చూడాలన్న కాన్సెప్ట్ ఆధారంగా తీసిన ఈ ఫిలాసఫికల్ ఆర్ట్‌లో హిమాలయాలు, మఠ ప్రాంగణాలూ ఎంజే రాధాకృష్ణన్ అద్భుత ఛాయాగ్రహణంలో మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

ఇసాక్ థామస్ కొట్టుపల్లి స్వరాలు పలికినట్టే వుండదు నిశ్శబ్దంలో కలిసిపోయి. అన్నట్టు ఇసాక్ థామస్ కొట్టుపల్లి ‘కమ్లి’కి సంగీతం వహించిన సంగీత దర్శకుడే. కొడుకుగా నటించిన మాస్టర్ గోవర్ధన్ మూగ పాత్రని మూగపాత్ర అన్పించకుండా నటించడమొక విశేషం. కాకపోతే హిమాలయాల్లో శరీర వర్ణంతో కాకుండా, హిమాలయాల్లో అతకని దక్షిణ పాత్రలా వుంటాడు.

90 నిమిషాల ‘సౌండ్ ఆఫ్ సైలెన్స్’ ఎక్కువ ఏకాగ్రతతో కదలకుండా కూర్చుని అనుభవించాల్సిన దృశ్య కావ్యం. చూపించకుండా చూపించిన విషయాలు, చెప్పకుండా చెప్పిన సత్యాలూ విస్మయ పరుస్తాయి. ఇదొక మాటల్లో చెప్పలేని మ్యాజిక్, అంతే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here