జ్ఞాపకాలు – వ్యాపకాలు – 10

0
4

[box type=’note’ fontsize=’16’] డా. అనంత పద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన జీవితంలో వివిధ దశలలోని ఉద్యోగ బాధ్యతలు, సాహితీకృషి లోని జ్ఞాపకాలను పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

కడపలో రెండో మారు (జూన్ 1980 – సెప్టెంబరు 1982):

[dropcap]1[/dropcap]980 జూన్ మధ్యలో విద్యాసంవత్సరం ప్రారంభంలో, విజయవాడ నుండి నన్ను కడపకు, కడప నుండి ఉషశ్రీని బదిలీ చేస్తూ ఆర్డర్లు వచ్చాయి. విద్యా సంవత్సరం ప్రారంభం కాబట్టి మా పిల్లల చదువుకు అనుకూలమే. నా అనుకూల శత్రువులు డైరక్టరేట్‌కు టెలిగ్రాములు పంపారు: “ఆయనను కడపకు పంపవద్దు!” అని సారాంశం. నేను జూన్ 18న రిలీవ్ అయ్యాను. వీడ్కోలు సభలో నండూరి రామమోహనరావు వంటి ప్రముఖులు అభినందిస్తూ మాట్లాడారు.

జూన్ 23న నేను కడపలో రెండో దఫా చేరాను. అప్పుడు దేవళ్ళ బాలకృష్ణ కడప కేంద్రం ఇన్‌ఛార్జ్ డైరక్టరు. నేను చేరిన వారంలోపు ఓ రోజు ఆదివారం నాడు హైదరాబాదు కేంద్రం నుంచి డైరక్టరుకు ఫోన్ వచ్చింది. కర్నూలు జిల్లా నందికొట్కూరు సమీపంలోని సంగమంలో సంజయ్ గాంధీ అస్థి నిమజ్జనం జరుగుతుందనీ, అక్కడికి రికార్డింగ్ యూనిట్ వెళ్ళి ప్రముఖుల సందేశాలు రికార్డు చేయ్యమని ఆదేశం. ఆ పనికి బాలకృష్ణ నన్ను పురమాయించారు. అతి పురాతనమైన మెటాడార్ వ్యాన్‌లో బయలుదేరాను. నందికొట్కూరు వద్ద వ్యాన్ చెడిపోయింది. అక్కడ మా బంధువు సీతారామారావుకు వ్యాన్ రిపేరు బాధ్యతలు అప్పగించి, జిల్లా సమాచార శాఖ వారి జీపులో నేను ‘సంగం’ వెళ్ళి కొందరు మంత్రులు దామోదరం మునుస్వామి తదితరుల సందేశాలు రికార్డు చేసి, తిరిగి వచ్చి ప్రసారం చేసి ప్రభుత్వ భక్తిని చాటుకొన్నాం.

జూలై నెలలో కేంద్ర సమాచార సహాయ మంత్రిణి శ్రీమతి రాంధులారీ సిన్హా తిరుమల సందర్శనానికి వస్తున్నారని ఢిల్లీ నుంచి వర్తమానం. కడప నుంచి నేను, మా సహచర మిత్రులు భూషణరావు తిరుపతి వెళ్ళి ముందురోజే తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి.వి.ఆర్.కె. ప్రసాద్‌ను కలిశాం. ప్రత్యేక దర్శనం విషయం ప్రస్తావించాము. ఒక అంబాసిడర్ కారు, కొండపై పద్మావతీ గెస్ట్ హౌస్, ప్రత్యేక దర్శనాలకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఆమె, ఆమె కుమారుడు స్వామి వారి దర్శనం చేసుకొని తృప్తిగా వెళ్ళారు.

సెప్టెంబరు నెలలో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం రజతోత్సవ సభలను రికార్డు చేసి ప్రముఖుల ప్రసంగాలు ప్రసారం చేశాము. ఈ దఫా ప్రభుత్వోద్యోగుల క్రీడా సాంస్కృతిక సంస్ధ ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకొన్నారు. జానపద సాహిత్య పరిషత్ పేరుతో ఆరవీటి శ్రీనివాసులు ఒక సంస్థను ప్రారంభించి నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు.

గొల్లపూడితో అనుబంధం:

గొల్లపూడి మారుతీరావు మదరాసు నుండి కడపకు బదిలీ మీద ఆకాశవాణిలో చేరారు. కొద్దిరోజుల్లోనే ఆయనకు స్టేషన్ ఇన్‌ఛార్జిగా పదోన్నతి కల్పించారు. అయన వారాంతాలలో మదరాసు వెళ్ళేవారు. ముగ్గురు బ్రహ్మచారి ఉద్యోగులు – వోలేటి పార్వతీశం, కలగా కృష్ణమోహన్‌, కపర్ది ఒకే ఇంట్లో అద్దెకుండేవారు. వారికి గెస్ట్‌గా గొల్లపూడి సంవత్సరంపైగా వున్నారు. కోడి రామకృష్ణ గొల్లపూడితో సినీచర్చల కోసం తరచూ వస్తూండేవారు.

గొల్లపూడి తన ఆత్మకథ ‘అమ్మ కడుపు చల్లగా’లో వ్రాసినట్టుగా ఈ సంవత్సర కాలంలో మేమిద్దరం మూదు ప్రధాన దేవాలయాలకు ఉత్సవాల సందర్భంగా వెళ్ళాము. 1981 మార్చిలో శ్రీశైలంలో శివరాత్రి ఉత్సవాలు ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఏర్పాటు చేశాం. శ్రీశైలం వెళ్తున్నప్పుడు మధ్యలో మేమిద్దరం నంద్యాలలో బస్‌స్టాండ్ సమీపంలోని హోటల్ వద్ద కారు ఆపి టిఫిన్ చేశాము. అనుకోకుండా అక్కడికి వచ్చిన బి.వి. మోహన్‌రెడ్డి త్వరలో యన్.టి.రామారావు ఒక రాజకీయ పార్టీ పెడతారనీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆధిపత్యం వహించే రోజు వస్తుందని జోస్యం చెప్పినట్లుగా మారుతీరావుతో చెప్పారు. ఆ జోస్యం ఫలించి రామారావుగారు తెలుగుదేశం పార్టీ స్థాపించి, 1983 జనవరి 9న రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు, జోస్యం చెప్పిన మోహన్‌రెడ్డి మంత్రి అయ్యారు.

కడప కేంద్రం నుంచి నేను, గొల్లపూడి ‘బావగారి కబుర్లు’ ఓ సంవత్సరం నడిపాం. ఒక వారం ఆయన మదరాసు నుండి రాలేదు. సాయంత్రం ప్రోగ్రాం ప్రసారం కావాలి. బావగారికి కోపం వచ్చి, నాతో మాట్లాడం లేదని చెబుతూ నేనే కార్యక్రమంలో మాట్లాడి రక్తి కట్టించాను.

‘ఆడది’ నాటకం:

మా ఆకాశవాణి క్లబ్ వార్షికోత్సవంలో పినిశెట్టి వ్రాసిన స్త్రీ పాత్ర లేని ‘ఆడది’ నాటకం స్టేజ్ మీద ప్రదర్శించాము. అందులో గొల్లపూడి ఇంటి యజమాని. అందులో నేను వంటవాడు శతభిషంగా నటించాను. నేను తయారు చేసి యిచ్చిన కాఫీ సరిగా లేదని చెంప వాయించే సన్నివేశం నాటకంలో వుంది. రిహార్స‌ల్స్‌లో చెంపకు చేయి తగలకుండా నటించిన గొల్లపూడి స్టేజి మీద సహజ నటనతో నా చెంప ఛెళ్ళుమనిపించారు. ఇకపై ‘నాటకాలు’ ఆడకూడదని నిశ్చయించుకున్నాను.

రెండో దఫా ప్రభుత్వోద్యోగుల క్రీడా సాంస్కృతిక సంస్ధ ఆధ్వర్యంలో కడప మునిసిపల్ ఆడిటోరియంలో ‘ఆడది’ నాటకం ప్రదర్శించాం. ముందుగానే గొల్లపూడితో ఒప్పందం కుదుర్చుకుని చెంప వాచిపోయేలా కొట్టవద్దని చెప్పాను. సరదాగా మేము ‘బావగారూ!’ అని సంబోధించుకుంటూ ఆయన గతించేంటవరకూ బాంధవ్యం కొనసాగించాం. ఆయనా, నేను మంత్రాలయంలో ఆరాధనోత్సవాలకు వెళ్ళాము. అక్టోబరులో జరిగిన తిరుమల బ్రహ్మోత్సవాలకు వెళ్ళాము. ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ సినిమా తొలి రోజు కడపలో ఇద్దరం కలిసి చూశాం. అది ఆయన తొలి సినిమా.

మంత్రులతో ఇంటర్వ్యూలు:

ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‌గా నా విధ్యుక్త ధర్మం ప్రముఖుల పరిచయాలు ప్రసారం చేయడం. సాహిత్య సాంస్కృతిక రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు కడపకు ఎవరు వచ్చినా నేను వారిని గెస్ట్‌ హౌస్‌లో కలిసి స్టూడియోకి ఆహ్వానించేవాడిని. సమయాభావం వల్ల వాళ్ళు రాలేకపోతే, అక్కడే రికార్డు చేసేవాడిని. కేంద్ర మంత్రులు కమలాపతి త్రిపాఠీ, సి.కె. జాఫర్ షరీఫ్, మల్లికార్జున్‌లు రైల్వే వ్యాగన్ వర్క్‌షాప్ ప్రారంభోత్సవానికి రేణిగుంట వచ్చినప్పుడు వారిని ఇంటర్వ్యూ చేశాను.

రైల్వే స్పెషల్ బోగీ ముందు పొద్దుటే ఎనిమిది గంటలకు లుంగీ కట్టుకుని తారాట్లాడుతున్న ఓ వ్యక్తిని చూసి. “మినిస్టర్ సాబ్ హైఁ” అన్నాను. బోగీ లోపలికెళ్ళగానే తెలిసింది – ఆయనే రైల్వేశాఖ సహాయ మంత్రి జాఫర్ షరీఫ్. రికార్డు చేశాను. కడపకు వచ్చిన కేంద్ర నీటి పారుదాల శాఖ స్వతంత్ర్య మంత్రి జడ్. ఆర్. అన్సారీని ఇంటర్వ్యూ చేశాను. ముందుగా హోం వర్క్ చేసుకుని, ఆయన ‘ఉన్నావ్’ నియోజకవర్గం నుండి గెలిచారని తెలుసుకున్నాను. ఇంటర్వ్యూలో ఆ ప్రస్తావన చేయగానే ఆయన పరమానందభరితుడయ్యాడు. గవర్నరు కె. సి. అబ్రహం మదనపల్లి వద్ద హార్స్‌లీ హిల్స్ కొండపై గవర్నరు వేసవి విశ్రాంతి భవనంలో వున్నప్పుడు కలిసి ఇంటర్వ్యూ చేశాను.

ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి, జలగం వెంగళరావు, నేదురుమిల్లి జనార్దన్ రెడ్డి, భవనం వెంకట్రామ్‌లను పలు సందర్బాలలో ఇంటర్వ్యూ చేశాను. రాష్ట్ర మంత్రులలో పి.నరసారెడ్డి, పి.వి. చౌదరి, అగిశం వీరప్ప, కె. రోశయ్య, భాట్టం శ్రీరామమూర్తి, యన్. అమరనాథరెడ్డి, పరకాల శేషావతారం, యన్. శ్రీనివాసులురెడ్డి, కె.యి.కృష్ణమూర్తి, మాణిక్యరావు, బి.శేషశయనారెడ్డి, రవీంద్రనాయక్‍లను సందర్భోచితంగా ఇంటర్వ్యూ చేశాను.

కేంద్రమంత్రులలో – కేంద్ర హోం శాఖా సహాయమంత్రి పెండేకంటి వెంకట సుబ్బయ్య నాపై  ప్రత్యేక ఆదరం చూపేవారు. ఢిల్లీ వెళ్ళీనప్పుడు తప్పక ఆయనను కలిసేవాడిని. నేను అనువదించిన ‘రామాయణంలో స్త్రీ పాత్రలు’ గ్రంథం వారికి అంకితం ఇచ్చాను. కేంద్ర కార్మిక శాఖ ఉప మంత్రి పులి వెంకటరెడ్డి కడపకు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ ప్రారంభోత్సవానికి వచ్చారు. నేను కందుకూరు కళాశాలలో లెక్చరర్‌గా వుండగా ఆయనను ఎరుగుదును. ఆయన కనిగిరికి చెందినవారు. ఆయన కడప స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ రికార్డు చేశారు. దరిమిలా నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు శ్రమశక్తి భవన్‌లో వారి మంత్రిత్వశాఖ ఆఫీసులో కలిసినప్పుడు ఆ శాఖాధిపతులకు నన్ను ఘనంగా పరిచయం చేశారు.

ప్రకాశం మంత్రివర్గం పడిపోవడానికి 1955లో మూలకారకుడైన ఎం.ఎల్.ఎ. నాయకంటి శంకర్‌రెడ్డిని కర్నూలులో కలిసి ఆ సంఘటన వివరాలు ముఖాముఖీగా రికార్డు చేసి ప్రసారం చేశాను. అలానే రాజమండ్రిలో ప్రకాశం మంత్రివర్గ సభ్యులు ఏ.బి. నాగేశ్వరరావును రికార్డు చేయడం అందమైన అనుభూతి.

కేంద్ర సాహిత్య అకాడమీ:

1981 డిసెంబరులో యు.పి.యస్.సి.లో అసిస్టెంట్ స్టేషన్ డైరక్టర్ ఇంటర్వ్యూ కెళ్ళాను. పాండిచేరి మాజీ గవర్నరు బేడీలాల్ బోర్డు నన్ను ఇంటర్వ్యూ చేసింది. పుల్లల వెంకటేశ్వర్లు, వి.కె. నారాయణ మీనన్ ఇతర సభ్యులు. ఇప్పటివరకు పనిచేసిన రాష్ట్రపతుల గురించి ఒకే వాక్యంలో చెప్పమన్నారు. రాజేంద్రప్రసాద్, రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వి.వి.గిరి, ఫక్రూద్దీన్ ఆలీ అహమ్మద్‍ల ఘనతను, ప్రత్యేకతను శ్లాఘిస్తూ చెప్పాను, సంతోషించారు. 1982 ఏప్రిల్ నెలలో యు.పి.యస్.సి. నుంచి ‘రిగ్రెట్ లెటర్’ వచ్చింది. ఆ అసంతృప్తితో ఆకాశవాణి వదిలివేద్దామనే ఆలోచన వచ్చింది.

కేంద్ర సాహిత్య అకాడమీ వారు మదరాసులోని ప్రాంతీయ కార్యాలయ కార్యదర్శి పదవికి నోటిఫికేషన్ ‘హిందూ’లో ప్రచురించారు. ఇంటర్వ్యూకి మదరాసు పిలిచారు (ఏప్రిల్‌లో). సాహిత్య అకాడమీ అధ్యక్షులు ఉమాశంకర్ జోషి, ఉపాధ్యక్షులు డా. వి.కె. గోకక్, డాక్టర్ కె ఆర్ శ్రీనివాస అయ్యంగార్‌లు 40 నిమిషాలు ఇంటర్వ్యూ చేశారు. రేడియోను ఎందుకు వదలాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఏడేళ్ళుగా ప్రమోషన్ లేదనీ, ఈ పోస్టు స్టేషన్ డైరక్టరు స్కేలుతో రూ.1100/- బేసిక్‍తో వుందని చెప్పాను. చివరగా వారు “మీకు లీన్ ఇస్తారా?” అని అడిగారు. కార్యదర్శి కేల్కర్ – “నేను మాట్లాడి ఏర్పాటు చేస్తాను” అన్నారు. అలా ఉద్యోగం ఇష్టం లేకపోతే వెనక్కి వచ్చే అవకాశం వుంటుంది. సాయంకాలం పార్థసారథి కోవెలకి వెళ్ళాను. పక్కనే శ్రీనివాస అయ్యంగార్ నివాసమని తెలిసి వారిని కలిసాను. ‘మీరు సెలెక్టు అయ్యార’ని ఆయన చెప్పారు. ఆర్డర్లు వచ్చాయి.

అనుకోని సంఘటన:

1982 జూన్‌లో మా స్వగ్రామం చెన్నూరులో మా నాన్నగారి షష్టిపూర్తి మహోత్సవాలు ఘనంగా నిర్వహించాం. అక్కడ వుండగానే ఒక అరుదైన విశేషం జరిగింది. అసిస్టెంట్ డైరక్టర్‌గా సెలెక్ట్ అయినట్టు టెలిగ్రాం వచ్చింది. రెండు నెలల ముందు రిగ్రెట్స్ పంపి, మళ్ళీ 15 ఖాళీలు వస్తే పానెల్‌లో వున్న 15 మందికీ నియామక పత్రాలు పంపారు. యు.పి.యస్.సి. చరిత్రలో అదొక విశేషం. బెజవాడ గోపాలరెడ్డి సలహా మేరకు నేను ఆకాశవాణిలో వుండిపోయాను.

అసిస్టెంట్ డైరక్టరుగా ఎక్కడ వేస్తారోనని ఎదురుచూశాను. హైదరాబాదు ఆకాశవాణికి బదిలీ చేస్తున్నట్టు ఆర్డర్లు వచ్చాయి. రాజధాని నగరంలో పనిచేసే అవకాశం లభించింది. అక్కడ సౌమ్యుడైన యస్. రాజారాం డైరక్టరు. ఆయన నన్ను సాదరంగా పలకరించాడు కడప వచ్చినప్పుడు. అక్టోబరు 4 న (1982) కడప మునిసిపల్ ఆడిటోరియంలో ఘనంగా వీడ్కోలు సభ జరిగింది. కడపలో, ప్రొద్దుటూరులో భువన విజయాలలో నేను పాల్గొన్న విషయాన్ని వక్తలు ప్రశంసించారు. ప్రొద్దుటూరులో తిమ్మరుసుగా వేషం వేశాను.  ప్రొడ్యూసర్‌గా ఏడున్నర సంవత్సరాలు (ఏలినాటి శని కాదు) పని చేసి యు.పి.యస్.సి. ద్వారా పదోన్నతి సంపాదించడం నా ఉద్యోగ జీవితానికి ప్రధాన సోపానం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here